చతుర్వేదుల వెంకట కృష్ణయ్య (సి.వి.కృష్ణ)
చతుర్వేదుల వెంకట కృష్ణయ్య సమకాలంలో సి.వి.కృష్ణగా ప్రఖ్యాతుడు. నెల్లూరు సొంత ఊరు, నెల్లూరు. ఇతని తండ్రి చతుర్వేదుల రాఘవయ్య, తల్లి లక్ష్మీదేవమ్మ. జననం 1894. నెల్లూరు వి.ఆర్.హైస్కూల్లో స్కూల్ ఫైనల్ చదివి, తరువాత గాడిచర్ల హరిసర్వోత్తమరావు, చిలుకూరి వీరభద్రరావు మొదలయిన పెద్దలు మదరాసులో నెలకొల్పిన "విజ్ఙాన చంద్రికా మండలి"లో కొంతకాలం పనిచేసినట్లు, ఆనాటి సాహిత్య, జాతీయ వాదులతో పరిచయాలు పెంపొందించుకొన్నట్లు.పొణకా కనకమ్మ పేర్కొన్నది. సి.వి.కృష్ణ తల్లిగారి ఊరు నెల్లూరుకు ఆరు మైళ్ళ దూరంలో, పినాకిని నదీతీరంలోని పల్లిపాడు.అగ్రహారం.
పొణకా కనకమ్మ పోట్లపూడిలో నెలకొల్పిన సుజన రంజని సమాజంతో సి.వి.కృష్ణ సంబంధాలు పెట్టుకొని, ఆ సమజాం వారికకి గొప్ప పండిత కవులను పరిచయం చేసాడు.1915-16లో వెన్నెలకంటి రాఘవయ్య, సి.వి.కృష్ణ కనకమ్మ ఆర్థిక సహాయంతో టెర్రరిస్ట్ అతివాద రాజకీయాలవైపు మొగ్గి, ఆ మార్గంలో పనిచేసారు.. ఆయుధాలు దాచను, ఆయుధాలు వాడడం ప్రాక్టీస్ చేయడం కోసం కనకమ్మ పల్లిపాడు సమీపంలో, పెన్నా తీరంలో 13 ఎకరాల తోటను ఖరీదు చేసింది. 1919కల్లా అందరూ మహాత్ముని దర్శనం చేసుకొని అహింసామార్గంలో ప్రవేశించారు.
సి.వి.కృష్ణ నెల్లూరు స్థానిక పత్రికల్లో జాతీయ ఉద్యమాన్ని గురించి రాస్తూ వచ్చాడు. ఆ సమయంలోనే మద్రాసులో ఉండి, సర్వెంట్స్ అఫ్ ఇండియా సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న దిగుమర్తి హనుమంతరావుతో స్నేహం కుదిరి, ఇద్దరు అహమదాబాదు వెళ్లి సబర్మతి ఆశ్రమంలో కొంతకాలం ఆశ్రమ సేవకులుగా ఉన్నారు. గాంధీజీ భారతదేశంలో మరెక్కడైనా సబర్మతి ఆశ్రమం వంటి ఆశ్రమాన్ని నెలకొల్పవలెనని భావిస్తున్న సమయంలో సి.వి.కృష్ణ, హనుమంతరావు గాంధీజీ అనుమతితో నెల్లూరు సమీపంలో, పల్లిపాడులో ఆశ్రమ స్థాపనకు పూనుకొన్నారు.[1] పల్లిపాడు సి.వి.కృష్ణ మాతామహుల ఊరే కనకే, అతనికి కొంత పలుకుబడి కూడా ఉంది. కనకమ్మ హింసాయుత ఉద్యమం కొనసాగించడానికి ఖరీదు చేసిన 13 ఎకరాల కొంజేటివారి తోటను ఆశ్రమ స్థాపనకు ఇచ్చింది.
1921 ఏప్రిల్ 21న గాంధీజీ పల్లిపాడులో పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. హనుమంతరావు స్థానికుడు కాదు, కనుక సి.వి.కృష్ణ నెల్లూరు రెడ్డి మిత్రుల సహకారంతో ఆశ్రమాన్ని నడపడానికి అవసరమైన హంగులన్నీ సమకూర్చగలిగాడు. స్శ్రవయంకృషితో సి.వి.కృష్ణ ఆశ్రమానికి మరికొంత భూమి సమకూర్చాడు. ఆశ్రమ ప్రాంగణంలో చేనేత, బ్రహ్మచర్యం వంటి కార్యక్రమాలు, హరిజన బాలురకు బడి సహాపంక్తి భోజనాలు, దళితులతో కలిసి జీవించడం వంటి కార్యక్రమాలవల్ల ఆశ్రమ వాసులను పల్లిపాడు అగ్రహారం బ్రాహ్మణులు సంఘ బహిష్కారం చేసారు.
సి.వి.కృష్ణ తండ్రి చతుర్వేదుల వెంకట రాఘవయ్య సంప్రదాయ నైష్ఠిక బ్రాహ్మణుడు, తిలక్ అనుయాయి. కుమారుడు వర్ణాశ్రమ ధర్మాన్ని విడిచి అస్పృశ్యత పాటించక కుల బహిష్కృతుడు కావడంతో 1930 ప్రాంతాలలో ఎటో వెళ్ళిపోయాడు. అతని ఆచూకీ తెలియ లేదు.
దిగుమర్తి హనుమంతరావు, దిగమర్తి బుచ్చికృష్ణమ్మ, చతుర్వేదుల వెంకట కృష్ణయ్య, కొండిపర్తి పున్నయ్య జీవితకాలపు ట్రస్టీలుగా పినాకినీ సత్యాగ్రహా ఆశ్రమం ట్రస్ట్ డీడ్ రిజిస్టర్ అయింది. హనుమంతరావు, సి.వి.కృష్ణ గొప్ప మిత్రులు. 1926 మార్చి 18వ తారీకున క్షయ రోగంతో హనుమంతరావు విశాఖపట్నంలో చనిపోవడంతో సి.వి.కృష్ణ చాలా నిస్పృహకు గురయ్యాడు. పైగా అతని మాట కఠినం, ఆ కారణం వల్లనే ఖాసా సుబ్బారావు వంటి వారు ఆశ్రమం విడిచి వెళ్లారని వెన్నెలకంటి రాఘవయ్య రాసాడు. ఆ తరువాత కూడా 1929 వరకు సి.వి.కృష్ణ ఆశ్రమ నిర్వహణ చేస్తూ, క్రమంగా ఆధ్యాత్మిక భావాలతో, 1929లో పాండిచ్చేరి వెళ్లి అరవిందుడి శిష్యుడయినాడు. 1932 వరకు సి,వి.కృష్ణ ఆశ్రమ కార్యదర్శి పదవిలో ఉన్నట్లు జమీన్ రైతు పత్రికలో ఆయన ప్రచురించిన ఆశ్రమ జమా ఖర్చుల రిపోర్ట్ వల్ల తెలుస్తోంది.
పుదుచ్చేరివెళ్లిన తరువాత, అరవిందాశ్రమ పత్రిక 'అర్క" సంపాదకుడుగా బాధ్యత నిర్వహిస్తూ,అరవిందుని అనేక పుస్తకాలు తెలుగులోకి అనువదించాడు. 1953 మే నెల 29న పక్షవాతంతో అరవిందాశ్రమం లోనే మరణించినట్లు జమీన్‌రైతు వార్త ప్రచురించింది. చరుత్వేదుల వెంకట కృష్ణయ్య ఫోటో అరవిందాశ్రమ నిర్వాహకుల సహకారంతో తెప్పించి పినాకిని సత్యాగ్రహాశ్రమం "రుస్తుం భవనం"లో ఆశ్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు.
మూలాలు
[మార్చు]- ↑ Kranthi (2021-04-07). "Pinakini Satyagraha Ashram: చారిత్రక చిహ్నంగా 'పినాకిని ఆశ్రమం'". www.hmtvlive.com. Archived from the original on 2022-11-07. Retrieved 2022-11-07.
ఇతర వనరులు
[మార్చు]- పినాకినీ తీరంలో మహాత్మా గాంధీ' రచయితలు:ఇ.ఎస్.రెడ్డి, ఆర్.సుందరరావు, వాణీ ప్రచురణలు, కావలి,2004.
- పొణకా కనకమ్మ ఆత్మకథ "కనకపుష్యరాగం", (రెండవ ముద్రణ)సంపాదకులు:డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, పల్లవి పబ్లికేషన్స్,, విజయవాడ.
- కాంగ్రేసు సేవ: రచయిత: కొమాండూరు పార్థసారథి. 1948.
- నెల్లూరు వారపత్రిక యూత్ కాంగ్రెస్ లో 19774-75లో వెన్నెలకంటి రాఘవయ్య రాసిన "స్మృతి శకలాలు" వ్యాసాలు.
- సీతానగరం సేవాశ్రమం 1924-1987 :రచయిత, బి.రాజారావు.
- Volumes of Gandhi jees' letters addressed to C.V. Krishna and to other residents of Ashram.
- Who's who of Freedom Struggle in Andhrapradesh, Editor : Professor Sarojini Regani, volume three, Published by Government of Andhrapradesh, 1982.8. Zamin Ryot weekly volumes.
- (Photo courtesy : Sri Aurobindo Ashram, Puducherry.)