చిలుకూరి శాంతమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలుకూరి శాంతమ్మ
జననంమార్చి 8, 1929
కృష్ణాజిల్లా మచిలీపట్నం
వృత్తిఅధ్యాపకురాలు
మతంహిందూమతం
భార్య / భర్తసుబ్రహ్మణ్య శాస్త్రి
తండ్రిసీతారామయ్య
తల్లివనజాక్షమ్మ

చిలుకూరి శాంతమ్మ, విశాఖపట్నానికి చెందిన మహిళా ప్రొఫెసర్. ప్రస్తుతం ఆమె వయస్సు (2022) నాటికి 93 సంవత్సరాలు. ఆ వయస్సులోనూ ఆమె విశాఖపట్నం నుండి రోజుకు 60 కి.మీ ప్రయాణించి విజయనగరం లోని ఒక కళాశాలలో విద్యార్థులకు తనకున్న మక్కువతో భౌతిక శాస్త్రంపై పాఠాలు చెపుతుంది. అక్కడి సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటారు. [1][2]

జననం, విద్యాభ్యాసం[మార్చు]

చిలుకూరి శాంతమ్మ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 1929 మార్చి 8న  జన్మించింది. తల్లిదండ్రులు సీతారామయ్య, వనజాక్షమ్మ.తండ్రి న్యాయ వ్యవస్థలో పనిచేసాడు. శాంతమ్మ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. ఆమె తల్లి వనజాక్షమ్మ 104 ఏళ్ళు జీవించింది. ఈమె రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఏవిఎన్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. శాంతమ్మకు భౌతిక శాస్త్రం అంటే చాలా మక్కువ. మహారాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపీలో పిహెచ్‌డికి సమానమైన డిఎస్సీ పూర్తి చేసింది.

వృత్తి[మార్చు]

1956లో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పనిచేసింది. ఆ తరువాత లెక్చరర్‌ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించింది. 1989లో పదవీ విరమణ చేశారు. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు పాటు పనిచేశారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (DST) వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు.

శాంతమ్మ విద్యార్ధి దశలోనే.. బ్రిటన్ రాయల్ సొసైటీ ఆచార్యుల పరిశీలనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది . స్పెక్ట్రోస్కోపీలో విశేషమైన పరిశోధనలు చేసి ప్రయోగశాలలను అభివృద్ధి చేసిన డాక్టర్ రంగధామారావు మార్గదర్శనంలో పరిశోధనలు చేసింది. లేజర్ టెక్నాలజీ, పెట్రోల్‌లో మలినాలు గుర్తింపు వంటి అనేక అనేక ప్రాజెక్టుల్లో శాంతమ్మ పరిశోధనలు చేసి. అనేక పరిశోధన పత్రాలు ముద్రించింది. అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియాలోని అనేక విశ్వవిద్యాలయాలు శాంతమ్మను ఆహ్వానించి ఆమె అనుభవాలు తెలుసుకున్నాయి. శాంతమ్మ మార్గదర్శకత్వంలో 17 మంది వరకూ పీహెచ్డీ పూర్తి చేశారు.[3]

అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన ఆమె విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్‌లో అనేక అవార్డులు, బంగారు పతకాన్ని అందించింది. ఈ ప్రొఫెసర్‌కి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఉంది. ఆమె "భగవద్గీత - ది డివైన్ డైరెక్టివ్" అనే పుస్తకాన్ని రచించింది, ఇది భగవద్గీత శ్లోకాల ఆంగ్ల అనువాదం. తన భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు ప్రొఫెసర్‌గా ఉంటూ ఆమెకు ఉపనిషత్తులను పరిచయం చేశాడు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో తెలుగు రాష్ట్రాలలో తొలితరం స్వయంసేవక్ లలో ఒకరుగా, ప్రాంత, క్షేత్ర సంఘచాలక్ గా, కేంద్ర కార్యకారిని సదస్యునిగా పలు బాధ్యతలు నిర్వహించి, వేలాదిమంది సంఘ్ కార్యకర్తలకు స్ఫూర్తి కలిగిస్తూ చివరి వరకు సంఘ  కార్యంలో నిమగ్నమైన ఆచార్యులు. ఆయన కొన్నేళ్ల క్రితం చనిపోయారు.[4]

ప్రత్యేకతలు[మార్చు]

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణగా హైదరాబాదులో ప్రతి ఏటా నిర్వహించే షష్టిపూర్తి కలాలకు సత్కారం కార్యక్రమం ‘మాతృవందనం’ లో డా. చిలుకూరి శాంతమ్మ సత్కార గ్రహీత. [5]

ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు తన విద్యార్థి అని ఆమె గర్వంగా చెప్తుంది.

ఆమె ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌. గిన్నిస్‌బుక్‌ వాళ్లకు ఆమె పేరును సూచిస్తున్నారు. ఆమె తమ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు, "మాది ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న కుటుంబం… డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మా వారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’. [6]

మూలాలు[మార్చు]

  1. "93-year-old professor from Andhra Pradesh's Vizianagaram has her passion for teaching still intact". The New Indian Express. Retrieved 2022-07-29.
  2. "93 Year Old Professor Chilukuri Santhamma Passion For Teaching For Students - Sakshi". web.archive.org. 2022-07-30. Archived from the original on 2022-07-30. Retrieved 2022-07-30.
  3. రెడ్డి, కిషోర్‌ (5 August 2022). "95 ఏళ్ల వయసులోనూ పాఠాలు చెబుతోన్న రిటైర్డ్ ప్రొఫెసర్‌.. ఈమె మన తెలుగు ఆమెనే." ది టైమ్స్ అఫ్ ఇండియా: సమయం. Retrieved 6 January 2024.
  4. Ahmed, Syed (26 July 2022). "93ఏళ్ల వయస్సులోనూ బోధన- విజయనగరంలో అరుదైన మహిళా ప్రొఫెసర్-చదివితీరాల్సిన పాఠం." One India. Retrieved 6 January 2024.
  5. "షష్టిపూర్తి కలాలకు సత్కారం". ABN ఆంధ్ర జ్యోతి. 11 May 2023. Retrieved 6 January 2024.
  6. "93 ఏళ్ళ వయస్సులోనూ పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్‌ శాంతమ్మ!". నిజం. 29 July 2022. Retrieved 6 January 2024.