వాసిరెడ్డి భాస్కరరావు
వాసిరెడ్ది భాస్కరరావు అభ్యుదయ, ప్రగతిశీల భావాలను కలిగి, విప్లవ దృక్పథంగల నాటకాలను రచించిన రచయిత. ఈయన సుంకర సత్యనారాయణతో కలసి "ముందడుగు", "మాభూమి", అపనింద" వంటి అభ్యుదయ నాటకాలను రచించి ప్రదర్శించారు.
జననం-విద్యాభ్యాసం
[మార్చు]వాసిరెడ్ది భాస్కరరావు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. తండ్రి వీరయ్య, తల్లి భ్రమరాంబ.భాస్కరరావు 1914 సెప్టెంబరు 2న కృష్ణా జిల్లా లోని వీరులపాడులో జన్మించాడు.[1] చిన్నతనంలోనే తల్లి గతించడంతో నల్గొండ జిల్లాలోని పెంచికలదిన్నెలో నివాసమున్న పినతల్లి దుర్గమ్మ వద్ద పెరిగాడు. భాస్కరరావు అసలు పేరు ఛాయా భాస్కరం. ఆయన తాతా ఛాయన్నపేరును కలిసి వచ్చేటట్లుగా పెట్టారు.అయితే భాస్కరరావుగానే అందరకు పరిచయం. భాస్కరరావు ప్రాథమిక విద్య వీరులపాడులోనే జరిగింది. అష్టావధాని జంగా హనుమయ్య చౌదరి వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నాడు. తెలుగు సాహిత్యపాఠాలు చదివి తెలుగు భాషలో ప్రావీణ్యం పొందాడు.ఈ ప్రావీణ్యంతో రెండు సంవత్సరాలపాటు వీధిబడిని నిర్వహించాడు. ఇదే సమయంలో వూరిలో ఏర్పాటు చేసిన హిందీఠశాలలో చేరి, హిందీలో రాష్ట్రభాష, విశారద చదివాడు. కాని విశారద చదువుకు విరామం వచ్చింది. జాతీయోద్యమంలో పాల్గొంటున్నావని అభియోగం పాఠశాల వారు మోపటంతో అక్కడ చదువు మానేసి విజయవాడ వెళ్ళి ఆయుర్వేదవిద్యను అభ్యసించుటకు ప్రయత్నించాడు. కాని ఆవిద్య భాస్కరరావుకు వంటబట్టలేదు.తిరిగి హిందీ విద్యాలయంలో చేరి "రాష్ట్ర భాషా విశారద"పట్టాను, తరువాత క్రమంలో "హిందీ ప్రచారక్" శిక్షణ పొందాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి "హిందీ విద్వాన్"పట్టా పొందాడు. భాస్కరరావు ఆ వీరులపాడు గ్రామంలో హిందీలో తొలి పట్టభద్రుడు.
జీవనం-రచన
[మార్చు]భాస్కరరావు 1936 లో కృష్ణా జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడుగా ప్రవేశించాడు. అదే కాలంలో గ్రామంలో అతివాద రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 1937 లో కూలి సంఘ ఉద్యమం జరిగింది.ఈ రెండూ భాస్కరరావు పై ప్రభావం చూపాయి. కమ్యూనిస్టు సిద్ధాంతంలపట్ల మొగ్గు చూపటం ప్రారంభించాడు. ఉద్యోగం చేస్తునే గ్రామ రాజకీయాల్లో, కూలిసంఘం ఉద్యమంలొ పరోక్షంగా పాల్గొనేవాడు. వీరులపాడుకే చెందిన వాసిరెడ్డి రామారావు అనే వారు కమ్యూనిస్టు వ్యక్తి. రామారావు నందిగామ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీకై పనిచేస్తున్నప్పుడు, ఇరువురికి పరిచయం కలిగి,ఇద్దరు కలసి ఆ ప్రాంతంలో రైతు సంఘ నిర్మాణానికి కలసి పనిచేసి, ఆ ప్రాంతంలో రైతు సంఘం బలోపేతం చేశారు. 1942 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలం కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచెయ్యడం మొదలుపెట్టాడు.
భాస్కరరావు హిందీ పండితుడుగా పనిచేస్తున్నప్పటికే సుంకర సత్యనారాయణ తో పరిచయం వున్నది.సుంకరది విజయవాడ తాలూకా ఈడుపుగల్లు గ్రామం. అక్కడినుండి సుంకర తిరువూరు తాలుకా కొణతమాత్మమూరు వలస వెళ్ళి వ్యవసాయం చేసూకుంటుండేవాడు. సుంకర సత్యనారాయణ తన తమ్ముడు వీరభద్రరావుతో కలసి చేసిన "స్టాలిన్ గ్రాడ్ బుఱ్ఱ కథ" మంచి జనాదరణ పొందినది. సుంకరతో కలసి భాస్కరరావు బుఱ్ఱ కథలు చెప్పడం ప్రారంభించాడు. వారిద్దరు చెప్పే బుఱ్ఱ కథలు జంఝూమారుతంలా సాగేవి. తరువాత వారిద్దరు కలసి నాటక రచన ప్రారంభించారు.1946 లో "ముందడుగూ,1947 లో "మా భూమి".
మద్రాసులో వుండగా సుంకరతో కలసి సినిమా రంగంలో పనిచేశారు."పుట్టిల్లు", పల్లెటూరు"[2]"కన్నతల్లి" సినిమాలకు వీరిద్దరు కలసి సంభాషణలు, పాటలు వ్రాసారు. మద్రాసులో వుండగా "పోతుగడ్డ"నాటకాన్ని రచించాడు, ఇదికూడా మంచి ప్రజాదరణ పొందినది. మద్రాసులో ఆరోగ్యం కుదుట పడక పోవటంతో తిరిగి 1954 లో వీరులపాడు వచ్చేసాడు.
జబ్బు మరింతగా ముదరటంతో 1957, నవంబరు 1 న మరణించారు[3] .
ఉల్లేఖన/ఆధారాలు
[మార్చు]- ↑ "చైతన్యదీప్తి నిరంతర స్ఫూర్తి వాసిరెడ్డి భాస్కరరావు". visalaandhra.com. Archived from the original on 2016-03-04. Retrieved 2014-02-25.
- ↑ "PALLETURU 1952 పల్లెటూరు". ,sakhiyaa.com. Archived from the original on 2013-09-28. Retrieved 2014-02-25.
- ↑ 2014 ఫిబ్రవరి 'మార్క్సిస్టు మాస పత్రిక నుండి