విఠోబా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విఠోబా
విఠలుడి ప్రతిమ
విఠలుడి ప్రతిమ
సంప్రదాయభావం విష్ణు అవతారం
ఆవాసం పండరీపురం
భార్య రుక్మిణి
వాహనం గరుడ పర్వతం

విఠోబా ( విఠలుడు లేదా పాండురంగడు) మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణా రాష్ట్రాల్లో ఎక్కువగా ఆరాధించే ఒక హిందూ దేవుడు. ఈయన విష్ణువు లేదా ఆయన అవతారమైన శ్రీకృష్ణుని యొక్క అంశగా భావిస్తారు. విఠోబాను సాధారణంగా చేతులు వెనక్కు కట్టుకుని నిల్చుని ఉన్న నల్లటి యువకుడిగా చిత్రీకరిస్తారు. చాలా ప్రతిమల్లో రుక్మిణి కూడా తోడుగా ఉంటుంది.

మహారాష్ట్రలోని వర్కారి, కర్ణాటకలోని హరిదాసు లాంటి ఏకేశ్వరోపాసనా సాంప్రదాయాలలో విఠోబా ప్రధాన దైవం. పండరీపురంలోని విఠల దేవాలయం ప్రధాన దేవాలయం. విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఈ పుండరీకుడే విఠోబాను పండరీపురమునకు రప్పించాడని భక్తుల విశ్వాసం. మరి కొన్ని కథలు ఆయన భక్తకవులను ఎలా కరుణించాడనే సంఘటనలమీద ఉంటాయి. ఈ వర్కారీ సాంప్రదాయానికి చెందిన వాగ్గేయకారులు మరాఠీ భాషలో విఠోబా దేవునిపై అభంగాలు అనే దివ్య సంకీర్తనలు రచించారు. కన్నడదేశంలోని హరిదాసు సాంప్రదాయంలో స్తోత్రాలు, మరాఠీ లోని హారతి పాటలు విఠోబా సాహిత్యం లో చెప్పుకోదగ్గవి. చాంద్రమానం ప్రకారం ఆషాడ మాసంలో వచ్చే శాయనీ ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ప్రభోదిని ఏకాదశి లో విఠోబాకు విశేష పూజలు జరుగుతాయి.

విఠోబా పేరు మీద, చరిత్రమీద అనేక వాదోపవాదాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అనేకమంది ఇండాలజిస్టులు (భారతదేశ చరిత్ర మీద పరిశోధన చేసేవారు) విఠోబా సాంప్రదాయం ఆరంభం కాకముందే ఇలాంటి విగ్రహాలు వివిధ కాలాల్లో వీరుడిగానూ, గ్రామదేవుడిగానూ, శివుడి యొక్క మరో స్వరూపంగానూ, జైన దేవుడిగానూ పూజలందుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. విఠోబా సాంప్రదాయం, ప్రధాన ఆలయం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక వాదనలు జరుగుతున్నా 13వ శతాబ్దానికి మునుపే వాటి ఉనికిని నిర్థారించేందుకు ఆధారాలున్నాయి.

వివిధ నామాలు[మార్చు]

విఠోబాకే విఠల, విఠ్ఠల, పాండురంగడు, పండరీనాథుడని, హరి, నారాయణుడనీ చాలా పేర్లున్నాయి. ఈ పేర్ల యొక్క మూలాల గురించి, అర్థాల గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వర్కారీ సాంప్రదాయం ప్రకారం విఠల అనే పదం విఠ్ (అంటే ఇటుక), ఠల (స్థలం అనే పదానికి రూపాంతరం, అంటే మీద నిలుచుని ఉన్న) అనే రెండు పదాల కలయిక. విఠోభా అంటే ఇటుకపై నిల్చుని ఉన్నవాడు అని అర్థం వస్తుంది. [1] తూర్పు దేశాల చరిత్రను, సంస్కృతులను అధ్యయనం చేసిన విలియం క్రూక్ ఈ వివరణను సమర్ధించాడు.[2] చేతులు వెనక్కి కట్టుకుని నిల్చుండటం అనే చిహ్నం భక్తుడు పుండలీకుడి గురించి ప్రచారంలో ఉన్న కథకు సంబంధించింది.

కానీ మరో భక్తుడు తుకారాం మాత్రం పేర్లకి వేరే వివరణ ఇచ్చాడు. ఆయన దృష్టిలో విఠ అంటే అజ్ఞానం అనీ అంటే అంగీకరించే అని అర్థం. విఠల అంటే అజ్ఞానులైన భక్తులను కూడా అక్కున చేర్చుకునేవాడని అర్థం. [3] ప్రముఖ చరిత్రకారుడు రామకృష్ణ గోపాల్ భండార్కర్ మరొక వాదనను తెరపైకి తీసుకొచ్చాడు. ఆయన ప్రకారం విఠు అంటే విష్ణు అనే సంస్కృత పదానికి కన్నడ రూపాంతరం. మరాఠా సాంప్రదాయం ప్రకారం ల, భా అక్షరాలను చేరిస్తే పూజనీయత ఆపాదించబడుతుంది. కాబట్టి విఠల, విఠోబా పేర్లు వచ్చి ఉండవచ్చునని ఆయన భావన. [4] ఈ విష్ణు అనే పేరు విఠు గా రూపాంతరం చెందడానికి మరాఠా, కన్నడ ప్రజలు సంస్కృత భాషను వేర్వేరుగా ఉచ్ఛరించడం కారణం కావచ్చు. [5]

పుణెలోని దక్కను కళాశాలకు చెందిన పరిశోధకుడు ఎమ్మెస్. మాటే ప్రకారం పుండలీకుడు ఒక చారిత్రక పురుషుడు. ఆయన అప్పటి హోయసాల రాజు విష్ణువర్ధనుడు లేదా బిత్తిదేవుడిని పండరీపురంలో విష్ణు ఆలయం నిర్మించేలా ప్రేరేపించాడు. అందులో దేవునికి బిత్తిదేవుని నామాంతరమైన విఠ్ఠలుడిగా నామకరణం చేశారు.[6] విఠురాయ (విఠల రాజు), విథాయి (విఠల మాత) మరి కొన్ని నామాంతరాలు. గుజరాతీయులు నాథ్ అనే పేరును చేర్చి విఠలనాథుడు అని పిలుచుకున్నారు. [7] మరికొంతమంది హిందీ భాషలో గౌరవ ప్రదమైన జీ కూడా చేర్చి విఠలనాథ్ జీ అని పిలుచుకున్నారు.

ఇక పాండురంగ లేదా పాండరంగ అనే పేరుకి శ్వేత వర్ణ దేవుడు అని అర్థం వస్తుంది. జైన సన్యాసి హేమచంద్ర (1089–1172 AD) ఈ పేరు శివుడిది కూడా అయి ఉండవచ్చునని భావించాడు. విఠోబా నల్లని వర్ణంతో చిత్రించినప్పటికీ ఆయనను శ్వేతవర్ణ దేవుడిగానే భావించారు. భండార్కర్ ఈ వైరుధ్యాన్ని ఇలా వివరించాడు. పాండురంగ అనేది పండరీపురం దేవాలయం లోని శివుడి రూపానికి ఒక విశేషణమనీ, ఇప్పటికీ అక్కడ ఉన్నది శివుని ఆలయమేనని ఆయన భావన. విఠోబా సాంప్రదాయం బాగా వేళ్లూనుకోవడంతో ఆ ఆలయాన్ని కూడా విఠోబా ఆలయంగా మారిందని ఆయన విశ్వాసం. [8] ఇంకో వాదం ఏమిటంటే విఠోబా ముందు శివుడి దేవాలయం గానే ఉండేది. తరువాత విష్ణు దేవాలయంగా గుర్తించారి. అందుకనే విఠోబాకు పాండురంగడని పేరు వచ్చింది.[9] క్రూక్ ప్రతిపాదన ప్రకారం పండరీపూర్ యొక్క పూర్వనామమైన పండరాగ అనే పదానికి సంస్కృతీకరిస్తే పాండురంగ అయ్యింది.[2] పండరీనాథుడు (పండరీపురానికి యజమాని) అనేది కూడా విఠోబా యొక్క మరో పేరు.

చివరిగా విఠోబాను ప్రధానం విష్ణువు అవతారంగా భావిస్తారు కాబట్టి విష్ణు నామాలైన హరి, నారాయణ లాంటి పేర్లు కూడా ఉన్నాయి. [10]

ఆవిర్భావం[మార్చు]

విఠోబాను ఆరాధన ఎప్పుడు ప్రారంభమైందనే విషయంపై భిన్నాభిప్రాయాలు, వాదనలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు విఠోబా ఆవిర్భావం గురించి, విఠోబా ఒక విశిష్టమైన దేవుడిగా కొలవడం ఎప్పుడు ప్రారంభమైందనే విషయం గురించి అనేక ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ప్రతిపాదించారు. 8వ శతాబ్దానికి చెందిన ఆది శంకరాచార్యుడు రాసిన పాండురంగాష్టకం స్తోత్రాన్ని బట్టి విఠోబా ఆరాధన అంతకు మునుపే ప్రారంభమైందని భావించవచ్చు. [11]

ఎ సోషియల్ హిస్టరీ ఆఫ్ దక్కన్ అనే పుస్తకం రాసిన రిచర్డ్ మాక్స్వెల్ ఈటన్ ప్రకారం ఆరవ శతాబ్ద కాలానికే విఠోబా ఒక గ్రామదైవంగా ఆరాధింపబడేవాడు. [9] విఠోబా చేతులు వెనక్కి కట్టుకుని నిల్చున్న ముద్ర బీహారుకు చెందిన పశువుల కాపరుల తెగ అహిర్ జాతి దైవం బిర్ కువర్ ని పోలిఉంది. [12] తరువాత అన్ని గ్రామదేవతలను ఆరాధించినట్టుగానే విఠోబాను కూడా శివుడిగా కొలవడం ప్రారంభించి ఉండవచ్చు. ఇలా భావించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పండరీపురంలో విఠోబా ఆలయం చుట్టూ అనేక శైవ దేవాలయాలున్నాయి. విఠోబా కిరీటం శివలింగాన్ని పోలి ఉంది. కానీ 13వ శతాబ్దం నుంచి కవి సన్యాసులైన నామదేవుడు, ఏకనాథుడు, తుకారాం మొదలైన భక్తులు విఠోబాను విష్ణువు అవతారంగా భావించడం ప్రారంభించారు. [9]

వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టియన్ లీ మాత్రం విఠోబా ఆరాధన సుమారు క్రీ.పూ 1000 లో కర్ణాటక రాష్ట్రం నుండి శైవారాధన ప్రధానంగాగల పండరీపురానికి తరలి వెళ్ళి ఉండవచ్చునని ఊహించాడు. అప్పట్లో ప్రధానంగా కృష్ణుని ఆరాధించే మహానుభవ సాంప్రదాయకుల ప్రభావంతో వైష్ణవ క్షేత్రంగా మారి ఉండవచ్చునని ఆయన ఊహ. ఇందుకు ఆధారంగా పట్టణంలో శివుని ఆరాధనకు సంబంధించిన శిథిలాలు గమనించవచ్చు. [13]

పండరీపురం ఆలయాలు, మరియు శాసనాలు[మార్చు]

The shikhara of the Vithoba's chief temple at Pandharpur

విఠోబా చరిత్రను శాస్త్రీయంగా పరిశీలించాలంటే పండితులు పండరీపురంలో అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్న ప్రధాన ఆలయం ఎన్ని సంవత్సరాల క్రిందటిదో నిరూపిస్తే తెలుస్తుంది .[14] ఆలయంలోని అతి ప్రాచీనమైన భాగం క్రీ.శ 12, 13 వశతాబ్దాలకు చెందిన యాదవరాజుల కాలానికి చెందినది. ఆలయం విస్తరించడం చాలాకాలం కొనసాగినప్పటికీ చాలా భాగం 17వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. [10] ఆలయం మొదటిసారిగా ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందని భండార్కర్ చెప్పలేకపోయినా 13 వశతాబ్దానికి చెందినదని మాత్రం ఆధారాలు చూపించగలిగాడు.[4] ఎస్.జి. తులుపే ప్రకారం క్రీ.శ 1189 కే ఆలయం అక్కడ ఉంది.[10] అక్కడ పరిసరాల్లో దొరికిన ఒక శాసనంలో 1189 సంవత్సరంలో విఠోబా కోసం చిన్న గుడికట్టినట్లు లిఖించబడి ఉంది. కాబట్టి విఠోబా ఆరాధన అంతకుముందే ప్రారంభమై ఉండవచ్చునని ఆయన నిర్ధారించాడు. [15]

పూజలు[మార్చు]

విఠోభా మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన దేవుడు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మరియు గుజరాత్ రాష్ట్రాల్లో కూడా భక్తులున్నారు. [16] కులదేవత ఆరాధన అంత లేకపోయినా మరాఠీ ప్రజలు విఠోబాను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.[17] విఠోబా ప్రధాన ఆలయంలోనే రకుమాయి దేవికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది. అందుకునే భక్తులు పండరీపురాన్ని భూవైంకుంఠం అని పిలుస్తు ఉంటారు.[18] మహారాష్ట్ర, కర్ణాటక, మరియు తెలంగాణా రాష్ట్రాల నుండి భక్తులు జ్ఞానేశ్వరుడు (13వ శతాబ్దం) కాలం నుంచే దర్శనానికి వెళ్ళివస్తుండే వారు.[11]

రాయలసీమ లోని చిత్తూరు, కడప జిల్లాల్లోని చాలా గ్రామాల్లో పాండురంగనికి దేవాలయాలున్నాయి. ఈ ఆలయాలన్నింటిలో ప్రతి సంవత్సరం లో ఒక పౌర్ణమికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో అగ్నిగుండ ప్రవేశం ప్రధానమైన భాగం. ఇంకా ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పండరి భజనలు కూడా ప్రదర్శిస్తారు.ఈ భజనల్లో పండరీనాథుని కీర్తిస్తూ భక్తులందరూ వలయాకారంలో నిలిచి లయబద్ధంగా అడుగులు వేస్తారు. కోలాటం కూడా ప్రదర్శిస్తారు.

భక్త తుకారాం సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు పాండురంగని భక్తుడైన తుకారాం గా నటించాడు.

పురాణ కథలు[మార్చు]

విఠోబాకు సంబంధించిన పురాణ గాథలన్నీ ఎక్కువగా ఆయన భక్తుడైన పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఇంకా విఠోబాను వర్కారీ సాంప్రదాయానికి చెందిన భక్తకవులను కరుణించిన వాడిగా చిత్రీకరించబడి ఉంటాయి. పుండరీకుని గురించిన ప్రస్తావన స్కంద పురాణంలోనూ, పద్మపురాణంలోనూ ఉంది. ఇంకా శ్రీధరుడు రాసిన పాండురంగ మహాత్మ్యం అనే గ్రంథంలోనూ, అదే పేరుతో ప్రహ్లాద మహారాజ్ రాసిన గ్రంథం లోనూ, అనేక భక్తకవులు రాసిన అభంగాలలోనూ పుండరీకుని ప్రస్తావన ఉంది.

పుండరీకుడి గురించి మూడు రకాలైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో రెండు స్కంద పురాణంలో (1.34–67) పాఠ్యానికి దగ్గరగా ఉంటాయి. మొదటి కథ ప్రకారం పుండరీకుడు విష్ణు భక్తుడు. తల్లదండ్రులకు సేవలో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకసారి గోవర్ధన గిరిధారియైన శ్రీకృష్ణుడు గోవులు కాచే గోపాలుడి రూపంలో పుండరీకుని కలవడానికి వస్తాడు. ఆయన రూపం దిగంబరమై, మకర కుండలాలతో, శ్రీవత్సముతో, తలపై నెమలి ఫించంతో చేతులు నడుము మీద పెట్టుకుని, గోవులను తరిమే కర్రను రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని దర్శనమిచ్చాడు.

గమనికలు[మార్చు]

 1. Novetzke (2005) pp. 115–16
 2. 2.0 2.1 Crooke (2003) pp. 607–08
 3. Pande (2008) p. 449
 4. 4.0 4.1 Bhandarkar (1995) p. 124
 5. Tagare in Mahipati: Abbott, Godbole (1988) p. xxxvi
 6. Sand (1990) p. 38
 7. Pathak, Dr. Arunchandra S. (2006). "Pandharpur". The Gazetteers Dept, Government of Maharashtra (first published: 1977). Retrieved 2008-07-14. 
 8. Bhandarkar (1995) p. 125
 9. 9.0 9.1 9.2 Eaton (2005) pp. 139–40
 10. 10.0 10.1 10.2 Zelliot, Eleanor in Mokashi (1987) p. 35
 11. 11.0 11.1 Pande (2008) p. 508
 12. For Bir Kuar, Tagare in Mahipati: Abbott, Godbole (1988) p. xxxiv
 13. Novetzke (2005) p. 116
 14. Karve (1968) pp. 188–89
 15. Shima (1988) p. 184
 16. Kelkar (2001) p. 4179
 17. Karve (1968) p. 183
 18. Tagare in Mahipati: Abbott, Godbole (1987) p. xxxv

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=విఠోబా&oldid=1892240" నుండి వెలికితీశారు