చోఖామేళా
చోఖా మేళా | |
---|---|
జననం | దేల్గావ్ తాలూకా, బుల్దానా జిల్లా . |
బిరుదులు/గౌరవాలు | సంత్ |
చోఖామేళా 14వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన ఒక వార్కరీ సన్యాసి.[1] విఠోబా భక్తుడు. ఈయన అప్పటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం అంటరాని కులంగా భావించే మహర్ జాతికి చెందిన వాడు. చాలా అభంగాలు రాశాడు. ఈయనను తొలితరం దళిత కవుల్లో ఒకడిగా చెప్పవచ్చు. ఈయన భార్య సోరాబాయి,[2] కొడుకు కర్మమేళా తో కలిసి జీవించాడు. ఈయన చెల్లెలు నిర్మల, ఆమె భర్త బంక, వీరందరూ కూడా విఠోబా భక్తులుగా ప్రసిద్ధి గాంచారు. నామదేవుడి (1270-1350) ఉపదేశంతో ఆధ్యాత్మిక సాధన కొనసాగించాడు.
జీవితం
[మార్చు]చోఖామేళా ప్రస్తుతం మహారాష్ట్ర, బుల్ధాణా జిల్లా, దేవుల్ గావ్ రాజా తాలూకా, మెహూణా రాజా అనే గ్రామంలో జన్మించాడు. మంగళవేద అనే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. ఆయన వృత్తి అగ్రవర్ణాలకు చెందిన తోటలు, పంటలకు కాపలా కాయడం. ఇందులో భాగంగానే ఊరికి దూరంగా నివాసం ఏర్పరుచుకుని ఉండేవాడు.
ఒకసారి పండరీపురాన్ని సందర్శించిన చోఖామేళా అక్కడే నామదేవుడి సంకీర్తనను విన్నాడు. సహజంగానే విఠోబా భక్తుడైన ఆయన ఆ గానంతో పరవశుడై నామదేవుని దగ్గర దీక్షను స్వీకరించి తర్వాత పండరీపురంలోనే స్థిరపడ్డాడు. ఇక్కడి సాంప్రదాయ కథ ప్రకారం అంటరాని వాడైన ఈయనను పూజారులు మొదట్లో ఆలయంలోకి అనుమతించలేదు. చంద్రభాగ నదికి ఆవల వైపున ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడ నుంచే విఠోబాను ప్రార్థిస్తూ ఉండేవాడు.
మరణం
[మార్చు]ఒక గోడను నిర్మిస్తుండగా గోడ విరిగిపడి చాలామందితో పాటు చోఖామేళా కూడా మరణించాడు. సాంప్రదాయ గాథల ప్రకారం ఈయన శవాన్ని గుర్తించడానికి అందరూ ఇబ్బంది పడుతుంటే నామదేవుడు వచ్చి ఎవరి ఎముకలైతే విఠల అనే పలుకుతాయో అదే చోఖామేళా అని చెప్పాడని ప్రతీతి. విఠల ఆలయం ఎదురుగా ఆయన సమాధి ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ Zelliot, Eleanor (2008). "Chokhamela, His Family and the Marathi Tradition". In Aktor, Mikael; Deliège, Robert (eds.). From Stigma to Assertion: Untouchability, Identity and Politics in Early and Modern India. Copenhagen: Museum Tusculanum Press. pp. 76–85. ISBN 8763507757.
- ↑ Harrisson, Tom (1976). "A Historical Introduction to the Warakari Movement". Living Through the Blitz. Cambridge University Press. p. 40. ISBN 9780002160094.