చిన్న పిళ్లై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న పిళ్లై
స్త్రీ శక్తి పురస్కార గ్రహీత చిన్న పిళ్లై
జననం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కళంజియం మహిళా స్వయం సహాయక గ్రూపులు
జీవిత భాగస్వామిబిల్లుసేరి పెరుమాళ్‌
పిల్లలుఇద్దరు కుమారులు
పురస్కారాలుజిజాబాయి స్త్రీ శక్తి పురస్కారం,
పద్మశ్రీ పురస్కారం,
అవ్వయ్యార్ అవార్డు

చిన్న పిళ్లై (Chinna Pillai) భారతదేశంలోని తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న పుల్లిసేరి [1] అనే ఒక కుగ్రామం నుండి ఎదిగిన నాయకురాలు.

విశేషాలు

[మార్చు]

చిన్న పైళ్లై ఒక సామాన్య భారతీయ మహిళ. ఈమె మధురై జిల్లా, అళఘర్ కోవిల్ సమీపంలోని కల్లందిరి అనే గ్రామంలో జన్మించింది. మధురైకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లుచ్చేరి గ్రామంలో నివసిస్తూ ఉంది. ఈమె మధుర మీనాక్షి ఆలయంలో బిల్లుసేరి పెరుమాళ్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. ఈమె భర్త పెరుమాళ్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అదే సమయంలో ఈమె తండ్రి మరణించాడు. దీంతో కుటుంబాన్ని కాపాడుకునేందుకు చిన్నపిళ్లై వ్యవసాయ కూలీగా పని చేయాల్సి వచ్చింది.

ఈ పరిస్థితిలో ఈమె ధైర్యసాహసాలు ప్రదర్శించి ఒంటరిగా పోరాడి తన తోటి మహిళలను వడ్డీ వ్యాపారుల బారినుండి తప్పించగలిగింది. ఈమె ప్రారంభించిన పొదుపు పరపతి పథకం ద్వారా వేలాది మంది గ్రామీణ మహిళల జీవితాలను మార్చగలిగింది. తమిళనాడులోని గ్రామాలలో చాలా విజయవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటి గ్రామీణ మహిళా పొదుపు గ్రూపుల ఫెడరేషన్ "కళంజియమ్"ను స్థాపించింది. మహిళలకు సాధికారత కల్పించడం ద్వారా పేదరికం, ఋణ బాధలను తగ్గించే దిశలో కృషి చేసింది.[2] కళంజియమ్‌ల ద్వారా పుల్లుచేరి గ్రామంలోని మహిళల్లో పొదుపు యూనిట్‌లను ప్రారంభించేందుకు ఈమె కృషి చేసింది. ప్రస్తుతం ఈ గ్రూపులో 40 వేలమంది సభ్యులు ఉన్నారు. చిన్న పిళ్లై నిరక్షరాస్యురాలు. ఈమె తన పేరు మాత్రమే సంతకం చేయగలదు. సంప్రదింపులు జరపడంలో ఆమె కనబరచిన నైపుణ్యం కారణంగా ప్రజలు ఆమెను నాయకురాలిగా గుర్తించారు.

ఈమె భూ యజమానులను సంప్రదించి, మొత్తం పది పదిహేను ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయ పనులు కౌలుకు తీసుకుని, వ్యవసాయ కూలీలను పోగుచేసి మొక్కలు నాటే పనులు, కలుపు తీయడం, పంటకోత వంటి పనులు చేసి, మొత్తం కూలీని అందరికీ సమానంగా పంచేది. వృద్ధులు, వికలాంగులను తన బృందంలో చేర్చుకుని వారికి కూడా సమానమైన వేతనాన్ని చెల్లించేది. ఆమె కార్మికుల తరపున యజమానులతో బేరసారాలు జరిపి వారికి అధిక వేతనాలు చెల్లించేలా చేయగలిగింది.

కళంజియం మహిళా స్వయం సహాయక సంఘాలు

[మార్చు]

చిన్నపిళ్లై జీవితంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్న సమయంలో మదురైకి చెందిన స్వచ్ఛంద సంస్థ అధినేత వాసిమలై తన బృందంతో కలిసి పిల్లుచ్చేరి గ్రామానికి వెళ్లి మహిళా స్వయం సహాయక సంఘం పథకం గురించి చిన్నపిళ్లైకి వివరించారు. అందుకు తగ్గట్టుగానే చిన్నపిళ్లై తన గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ మహిళా స్వయం సహాయక సంఘాలను స్థాపించి మహిళల ఆర్థిక ప్రగతికి కారకురాలైంది.

చిన్నపిళ్లై ఏర్పాటు చేసిన మూడు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మదురై జిల్లా కన్మాయి గ్రామంలో చేపల వేట లీజును పొంది రికార్డు సాధించింది. 2004లో తమిళనాడులో సునామీ వచ్చినప్పుడు చిన్నపిళ్లై నేతృత్వంలోని రెస్క్యూ మిషన్‌లో మహిళలు చేసిన కృషి అభినందనీయం. భారత ప్రధానమంత్రి "స్త్రీ శక్తి అవార్డు" నుండి వచ్చిన లక్షా డెబ్బై వేల రూపాయలను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల వైద్య ఖర్చుల కోసం ఇచ్చివేసింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారాన్ని రూపుమాపింది. మహిళా స్వయం సహాయక సంఘాలు మొదట్లో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తూ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళా అభివృద్ధికి బాగా కృషి చేస్తూ చిన్నపిళ్లైని అగ్రగామిగా నిలబెట్టాయి.

పదవులు

[మార్చు]

కళంజియం మహిళా స్వయం సహాయక సంఘం ప్రారంభించినప్పుడు పద్నాలుగు మంది మహిళలతో కూడిన స్వయం సహాయక సంఘానికి నాయకురాలిగా ఉన్న చిన్నపిళ్లై ఆ తర్వాత మూడేళ్లలో ఐదు వేల మంది మహిళలకు నాయకురాలిగా ఎదిగింది.

సెవెన్ స్టేట్ ఉమెన్స్ వేర్ హౌస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్గనైజేషన్ లో ఏడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పనిచేసింది. ప్రస్తుతం, ఈమె తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సాతో సహా పన్నెండు రాష్ట్రాలకు చెందిన రెండు వందల నలభై ఫెడరేషన్లకు అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది. ఈ సమాఖ్య సభ్యత్వం సుమారు ఎనిమిది లక్షల మంది మహిళలు.

గుర్తింపు

[మార్చు]
  • 1999లో స్త్రీ శక్తి పురస్కారం అందుకున్న ఐదుగురు మహిళల్లో చిన్నా పిళ్లై ఒకరు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమెకు అవార్డును అందజేసినప్పుడు గౌరవంగా ఆమె పాదాలను తాకి నమస్కరించారు .[3]
  • తమిళనాడు ప్రభుత్వం ఈమెను లక్షరూపాయల విలువైన బంగారు పతకంతో సత్కరించింది.
  • మహాత్మాగాంధీ మనుమరాలు సుమిత్రా కులకర్ణి చేతులమీదుగా "బజాజ్ జానకీ దేవి అవార్డ్ ఫర్ కెరీర్ డెవెలప్‌మెంట్" పురస్కారాన్ని స్వీకరించింది.
  • 2007లో దూరదర్శన్ వారిచే ఉత్తమ సమాజ సేవకురాలు అవార్డును పొందింది.
  • 2018లో అవ్వయ్యార్ అవార్డు స్వీకరించింది.
  • 2019లో ఈమె చేసిన సేవకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Menon, Rasmesh (15 January 2001). "The Negotiator". Rediff. Retrieved 7 July 2020.
  2. Dharmaraj, Vidyashree (23 March 2002). "Woman Achiever". The Hindu. Archived from the original on 28 November 2004. Retrieved 9 March 2013.
  3. Rajachandrasekaran, Anitha (5 March 2005). "On an EQUAL footing". The Hindu. Archived from the original on 20 November 2013. Retrieved 10 March 2013.
  4. "Padma Awards 2019 Announced: Full list of awardees". The NEWS Minute. 25 January 2019. Retrieved 25 January 2019.