గ్యాన్ కుమారీ హెడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్యాన్ కుమారీ హెడా హైదరాబాదుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు, గాంధీ స్మృతి అధ్యక్షురాలు. ఈమె సామాజిక సేవారంగంలో కూడా ప్రసిద్ధమైన పాత్ర పోషించింది.

జ్ఞానకుమారి 1918, అక్టోబరు 11న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‍షహర్ జిల్లాలోని ఖుర్గా గ్రామంలో జన్మించింది.[1] బి.ఏ వరకు చదివింది. చిన్న వయసు నుండే జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు కూడా వెళ్ళిన ఈమె 1936లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు హరీష్ చంద్ర హెడాను వివాహమాడి హైదరాబాదులో స్థిరపడింది. హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న అతికొద్ది మంది మహిళలలో ఈమె ఒకరు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో విమలాబాయి మేల్కోటే, పద్మజానాయుడు, వనమాలి, కమలమ్మ తదితర మహిళలతో పాటు ఈమెను అరెస్టు చేసి, అప్పటికి మహిళా రాజకీయ ఖైదీలను ఉంచడానికి ప్రత్యేక జైళ్లు లేకపోవటంవలన మౌలాలీ సమీపంలోని కృష్ణప్రసాద్ దేవిడీలో నిర్భంధించారు.

స్వతంత్రానంతరం క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకుని సాంఘిక సంస్థల్లో విశేష కృషిచేసింది. హైదరాబాదులో సాంఘిక, రాజకీయ చైతన్యం పెరగడానికి పనిచేసిన తొలితరం మహిళ జ్ఞానకుమారి హెడా. జ్ఞానకుమారి 1945 నుండి 1963 వరకు కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక ట్రస్టు యొక్క హైదరాబాదు రాష్ట్ర ప్రాంతీయ ప్రతినిధిగా పనిచేసి హైదరాబాదులో కస్తూర్బా ట్రస్టును తీర్చి దిద్దింది. 1946 నుండి 1957 వరకు హైదరాబాదు రాష్ట్ర హరిజన సేవక్ సంఘ్ యొక్క కార్యనిర్వాహక సంఘ సభ్యురాలిగా హరిజన హాస్టలును నిర్వహించింది.

మహాత్మాగాంధీ మరణించిన తర్వాత ఆయన అస్థికలను గ్యాన్ కుమారీ 1948 ఫిబ్రవరి 12న హైదరాబాదులోని లంగర్ హౌజ్ ప్రాంతంలోని మూసీ నది, ఈసీ నది సంగమ ప్రదేశంలో నిమజ్జనం చేసింది. అప్పటి నుండి ఈ ప్రాంతం బాపూఘాట్‍గా పేరు పొందింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సర్వోదయ సంస్థ సభ్యులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12న గాంధీ స్మృతి ప్రార్థనా దినోత్సవంగా జరుపుకుంటారు.[2]

ఈమె 89 ఏళ్ల వయసులో న్యూజెర్సీలోని తన కుమారుని నివాసంలో జూలై 18, 2008న మరణించింది.[3][4]

మూలాలు[మార్చు]