చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
పొడుపు కథలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
తాను మాత్రం సుఖంగా ఉండేందుకు కావల్సిన ఏర్పాట్లన్నీ సరిచూసుకొని ఎదుటి వారు ఏమైపోతే నాకెందుకు అని అనుకునే వారిని విమర్శిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ సామెత. ఈ సామెత రూపకల్పనలో అచ్చ తెలుగుతనం, జానపద హృదయ స్పందన, తెలుగింటి ఆహార అలవాట్ల వివరణ కనిపిస్తుంటాయి. ఉదయాన్నే చద్దెన్నం తినడమనేది పల్లెటూళ్ళలో నిత్యం కనిపించే ఒక విషయం. నేటి ఆధునిక సమాజంలో తిన్నట్లుగా 'టిఫిన్'ల పేరుతో ఏవేవో వంటకాలు తినడం కాక ఆరోగ్యానికి హాని కలిగించని విధంగా రోజంతా మనిషికి ఉత్సాహాన్ని కలిగించేందుకు దోహదం చేసే చద్దెన్నం తినడం ఎంతో మంచిది. ఈ అన్నం తిన్న వారికి మళ్ళీ మిట్ట మధ్యాహ్నం వరకు ఆకలీ, అలుపు ఉండవు. ఒక ఇంట్లో కొద్దిగా స్వార్థపరురాలైన ఒక ఇల్లాలు ఉదయాన్నే తాను మాత్రమే చద్దెన్నం తిని ఎంతసేపైనా తన భర్త ఆకలిని గుర్తించక వేరే ఆహార పదార్థాలు వండక కూర్చున్నదట. ఈ విషయాన్ని కొంత నిశితంగా పరిశీలిస్తే తన స్వార్థం తాను చూసుకొని ఎదుటివారు ఎంత ఇబ్బంది పడుతున్నా చూస్తూ కూర్చొనే వారు ఎంత మతిమాలిన వారోననే విషయం అర్థమవుతుంది.