చీమ, మిడత కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

జీన్-బాప్టిస్ట్ ఔడ్రీ, 1750లో చిత్రీకరించిన చీమ - మిడత కథ

చీమ, మిడత (లేక గొల్లభామ) కథ అన్నది ఈసపు కథల్లో ఒకటి. ఇది బెన్ ఎడ్విన్ పెర్రీ రూపొందించిన పెర్రీ సూచికలో 373వ కథగా ఉంది.[1] ముందుచూపు లేని మిడత శీతాకాలం వచ్చేసరికి ఆకలితో చీమల నుంచి ఆహారం కోసం అభ్యర్థించడం, దాన్ని ఆ చీమలు తిరస్కరించడం ఈ కథలో ఇతివృత్తం. ఈ కథ కష్టపడి పనిచేయడం, భవిష్యత్తు కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం వంటి విషయాల్లో నీతి బోధిస్తుంది.[2]


ప్రాచీన కాలంలోనే ఈ కథలోని నీతిని కొందరు తిరగేసి భాష్యం చెప్పడంతో ఒక ప్రత్యామ్నాయ కథ రూపొందింది. ఆ వెర్షన్ చీమల కష్టపడే స్వభావాన్ని స్వలాభం కోసమేననీ, తోటివారికి సాయపడక పిసినారితనంతో ఉన్నాయని వ్యాఖ్యానించేలా ఉంటుంది. జీన్ దె లా ఫోంటైన్ ఫ్రెంచ్ భాషలోకి ఈ కథను జాగ్రత్తగా, వ్యంగ్యంతో తిరగరాయడంతో ఈ కథ, దాని నీతి చుట్టూ సహానుభూతి, దాతృత్వం వంటి అంశాలపై ఉన్న చర్చ మరింతగా జరిగింది. 18వ శతాబ్ది నుంచి మిడతను కళాకారులకు ప్రతీకగా కూడా చూడడంతో సంస్కృతికి సమాజంలో ఉన్న స్థానం గురించిన చర్చకు కూడా ఈ కథపై వ్యాఖ్యానంలో చోటుదక్కింది. సాహిత్యం, కళలు, సంగీతం వంటివాటి కళారూపాల్లోకి ఈ కథ ఇతివృత్తాన్ని తీసుకుని అనుసృజన చేయడం ద్వారానూ, ఈ కథ గురించి పునర్‌వ్యాఖ్యానించడం ద్వారానూ ఈ కథ చెప్పే నీతికి ఉన్న అస్పష్టత గురించి రకరకాల కోణాలను బయటకుతెచ్చారు.

కథ, ప్రతికథ

[మార్చు]
చార్లెస్ హెచ్. బెనెట్ 1857లో చిత్రీకరించిన చీమ, మిడత బొమ్మ

ఒక మిడత వేసవికాలం అంతా పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ గడుపుతుంది. అదే సమయంలో ఒక చీమ (కొన్ని వెర్షన్లలో చీమలు) శీతాకాలం కోసం ఆహారాన్ని నిలువ చేసుకోవడానికి కష్టపడి పనిచేస్తూంటుంది. శీతాకాలం రావడంతో ఆహారం దాచుకోని మిడత తిండి లేక చనిపోయే స్థితికి చేరుకుని చీమని ఆహారం ఇవ్వమని అభ్యర్థిస్తుంది.  వేసవికాలం అంతా పనిచేయకుండా పాటలు పాడుతూ, తుళ్ళుతూ గెంతుతూ గడిపినందుకు మిడతని తప్పుపట్టిన చీమ, ఇప్పుడు చలికాలంలో కూడా అలానే నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ గడపమని చెప్పి పంపేస్తుంది.[3] బాబ్రియస్, అవియానస్ వంటి గ్రీకు రచయితల కథల సంకలనాల్లో ఈ కథ వెర్షన్లు కనిపిస్తాయి. వాటితో పాటు సింటిపస్, అప్థోనియస్ వంటివారికి ఆపాదించిన రచనల్లో కూడా ఈ కథ కనిపిస్తుంది. గ్రీక్ మూలంలో ఈ కథలో మిడత బదులు సికాడా (తెలుగులో ఇలకోడి, ఝిల్లిక) అనే పురుగు ఉంటుంది. లాటిన్, రొమాన్స్ భాషల్లోకి జరిగిన అనువాదాల్లో సికాడానే కొనసాగింది. తర్వాత దాని స్థానంలోకి మిడత వచ్చి చేరింది. పెర్రీ ఇండెక్స్‌లో 112వ కథ కూడా ఇదే ఇతివృత్తంతో ఉంటుంది. దానిలో ఒక పేడ పురుగు ముందుజాగ్రత్త లేకుండా బ్రతుకుతూ ఉంటుంది. వానాకాలం వచ్చేసరికి వానల వల్ల అది ఆహారంగా తింటున్న పేడ కొట్టుకుని పోతుంది.[4]

ఈ కథ మధ్యయుగాలకు చెందిన లాటిన్ మూలాలు చాలావాటిలో కనిపిస్తుంది. అలానే, 14వ శతాబ్దికి చెందిన ఫ్రెంచి కవి యూస్టాష్ దెషాంప్స్ రాసిన నీతి కథల గేయగాథల్లో కూడా ఇది చోటుచేసుకుంది.[5] పునరుజ్జీవనోద్యమ కాలంలో వివిధ యూరోపియన్ భాషల్లోకి అనువాదమైన యూసప్ కథల్లో కూడా కనిపించడంతో పాటు అనేక మంది నియో-లాటిన్ కవులు దీనిని ఒక ఇతివృత్తంగా ఉపయోగించారు. వీరిలో గాబ్రియేల్ ఫేర్నో (1563), [6] హిరోనిమస్ ఓసియస్ (1564), [7] కాండిడస్ పాంటాలియన్ (1604) ఉన్నారు. [8]

కష్టపడి పనిచేయడంలోని ప్రయోజనాన్ని, ముందుచూపు లేకపోవడంలోని నష్టాలను చెప్పడానికి ఈ కథ ఉపయోగపడింది. కొన్ని వెర్షన్లలో నీతులను చివరిలో నేరుగా ఇచ్చారు, ఆ వాక్యాలు ఇలా ఉంటాయి: "సోమరిపోతులు ఆకలితో బాధపడతారు", [9] "రేపు తినడానికి ఈ రోజు పని చేయండి", [10] "జూలై తర్వాత డిసెంబర్ వస్తుంది" (యూరపులో జులై వెచ్చటి వేసవికి, డిసెంబరు కరడుకట్టిన చలికాలానికి సంకేతం).[11] ఫ్రెంచి భాషలోకి లా ఫోంటైన్ పునఃకథనంలో ఏ తుది తీర్పూ ఇవ్వలేదు,[12] అయితే ముందుజాగ్రత్త లేని తన పద్ధతులను రచయిత వ్యంగ్యంగా తానే ఎగతాళి చేస్తున్నాడని కొందరు భావించారు.[13] అయితే ఈ కథను అనువదించినవారు, అనుసృజించినవారు చాలావరకూ తమ దృక్కోణాన్ని చీమ ధోరణికి మద్దతుగానే చెప్పారు. ఇలాంటి దృక్పథానికి ప్రధానంగా బైబిల్లోని సామెతల గ్రంథం కారణం. ఇందులో రెండుసార్లు చీమల గురించిన ప్రస్తావన వస్తుంది.[14]

మొదటి సామెత ఇలా హెచ్చరిస్తుంది, "చీమ దగ్గరకు వెళ్ళు, సోమరి! ఆమె మార్గాలను గమనించి తెలివి తెచ్చుకో, చీమకు నాయకుడు, పర్యవేక్షకుడు, పాలకుడు లేకపోయినా, వేసవిలో తన ఆహార ధాన్యాలను ముందే దాచుకుంటుంది, పంట పండేకాలంలో అవసరమైన ఆహారాన్ని సేకరిస్తుంది" (6.6-8) .

రెండవ సూక్తి ఇలా చెప్తుంది: 'భూమిపై చిన్నగా ఉండే నాలుగిటిలో కీటకాలు కూడా ఉన్నాయి, కానీ అవి చాలా తెలివైనవి. చీమలు దృఢంగా ఉండవు, కానీ (తెలివిగా) వేసవిలో తమ ఆహారాన్ని దాచుకుంటాయి.' (30.24–25)

ఈసప్ కథను కూడా చాలామంది ఈ సామెతలు చెప్పే దృష్టితోనే చూశారు.

అయితే, ఈసప్‌ కథల్లోనే ఇందుకు భిన్నమైన మరో దృక్కోణం కూడా ఇంకో కథలో కనిపిస్తుంది. పెర్రీ సూచికలో 166వ కథ అది. దాన్ని ఈ "చీమ, మిడత కథ"కు ప్రతికథగా అభివర్ణిస్తారు.[15] దాని ప్రకారం - పూర్వం ఒక మనిషి వ్యవసాయంలో చాలా కష్టపడేవాడు, ఎప్పుడూ అధిక ఉత్పత్తి కోరుకునేవాడు. తన సొంత శ్రమకు దక్కిన ఫలితాలతో తృప్తి చెందక రాత్రిపూట పొరుగువారి పంటలను కూడా దోచుకుని దాచుకునేవాడు. ఇది దేవతల రాజుకు కోపం తెప్పించింది. దానితో మనిషిని దేవతల రాజు చీమగా మార్చేశాడు. మనిషి తన రూపురేఖలు చీమగా మారినప్పటికీ అలవాట్లను మార్చుకోకుండా నేటికీ పొలాల చుట్టూ తిరుగుతూ ఇతరుల శ్రమ ఫలాలను తెచ్చుకుని తనకోసం దాచుకుంటున్నాడు. పాత గ్రీకు మూలాల్లో దీనికి చెప్పిన నీతి ఏమిటంటే, ఒకరి నైతిక స్వభావాన్ని మార్చుకోవడం కంటే రూపాన్ని మార్చుకోవడం సులభం. ప్రాచీన కాలం నుండి ఇది చాలా అరుదుగా దొరికే కథ. కల్పిత కథల సేకర్తలలో గాబ్రియేల్ ఫేర్నో (1564), [16] రోజర్ ఎల్'ఎస్ట్రాంజ్ (1692) దీన్ని సేకరించిన కొద్దిమందిలో ఉన్నారు.[17]

మూలాలు

[మార్చు]
 1. Ben Edwin Perry (1965). Babrius and Phaedrus. Loeb Classical Library. Cambridge, MA: Harvard University Press. pp. 487, no. 373. ISBN 0-674-99480-9.
 2. Brewer's Concise Dictionary of Phrase and Fable, London reprint 1992, p.36
 3. Francisco Rodríguez Adrados, History of the Graeco-Latin fable III, Leiden NL 2003, p.146
 4. "Aesopica website". Mythfolklore.net. Retrieved 2012-04-04.
 5. Poésie Morale, Paris 1832, pp.191-2
 6. Faerno, Gabriello (1743). Fable 7. Retrieved 2013-08-18.
 7. "Fable 88". Uni-mannheim.de. Retrieved 2013-08-18.
 8. "Fable 145". Uni-mannheim.de. Retrieved 2013-08-18.
 9. The Sunday School Teacher: A Monthly Magazine, Chicago 1866, p.335
 10. Debra J. Housel, The Grasshopper and the Ants--Reader's Theater Script & Fluency Lesson, 2014, p.9
 11. Isaac Bickerstaffe’s version, The Gentleman’s Magazine, 26 November 1768, reprinted in The Dramatic Cobbler: The Life and Works of Isaac Bickerstaff, Bucknell University 1972, pp.272-3
 12. Jean de La Fontaine. "Original text and translation". Bewilderingstories.com. Retrieved 2013-08-18.
 13. Andrew Calder, The Fables of La Fontaine: Wisdom Brought Down to Earth, Geneva CH 2001, pp.18-24
 14. Franz Delitzsch, Biblical Commentary on the Proverbs of Solomon, Edinburgh 1874, p.141
 15. "Zeus and the Ant", "Mythfolklore.net". Mythfolklore.net. Retrieved 2012-04-04.
 16. Faerno, Gabriello (1743). Fable LXXXIII, available online. Retrieved 2012-04-04.
 17. "Fable 188". Mythfolklore.net. Retrieved 2012-04-04.

బయటి లింకులు

[మార్చు]