Jump to content

హంపి నిర్మాణ సమూహాలు

వికీపీడియా నుండి
(హంపి వద్ద నిర్మాణ సమూహాలు నుండి దారిమార్పు చెందింది)

చరిత్ర, విశేషాలు

[మార్చు]

హంపి విజయనగరంలోని చారిత్రక నిర్మాణాలు చాలా ప్రాధాన్యత కలిగినవి. తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ కృష్ణదేవ రాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యానికి ఇది ముఖ్యపట్టణం. సుమారు నాలుగు వందల సంవత్సరాల కాలం దక్షిణాపథమంతా వ్యాపించి సుపరిపాలనను అందించిన ఆ సామ్రాజ్యం 16 వ శతాబ్దాంలో ముష్కరుల చేతిలో సర్వనాశనమై పోయింది. ఆ శిథిలాలే ఇప్పుడు ఇక్కడ మిగిలి ఉన్నాయి. సుమారు 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉన్నాయి. విద్యారణ్యస్వామి, హరిహర రాయులు, బుక్క రాయులు, రామ రాయలు, శ్రీకృష్ణ దేవరాయులు, అచ్యుత రాయలు, తిమ్మరుసు, అష్టదిగ్గజ కవులు, మొదలైన ప్రముఖులతో పెనవేసుకున్న చరిత్ర ఆనవాళ్ళు ఇక్కడ నిక్షిప్తం అయి ఉన్నాయి. భువన విజయ సాహిత్య చర్చల స్థావరాన్ని ఇక్కడ చూడవచ్చు. రత్నాలను రాసులగా పోసి, బజార్లలో అమ్మిన ప్రదేశాలు, విజయనగర శిల్ప కళా రీతులు ఉన్నత శిఖరాల నధిరోహించిన జాడలు, ఇక్కడ కనిపిస్తాయి. ముష్కర మూకచే దండయాత్రలో సర్వ నాశనమై కేవలం ఆనవాళ్ళు మాత్రమే మిగిలిన ఈ ప్రాంతాన్ని చూస్తే కకావికల మైన మనస్సుతో, దీనమైన వదనంతో ఉన్న శిల్పాలు మనకు కన్నీళ్లను తెప్పిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ హంపి-విజయనగరాన్ని ప్రపంచపు వారసత్వ ప్రదేశాల్లో చేర్చి దీని ఘనతను ప్రపంచానికి చాటారు.

హంపి విజయనగరం ఎక్కడ ఉన్నది ?

[మార్చు]

"హంపి.... విజయనగరం " కర్ణాటక రాష్ట్రం లోని బళ్ళారి జిల్లా హోస్పేట్కు సమీపంలో ఉంది. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి, రైలు, బస్సు సౌకర్యాలు బాగా ఉన్నాయి. హోస్పేట్ నుండి విరివిగా బస్సులు, ఆటోలు ఉంటాయి. హోస్పేట్ నుండి హంపి సుమారు 12 కిలోమీటర్ల దూరం. హోస్పేట్ నుండి హంపికి రెండు దార్లున్నాయి. ఒకటి కమలాపుర మీదుగా, రెండోది ఖడీరాంపురం మీదుగా. మొదటి దారిలో నుండి వెళ్లితే కమలాపురలో దిగి అక్కడి నుండి వరుసగా అన్ని ప్రదేశాలను చూసుకుంటూ హంపి వరకు వెళ్లి, అక్కడ చూడ వలసినవి చూసి అక్కడినుండే తిరుగు ప్రయాణం కావచ్చు. లేదా రెండో మార్గంలో ఖడీ రాంపురం మీదుగా నేరుగా హంపి వెళ్లి, అక్కడున్నవన్ని చూసి, తిరుగు ప్రయాణంలో కమలా పురం దారిలో అన్నీ చూసుకుంటూ కమలాపురం వరకు వచ్చి, అక్కడ నుండి తిరుగు ప్రయాణం కావచ్చు. కమలాపురం నుండే చూడవలసిన వన్నీ ఉన్నాయి. ఎవరి అనుకూలతను బట్టి వారు మార్గం నిర్దేశించు కోవచ్చు. స్వంత వాహనాలు కాకుండా బస్సులో వెళ్ళేవారు, ముందుగా కమాలాపురం మీదుగా వెళ్లితే అనుకూలంగా ఉంటుంది.

చరిత్ర

[మార్చు]

విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఒక శతాబ్దము మునుపు దక్షిణ భారతదేశము లోని రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫర్ ఓరుగల్లును ఆక్రమించి మలబార్ రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర, బుక్క అను సోదరులిద్దరు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. ఈ ఇరువురిని ఢిల్లీకి తరలించి, ఇస్లాము మతమునకు మార్చారు. హోయసాల రాజు తిరుగుబాటు అణచి వేయుటకు, సుల్తాను వీరిద్దరినీ ద్వారసముద్రము పంపుతాడు. సోదరులు తమకిచ్చిన కార్యము నెరవేర్చారు గాని శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి విజయనగర రాజ్యమును స్థాపించారు.

దక్కను ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల, ముహమ్మద్ తుగ్లక్ పాలన అంతమవడంతో, హరిహరరాయల ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర రాజధాని 1340 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన స్థాపించబడింది. హరిహరరాయలు తర్వాత 1343 లో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు 1379 వరకు పాలించాడు. అతడి పాలనా కాలం చివర కొచ్చేసరికి, దక్షిణభారతదేశంలో తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది. తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యముగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది; దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొకొని ఒక బలీయమైన శక్తిగా నిలబడింది.

1510 ప్రాంతాల్లో బిజాపూరును, సుల్తాను అధీనంలో ఉన్న గోవాను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. విజయనగర పాలకులకు పోర్చగీసు వారికి మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. వ్యాపార సంబంధాలేకాక, విజయనగరం రాజ్యంలో నీటి పారుదల వనరుల నిర్మాణానికి పోర్చుగీసు ప్రముఖులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారనడానికి చారిత్రికాధారాలెన్నో ఉన్నాయి.

శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. కేవలం విజయనగరం లోనే కాక, ఆతని ఏలుబడిలోని ఆన్ని ప్రాంతాలలోను శిల్ప కళా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు, మండపాలు, నీటి వనరులు ఇలా అనేక కట్టడాలను నిర్మించాడు. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.

1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. 1542 లో రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి, వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని దక్కను సుల్తానులు చిత్తుగా ఓడించారు. సంయుక్త సుల్తాను సైన్యం విజయనగర రాజధానిని సర్వనాశనం చేసి, నేలమట్టం చేసింది. యుద్ధములో సజీవముగా బయటపడిన రామరాయల తమ్ముడు తిరుమలరాయలు, సదాశివరాయలతో సహా పెనుకొండకు పారిపోయాడు. ఆ విధంగా విజయనగర సామ్రాజ్యము పతనమైంది.

హంపి విజయనగరానికున్న పౌరాణిక ప్రాధాన్యత

[మార్చు]

ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాముఖ్యతే కాకుండా, పౌరాణిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ హంపి విజయనగర ప్రాంతమంతా రామాయణ కాలంనాటి కిష్కింధ అని జనవాక్యం. ఇక్కడున్న వంకలు, వాగులు, కొండలు, గుట్టలు, గుహలకు రామాయణం కాలంనాటి పేర్లే ఉన్నాయి. ఇక్కడ కొండల పై పెద్ద పెద్ద బండ రాళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆనాడు వానర సైన్యం రామసేతు నిర్మాణంలో వాడగా మిగిలిన రాళ్లని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడి కొండల పేర్లు, మాతంగ పర్వతం, అంజనాద్రి, సుగ్రీవుని గుహ, రాముని గుహ, లోక పావని ఇలాంటి పేర్లే గాక ఇక్కడ రెండు రకాల వానర సంతతి ఉంది. అవి వాలి, సుగ్రీవుల సంతతి అని స్థానికుల నమ్మకము. ఈరెండు జాతులు చూడడానికి ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో రామాలయాలు, ఆంజనేయ విగ్రహాలు చాల ఎక్కువ. ఆ విధంగా ఈ ప్రాంతమంతా పౌరాణిక అంశాలతో పెనవేసుకొని ఉంది.

విజయనగర పాలకుల వంశ వృక్షం

[మార్చు]

క్రింది జాబితా రాబర్ట్ సెవెల్ వ్రాసిన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (విస్మృత సామ్రాజ్యం) అనే పుస్తకం నుండి సంగ్రహించినవి.

సంగమ వంశము

[మార్చు]

హరిహర (దేవ రాయ) 1336-1343

బుక్కరాయలు 1343-1379
హరిహర రాయలు 1379-1399
రెండవ బుక్క రాయలు 1399-1406
మొదటి దేవ రాయలు 1406-1412
వీర విజయ రాయలు1412-1419
రెండవ దేవ రాయలు 1419-1444
(తెలియదు) 1444-1449;
మల్లికార్జున రాయలు 1452-1465 (తేదీలు సందేహాస్పదం)
రాజశేఖర రాయలు 1468-1469 (తేదీలు సందేహాస్పదం)
మొదటి విరూపాక్ష రాయలు 1470-1471 (తేదీలు సందేహాస్పదం)
ప్రౌఢదేవ రాయలు 1476-? (తేదీలు సందేహాస్పదం)
రాజశేఖర రాయలు 1479-1480 (తేదీలు సందేహాస్పదం)
రెండవ విరూపాక్ష రాయలు 1483-1484 (తేదీలు సందేహాస్పదం)
రాజశేఖర రాయలు 1486-1487 (తేదీలు సందేహాస్పదం)

సాళువ వంశము

[మార్చు]

నరసింహ 1490-?; నరస (వీర నరసింహ) ?-1509; శ్రీ కృష్ణదేవరాయలు 1509-1530; అచ్యుత దేవరాయలు 1530-1542; సదాశివరాయలు (నామమాత్రపు రాజు) 1542-1567;

తుళువ వంశము

[మార్చు]
రామరాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1542-1565
తిరుమల రాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1565-1567
తిరుమల (పట్టాభిషిక్తుడు) 1567-1575
రెండవ రంగరాయలు 1575-1586
మొదటి వేంకటపతి రాయలు 1586-1614

ఆరవీడు (తేదీలు సందేహాస్పదం, కేవలం శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం) రాజుల్లో కిందివారు ఉన్నారు. ప్రతిపేరుతోను ఒకరికంటే ఎక్కువమంది రాజులు ఉన్నారు. కాలం - 1614 నుండి చివరగా తెలిసిన 1739 వరకు

రంగ దేవరాయ 1614-1615
రామ దేవరాయ 1615-1633
వేంకట దేవరాయ 1633-1646

నిర్మాణ సమూహాలు ,ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు,విశేషాలు

[మార్చు]
హంపి పర్యటనకు మార్గ నిర్దేశి

హంపి విజయనగర పర్యటకుల ఉపయోగార్థము చిత్రపటము: ఈ పర్యటన ప్రధానముగా రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి హొస్ పేటె నుండి కమలాపురం ద్వారా అంతఃపురం ప్రాంగణము వరకు ఒక మార్గము. అందులో, హొస్ పేటెలోనే ఉన్న అనంత పద్మనాభాలయం, తర్వాత సూళె బావి, కమలాపుర, కోదండ రామాలయం, గినిగిట్టి జైన దేవాలయం, భీముని ద్వారము, ....... అంతఃపుర ప్రాంగణంలో, అంతఃపుర వీధులు, దసరా దిబ్బ, కోనేరు, రహస్య మందిరము, పద్మ మహల్, ఏనుగుల నివాస కేంద్రము, రాణివాస స్నాన ఘట్టము, అష్టాగనల్ బాత్, లక్ష్మీనరసింహ విగ్రహము, బసవలింగము, శ్రీ కృష్ణాలయము మొదలగునవి వరుసగా చూడడానికి మార్గాన్ని చూపడమైనది. రెండో భాగంలో విరూపాక్షాలయము, హంపి బజారు, విఠలాలయము పరిసర ప్రాంతాలు, తులాభారము, తుంగ భద్ర నదిలో నిర్మించిన వంతెన ఆనవాలు, కోదండ రామాలయము, సూళె బజారు, విఠలాలయం తర్వాత తలారఘట్ట, తుంగ భద్ర నదిని దాటి అవతల ఉన్న ఆనెగొంది లోని తోటలోని మండపము, (అదే ఆనెగొంది,,.. విజయనగరానికి పూర్వం వారి రాజధాని). అందులో అనంత పద్మనాభాలయము, చింతామణి ఆశ్త్రమము,.నవ బృందావనము మొదలగునవి రెండో భాగంలో చూడడానికి మార్గాన్ని సూచించడమైనది. మొదటిసారిగా వచ్చిన వారికి ఈ మార్గ నిర్దేశ పటము ఉపయోగకరంగా ఉంటుందని భావించడమైనది. ఈ మార్గ నిర్దేశాన్ని అనుసరించి వెళ్లగలిగితే, ఆయా ప్రాంతాలో ఉన్న ప్రతి ఒక్క చారిత్రక ప్రదేశమును చూసినట్టవుతుంది.

హంపి పర్యటనకు మార్గ నిర్దేశము

హంపి బజారు

[మార్చు]
హంపి బజారు

సా.శ. 1520 వ సంవత్సరంలో పోర్చు గీసు దేశస్థుడైన డొమింగో పీస్ శ్రీకృష్ణదేవరాయలు రాజ్య పాలన చేయుచుండగా విజయనగరానికి వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన చెప్పిన విశేషాలను సందర్భాను సారంగా ఇంతవరకు చదివారు. ఇప్పుడు హంపి బజారు గురించి ఎమన్నాడో చదవండి. తర్వాత ప్రస్తుతం హంపి బజారు ఎలా ఉందో చదవ వచ్చు. "విరూపాక్షాలయం ముఖ ద్వారానికి ఎదురుగా అత్యంతము అందమైన ఇళ్లతోను, వరండాలతోను, అలరారు తున్న వీధి ఉన్నది. వీటిలో ఇక్కడి కొచ్చే భక్తులకు, యాత్రికులకు వసతి కల్పించ బడుచున్నది. ధనవంతులకు కూడ వసతి గృహములు ఉన్నవి. రాజుగారి బసకు కూడ ఈ వీధిలో ఒక భవనము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద రథం ఉన్నది. ఉత్సవ సందర్భాలలో దేవుడిని దీని పై ఉంచి ఊరేగిస్తారు. ఈ రథం చాలా పెద్దదైనందున చిన్న చిన్న వీధులలో ఇది తిరగదు. ఇక్కడే వజ్రాలు, రత్నాలు అమ్ముతున్నారు, అందువలన విదేశీయులు కూడ కనబడుతున్నారు. .................................." అని అన్నాడు. హంపి బజారు ఇప్పుడెలా ఉన్నది:..... విరూపాక్షాలయ రాజ గోపురం ముందు నుండి ఇటు మాతంగ పర్వతం వరకు ఉన్న విశాలమైన వీధి..... హంపి బజారు. వీధి మధ్యలో పెద్ద రథం ఉన్నదని గమనించ వచ్చు. అటు ఇటు అందమైన స్తంభాలు కలిగిన మండపాలు ఉన్నాయి. కొన్ని రెండతస్తులవి కూడా ఉన్నాయి. వీధి మధ్యలో రాజుగారి కొక అందమైన రెండంతస్తుల విశ్రాంతి మందిరం ఉంది. దాని ముందు వేదిక ఉంది. ఉత్సవ సమయాలలో ఆ రథాన్ని ఈ వీధిలో ఊరేగిస్తారు. ఇక్కడ పెద్ద శిలా స్తంభం ఉంది. రాత్రులందు దీనిపై దీపాలను పెట్టేవారు. ఇక్కడే రాజుగారి విశ్రాంతి మందిరానికి వెనుక ఒక పెద్ద నంది విగ్రహం ఉన్నది,. దీనిని " ఎదురు బసవణ్ణ" అంటారు. ప్రస్తుతం ఈ మండపాలల్లో చాలవరకు వ్యాపార సంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు నిర్వహించ బడుచున్నాయి. ఇక్కడే హోటళ్లు, ఇతర దుకాణాలు కూడా ఉన్నాయి. ఇక్కడే ఒక చోట పురా వస్తు శాఖ వారి ఫోటో ప్రదర్శన శాల కూడా ఉంది. అందులో ఈ ప్రాంతం లోని ప్రముఖు ప్రదేశాల ఫోటోలు వంద సంవత్సరాల క్రితం తీసినవి, అవే ప్రదేశాలను అదే కోణంలో ఈ కాలంలో తీసిన ఫోటోలు, ప్రక్క, ప్రక్కన పెట్టి తేడాలను గమనించడానికి ఉంచారు. అలెగ్జాండర్ గ్రీస్ " అనే యాత్రికుడు విజయనగర శిధిలాలను, 1856 వ సంవత్సరంలో తీసిన ఫోటోలు, అవే ప్రదేశాలను అదే కోణంలో 1983 వ సంవత్సరంలో తీసిన ఫోటోలను తేడా గమనించడానికి ప్రక్క, ప్రక్కన ఉంచినారు.

హంపి బజారులోని ఫోటో ప్రదర్శన శాల

[మార్చు]

విరూపాక్షాలయం ముందున్న రాజగోపురం ముందు నుండి ఆ చివరన బజారు మధ్యలో ఉన్న రాజుగారి మందిరం దగ్గారగా ఎడం వైపున ఉన్న మండపాలలో చిత్ర ప్రదర్శన శాల ఉన్నది. అందులో " అలెగ్జాండర్ గ్రీస్ " అనే యాత్రికుడు విజయనగర శిధిలాలను పద్దెనిమిది వందల యాబై ఆరు లో తీసిన ఫోటోలు, అవే ప్రదేశాలలో, అదే కోణం లో పంతొమ్మిదివందల ఎనభై మూడులో "జాన్ గొలింగ్స్" తీసిన ఫోటొలను ప్రక్క,ప్రక్కన పెట్టి ప్రదర్శనలో ఉంచారు. అందులో, రాతిరథం, లక్ష్మీ నరసింహ విగ్రహం, శ్రీ కృష్ణాలయం మొదలగు వాటి ఫోటోలు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత ఈ ప్రదర్శన శాల నుండి వెనక్కి, అనగా ఇది వరకు వచ్చిన దారిలో, అనగా హంపి బజారు మధ్యలో ఎడం వైపున ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో " కోదండ రామాలయానికి దారి" అని ఉంటుంది. అది ఒక మట్టి రోడ్డు.

హోస్పేట అనంతశయన ఆలయం

[మార్చు]

"శ్రీ కృష్ణ దేవరాయలు తన భార్య పేరునకు గుర్తుగా ఒక పట్టణాన్ని కట్టించెను. అందు అందమైన భవనాలు, అందమైన ఒక పెద్ద దేవాలయాన్ని కూడా నిర్మించెను. ప్రతి యేడు దసరా తర్వాత రాజు గారు ఇక్కడ నివసించును. ఆ నగరం పేరు "నాగలాపురం". డొమింగో పీస్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ నగరానికొచ్చి, ఇక్కడి విశేషాలను స్వయంగా చూచి, ఇలా రాసుకున్నాడు. ఈ ఆలయము కమలాపురం వేళ్ళే దారిలో హొసపేట శివార్లలో ఉంది. ఆలయం ముందున్న సూచికలో "ఈ ఆలయాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు , తన తనయుని పేరున తిరుమల రాయ పురమనే నగరంలో అనంతశయన స్వామికి సా.శ.1526 లో ఈ ఆలయాన్ని కట్టించెను" అని ఉంది. అదే ఆ నాటి నాగలాపురం. ....నే టి హొసపేట. కాని, ఇక్కడ ప్రస్తుతం ఎటువంటి చారిత్రక కట్టడాలు కనుపించవు. చారిత్రక కట్టడాల ఆనవాళ్లు కూడా ఏమి కనబడవు. సమీప ంలో తుంగభద్ర డాం ఉంది. దానిని తిరుగు ప్రయాణంలో చూడొచ్చు. హోస్పేత శివార్ల లోనే వున్న అనంతశయన దేవాలయం చాల పెద్దది. ఉత్తరాభిముఖంగా ఉన్న ఈ ఆలయం ముందున్న ముఖ ద్వారము గాక కుడి ఎడమలకు కూడా చిన్న ద్వారాలు ఉన్నాయి. గర్భాలయం చాల విశాలంగా ఉంది. అనంతశయన విగ్రహం పడుకొని ఉన్నట్లుంటుంది గాన గర్భ గుడి విశాలంగా ఉంది. లోపల విగ్రహం లేదు. స్థానికుల కథనం ప్రకారం, ఇందులో విగ్రహం స్థాపించనే లేదట. దానికొక కథ చెప్తారు. గర్భగుడి ముందున్న విశాలమైన హాలులో ఎడమ ప్రక్క గోడకు తెలుగులోను, సంస్కృతంలోను శిలా శాసనం చెక్కి ఉండటం గమనించ వచ్చు. ప్రక్కనే అమ్మ వారికి కూడా ఆలయం ఉంది. ఎందులోను విగ్రహాలు లేవు. ఆవరణంలో ఒక కోనేరు కూడా ఉంది.

సూళె బావి

[మార్చు]

హొసపేటె లోని పద్మనాభ స్వామి ఆలయం నుండి హంపి వైపు వెళ్ళే దారిలో 2 కిలోమీటర్ల దూరంలో ఎడం వైపున ఒక బావి ఉంది. దీని రాతి కట్టడం. అందమైన మెట్ల వరస చాల అద్భుతం. దీనిని ఆ నాటి, మంచి నీటి అవసరాలకు ఒక వేశ్య కట్టించి నందుకే దీనికి సూళె బావి అని పేరు. ఆ దారిలోనే ఇంకొంత దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది. దాని కట్టమీద నుండే కమలా పురానికి దారి. ఇది కూడా పురాతన మైనదే గాని దాని వివరాలు ఏమి లేవు. ఈ దారిలో కమలా పురం వరకు చూడ వలసినవి ఏమి లేవు.

కమలాపురం

[మార్చు]

ఇది విజయనగరం కోట గుమ్మం ముందు వెలసిన గ్రామం. సాధారణంగా అధిక ప్రాముఖ్యత కలిగినదై ఉండాలి. కాని, ఇక్కడ చారిత్రక కాట్టడాలు ఏమీ లేవు. ఈ గ్రామంలో చూడవలసినవి తర్వాతి కాలంలో వెలుగులోకి వచ్చిన పురావస్తు శాఖ వారి ప్రదర్శన శాల. అందులో, హంపి విజయనగరం లోని ప్రధానమైన దృశ్యాల ఫోటోలు, ఆనాటి, ఆయుధాలు, నాణేలు, శిలా విగ్రహాలు, ఇలా చాలా ప్రదర్శనలో పెట్టారు. అందులో ముఖ్యంగా చూడవలసినవి........ హంపి---విజయనగరం విహంగ వీక్షణం. ఇందులోని విశేష మేమంటే, దీనిని చూస్తే, హంపి—విజయనగరం మొత్తం ఆకాశంలో నుండి చూస్తే ఎలా కనిపిస్తిందో అలా ఏర్పాటు చేశారు. ఆ దృశ్యం చూస్తే తర్వాత .... తర్వాత చూడబోయే వాటికి నమూనాగా తీసుకొని వరుస క్రమంలో చూడ వీలౌతుంది. ముందు ముందు చూడబోయే హంపి, విజయనగర దృశ్యాలపై మంచి అవగాహన కలుగుతుంది. ఇక్కడున్న మరో విశేషమేమంటే, ఇక్కడ ఏర్పాటు చేసిన దృశ్య, శ్రవణ యంత్రం. అనగా కంప్యూటర్ లోని ఒక మీట నొక్కితే, మనకు కావలసిన హంపి విజయనగరంలో గల ఆ ప్రాంతంలోని దృశ్యం కంప్యూటరులో ప్రత్యక్ష్యమౌతుంది. దీనిని చూసి నందువలన ముందు ముందు మనం చూడబోయే విశేషాలకు ఇది మార్గ దర్శకమై, మన వీక్షణ సులభతరమవుతుంది. అంతేగాక ఇక్కడ మన అవసరాన్ని బట్టి అధికారులు హంపి-- విజయనగరం కు సంబంధించి, ఆ యా ప్రదేశాల వివరాలు తెలిపే ఒక బ్రోచర్ ను ఉచితంగా ఇస్తారు. దానివలన కూడా మన యాత్ర సులభతరమౌతుంది. ఈ మ్యూజియం తప్పక చూడ వలసినది. ఈ మ్యూజియమునకు సోమవారం సెలవు.

పట్టాభి రామాలయం

[మార్చు]

కమాలాపురలోని పురావస్తుశాఖవారి మ్యూజియం ముందు నుండి ఎడం వైపు రోడ్డులో 2 కిలోమీటర్ల దూరంలో పట్టాభి రామాయలం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయానికి ప్రధాన ద్వారం నుండి గాక, ఉత్తర దిశలో ఉన్న ద్వారం గుండా ప్రవేశమున్నది. రోడ్డుకు ఎడమ వైపున ఉన్న పచ్చిక మైదానానికి ఆనుకుని ఉన్న ఈ ద్వారం గుండా లోనికి వెళ్ళవచ్చును. ఇది చాలా విశాలమైన, అన్ని హంగులు కలిగిన ఆలయం. ఇందులో గర్భగుడిలో విగ్రహం లేదు. ఇందులోనీ విశేష మేమిటంటే గర్భ గుడి ముందున్న మండపం, ఆ ప్రక్కనే ఉన్న కళ్యాణ మండపం, ఈ రెండూ అన్ని విధాల పోలికలో ఒకే తీరులోనే ఉన్నాయి. అందు లోని శిల్పాలు గాని స్తంభాలు గాని అన్నీ ఒకేలాగ ఉన్నాయి. ఈ రెండు మండపాలు ఒకే విధంగా ఉండటము ప్రత్యేకంగా గమనించ గలరు. ఒకటి ప్రధాన ఆలయానికి ముందు ఉంది. రెండోది ఆలయ ప్రాంగణంలో, ఆలయం లోపలికి వెళ్ళే దారికి కుడివైపున ఉంది. ఆలయ ప్రహరీ చుట్టూ లోపలివైపునకు మండపాలు కట్టి ఉన్నాయి. బహుశ, అవి యాత్రీకుల వసతి సౌకర్యార్థం కావచ్చు. ఈ ఆలయాన్ని అచ్యుత రాయల కాలంలో, తిమ్మరాజు అను నతడు 1540 లో కట్టించెనని తెలియుచున్నది. ఈ ఆలయం లోపల ప్రక్కన దేవేరికి మరొక ఉపాలయమున్నది. ఇందులో కూడా విగ్రంలేదు. తూర్పు దిశగా ఉన్న ప్రధాన ద్వారం కొంత శిథిలావస్థలో ఉన్నందున, దానిని ముళ్ళ కంపలతో మూసివేసి, ఆలయానికి కుడివైపున ఉన్న మరో ద్వారం నుండి ప్రవేశం కల్పించ బడుతున్నది. ఈ ఆలయ ప్రాంగణంలో ఆగ్నేయ మూల వంటగది ఉంది. అంతే కాక, ఆలయం ప్రాంగణంలో నీటి కాలువలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కాని ఆ కాలువలలో నీరు ప్రవహించడం లేదు. ఈ ఆలయం ఎక్కువగా ధ్వంసం కాలేదు. కనుక దీనిని అతి సులభంగా పునరుద్ధరించ వచ్చును.

గినిగిట్టి జైన్ దేవాలయం

[మార్చు]

కమలాపురం కూడలినుండి "కంప్లి" వెళ్లే మార్గంలో ఈ దేవాలయం ఉంది. ఇది చిన్న జైన దేవాలయం. గుడి ముందున్న అందమైన స్థూపం పై బాగాన శిలా శాసనం చెక్కి ఉంది. ఇది చాల స్పష్టంగా కనబడుతున్నది. గమనించవచ్చు. దీనిని హరిహర రాయల ప్రధాన సేనా నాయకుడైన "ఇరుగు" అను జైన మతస్తుడు 1386 లో కట్టించెను. అదే విధంగా లోపల ఒక అందమైన రాతి ఫలకం పై శిలా శాసనం చెక్కి పాతి ఉంది. మందిరం పైన జైన తీర్థంకరుల బొమ్మలు చెక్కి ఉన్నాయి. ప్రధాన ఆలయం... గర్భగుడిలోలో ఏ విగ్రహం లేదు. కాని ప్రధాన ఆలయం ముఖ మంటపం పైన జైన తీర్థంకరుల బొమ్మలు తీర్చబడి ఉన్నాయి. ఆలయానికి ఎడం ప్రక్కన కొన్ని బండలు భూమిలో పాతి పెట్టబడి ఉన్నాయి. వాటిపై అస్పష్టమైన కొన్ని శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ గుడి వెనుక ఉన్న కాలి బాట వెంబడి వెళితే, దగ్గర్లోనే భీముని ద్వారం ఉంది. ఇది కోటకు ఉన్న ద్వారం. ఇది చాల ఆందమైనది. కానీ శిథిలమైనది. అప్పట్లో ఈ ద్వారమే ప్రముఖమైనది. ఇక్కడ భీముని శిల్పం ఉంది. గోడకున్న ఒక శిలపై ఒక శిల్పం చెక్కి ఉంది. అది ఎలా ఉన్నదంటే, ఒక వీరుడు మరొక వీరుని తన తొడపై పెట్టుకొని, పొట్టను చీలుస్తున్నట్లున్నది. అతని చేతిలో కత్తి ఉంది. గద కాదు. ఆ ప్రక్కనే తల విరబోసుకొని ఒక స్త్రీ నిలబడి ఉంది. ఇటువంటి శిల్పమే రెండు వరుసల క్రింద కూడా ఉంది. ఈ ద్వారము చాల వరకు శిథిలమైనది. కాని ఈ ద్వారా నిర్మాణ శైలిని బట్టి చూస్తే, ఈ ద్వారము విజయ నగర కోటకు అత్యంత ప్రముఖమైనదిగా తలపిస్తుంది. డొమెంగో ఫీశ్' అనే ఫోర్చు గీసు యాత్రికుడు తన యాత్రా కథనంలో కూడ ఈ ద్వార విషయమై వివరిస్తూ,. ఈ ద్వారం ఫోర్చు గీసు (అనగా గోవా) (గోవా ఆరోజుల్లో ప్రోర్చు గీసు వారి ఆధీనంలో ఉండేది) నుండి వచ్చేవారికి ప్రధాన ద్వారం అని అన్నాడు.

మాల్యవంత రఘునాథాలయం

[మార్చు]

గినిగిట్టి ఆలయం నుండి అదే రోడ్డు పై చాలా దూరం వెళ్లాలి. అక్కడ కొండపై ఒక ఆలయం కనిపిస్తుంది. ప్రక్కనే బండపై అనేక శివ లింగాలు నంది విగ్రహాలు చెక్క బడి ఉన్నాయి..వీటిని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని జన వాక్యం. పర్వదినాలలో ఇక్కడ విశేష పూజలు ఇప్పుడు కూడా జరుగు తాయి. ఇక్కడ శివాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయం కూడ ఉన్నవి.ఇక్కడి నుండి తిరిగి కమలాపురం వెళ్లి, అక్కడి నుండి హంపి వైపు వెళ్లాలి.

చంద్ర శేఖరాలయం./సరస్వతి ఆలయం

[మార్చు]

కమలాపురం నుండి హంపి వైపు అతి కొద్ది దూరంలోనే హంపి రోడ్డు లో ఎడమ వైపు కొద్ది దూరంలో రెండు ఆలయాలు కుడివైపున కనిపిస్తాయి. అందులో మొదటిది చంద్ర శేఖరాలయం. ఇది చాల పెద్దది. లోపల విగ్రహం లేదు.. ఆలయం లోపల ప్రహరి చుట్టు వరండాలు కట్టబడి ఉన్నాయి. ఇవి భక్తుల వసతి కొరకు అయి ఉండవచ్చు. ఈ ఆలయంలో శిల్ప కళ ఏ మాత్రం లేదు. అన్నీ సాధారణ రాతి స్థంభాలే. ఈ ఆలయంగురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆలయం గురించి కూడ తగు సమాచారము అందు బాటు లో లేదు. ఇక్కడి నుండి కొంచెం ముందుకి వెడితే మరో ఆలయం కనిపిస్తుంది. అది సరస్వతి ఆలయం. ఇది చాల చిన్నది. దీని గర్భగుడి, పైన విరిగి ఉన్నందున, లోపలి నుండి ఆకాశం కనిపిస్తుంది. దీనిని చూడాలంటే, అంతఃపురం ప్రదేశాలకు వెళ్లి నప్పుడు కూడ చూడ వచ్చును. అక్కడికి దగ్గిర. చంద్ర శేఖారాలయం వెనుక వైపున ఆనాడు మంచి నీటి సరపరాకు వేసిన మట్టి గొట్టాలు కనిపిస్తున్నాయి. అక్కడికి కొంత దూరంలో ఉన్న ఒక పెద్ద బావి నుండి కపిలి/ మోట ద్వారా నీటిని తోడి, అంతపుర ప్రాంతానికి చేర్చేవారు. ఈ మంచి నీటి కాలువ సమంగా ఉన్న భూమి పై మట్టి గొట్టాలతోను, పల్లంగా ఉన్న చోట రాతి స్థంభాలు కట్టి, వాటిపై రాతిలో చెక్కిన కాలువలు గల బండలను పరిచి, దానిద్వారా నీటిని పారించారు. అంతఃపురం లోని కోనేరుకు ఈ రాతి కాలవల లోనే నీటి సరఫరా జరిగేది. ఆ తర్వాత కూడ భూమిపై నిర్మించిన రాతి కాలువల ద్వారా నీటి సరఫరా జరిగేది. ఆ కట్టడాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇలాంటి రాతి కాలువలు, నీటి అవసరమున్న ప్రతి ప్రదేశానికి అనగా, హజరా రామాలయం, రాణివాస స్నానఘట్టం, అష్టాగనల్ బాత్, మొదలగు ప్రదేశములకు కలుపబడి ఉన్నవి.

మహారాణి స్నాన ఘట్టం

[మార్చు]
రాణివాస స్త్ర్హీల స్నాన ఘట్టము

హంపి రోడ్డుపై కొంత దూరంలోనే రోడ్డు కానుకొనే ఒక కట్టడం కనబడుతుంది. అదే, మహా రాణీ స్నాన ఘట్టం. దీన్ని "రాణి గారి స్నాన ఘట్టం" అని కూడ అంటారు. దీని నిర్మాణం చాల వైవిధ్యంగా ఉంది. చుట్టూ అందమైన వరండాలతో, బట్టలు మార్చు కోవడానికి గదులతో, మధ్యన ఈత కొలను ఉంది. వరండాల లోని పైకప్పు నందున్న డిజైనులు డోం ఆకారంలో ఉండి, లోన కప్పు ఒకదాని కున్న డిజైను మరొక దానికి లేకుండా, దేనికదే ప్రత్యేకంగా ఉన్నవి. కొలను లోనికి మంచి నీరు రావడానికి, లోన నీరు బయటకు పోవడానికి ఏర్పాట్లు ఉన్నవని. గమనించ వచ్చు. మధ్య నున్న కొలను పై కప్పు లేదు. కాని కొలను అడుగున నాలుగు మూలలందున్న చిన్న గుంటలను బట్టి ఆగుంటలలో స్థంభాలుంచి, పైన అప్పట్లో దానిపై కప్పు ఉండేదని అర్థం అవుతుంది. రెండతస్తులు కలిగిన ఈ భవనం చుట్టూ కందకం కూడా ఉన్నది. దీని ముందున్న బోర్డు లోని విషయాన్ననుసరించి దీని చుట్టూ ఒక పెద్ద భవన సముదాయం అప్పట్లో ఉండేది. ప్రస్తుతం కేవలం స్నాన ఘట్టం మాత్రం మిగిలి ఉన్నది. అంతఃపురం ప్రహరీ ఇక్కడికి సమీప ంలోనే ఉంది. కనిపిస్తూనే ఉంటుంది.

భోజనశాల

[మార్చు]

స్నానఘట్టము నుండి అతి కొద్ది దూరంలోనే రోడ్డునకు ఆనుకొనే, ఒక చిన్న కట్టడం కలదు. ఇది ఎనిమిది భుజాల వృత్తాకార కట్టడం. దీని మధ్యలో ఒక పెద్ద రాతి తొట్టె కలదు. దీని సమీప ాన కూడ ఆనాటి మంచినీటి సరపరా కొరకు వేసిన మట్టి పైపులు కనబడ తాయి. రోడ్డుకు అవతల కంచె లోపల పొలాల్లో ఒక వింత కట్టడం కలదు. దానికి సంబంధించి సూచిక ఏమి లేదు. అది మూడడుగుల లోతు కలిగి, అంతే వెడల్పుతో, ఇరు వైపులా మూడడుగుల నల్లని బండలు పరిచి, వాటిపైన మనం భోజనం చేసే పళ్లాల వలే, ఆ పళ్లెం చుట్టూ చిన్న చిన్న గిన్నె లు లాగ రాతి లోనే చెక్కి ఉన్నాయి. వాటిని చూస్తూనే తెలుస్తుంది అవి భోజన పళ్లాలని, ఆ చుట్టు ఉన్నవి చిన్న గిన్నెలని. మధ్యనున్న కాలవలో మనుషులు నిలబడి అన్నం వడ్డించే వారని అర్థం అవుతుంది. ఈ నిర్మాణం రోడ్డు కింద కూడా ఉండి, రోడ్డునకు అవతల ఉలున్న కట్టడం వరకు ఉన్నది. ఇక్కడి నుండి కొంత దూరం ముందుకు వెళితే, ఎడం వైపున భూమి మట్టానికి కిందికి ఒక ఆలయం కనబడుతుంది.

పాతాళేశ్వర ఆలయం

[మార్చు]
పాతాళేశ్వరాలయం ప్రధాన ద్వారం

భూ మట్టానికి కింద ఉన్నందున దీన్ని పాతాళేశ్వరాలయం అన్నారు. దీని ముఖ ద్వారం కొంత వైవిధ్యంగా ఉన్నది. చతురస్రారాకారం లో మధ్యలో ద్వారం ఉంది., పైన గోపురం లేదు. దాని ముందు ధ్వజ స్థంభం, దాని ముందు మండపాలు, చుట్టు ఆలయాలు ఉన్నాయి. ఇందులో ఉన్నవన్నీ శివాలయాలే. ఇది కూడ శిధిలావస్థలోనే ఉన్నది. అక్కడక్కడ శివ లింగాలు, నంది విగ్రహాలు పడి ఉన్నాయి. ఈ ఆలయంలో శిల్పకళ అంతగా లేదు. అన్నీ సాధారణ స్థంభాలే. ఈ శైలిని బట్టి, ఇది విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. వర్షాకాలంలో ఈ ఆలయం పూర్తిగా నీటితో నిండి పోతుంది. ఈ ఆలయం ప్రక్కనున్న మట్టి రోడ్డు లో ముందుకు వెడితే చూడవలసినవన్నీ అక్కడే ఉన్నాయి.

దండ నాయకుని కోట

[మార్చు]
దండనాయకుని కోట ప్రాంగణం లో వున్న మసీదు

భూగర్భ ఆలయం ప్రక్కనున్న మట్టి రోడ్డు లో కొంత దూరంలోనే ఎడం ప్రక్కన ఏదో భవన పునాది కనబడుతుంది. ఆ ఎదురుగా అల్లంత దూరాన ఒక పెద్ద కట్టడం కనబడుతుంది. అదే దండ నాయకుని కోట. ఆ కోట గోడను కొంత విరగ్గొట్టి, దారి చేసి అక్కడే "డండ నాయకుని కోట" అని బోర్డు పెట్టారు. లోపలికి వెళ్ళగానే సువిశాలమైన ప్రదేశం, దాన్ని రెండు భాగాలుగా చేస్తూ మధ్యలో గోడ ఉన్నది. మొదటి భాగంలో ఆ ఎదురుగా కొంత దూరంలో మసీదు లాంటి కట్టడం కనబడుతుంది. దాని ప్రక్కనే దండనాయకుని మందిరం యొక్క పునాది మట్టం కనబడుతుంది. రెండో భాగంలో, ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ పునాది మట్టాలే. అక్కడ ఒక బావి లోనికి " గో ముఖం "నుండి నీళ్లు వచ్చే ఏర్పాటున్నది. అందు లోని నీరు బయటికి తోడడానికి దానికి కపిలి/మోట వంటి ఏర్పాటున్నది. ప్రస్తుతం అందులో నీరు లేదు. కోట లోపలికి వెళ్లగానే కుడి వైపు రెండంతస్తుల కోట బురుజు కనబడుంది. దాని పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. పై కెక్కి చూడవచ్చు. పై నుండి సువిశాలమైన ప్రాంతం కనబడుతుంది.

ప్రముఖుల నివాస స్థలములు

[మార్చు]

కోట బయట, రోడ్డునక అవతల ఇంకో బోర్డు ఉంది. అందు "ప్రముఖుల నివాస స్థలములు" అని ఉంది. ఎదురుగా అల్లంత దూరంలో ఒక పెద్ద గుండు పై ఇనుప తీగలతో చుట్టు కంచె, పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. అక్కడున్న ప్రముఖుల నివాస స్థలాలను చూడ డానికే ఆఏర్పాటు. అక్కడున్నవన్ని కూడ అనేక రకాల భవంతుల పునాది మట్టాలే. ప్రముఖు లంటే ఆ నాటి సేనాధిపతులు, మంత్రులు, అష్ట దిగ్గజ కవులు , మొదలగు వారు కావొచ్చు. కొన్ని భవన పునాదుల పై అప్పట్లో వేసిన నేల మీద గచ్చు ఇంకా కొంత మిగిలి ఉన్నది. అది చాల అందంగాను, గట్టిగాను ఉన్నది. ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఇళ్లల్లో వాడుకునే విసుర్రాళ్లు, రోళ్లు కూడ పడి ఉన్నాయి. దండ నాయకుని కోట, ప్రహరీ గోడకు కుడి వైపున ఉంటే, ఎడం వైపు ఒక చిన్న కొండ ఉన్నది. ఈ మధ్యలోనున్న దారి అంతఃపుర సముదాయం వరకు వెడుతుంది.

శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో పోర్చుగీసు యాత్రికుడు "డొమింగో పీస్" విజయనగరానికి వచ్చి, స్వయంగా చూసి, విజయనగరాన్ని గురించి తన అభిప్రాయాన్ని తన రాజుగారికి తెలియ జేస్తాడు. విజయనగరాన్ని గురించి అతడు తన నివేదికలో ఇల్లా వ్రాసుకున్నాడు. ---- "ఈ నగర జనాభా ను లెక్కించడం సాధ్యం కాదు. జనాభా గురించి వ్రాస్తే, ఇదేదో కట్టు కథ లాగ అనిపిస్తుంది. కనుక దాన్ని గురించి నేను వ్రాయను. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. వీధుల్లో నడుస్తున్న ప్రజలు, వారి ఏనుగులను తప్పించుకొని ముందునకు సాగి పోవడానికి సైనిక పటాలానికి గాని, గుర్రపు దళానికి గాని అంత సులభం కాదు. అంటే వీధుల్లో జనం అంత ఒత్తు గా ఉన్నారన్న మాట. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వయం సంమృద్ది చెందిన నగరం. ఇక్కడ ఆహార ధాన్యాలు వరి, జొన్న, పెసలు, ఉలవలు ఎక్కువగా ఉన్నాయి.. వాటిని నిల్వ చేయడానికి పెద్ద ఆవాసాలున్నాయి. ధరలు కూడ తక్కువే. కాని గోధుమలు తక్కువ. అరబ్బులు మాత్రమే గోధుమలను తింటారు. వీధుల్లో వచ్చి పోయే ఎద్దుల బండ్ల వరుసలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార స్థలాలకు వెళ్లే ఈ బండ్ల వరుసలను దాటడానికి చాల సేపు ఆగవలసి వస్తుంది. ఏ ఒక్క ప్రాంతాన్నుండి అయినా ఈ నగరాన్నంతటిని చూడ వీలు గాదు. అందుచేత నేనొక కొండనెక్కి చూసాను. నాకు కనిపించినంత ప్రాంతమే మన రోము నగర మంత ఉన్నది. ఏడు ప్రాకారలతో చుట్టి ఉన్న ఈ నగరం, అందులో, పండ్ల తోటలు, ఫల వృక్షాలు, పంట పొలాలు, చెరువులు, మధ్యన పంట కాలువల తో పెద్ద అరణ్యం లాగ కనిపిస్తున్నది........." ఇలా అన్నాడు, ఆనాడు డొమొంగో ఫీస్. దండనాయకుని కోట ప్రక్కనే ఉన్న ఈ గుట్ట నెక్కే, నగరాన్ని చూసి ఉంటాడు, డొమింగో పీస్. ఎందు కంటే ఇది నగరం ముంగిట ఉన్నది. ఇంత కంటే ఎత్తైన ప్రదేశం ఈ చుట్టు ప్రక్కల లేదు. కుడి ప్రక్క దండ నాయకుని కోట, ఎడం ప్రక్క గుట్ట దాటగానే, అక్కడ కుడి ఎడమలకు ఒక రోడ్డు వస్తుంది. ఎడం వైపున రోడ్డు లో పురావస్తు శాఖ వారి కార్యాలయం, అది దాటితే రాణి వాసం మొదలైనవి వస్తాయి. కుడి వైపున పెద్ద మైదానం, దానికి అవతల ఒక ఆలయం కనిపిస్తాయి. అదే హజారా రామాలయం. దానికి అవతల ఉన్నది అంతఃపుర భవన సముదాయ పునాదులు.

రాణివాస భవన సముదాయం

[మార్చు]

ఎడమ వైపు రోడ్డులో వెడితే, కొంత దూరంలోనే పురావస్తు శాఖ వారి కార్యాలయం, దాని తర్వాత ఎత్తైన ప్రహరి గోడ కనిపిస్తాయి. అదే రాణివాస భవన సముదాయం. లోపలికి వెళ్లడానికి బయటనే టికెట్టు అమ్ము తుంటారు. లోపలికి వెళ్లడానికి ప్రత్యేకమైన ప్రవేశ ద్వారం ఏమి లేదు. ఉన్న ప్రహరి కొంత మేర పడగొట్టి దారి ఏర్పాటు చేసారు. లోపలికి వెళ్లగానే ఎడం వైపు ఒక భవనం కనబడుతుంది. అది వస్తు ప్రదర్శన శాల. అందులో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక వస్తువులను ప్రదర్శిస్తున్నారు. ఇదివరకు కమలాపురం లో ఉన్న ప్రదర్శన శాలలో చూసినవే ఉన్నాయి. ఈ ప్రదర్శన శాలలో ముఖ్యమైనది: ఈ ప్రదేశంలో ముఖ్యమైన ప్రదేశాలలో వంద సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు. అవే ఫోటోలను అదే కోణంలో ప్రస్తుతం ఉన్న తీరులో తీసిన ఫోటోలు, వాటి తేడాలను చూపుతూ ప్రక్క ప్రక్కనే ఉంచారు. ఈ భవనం కొంత వైవిధ్యంగా ఉన్నది. ఇది ఆ రోజుల్లో ఖజాన భవనం గా సేవలందించింది. ఎత్తైన పై కప్పుతో, లోపల వేదికలతో, గంభీరంగా కనబడుతుంది. దీనిపైన, చుట్టూ ఉన్న చూరు ను గమనిస్తే, పడగ విప్పిన నాగులు మీద పడతాయా అన్నట్లుంటుంది. ఇంత వరకూ ఏమాత్రం శిధిలం కాకుండా కనిపించిన మొదటి భవనం ఇదే. దీని ముందే రాణీ అంతఃపుర భవన పునాది మట్టం ఉన్నది. ఈ ప్రహరీ లోపల మూలలందు బురుజులు ఉన్నాయి. ఒకదాని పైకి ఎక్కి చూడవచ్చు. ఈ ఆవరణలో ఉన్న మరో ప్రధాన భవనం పద్మమహల్.

పద్మమహల్

[మార్చు]
రాణీవాసపు ప్రాంతములో పద్మ మహలు

ఈ అందమైన భవనం కూడ ధ్వంసం కాకుండా మిగిలి ఉన్నది. కాల గమనంలో కొంత శిధిలమైనా బాగానే ఉన్నది. ఇది మూడడుగుల ఎత్తైన పీఠం పై రెండంతస్తులలో ఉన్నది. హిందూ, ముస్లిమ్ నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు. తొమ్మిది పిరమిడ్ ఆకారంలో ఉన్న "డోం" లను కలిగి ఉంది. ఆర్చీల మధ్య సింహం తలలు కలిగి ఉన్నది. దీనిలో గదు లేమీ లేవు. ఇదొక అలంకార భవనం. చూడ ముచ్చటగా ఉన్నది. దీనిని పదనారవ శతాబ్దంలో నిర్మించారు. దీని ప్రక్కన పూదోట ఉన్నది. ఈ ఆవరణ లో ఇంత కన్న చూడ వలసినవేమి లేవు. ఆ ఎదురుగా ఉన్న దారి గుండా బయటికి వెళ్ల వచ్చు.

గజ శాల

[మార్చు]
గజ శాల

రెండో వైపు బయటికి రాగానే ఎదురుగా ఉన్న పెద్ద మైదానానికి అవతల ఉన్న భవనం పేరు గజశాల. ఎత్తైన రాతి గోడలతో, పైన గోళాకార బురుజులతో దీర్ఘ చతురస్రంగా ఉన్న ఈ కట్టడం పైన మధ్యలో మండపం కలిగి, చాల అందంగా ఉన్నది. ఏనుగులు ఉండడానికి విశాలమైన పదకొండు గదులతో, అన్ని గదులు ఒక దాని కొకటి చిన్న ద్వారం ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. లోపలి నుండి, పైనున్న బురుజుల పైకప్పు కేసి చూస్తే ఒకదానికి ఉన్న డిజైను మరొకదానికి లేకుండా దేనికి అదే ప్రత్యేకంగా ఉన్నది. ఇది పదిహేనవ శతాబ్దంలో కట్టబడినది. " డొమ్ ల పై ఆకారం కూడ అన్నీ ఒకే విధంగా కాకుండా వేరు వేరుగా ఉన్నాయి. దీనికి అవతల ఇంకో రాతి కట్టడం కనబడుతుంది.

కాపలా దారుల నివాస భవనం

[మార్చు]
గజశాల ప్రక్కనున్న కట్టడము.కాపలాదారుల నివాస భవనము

అక్కడున్న బోర్డును బట్టి అది భటుల నివాస భవనం. బోర్డు మీద అలానే వ్రాసి ఉన్నది. కాని ఈ భవనంలో గదులేమీ లేనందున, నివాస యోగ్యంగా లేదు. చుట్టూ ఎత్తైన వేదిక కలిగి, మధ్యలో ఆకాశం వైపు ఖాళీగా ఉన్నది. ఇది ఏనుగులకు శిక్షణ ఇచ్చుటకు గానీ, వాటికి చికిచ్ఛ చేయుటకు గాని ఉపయోగించి ఉటారు. ఎలా గంటే మధ్యలో ఏనుగు నిలబడితే, పైన వరండాలో నుండి ఏనుగు పైకి సునాయసంగా ఎక్కవచ్చు. బలిష్ఠమైన రాతి కట్టడం కలిగిన ఈ భవనం ఏనుల కొరకే నిర్మించి ఉండవచ్చు. ప్రస్తుతం ఇందులో కొన్ని శిల్పాలను ప్రదర్శనకు పెట్టారు. ప్రస్తుతం ఇది కొన్ని శిల్పాల ప్రదర్శన శాలగానే ఉపయోగ పడుతున్నది.

మాధవ / రంగ ఆలయం

[మార్చు]

గజశాల నుండి రాణివాస ప్రహరీ గోడ వెంబడి బయట చివరి దాకా కాలి బాటలో వెడితే అక్కడ ఒకే ఆవరణలో రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పూర్తిగా శిధిలం కాగా, రెండోది కొంత మేర నిలిచి ఉన్నది. ఇది రంగ-మాధవ ఆలయము. ఈ గుడి మండపంలో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. అక్కడ ఉన్న సూచిన ఫలకాన్ని అనుసరించి ఇక్కడ గతంలో నాట్యం సాధన చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడి నుండి అల్లంత దూరంలో, ఒక పెద్ద వేప చెట్టు కనబడుతుంది. కాలి దారిన అక్కడికి వెళ్ల వచ్చు. అది ఒక గ్రామ దేవత ఆలయం. ఎల్లమ్మ గుడి.

ఎల్లమ్మ గుడి

[మార్చు]

ఇది భూమట్టానికి కొంత దిగువకు ఉన్నది. కనుక బయటికి కనబడదు. ఇక్కడ ఇప్పుడు కూడ పూజలు జరుగు తున్నాయి. దీని ప్రక్కనే ఒక పెద్ద పాడు పడిన బావి ఉన్నది. డొమింగోమ్ పీస్ అన్నమాటలను చూడండి. " ఈ విజయనగరంలో ఈ ఒక్క గుడి ముందు మాత్రమే జంతు బలులు జరుగుతాయి. మరే ఆలయంలోను జంతువులను వధించరు. వీటి రక్తంతో గుడి లోని దేవునికి అభి షేకం చేస్తారు. జంతువుల తలను పూజారికే వదిలేస్తారు. అలాగే ఒక్కో తలకు ఒక నాణెం కూడ ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత పూజారి తన బూరను ఊదుతాడు. దేవుడు ఈ బలిని స్వీకరిం చాడని దీనికి అర్థం. ఈ పూజారుల గురించి తర్వాత చెప్తాను." అని అన్నాడు. ---- ఇక్కడి నుండి దూరంగా హజర రామాలయం కనబడుతుంది.

శివాలయాల సమూహము

[మార్చు]

ఎల్లమ్మగుడి నుండి దూరంగా కనబడే హజార రామ ఆలయం వరకు మధ్యలో లెక్కకు మించిన ఆలయాల శిధిలాలు కనుపిస్తాయి. ఇవన్నీ శివాలయాలే. అక్కడక్కడ పడి ఉన్న నంది, శిలలు, శివ లింగాలు ఇందుకు తార్కాణం. అక్కడక్కడ కొంత మిగిలి ఉన్న, ఆలయ మంటపాలు ద్వారాలు, స్థూపాలు, ఆలయ పునాది మట్టాలు వీటిని గమనిస్తే, అప్పట్లో ఈ శిధిల ప్రాంతం అత్యంత సుందరంగా ఆలయాలతో అలరారేదని అర్థం అవుతుంది. ఈ శిధిలాల చివరన, అనగా హజార రామాయలానికి ఎదురుగా ఒక పెద్ద శిలా స్తంభం ఉన్నది. ప్రక్కనే ఆలయ పునాది, ఒక కోనేరు ఉన్నాయి. ఆ స్తంభం ధ్వజస్తభం కానేరదు. అదొక అలంకార స్తంభం.

హజార రామాలయం

[మార్చు]
హజార రామాలయ ప్రహరీ గోడపై శిల్పకళ

ఇది అంతఃపుర భవన సముదాయం మధ్యలో ఉన్న ఒకే ఒక్క ఆలయం. ఇది చాల పెద్దదే కాక చాల అందమైనది కూడా. దీనికి సంబంధించిన సూచిక బోర్డులో "ఈ ఆలయం అంతఃపుర వాసులకు ప్రత్యేకంగా నిర్మించబడినది" అని వ్రాసి ఉన్నది. ఈ ఆలయానికి ఇరువైపుల వేదికలు కలిగిన ప్రవేశ ద్వారం, ఏనుగు శిల్పాల మధ్య దారి గల ముఖ మంటపం ఉన్నవి. ముఖ మంటపం ప్రక్కనే ఒక అందమైన శిలా ఫలకంపై ప్రత్యేక శాసనం చెక్కబడి ఉన్నది. అదే విధంగా, ఆ ప్రక్కనే ఉన్న గది అన్ని గోడల పై కూడా శాసనాలు చెక్కి ఉన్నాయి. గర్భ గుడిలో విగ్రహం లేదు. దాని ముందున్న నాలుగు ఆకుపచ్చని శిలా స్తంభాలపై అత్యంత మనోహరమైన శిల్ప కళ ఉన్నది. గర్భ గుడి గోడలపై ఉత్తర రామాయణం లోని కథా ఘట్టాలైన లవకుశుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. గౌతమ బుద్ధుని శిల్పం కూడా ఉన్నది. ప్రక్కన దేవి కొరకు ఒక ఆలయం ఉన్నది. ఆందులో కూడ విగ్రహం లేదు. ఆలయ ఆవరణ లోపల రాతి నీటి కాలువలు ఉన్నాయి. వంట గది కూడా ఉన్నది. ఆలయానికి ప్రధాన ద్వారమే కాక, కుడి ఎడమలకు కూడ గోపురం , మండపం కలిగిన చిన్న ద్వారాలు ఉన్నాయి. ఆవరణ లోపల ఉప ఆలయాలు చాలా ఉన్నాయి. దేని లోనూ విగ్రహాలు లేవు. ఈ ప్రాంతంలో ఏ ఆలయానికీ లేని విధంగా ప్రత్యేకంగా ప్రహరీ గోడపై కూడా యుద్ధానికి వెడుతున్న ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, సైనికుల శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న ఉప ద్వారం కొంత ప్రత్యేకతను సంతరించు కొని అందంగా ఉన్నది. ఇది రాణి వాస స్త్రీలకు ప్రత్యేకమైన ప్రవేశ ద్వారం. ఎందుకంటే ఆ వైపుననే కదా రాణివాస మందిరాలున్నది.

అంతఃపుర ముఖ ద్వారం

[మార్చు]

గుడి ముందుకు వచ్చి నిలబడితే, కుడి వైపున ఆల్లంత దూరంలో కనిపించేదే అంతఃపుర ముఖ ద్వారం. ప్రస్తుతం ప్రత్యేకమైన ద్వారంగాని, దాని పై గోపురంగాని, ఏమి లేవు. ఆ నాడు డొమొంగో ఫీస్ స్వయంగా చూసి చెప్పిన వర్ణన చూద్దాం. "మైదానానికి ఎదురుగా ఉన్న అంతఃపుర ముఖ ద్వారం పై గోపురమున్నది. ఇక్కడి నుండే ప్రారంభమైన ప్రహరీ గోడ అంతఃపుర ప్రాంగణమంతా చుట్టి ఉన్నది. ఈ ద్వారం వద్ద చాలా మంది కాపలా దారులున్నారు. వారు తమ చేతుల్లో, కొరడాలు, కర్రలు పట్టుకొని ఉన్నారు. వీరు తమ అధికారి, చెప్పిన వారిని, ప్రముఖులను తప్ప, ఎవ్వరిని లోపలికి అను మతించరు. మాకు రాజుగారి అనుమతి ఉన్నందున, మమ్ములను లోనికి అనుమతించారు. ముందు మేము ఎంత మందిమి ఉన్నామో లెక్కబెట్టుకొని లోనికి అనుమతించారు." ప్రస్తుతం అక్కడున్న పునాదులను చూసి, ఆనాటి దర్బారును ఊహించు కోవలసిందే. ఇక్కడ ప్రారంభంలోనే ఒక అంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.

దర్బారు హాలు

[మార్చు]
ఏక శిలా నిర్మితమైన, పొడవైన రాతి తొట్టి

ఇంకొంచెం ముందుకు వెడితే, కుడి ప్రక్కన ఒక విశాలమైన ప్రదేశం కనబడుతుంది. అదంతా బండలు పరిచి, ఆ బండలపై అక్కడక్కడ క్రమ పద్ధతిలో వరుసలుగా గుంటలు చెక్కి ఉన్నాయి. ఆ గుంటలలో గతంలో కఱ్ఱ స్తంభాలు ఉండి పైన కప్పు ఉండేదని ఊహించు కోవచ్చు. దీనికి ఎదురుగా ఎత్తైన రాతి స్తంభాలపై వేదిక లాగ ఏర్పరచి, పైకి ఎక్కడానికి రాతి మెట్లు ఉన్నాయి. ఏ ఏర్పాటు దేని కొరకో ఆర్థం కాదు. ఇదే దర్బారు హాలు. ఆనాడు భువన విజయ సభలు ఇక్కడే జరిగాయి. ఈ దర్బారు హాలుకు వెనుక భాగాన మైదానంలో ఒక పెద్ద రాతి తొట్టి పడి ఉన్నది. అది సుమారు, మూడడుగుల లోతు, అంతే వెడల్పు కలిగి, సుమారు నలబై అడుగుల పొడవు ఉన్నది. ఒకే శిలలో చెక్కినది. ఇంత పెద్ద దాన్ని ఎలా చేశారు ,ఇక్కడికి ఎలా చేర్చారు ఊహాతీతమే. దీని ఉపయోగం సులభంగానే గ్రహించ వచ్చు. ఆ ఎదురుగా ఉన్నది దర్బారు హాలు, రాజులు, సామంతులు, మంత్రులు, సేనా నాయకులు, సమావేశ మయ్యే ప్రదేశం. వారి గుర్రాలను ఇక్కడ కట్టిఉంచగా వాటి త్రాగు నీటి అవసరార్థం ఈ రాతి తొట్టిని నిర్మించారు. ఆ ప్రక్కగా చిన్న గుట్టలాగ కనిపించేది మట్టి దిబ్బ. అదేమిటంటే ఈ అంతఃపుర ప్రాంతంలో శిధిలమైన శిల్పాలు, స్తంభాలు, ఇతర భవన శిధిలాలు ఎత్తి కుప్పగా పోసి ఈ ప్రాంతం శుభ్రం చేసారు. దాని పైకి ఎక్కి చూస్తే, అంతఃపుర ప్రాంగణమంతా పుర వీధులు వరుసలు గా కనిస్తాయి. ఈ మట్టి దిబ్బలో ఎంత శిల్ప కళ దాగి ఉందో?

రహస్య మందిరం

[మార్చు]
హంపి, అంతఃపుర ప్రాంగణంలో ఉన్న రహస్య(భూగర్భ గృహము

ఈ అంతఃపుర ప్రాంగణము లోనే భూమట్టానికి దిగువగా సుమారు 10,12 అడుగుల పొడవు, వెడల్పు, అంతే లోతు గల ఒక గృహం ఉన్నది. అది అందమైన నల్లరాతి పలకలతో తాపడం చేయబడి ఉంది. దాని చుట్టూ భూమి పై పడిన వర్షం నీరు లోపలికి పోకుండా, ప్రస్తుతం చుట్టూ పిట్ట గోడ కట్టి ఉన్నారు. లోపలికి దిగడానికి అందమైన నల్లని రాతి మెట్ల వరుస ఉన్నది. లోనికి వెళ్లి చూడ వచ్చు. అడుగు భాగాన నలు మూలల్లో రాతి లోనే నాలుగు రంధ్రాలు చేసి ఉన్నాయి. గతంలో వీటిలో గుంజలు / స్తంభాలు పాతి, పైన కప్పు ఉండేది. రహస్య సమావేశాలకు దీనిని ఉపయోగించే వారు.

అంతఃపురం, అందులోని వీధులు

[మార్చు]

ఈ చుట్టూ ఉన్నవన్నీ అంతఃపుర భవన సముదాయ కట్టడాల పునాది మట్టాలు మాత్రమే. తళ్లి కోట యుద్ధంలో, సర్వం దోచేసి, శిధిలం చేయగా, మిగిలిన వాటిని ప్రజలు లూటీ చేయగా, ఇంకా మిగిలిన శిధిలాలను, పురావస్తు శాఖ వారు, శుభ్రం చేసి, అంతా కుప్ప పోశారు. అదే ఇందాక చూసిన మట్టి దిబ్బ. వీధులన్నీ తిన్నగా, అందులో మంచి నీటి అవసరానికి రాతిలో మలచిన కాలువలున్నాయి. ఏ పునాది మట్టం పై ఏ భవనం ఉండేదో ఇప్పుడు ఊహించడం కష్టం. అందుచేత అలనాడు శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో విజయనగరానికి విచ్చేసి స్వయంగా ఇక్కడి అంతఃపుర విశేషాలను తిలకించి చెప్పిన "డొమొంగో ఫీస్" మాటలను మననం చేసుకోవడం సందర్భోచితం

డొమింగో పీస్ మాటల్లో అంతఃపుర వర్ణన

[మార్చు]

"మేము మా గవర్నర్ తో కలిసి శ్రీ కృష్ణ దేవరాయలు విడిది చేసి ఉన్న నాగలాపురానికి వెళ్లి, రాజాంతఃపుర సందర్శనానికి అనుమతి కోరాము. రాజుగారు దయతో అనుమతించారు. విజయనగరానికి రాగానే రాజాధికారులు మాకు అంతఃపురాన్ని చూపించారు. అంతఃపుర ద్వారం వద్ద మమ్ములను నిలిపి, మేము ఎంత మందిమి ఉన్నామో లెక్కించుకొని, ఒక్కొరిగా లోనికి పంపించారు. అది ఒక గది. నేలంతా నున్నగా గచ్చు చేయ బడి ఉన్నది. గోడలు తెల్లగా ఉన్నాయి. ఎదురుగా ఉన్నది రాజుగారి నివాసము. దీని ప్రవేశ ద్వారమునకు ఇరు వైపుల రెండు చిత్ర పటాలు ఉన్నాయి. ఒకటి ప్రస్తుత రాజు గారిది, రెండవది వారి తండ్రి గారిది. ఆ గది నుండి బయటకు రాగానే, ఎడ ప్రక్క రెండు గదులు, ఒకదానిపై ఒకటి ఉన్నాయి. క్రింద నున్న గది భూ మట్టానికి కొంచెం దిగువగా నున్నది. రెండు మెట్లు దిగాలి. ఈ మెట్లు రాగితో తాపడం చేయ బడి ఉన్నాయి. అక్కడి నుండి పైదాక అంతా బంగారంతో తాపడం చేయ బడి ఉన్నది. దానికి ఉన్న తలుపులకు, వజ్రాలు, కెంపులు, మాణిక్యాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఆ గదిలో ఒక మంచం ఉన్నది. దాని పట్టీలకు బంగారు తాపడం చేయబడి ఉన్నది. అక్కడ పైనుండి రెండు బంగారపు దీప స్తంభాలు వేళాడుతున్నాయి. మంచం మీదున్న దుప్పటి శాటిన్ బట్టది. దాని అంచులకు ముత్యాలు కుట్టబడి ఉన్నాయి. దానిమీద రెండు దిండ్లు ఉన్నాయి. వాటికి గలీబులు లేవు. దీని పైనున్న గదిలో ఏముందో నేను చూడలేదు. ఈ భవనంలోనే ఇంకో గది ఉంది. అది అందంగా చెక్కబడిన రాతి స్తంభాలు కలిగి ఉంది. ఈ గది క్రిందా పైనా, స్తంభాలకు కూడా గులాబి, తామర పువ్వులు చెక్కబడిన దంతంతో కప్పబడి ఉంది ఇంతటి అందమైన గది మరొక్కటి నాకు మరెక్కడా కనబడ లేదు. ఇందులోనే రెండు సింహాసనాలు ఉన్నాయి. అవి బంగారం తో చేయబడి ఉన్నాయి. అక్కడే ఇంకొక గది ఉన్నది. దాని తలుపులు పెద్ద బీగాలతో మూయబడి ఉన్నది. అందులో గత తరాల రాజులు నిధిని దాచి ఉంచు తారట. రాజుగారికి జమీందారులు, సామంతులు, ధనవంతులు, దసరా సందర్భంగా బహుమతు లిస్తుంటారు. ఈ రాజ్యంలో ఒక అచారమున్నది. ప్రతి రాజు తన ఏలుబడిలో వీలైనంత సంపదను ఇక్కడ దాచి పెడ్తాడు.. అత్యవసరం అయితే తప్ప దాన్ని వాడరు. కనీసం అందులో ఎంత ఉందో కూడ చూడరు. ఇలా తరతరాలుగా ఆ నిధి అలా పెరుగుతూనే ఉన్నది.

ఆ తర్వాత మేము ఒక పెద్ద హాలు లోనికి ప్రవేశించాము. మధ్యలో కర్ర స్తంభాలు ఉన్నాయి. వీటి పైభాగం అంతా రాగి తో తాపడం చేయబడి ఉన్నది. మధ్యలో నాలుగు వెండి గొలుసులు, వాటి కొక్కెములు స్తంభాల పై భాగానికి తగిలించి ఉన్నాయి. ఇది రాజుగారు తన రాణులతో ఊయాలలూగడానికి చేసిన ఏర్పాటు. వీరి ఇళ్లన్నీ ఒకే అంతస్తు కలిగి పై కప్పు చదునుగా ఉంటుంది. అక్కడున్న మరో భవనం రాతి స్తంభాలతో ఉండి, పై కప్పు మాత్రం చెక్కతో చేయ బడి ఉంది. ఈ భవనం ప్రవేశ ద్వారం ముందు నాలుగు స్తంభాల మండపం ఉంది. స్తంభాలపై నాట్య గత్తెల, ఇతర చిత్రాలు మలచ బడి ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఎర్రటి రంగుతో ఉన్నాయి. ఈ భవనం దేవి విగ్రహం ఉంచడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇందులో చివరగా మూయబడిన గదిలో దేవి విగ్రహం ఉన్నది. దసారా ఉత్సవ సందర్భంలో దేవి విగ్రహాన్ని బంగారు సింహాసనం పై తీసుక వెడతారు. ఇక్కడ మరో భవనం ఉంది. అక్కడ పెద్ద పెద్ద గంగాళాలు ఉన్నాయి. అవి ఎంత పెద్దవంటే, ఒక్కో దాన్లో రెండు పొట్టేళ్లను వండవచ్చు. అక్కడ ఇంకా వెండి పాత్రలు, చిన్న బంగారు పాత్రలు ఉన్నాయి.

అక్కడి నుండి ఇంకో భవనం లోనికి వెళ్లాము. అది అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పే మందిరం. ఇది అందమైన శిల్పాలతో ఉన్న స్తంభాలతో నిర్మించ బడినది. పై కప్పుకు, ఏనుగులు, ఇతర జంతువుల చిత్రాలు వేయబడి ఉన్నాయి. నాట్యకారిణిల శిల్పాల చేతిలో మద్దెల వంటి వాయిద్య పరికరం ఉన్నది. ఈ నాట్య శిల్పాలు ఎలా ఉన్నాయంటే. నాట్యం చేస్తూ చివరిగా ఏ భంగిమలో నాట్యం నిలుపు చేస్తామో, ఆ భంగిమలో ఆ శిల్పం ఉన్నది. ఇటువంటి భంగిమలు అనేకం ఉన్నవి. నాట్యం నేర్చుకునే వారు నిన్న ఏ భంగిమలో నాట్యం నిలుపు చేసారో ఆ భంగిమతో ఈ రోజు నాట్యం ప్రారంభంచ డానికి ఆ ఏర్పాటు. ఈ భవనం చివర స్త్రీల చిత్ర పటాలు ఉన్నాయి. నాట్యం నేర్చుకునే ముందు శరీరం నాట్యానికి అనువుగా మలచు కొనుటకు వ్యాయామం చేస్తున్న స్త్రీల చిత్రాలు అవి. దీనికి ఎదురుగా ఒక వేదిక ఉంది.. రాజుగారు దీనిమీద కూర్చొని, నాట్యాన్ని తిలకించేవారు. ఇక్కడ నేల, గోడలు అన్నీ బంగారు పూత పూయ బడి ఉన్నాయి. ఈ మధ్యలో ఒక నాట్య గత్తె, నాట్యం చివరన చూపే భంగిమలో ఉన్నట్లు బంగారు విగ్రహం ఉంది. ఇది పన్నెండు సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయంత ఉంది.

ఇంతకన్నా ఎక్కువగా వారు మాకు చూపలేదు. రాణి వాస మందిరాల్లోకి నపుంసకులకు తప్ప వేరెవ్వరికి అనుమతి లేదు. ఇక్కడి నుండి మేము లోనికి వెళ్లిన ద్వారం ప్రక్కనున్న ద్వారం గుండా బయటికి వచ్చాము. అప్పుడు మమ్ములను ఎంత మందిమి ఉన్నామో తిరిగి లెక్కించుకున్నారు". ఇవి అతని మాటలు.

రహస్య మందిరం నుండి కొంత ముందుకు వెడితే, అక్కడ ఒక పునాది మట్టం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అది అన్నిటికన్న పెద్దది గాను, ప్రత్యేకంగాను కనిపిస్తుంది. దాని చుట్టు ఉన్న పునాది రాళ్ల పై శిల్ప కళ ఉన్నది. ముందు చిన్న గున్న ఏనుగుల నల్లని , శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు కొంత మొక్క పోయినా, ఒక దాని మీద చిన్న రాయితో మీటితే లోహ శబ్దం వస్తుంది. ఇదే రాజాంతఃపురం.

కోనేరు

[మార్చు]
కోనేరు.

రాజాంతఃపురం నుండి ముందుకు అల్లంత దూరంలో, రాతి స్తంభాలపై అడ్డంగా కనిపిస్తుంది. అదే మంవి నీటి కాలువ, బయట నుండి ఈ నీటి కాలువ ఇలా స్తంభాలపై వచ్చి అంతఃపుర వీధులలో భూమిపై వ్యాపించి, ఆలయాల లోనికి కూడ వెళ్లింది. ఆక్కడే ఉన్నది కోనేరు. ఈ కాలువ నుండే మంచి నీరు కోనేరు లోనికి పోవడానికి రాతి కాలవ ఉన్నదని గమనించ వచ్చు. ఈ కోనేరు చాల అందంగా ఉన్నది. త్రిభుజాకారపు నల్ల రాతి పలకలతో అందంగా కట్టబడినది.

దసరా దిబ్బ/ హౌస్ ఆఫ్ విక్టరి

[మార్చు]
దసరా దిబ్బ ముందునుండి.

రాజాంతఃపుర ప్రాంగణంలో ఈశాన్య మూలలో వేధిలాగ ఎత్తుగా కనబడేదే " దసరా దిబ్బ" లేదా "హౌస్ ఆఫ్ విక్టరి". . ఇది చతురస్రంగా 25 అడుగుల ఎత్తు కలిగిన రాతి కట్టడం. పైన చదునుగా ఉండి నలు మూలలలో రాతి లోనే గుంట లున్నాయి. ముందు నుండి పైకెక్కడానికి, అలాగే ప్రక్క నుండి, వెనకనుండి కిందికి దిగడానికి మెట్లు ఉన్నాయి. ముందున్న మెట్లకు ఇరు వైపులా అందమైన నల్ల రాతి శిల్పాలు అమర్చి ఉన్నాయి. అవి చాల వరకు విరగ గొట్ట బడినాయి. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. విరిగిన వాటిని ఆ ఎదురుగా కుప్ప పోసి ఉంచారు. దసరా ఉత్సవాలు ఇక్కడి నుండే ప్రారంభ మయ్యేవి. ఇప్పటికి కూడ కర్ణాటక దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇది ఆనాటి సాంప్రదాయం. శ్రీ కృష్ణదేవ రాయలు, తాను కళింగ (నేటి ఒడిషా./.ఒడిషా) దేశాన్ని జయించి నందుకు గుర్తుగా దీన్ని నిర్మించాడు. ఈ వేదికకు ఒక వైపున కిందికి దిగి వచ్చే మార్గంలో గోడలపై అనేక శిల్పాలు చెక్కి ఉన్నాయి. అందులో, గుర్రాలను పట్టుకొన్న అరబ్బులు, ఏనుగులు, ఒంటెలు, విల్లంబులు ధరించిన స్త్రీలు, యుద్ధ దృశ్యాలు, యోధులు, ఇలా అనేకమైన శిల్పాలు ఉన్నాయి. వీటిని బట్టి అనాటి సాంఘిక జీవన విధానం అవగత మవుతుంది. ఆ రోజుల్లో ఈ వేదిక దసరా ఉత్సవాల సందర్భంలో ఎంత వైభవోపేతంగా ఉండేదో తెలియాలంటే దాన్ని చూసిన వారు చెప్పగా వినాలి. లేదా చూసిన వారు చూసింది చూసి నట్టుగా వ్రాసి ఉంటే చదివి ఆనందించాలి.

సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ వేదిక పై జరిగిన దసరా ఉత్సవాలను స్వయంగా చూసి "డొమింగో పీస్" గ్రంథస్థం చేసిన విశేషాలు, అతని మాటల్లోనే....,. "మన దేవుని నమ్మని వీరు మనలాగే కొన్ని రోజులు విందులు చేసుకుంటారు. అలాగే కొన్ని రోజులు ఉపవాసముంటారు. ఆ దినాలలో పగలంతా ఏమీ తినకుండా అర్థ రాత్రి మాత్రమే తింటారు. ముఖ్యమైన ఉత్సవ సందర్భంగా రాజు గారు తన కొత్త నగరం నుండి విజయనగరానికి వచ్చి, ఉత్సవాలలో పాల్గొనడం ఆనవాయితి. ఆ సందర్భంలో ఈ దేశంలోని నాట్యగత్తె లందరూ, ఇక్కడికి రావాలి. అదే విదంగా సైన్యాధి పతులు, సామంతులు, ఇతర ప్రముఖులు, వారి వారి సిబ్బందితో రావాలి. కాని యుద్ధ ప్రాంతాలలో ఉన్న వారికి, సుదూర ప్రాంతంలో ఉన్న వారికి, యుద్ధ భయం ఉన్న వారికి రాకుండుటకు మినహాయింపు ఉన్నది. ఈ ఉత్సవం సెప్టెంబరు 12 న ప్రారంభమై, రాజాంతఃపురంలో, తొమ్మిది రోజుల పాటు జరుగు తాయి. ఈ మైదానంలో దసరా ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన వారిలో సామంతులు, సేనాపతులు, పుర ప్రముఖులు ఉన్నారు. ఈ మైదానానికి ఎడమ వైపున ఉత్తర దిశలో ఒక ఎత్తైన కట్టడం కలదు. ఇది ఒకే అంతస్తు కలిగి ఉన్నది. ఈ కట్టడం ఏనుగు ఆకారం గల స్తంభాలపై ఉన్నది. దీనిని "విజయ గృహము" అంటారు. శ్రీకృష్ణ దేవరాయలు కళింగ దేశాన్ని జయించి వచ్చిన తర్వాత, దానికి గుర్తుగా దీన్ని కట్టించాడు. ఈ మైదానానికి కుడి ప్రక్కన ఉన్న స్థలంలో కర్రలతో నిర్మించిన వేదికలు ఉన్నాయి. అవి ఎంత ఎత్తు ఉన్నాయంటే, అవి బయటి నుండి ప్రహరీ పై నుండి కూడ కనిపిస్తున్నాయి. వీటిని తాత్కాలికంగా ఈ ఉత్సవాల కొరకు మాత్రమే నిర్మించారు. వీటి చుట్టు, క్రింది నుండి పైదాక ఎర్రటి, ఆకు పచ్చ బట్ట కప్పబడి ఉన్నది. ఈ గేటునకు ఎదురుగా రెండు వృత్తాకార వేదికలు ఉన్నాయి. అత్యంత ఆడంబరంగా, రత్న ఖచిత ఆభరణాలు ధరించిన నాట్యగత్తెలు ఆ వేదికలపై ఉన్నారు. ఈ గేటునకు ఎదురుగానె "విజయ గృహము" లాంటి రెండు వేదిక లున్నాయి. వీటి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఇవి కూడ అందమైన బట్ట తో కప్పబడినాయి. ఈ రెండు వేదికలు రాజుగారి పుత్రులకు, వారి ఆంతరంగికులకు, కొన్ని సందర్భాలలో నపుంసకులు ఉపయోగిస్తారు. రాజు గారి అనుమతి ప్రకారం ఉత్సవాలు బాగా కనుపించే విధంగా, రాజుగారికి దగ్గిరగా, పైనున్న వేదికపై మాకు స్థానం కల్పించారు. వేదిక మధ్యన మెట్లక్కు ఎదురుగా ఈ రాజ్యం యొక్క సింహాసనం ఉంచబడినది. ఇది నాలుగు అంచులు కలిగి, మధ్యలో గుండ్రంగా ఉన్నది. ఇది అత్యంత నేర్పుగల చెక్క పని తనం కలిగి ఉన్నది. దీనిపై పట్టు బట్ట కప్పి ఉంది. దీని చుట్టూ బంగారపు సింహం బొమ్మలు ఉన్నాయి. బట్టల మధ్య ఖాళీలలో ముత్యాలు పరిచి, దానిపై ఉంచిన బంగారు పళ్లాలలో వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు పోసి ఉన్నాయి. దాని చుట్టు ప్రక్కల ప్రముఖుల బంగారపు విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆసనం పై, పూలతో అలంకరించ బడిన బంగారు విగ్రహం ఉన్నది. దీని ప్రక్కనే రత్న, వజ్ర వైడూర్య ఖచిత మైన కిరీటం ఉంచబడినది. దీని ముందు ఆసనంలో రెండు దిండ్లు ఉన్నాయి. ఉత్సవ సందర్భంలో రాజుగారు ఇక్కడ ఈ సింహాసనంపై కూర్చుంటారు." ఇవి డొమింగో పీస్ మాటలు. అచ్యుత రాయల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఏ మన్నడంటే...... " దసరా ఉత్సవాల సందర్భంగా విజయనగర రాజులు, రత్న ఖచితమైన సింహాసనం మీద కూర్చుంటారు. ఈ ఒక్క రోజు మాత్రమే రాజు గారు సింహాసనం అధిష్టిస్తాడు. ధర్మ పరాయణులై ఎల్లప్పుడు సత్యమునే పలికే రాజులు మాత్రమే ఈ సింహాసనం మీద కూర్చొనడానికి అర్హులు. ప్రస్తుతం అచ్యుత రాయలు రాజ్యం చేస్తున్నాడు. ఇతను అంతటి ధర్మ బద్ధుడు కాదు. కనుక సింహాసనం మీద కూర్చొన లేదు" అన్నాడు.

"దసరా ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ప్రతి రోజు, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా, ఒక రోజు ఇరవై ముప్పై మంది స్త్రీలు చేతిలో బెత్తాలతో, బుజాన కొరడాలతో లోపలి నుండి వస్తారు. వీరందరు వాయిద్యాలను వాయిస్తుండగా, వారి వెనక కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా ఆభరణాలు ధరించి వస్తారు. వారి వెంబడి కొందరు కొజ్జాలు వస్తారు. ఆ స్త్రీల అలంకరణ ఈ విధంగా ఉటుంది. వీరు పట్టుబట్టలు ధరించి, తలపై కిరీటాలు ధరించారు. ఆ కిరీటాలకు పెద్ద పెద్ద ముత్యాలతో చేసిన పుష్పాలు అమర్చబడి ఉన్నాయి. వారు భుజాలకు, మెడకు వేసుకున్న ఆభరణాలు బంగారంతో చేసినవి. వీటిలో వజ్రాలు, వైడుర్యాలు వంటి రాళ్లు పొదిగి ఉన్నాయి. భుజ కీర్తులకు, ముంజేతి కంకణాలకు, కూడ వజ్రాలు తాపడం చేసి వున్నాయి. .. వాళ్లు వేసుకున్న కాళ్ల కడియాలు, వాటికి పొదిగిన వజ్రాలు, మిగతా వాటికన్నా విలువైనవిగా ఉన్నాయి. ఆ స్త్రీలు బంగారు బిందెలను ఎత్తుకున్నారు. వీరందరు సుమారు ఇరవై, ముప్పై మంది ఉన్నారు. వారంతా పదహారు, ఇరవై సంవత్సరాల వయస్సున్న వారే. వీరందరు తాము ధరించిన ఆభరణాల భరువుతో సరిగా నడవలేక పోతున్నారు. అందుచేత వారి పక్కనున్న స్త్రీలు వీరి చేతులు పైకి ఎత్తి వారు నడవడానికి సహాయ పడుతున్నారు. ఆ విధంగా వారు గుర్రాల చుట్టు మూడు సార్లు తిరిగి అంతఃపురం లోనికి వెళ్లి పోతారు. వీరందరూ మహారాణుల చెలికత్తెలు మాత్రమే. ఈ తొమ్మిది రోజుల్లో ప్రతి మహారాణి, తనకు కేటాయించిన రోజున తన చెలికత్తెలను ఈవిధంగా ఆలంకరించి ప్రదర్శనకు పంపి తనకున్న, ఆభరణాలను, సంపదను, గొప్పతనాన్ని, ప్రదర్శించు కుంటుంది." ఇవి అతని మాటలు. --ఇప్పుడు దసరాదిబ్బ ప్రక్కనున్న గుమ్మము నుండి బయటకు వెళ్లాలి.

రాతి తలుపు

[మార్చు]

దసరా దిబ్బ నుండి బయటకు రాగానే, అక్కడ ఒక అతిపెద్ద రాతి తలుపు పడి ఉన్నది. రెండు రెక్కలున్న ఈ తలుపుకు సాధారణ తలుపుకు ఉండవలసిన భాగాలన్నీ రాతి తోనే తయారు చేసి ఉన్నాయి. ఒకే శిలలో ఇలా పూర్తి స్థాయి తలుపు మలచడం చాల అద్భుత మైన విషయం. ఇది అంతఃపుర ముఖద్వారం వద్ద పడి ఉంటే ఇది అక్కడిదే ఉనుకోవచ్చు. కాని ఇది ఇక్కడకు ఎలా వచ్చిందో? ఏమైనా ఇదొక అపూర్వ కళా ఖండమే. ఇక్కడి నుండి కొంత దూరంలో ఒక చిన్న గుడి కనబడుతుంది. అదే సరస్వతి ఆలయం.

సరస్వతి ఆలయం / అష్టాగనల్ బాథ్

[మార్చు]

సరస్వతి ఆలయం చాల చిన్నది. ఇందులో శిల్ప కళా చాతుర్యం ఏమీ లేదు. గర్భగుడి గోపురం పై భాగం కూలి పోయినందున లోపల నుండి ఆకాశం కనబడుతున్నది. ఇదేమంత అద్భుతమైన కట్టడం కాక పోయినా, దీనికి కొంచెం అవతల "అష్టాగనల్ బాథ్ అనే ఈత కొలను ఉన్నది. దీన్ని తప్పక చూడాలి. ఇది ఎనిమిది కోణాలతో వృత్తాకారంలో వున్న కొలను. మధ్యలో ఎనిమిది కోణాలతో ఎత్తైన వేదిక ఉన్నది. ఈ కొలను చుట్టూ స్తంభాల తో వరండా ఉన్నది. నేలంతా అందమైన గచ్చు చేయబడి ఉన్నది. ఈ ప్రాంతంలో చూడవలసినవి ఇవి. ఇప్పుడు కమలాపురం...హంపి రోడ్డు లోని ఇదివరకు చూసిన పాతాళేశ్వర ఆలయం వద్దకు వెళ్లి అక్కడి నుండి హంపి వైపు వెళ్లాలి.

29.అక్కా చెల్లెళ్ల గుండ్లు

[మార్చు]
హంపి: అక్కాచెల్లెళ్ల గుండ్లు

పాతాళేశ్వరాలయం దగ్గర లోనే, హంపి రోడ్డుకు ఎడం ప్రక్కన చిన్న గుట్ట కనిపిస్తుంది. అది పెద్ద గుండ్ల కుప్ప. అందులో రెండు పెద్ద గుండ్లు పైభాగాన రెండు ఆని, క్రింది భాగాన విశాలమైన ఖాళీ ప్రదేశం ఉన్నది. ఇదొక ప్రకృతి వింత. అంతే గాని దీనికి చారిత్రక ప్రాధాన్యత లేదు. కాని ఈ ప్రాంతంలో చూడ వలసిన ప్రదేశాలలో దీన్ని కూడ ఒకటిగా చేర్చి చెప్పుతుంటారు. అదేదో చూడక పోయామే అని తర్వాత బాధ పడేదానికన్న, ప్రక్కనే ఉన్నది గాన, చూసి వెళ్ల వచ్చు. దీని ప్రక్కనే కోట బురుజు కూడ ఉన్నది. దీని తరువాత అదే రోడ్డు పై సుమారు ఒక కిలో మీటరు దూరం వెడితే, అక్కడ ఉద్దాన వీరభద్ర స్వామి ఆలయం ఉన్నది.

ఉద్దాన వీరభద్రస్వామి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం రోడ్డునకు ఆనుకొనే ఉన్నది. గుడి చిన్నది. ఇది గుడి లాగ లేక నివాస గృహం లాగున్నది. పూజారులు ఈ అవరణంలోనే ఉంటున్నారు. ఇందు లోని వీరభద్ర స్వామి విగ్రహం చాల పెద్దది. సుమారు 10 అడుగులు ఎత్తుంటుంది. ఇక్కడ నిత్య పూజలు జరుగు తున్నాయి. దీని ధ్వజ స్తంభం రోడ్డు పైనున్నది. ఈ ఆవరణంలో రెండు శిలా ఫలకాలు, అందులో ఏదో శిలా శాసనం ఉన్నది. దీనికి ఎదురుగా రోడ్డునకు అవతల ఇంకో ఆలయం కూడ ఉన్నది. దాని ముందున్న ఫలకం పై " వీరభద్రాలయం" అని ఉన్నది. కాని ఇది వీరభద్రాలయం కానేరదు. ఎందుచేత నంటే, ఇందులోని శిల్ప కళా శోభితమైన స్తంభాల పైన దశావతార శిల్పాలు, బాలకృష్ణుడు, శంకు, చక్ర, గద లాంటి శిల్పాలు చెక్కి ఉన్నాయి. కనుక ఇది బాల కృష్ణుని ఆలయం అయి ఉండవచ్చును. ఆలయం చిన్నదైనా, ఆన్ని హంగులతో, చాల అందంగాను, ముచ్చటగాను ఉన్నది. ఈ ఆవరణలో ఇంకా చిన్న ఆలయాలు ఉన్నాయి. ఎందులోనూ విగ్రహాలు లేవు. దీని వెనుక పొలాలలో ఇంకో ఆలయం కనబడుతున్నది. కాని అక్కడికి దారిలేక చూడ వీలు గాదు. ఇక్కడి నుండి రోడ్డు పై ఇంకొంచెం ముందుకు వెడితే అక్కడ లక్ష్మీనరసింహ విగ్రహం ఉన్నది.

లక్ష్మీ నరసింహ విగ్రహం

[మార్చు]
లక్ష్మీనరసింహ విగ్రహం.

వీరభద్రాలయం నుండి రోడ్డు పై కొంచెం దూరంలోనే ఎడమ చేతి వైపు పొలాల మధ్యలో ఒక మట్టి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డులో కొన్ని గజాల దూరంలోనే, ఎదురుగా ఎత్తైన విగ్రహం , కుడి వైపు మరొక కట్టడం కనబడుతుంది. ఆ ఎత్తైన విగ్రహం లక్ష్మీ నరసింహ విగ్రహం. ఇరవై అడుగుల ఎత్తైన ఈ ఏకశిలా విగ్రహం విజయనగర శిల్ప కళా వైభవానికి నిదర్శనం. లక్ష్మీ నరసింహుడు ఆదిశేషుని పై కూర్చున్నట్టు ఉన్నది. స్వామి వారి నాలుగు చేతులు, తొడపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి కూడ అదృశ్య మైనవి. అనగా విరగ గొట్ట బడినవి. దేవేరి లక్ష్మీదేవి కుడి చేయి కొంత భాగం మనకు కనిపిస్తున్నది. దీన్ని క్రీ. శ.1528 లో కృష్ణ భట్టు అనే అతను శ్రీకృష్ణ దేవరాయల ఆదేశానుసారం స్థాపించెనని శాసనాల వలన తెలుస్తున్నది. హంపి...విజయనగరం అనగానే ఈ ఏకశిలా విగ్రహమే గుర్తుకు వస్తుంది, లేదా ఈ విగ్రహం చూడగానే హంపి గుర్తుకు వస్తుంది. అంతగా ప్రసిద్ధి పొందినది ఈ విగ్రహం. ముష్కరులు దీన్ని పూర్తిగా ధ్వంసం చేయగా ఆ విరిగిన ముక్కలను, ఏర్చి, కూర్చి ప్రస్తుతము ఉన్న రూపానికి తెచ్చారు. ఈ రెండింటి మధ్య తేడాను ప్రదర్శన శాలలో ఫొటోలో చూపారు. హంపి లోని ప్రదర్శన శాలలో కూడ ఇటువంటి ఫొటోలను చూడవచ్చు.

బడవ లింగం

[మార్చు]
బడవ లింగం. ఇది హంపిలో లలక్ష్మీనరసింహ విగ్రహం ప్రక్కనే ఉన్నది

సుమారు పది అడుగులు ఎత్తున్న ఈ శివ లింగం ఒక బీద స్త్రీ నిర్మించి నందున దీనికి బడవ (బీద) లింగమని అంటారు. ఈ లింగం పై మూడు కన్నులు ఒక గీత చెక్కబడి వున్నాయి. చుట్టు రాతి తో నిర్మించిన గోడ పై ఇటుక గోడ కలదు. పై కప్పు కూలి పోయినది. ఇందు లోని విశేషమేమంటే ..... ఈ శివ లింగం సర్వ కాలాలందు మూడడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఈ నీరు పక్కనే ప్రవహిస్తున్న పంట కాలువ నుండి ఒక సన్నని రాతి కాలువ ద్వారా లోనికి వచ్చి, అక్కడ నుండి బయటి రాతి కాలవ ద్వారా పంట కాలవ లోనికి కలిసి పోయే ఏర్పాటు ఉన్నది. ఈ పంట కాలువలు విజయనగర రాజుల కాలం నాటివే. ఇప్పటికి కూడ పంటలకు ఈ నీటి కాలువలే ఆధారం.

శ్రీకృష్ణాలయం

[మార్చు]

బడవ లింగం చూసి తిరిగి తారు రోడ్డు మీదికొచ్చి కొన్ని గజాలు నడిస్తే ఎదురుగా కనిపించేదే శ్రీ కృష్ణాలయం. రోడ్డునకు అడ్డంగా ఒక ద్వారం ఉన్నది. అది అలనాడు హంపికి మొదటి ముఖ ద్వారం. దీని తర్వాత ఎదురుగా ఉన్నది ఆలయ దక్షిణ ద్వారం. తారు రోడ్డు వెంబడి వెళితే శ్రీ కృష్ణాలయ ముఖ ద్వారం వద్దకు వెళ్లవచ్చు. తూర్పు ముఖ ద్వారం ప్రత్యేకంగా ఉన్నది. ముఖ ద్వారానికిరువైపులా ఎత్తైన పీఠాలు కలిగి, దానిపై స్తంభాలతో మండపాలు ఉన్నాయి. పైనున్న గోపురం శిధిలమైనా, మిగిలిన శిల్పాలు అందంగా ఉన్నాయి. శిలా శాసనాలను బట్టి సా.శ. 1513 లో శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి నుండి బాలకృష్ణుని విగ్రహాన్ని తెప్పించి, ఈ గుడిలో ప్రతిష్టించాడు. ఈ ఆలయం పంచాయతన పద్ధతిలో కట్టబడినది. ముఖ ద్వారంలోనే తెలుగు, సంస్కృతము లలో శాసనాలున్నాయి. ఈ ఆలయానికి రెండు ప్రాకారాలున్నాయి. మొదటి ప్రాకారంలో ముఖ మంటపం, అంతరాళం, సామానుల గది, వంట గది, ఇతర ఉప ఆలయాలు ఉన్నాయి. ముఖ మంటపంలో ఉన్న శిలా స్తంభాలు శిల్పకళా శోభితమై, అందు శ్రీ కృష్ణలీలలు ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. ముఖ మంటపం ప్రక్కనే ఒక గది ఉన్నది. దీని గోడలపై ఎన్నో శాసనాలు చెక్క బడి ఉన్నాయి.. గర్భగుడిలో విగ్రహం లేదు. దీన్ని మద్రాసు మ్యూజియం లో భద్రపరిచారు. మొదటి ఆవరణలో నుండి రెండో ఆవరణ లోనికి వెళ్లడానికి ఒక ద్వారం ఉన్నది. ఈ రెండో ఆవరణలో కట్టడాలేమి లేవు. అక్కడక్కడా శిధిల శిల్పాలు, పడి ఉన్నాయి. ఈ రెండో ప్రహరీ గోడ గుడి వెనుక వైపు నుండి దక్షిణ వైపుననున్న ద్వారం వరకు ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద కాపలా బురుజు కూడ ఉన్నది. ఏ ఆలయానికి లేని విధంగా, ఈ ఆలయానికి రెండు బలమైన ప్రహరీ గోడలు, కాపల బురుజులు ఉన్నాయి.

ఆలయ ముఖ మండపానికి ఎదురుగా రోడ్డునకు ఆనుకొని రెండు సాధారణ మండపాలున్నాయి. అందులో రెండు పెద్ద రాతి తొట్టెలు ఉన్నాయి. వాటి పై శంఖము, చక్రము చెక్కబడి ఉన్నాయి. ఈ మండపాలకు వెనుకన అంతా పల్లపు ప్రాంతం. అందులో ఇరువైపులా మండపాలు కలిగి, మధ్యలో అందమైన ఒక పెద్ద మండపం ఉన్నది. దాని ముందు, పొడవుగా ఉన్న కోనేరు కలదు. కోనేరు మధ్యలో చిన్న మండపం కలదు. కోనేరు లోనికి నీళ్లు రావడానికి రాతి కాలువను ఏర్పరచి, దానిని ప్రక్కనే ఉన్న పంట కాలువకు అనుసంధానించి ఉన్నది. ఈ కోనేరుకు ఒకవైపు పెద్ద బండరాళ్ళ వరుస, రెండో వైపున పంట పొలాలు చూడడానికి చాల అందంగా ఉన్నది.

శశివకల్లు గణపతి

[మార్చు]
శశివకల్లు గణపతి మండపం.

శ్రీ కృష్ణాలయం ప్రక్కనే రెండు ఆలయాలు ఉన్నాయి అవి పునరుద్ధరణలో ఉన్నాయి. వాటికి ఇంకా పేర్లు పెట్ట లేదు. ఆ రోడ్డుపై కొంచెం ముందుకు వెడితే అది రోడ్డు కూడలి. కమలా పురం నుండి, హొస్పేట నుండి వచ్చే రెండు రోడ్ల కూడలి . ఈ కూడలికెదురుగా బండపై చుట్టూ గోడలు లేని, స్తంభాల మండపం లో ఉన్న గణపతే శశివకల్లు గణపతి. ఇది భారీ ఏకశిలా విగ్రహం. గణపతికి ఉన్న నాలుగు చేతులలో లడ్డులు ఉన్నవి. ఈ మండపం ముందు సహజ సిద్ధమైన బండ పై ఒక శిలా శాసనం చెక్కబడి ఉన్నది. వీక్షకులనాకర్షించడానికి, శాసనం చెరిగి పోకుండా ఉండడానికి, దానిపై పెద్ద గాజు పలకను అమర్చి ఉన్నారు. ఇందులో వ్రాసిన దాని ప్రకారం, మండపాన్ని సా.శ. 1502 లో తిరుపతి సమీప ంలోని, చంద్రగిరి నివాసియైన, ఒక వ్యాపారి విజయనగర రాజైన నరసింహ 2. (1491...1502) జ్ఞాపకార్థం కట్టించెను. ఈ ప్రాంతం ఎత్తులో ఉన్నందున, శ్రీకృష్ణాలయం మీదుగా చూస్తే, పంట పొలాలపై లక్ష్మీ నరసింహ విగ్రహం దూరంగా కనబడుతుంది. ఈ చుట్టు ప్రక్కల చిన్న చిన్న ఆలయాలున్నాయి. ఒక ప్రక్క కోట ద్వారం లాగ కనబడుతుంది. అది హేమకూట పర్వతానికి ద్వారం.

కదలై కల్లు గణపతి

[మార్చు]

శశివ కల్లు గణపతి మండపం ముందు నుండి తారు రోడ్డు కొంత ఎగువకు ఉంటుంది. మిట్ట కొచ్చాక ఎదురుగా రెండు కట్టడాలు కనబడతాయి. అందులో ఒకటి విశ్రాంతి మందిరం. రెండోది కదలై కల్లు గణపతి ఆలయం. విశ్రాంతి మందిరానికి ఎదురుగా రోడ్డునకు అవతల ఉన్న శిధిల కట్టడం గతంలో హంపికి రెండో ప్రవేశ ద్వారం. అక్కడి నుండే యాత్రికులు హంపికి వచ్చే వారు. ఆ దారి ఈ విశ్రాంతి మందిరం మధ్యలో నుండి వెళుతుంది. ఇప్పటికి కూడా మెట్ల దారి ఉన్నది. యాత్రికులకు ఇది విశ్రాంతి మందిరంగా ఉపయోగ పడేది. ఈ విశ్రాంతి మందిరం మధ్యలో దారి ఉండి, అటు ఇటు ఎత్తైన వేదికలు కలిగి పొడవాటి స్తంభాలతో పైన ఒకే కప్పు కలిగి ఉన్నది. మధ్యలో ఒక అందమైన పెద్ద శిలా ఫలకం పై పెద్ద శాసనం చెక్కి ఉన్నది. ఆ ప్రక్కన ఉన్నదే "కదలై కల్లు గణపతి" ఆలయం. ఇది ఎత్తైన వేదికపై ఉండి , పొడవాటి స్తంభాలు కలిగిన మండపం, దాని వెనక గర్భ గుడి. అందులో భారీ గణపతి విగ్రహం ఉన్నది. ఈ ఆలయం వెనుక ఉన్నది హేమ కూటమనే కొండ. ఆ ప్రక్కన కనిపించేదే విరూపాక్ష ఆలయ ప్రధాన రాజ గోపురం. దాని ముందున్నది హంపి బజారు. తారు రోడ్డు వెంబడి వెడితే, హంపి బజారు మధ్యలోకి వెళతారు.

కోదండ రామాలయం

[మార్చు]

ఈ మట్టి రోడ్డులో వెడితే కొద్ది దూరంలోనే తుంగభద్రా నది, దాని వెంబడే కొంత దూరం వెడితే, అక్కడ రెండు కొండల మధ్యన నది సన్నగా ఉంటుంది. ఆ ప్రక్కనే కొండ రాళ్ల మధ్య దారి, అందులో నుండి వెడితే కొన్ని మండపాలు, ఆ ఎదురుగా కొంత దూరంలో ఆలయ గోపురం కనబడుతుంది. అదే కోదండ రామాలయం. ఈ దారంతా కాలి నడకనే వెళ్లాలి. వాహనాలు వెళ్లలేవు. కొంత మంది విదేశీయులు సైకిళ్ల పై వెడు తుంటారు. ఈ ఆలయం ముందున్న నదిని చక్రతీర్థం అంటారు. నది ఉధృతిగా ఉన్నప్పుడు, ఇక్కడ నీళ్లు సుడులు తిరుగు తాయి. అందు చేత దీనిని చక్ర తీర్థం అన్నారు. ఈ ఆలయం చిన్నది. దీనికి ముఖ మంటపం, ధ్వజ స్తంభం , గర్భాలయం ఉన్నవి. ఇందులోని విశేష మేమంటే సీతా,రామ, లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాతి పై చెక్కి ఉన్నవి. ఇక్కడ నిత్య పూజాదికాలు జరుగుచున్నవి. ఈ ఆలయం వెనుక కొండ మధ్యలో, యంత్రోద్దార హనుమంతాలాయం ఉన్నది, ఇక్కడ కొంతమంది సాధువులుంటారు. ఈ ఆలయం నుండి కొంచెం ముందుకు వెడితే అక్కడ కొండ మలుపులో ఒక చిన్న ఆలయం కనబడుతుంది. దీని ముందుభాగంలో, మహా విష్ణువు, లక్ష్మీ దేవి శిల్పం చెక్కబడి ఉన్నది. లోన గర్భాలయంలో అందమైన చిన్న మహా విష్ణువు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ గర్భగుడి సహజ సిద్ధంగా కొండ రాళ్ల మధ్యన ఏర్పడినది. ఈ ఆలయానికి ఎదురుగా పూర్తిగా శిధిలమైన ఆలయం కనబడుతుంది. ఇక్కడ కేవలం శిలా స్తంభాలు, రాళ్లు కుప్ప గా పడి ఉన్నాయి. పునాది పై శ్రీ కృష్ణదేవరాయల రాజ ముద్రిక అయిన వరాహం, సూర్య, చంద్రులు, కత్తి చెక్కబడి ఉన్నవి. ఇక్కడి నుండి రెండు కొండల మధ్యన విశాలమైన ప్రదేశం, ఆ చివరన ఆలయ గోపురం కనబడతాయి. అదే అచ్యుత రామాలయం.

అచ్యుత రామాలయం

[మార్చు]
హంపిలోని అచ్యుత రాయ ఆలయం. ఈ ఆలయం ముందున్న మండపాల వీధినే సూళె బజారు అంటారు
మాతంగ పర్వతం పైనుండి అచ్యుత రామాలయ దృశ్యం

రెండు కొండల మధ్యన విశాలమైన ప్రదేశంలో ఆ చివరన ఉన్నదే అచ్యుత రామాలయం. మధ్యనున్న విశాల ప్రదేశంలో అటు ఇటు స్తంభాలుండి, వరుసగా ఈ చివర నుండి ఆ చివరన ఆలయం వరకు మండపాలున్నాయి. మండపాలపై ప్రస్తుతం పై కప్పు లేదు. హంపి బజారు లాగ ఇది కూడ అందమైన వీధి. ఇక్కడ కూడ ఈ వీధిలో రత్నాలు, మణి మాణిక్యాలు రాసులుగా పోసి అమ్మే వారని విదేశీ యాత్రికులు వ్రాశారు. ప్రస్తుతం దీనిని సూళె బజారు అంటున్నారు. ఈ వీధి ప్రారంభంలో కొండ క్రింద ఒక కోనేరు, అందులో నాలుగు స్తంభాల మండపం ఉన్నది. ఈ వీధిలో ఆ చివరన ఆలయ ముఖ ద్వారం ఉన్నది. దీని శిఖరం కూలా గొట్ట బడినది. ఈ ముఖ ద్వారం అంత ఎత్తు వరకు రాతి నిర్మితం. తర్వాత ఇటుకలు, సున్నంతో కట్టబడినది. గోపురంలో నున్న అందమైన స్త్రీ శిల్పాల అవయవాలు ఛిద్రం చేయ బడినవి. ద్వారానికి లోపలి వైపున దశావతారాలు, శ్రీకృష్ణ లీలలు, సంజీవిని పర్వతాన్నెత్తిన ఆంజనేయ స్వామి వంటి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ అవరన లో రెండు ఉప ఆలయాలున్నాయి. గోపురం ప్రక్కన ఉన్నది లక్ష్మీ దేవి ఆలయం. ఆ ప్రక్కనే ఉన్నది రెండో ఆలయం. దీన్ని పూర్తిగా ధ్వంసం చేయగా, ఇప్పుడు రాళ్ల కుప్పగా ఉన్నది. ముఖ మంటపం మెట్ల కిరువైపుల ఉన్న ఏనుగు శిల్పాల తొండాలు విరగ గొట్ట బడినవి. రంగ మండపంఆలయంలోనున్న జయ, విజయుల చేతులు విరగగొట్ట బడినవి. గర్భాలయం పై శిఖరం కూడ కూల గొట్ట బడినది. ఆలయ ప్రహరీకి ఆనుకొని లోపలి వైపు చుట్టు యాత్రికుల సౌకర్యార్థం మండపాలు ఉన్నాయి. లోపలునున్న ఏ గర్భాలయంలోను మూల విరాట్టులు లేరు. దక్షిణాభి ముఖంగా ఉన్న ఈ ఆలయానికి తూర్పు పడమరలకు కూడ చిన్న ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయానికి వెనుకకు ప్రహరీకి చిన్న ద్వారం ఉన్నది. దానిలో నుండి బయటకు వెడితే, అక్కడే ఎదురుగా కాళీ మాత ఆలయం ఉన్నది. సహజ సిద్ధంగా ఏర్పడిన పెద్ద బండరాతి పై పది చేతులతో, వాటిలో ఆయుధాలతో చాల అందంగా చెక్కబడి ఉన్నది. దీనికి పై కప్పుగా రేకులు అమర్చారు. దీని ముందు పడివున్న అందమైన శిలా స్తంభాలు, శిల్పాలు, రాళ్ల కుప్పను చూస్తే గతంలో ఇక్కడ అందమైన ఆలయం ఉండేదని తేలికగా అర్థం అవుతుంది. ఈ గుడి వెనక నున్నదే మాతంగ పర్వతం.

మాతంగ పర్వతం

[మార్చు]

ఈ మాతంగ పర్వతం హంపి బజారు నుండి కూడ కనిపిస్తుంది,. దానిపైనున్న ది వీరభద్రాలయము. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కొండల కన్నా ఇదే ఎత్తైనది. ఈ పర్వతం పైకెక్కడం చాల శ్రమ తో కూడుకున్నదే గాక చాల ప్రమాదకరం కూడ. చూడ లేని వారికి అక్కడ ఏమున్నదో యని కుతూహలం కలగడం సహజం. అందుకే ఈ క్లుప్త వివరణ. కొండపైకి ఎలా వెళ్లాలంటే?......అచ్యుత రామాలయం వెనక ఆరుబయట వున్న కాళికాలయం ముందున్న చిన్న పంట కాలువలో సుమారు ఒక కిలో మీటరు దూరం కొండ అంచునే వెడితే, అక్కడ కొండ పైకి మెట్ల దారి కనబడుతుంది. మెట్ల ప్రారంభంలో ఒక రాయి పై శివ లింగం, నంది విగ్రహం, దాని క్రింద సాష్టాంగ నమస్కార ముద్రలో ఒక స్త్రీ శిల్పం చెక్క బడి ఉన్నది. అక్కడ నుండి మెట్ల దారి ప్రారంభమవుతుంది. పెద్ద పెద్ద బండ రాళ్లను పరచి మెట్లను ఏర్పరిచారు. ఈ కొండ ప్రాంతమంతా పెద్ద బండరాళ్ల మయం. చెట్లు ఏమాత్రం లేవు. జన సంచారం ఏమాత్రం ఉండదు. పైనున్న గుడి చిన్నదైనా, దాని చుట్టు విశాలమైన వరండాలు కలిగి, సున్నపు గచ్చు చేయ బడి ఉన్నది. శిల్పకళ ఏమాత్రం లేని శిలా స్తంభాలు ఉన్నాయి. అక్కడే ఒక చిన్న కాళికా మందిరం, అందులో కాళికా దేవి విగ్రహం ఉన్నది. ప్రతి రోజు ఒక వ్యక్తి వచ్చి, ఇక్కడ పూజ చేసి వెడుతుంటాడు. కొండ శిఖారాగ్రాన ఉన్న ఈ ఆలయ మండపం పైకి ఎక్కడానికి, ఆక్కడి నుండి వీక్షించడానికి పైకి మెట్లు, పైన విశాల స్థలం ఉన్నది. అక్కడి నుండి చూస్తే ఆ చుట్టు ప్రక్కల కొన్ని కిలోమీటర్ల దూరం సూక్ష్మ రూపంలో కనబడుతుంది. ఉత్సవ దినాలలో ఇక్కడ జాతర జరుగుతుంది. అప్పుడు మాత్రమే జనం వస్తారు. ఇక్కడి నుండి క్రిందికి దిగడానికి హంపి వైపు కూడ దారి ఉన్నది. కాని ఈ దారి చాల ప్రమాద కరంగా ఉన్నది. కొండ పైనుండి హంపి వైపు దిగితే, కొండ పాద బాగాన ఒక అందమైన శివాలయం, ఒక ఆశ్రమం ఉన్నాయి. ఈ ఆశ్రమం చాల పెద్దది. అందులో జనసంచారం ఉన్నట్లుంది. ఇక్కడి నుండి హంపి బజారులోనున్న "ఎదురు బసవణ్ణ" చాల దగ్గర.

సుగ్రీవుని గుహ

[మార్చు]

అచ్యుత రాయల ఆలయం ముందు నుండి నడచి వచ్చి, అక్కడున్న కాలి బాటలో కొంత దూరం నడిస్తే, అక్కడ ఎడం వైపు, అనగా నది వైపు ఒక పెద్ద రాళ్ల కుప్ప కనిపిస్తుంది. ఆబండ రాళ పై తెల్లటి పట్టీలు, తెల్లటి సున్నం పట్టీలు వేసి కనబడుతుంది అదే సుగ్రీవుని గుహ. దీనికి చారిత్రక ప్రాముఖ్యత లేదు. కాని స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతమంతా రామాయణం లోని కిష్కింధ యని అంటారు. దాని కాధారంగా వారు చెప్పే దేమంటే.............. "రావణుడు సీతాపహరణ సందర్భంగా, సీత జార విడిచిన నగలు ఆంజనేయుడికి దొరకగా వాటిని ఈ సుగ్రీవుని గుహలోనే దాచాడట. ఈ ప్రాంతంలో రామాలయా లెక్కువ. ఆంజనేయుని విగ్రహాలు కూడ ఎక్కువ. అంతే గాకుండా ఇక్కడున్న కొండలు, వంకలు వాగులకు రామయాణం కాలం నాటి పేరులే ఉన్నాయి. అవి, తుంగ భద్ర నదికి పంప నది అని పేరు., పంపా సరోవరం ఆనె గొంది సమీప ాన ఉన్నది, అక్కడే ఋష్య మూక పర్వతం ఉన్నది, ఆంజనేయుడు జన్మించిన అంజనాద్రి నదికి అవతలనున్నది. హేమకూటం, మాతంగ పర్వతం, ఇవి ఆనాటి పేర్లే. ఇక్కడ సంచరిస్తున్న వానర జాతి రెండు రకాలు, అవి వాలి సుగ్రీవుల సంతతే. ఇక్కడ కొండల్లో పెద్ద పెద్ద బండ రాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి, అవన్నీ వానర సైన్యం. రామ సేతువును నిర్మించగా మిగిలిన బండ రాల్ళే........ ఇక్కడికి సమీప ంలో "నింబా పురం" లో శ్రీ రాముడు వాలిని దహనం చేశాడు. అందుకే అక్కడ విస్తారంగా బూడిద, శల్యాలు కనబడతాయి. ఇలా నిదర్శనాలు చూపెడతారు...... ఈ సుగ్రీవుని గుహలో స్థానికులు పూజలు చేస్తుంటారు. పర్వ దినాలలో పెద్ద ఉత్సవాలు జరుపుతారు. ఈ గుహకు ఎదురుగా కొండ వాలులో ఒక శిధిల దేవాలయం ఉన్నది. అందు ఏనుగు శిల్పాలు, సతీ శిల్పాలు ఉన్నాయి. ఇది జైన మందిరం. ఈ దారిలో తర్వాత వచ్చేది పురందర దాసు మందిరం. ఇక్కడి నుండి కొండ పాద భాగాన ఉన్న కాలి బాట వెంబడి వెడితే " తులాభారం " వరకు వెళ్ల వచ్చు. ఈ మధ్యలో చెప్పుకో దగ్గ కట్టడాలు లేవు. అందు చేత నది వెంబడి వెడితే పురందర దాసు మండపం వస్తుంది.

పురందర దాసు మండపం

[మార్చు]

సుగ్రీవుని గుహ నుండి నది వెంబడి కాలి బాటలో కొంత దూరం నడిస్తే నదిలో రెండు వరుసల రాతి స్తంభాలు పాతి ఉన్నవి కనబడతాయి. అది విజయనగర రాజుల కాలంలో నదిని దాటడానికి కట్టిన వంతెన. ప్రస్తుతం కేవలం స్తంభాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వంతెన గురించి ఆ కాలంలో విజయనగరాన్ని సందర్శించిన డొమింగో ఫీస్ గాని, నూనిజ్ గాని వివరించ లేదు. కారణమేమై ఉండునో..... వారిక్కడికొచ్చినప్పుడు ఆ వంతెన కట్టలేదో.... లేదా వారు దానిని చూడ లేదో..... ఇక్కడికి ఇంకొంత దూరంలోనే నదీగర్భంలో ఒక పెద్ద మండపం కనబడుతుంది. అదే "పురందర దాసు మండపం. అరవై లావు పాటి స్తంభాలపై నిర్మించిన ఈ మండపం నదిలో ప్రవాహం ఎక్కువై నప్పుడు పూర్తిగా మునిగి పోతుంది. ఇది కొన్ని శతాబ్దాలలో కొన్ని వందల సార్లు వరద తాకిడికి గురైనా చెక్కు చెదర లేదు. గోడలు లేని ఈ మండపంలో మధ్యన పురందర దాసు విగ్రహం ఉన్నది. మండపం పై కన్నడంలో "పురందర దాసు మండపం." అని చెక్కి ఉన్నది. మహారాష్ట్రకు చెందిన ఈ భక్తాగ్రేసరుడు విజయనగర కాలంలో ఇక్కడ కొంత కాలం నివసించాడు. అతని గుర్తు గా ఈ మండపం నిర్మించారు. ముందు ముందు చూడ బోయే విఠలాలయంలో కూడ పురందర దాసు కొరకు ఒక భజన మండపం ఉన్నది.

తులా భారం

[మార్చు]

పురందర దాసు మండపం నుండి దక్షిణం వైపు కొంత దూరంలో ఎదురుగా రెండు స్తంభాల పై అడ్డంగా ఒక స్తంభాం పెట్టి ఉన్నది. అదే తులాభారం. ఈ మధ్య దారిలో ఒకా దర్గా కూడ ఉన్నది దాన్ని కూడా చూడొచ్చు. ఇది కూడ ఆనాటిదే. ఆ రోజుల్లో ఈ తులాభాని కున్న కొక్కేలకి గొలుసులతో ఒక త్రాసును కట్టి రాజు గారు తన బరువుకు సమానమైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు పెట్టి తూచి వాటిని ప్రజలకు దానం చేసే వారు. ఇందులోని ఒక స్తంభం పాద భాగాన శ్రీకృష్ణ దేవరాయలు, వారి సతీమణి యొక్క ప్రతిమలు చెక్క బడి ఉన్నాయి. ఈ తులాభారం వెనుక ఎదురెదురుగా రెండు ఆలయాలు ఉన్నాయి. అందులోని ఒక దాని లో రెండు రాతి తొట్లున్నాయి. గర్భ గుడి ద్వారం పైభాగాన లక్ష్మీదేవి ప్రతిమ, ఇరువైపుల ఏనుగుల ప్రతిమలు ఉన్నాయి. ఇవి లక్ష్మీదేవి ఆలాయాలు. రెండో ఆలయం పూర్తిగా ధ్వంసం చేయ బడినది. దేని లోను విగ్రహాలు లేవు. ఈ తులాభారం వద్దకు రావడానికి సుగ్రీవుని గుహ నుండి కొండ వాలులో కాలి దారి ఉన్నది. తులాభారం మధ్యలో నిలబడి ముందుకు చూస్తే ఎదురుగా కొంత దూరంలో విరిగిన స్తంభాలు మధ్యలో దారి అటు ఇటు కొన్ని ఆలయాలు కనబడతాయి. దాని ప్రక్కనే పెద్ద ప్రహరీ గోడ కనబడుతుంది. ఆ లోపల ఉన్నదే "విఠలాలయం"

విఠలాలయం

[మార్చు]
హంపీలోని విఠలాలయం

ఈ విఠలాలయం విజయనగర చారిత్రక కట్టడాలన్నింటి లోకి, శిల్ప కళ రీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించు కొన్నది. దాని ముందున్న పురావస్తు శాఖ వారి సూచిక ఫలకం లోని విషయం క్లుప్తంగా.................." ఈ ఆలయంలోని శిల్ప కళా రీతులు అత్యంత అద్భుతం. విఠల్ అనగా శ్రీకృష్ణుని రూపమే. ఆ కాలంలో ఇది అన్నింటి కన్న పెద్ద ఆలయం. దీనిని రెండవ దేవ రాయలు 1422-- 1446 సంవత్సరాల మధ్యలో కట్టించెను. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు, ఇందులోని నూరు స్తంభాల మండపం, ఇరుప్రక్కల ప్రహరీకున్న ద్వారాలు దానిపై గోపురాలు కట్టించెను. ఆలయం లోని సభా మండపం లోని ఏకశిలా స్తంభాలు, అందులోని శిల్ప కళ అత్యంత అద్భతం. ప్రతి స్తంభానికి నాలుగు వైపులా నాలుగు ఉప స్తంభాలు చెక్కి ఉన్నాయి. వాటిని సుతారంగా మీటితే సప్త స్వరాలు పలుకుతాయి. ప్రవేశద్వారం ముందున్న ఏక శిలా రథం దేవుని ఊరేగింపునకు ఉపయోగించిన రథానికి ప్రతి రూపం. ఇది విజయనగర శిల్ప కళా రీతులకు పరాకాష్ట. ఈ రథం లో గరుడుడు ఆశీనుడై ఉన్నాడు. తూర్పు ముఖ ద్వారానికి ఎదురుగా ఉన్న రాజ వీధి తొమ్మిది వందలా తొంబై ఐదు మీటర్లు పొడవు, నలబై మీటర్ల వెడల్పుతో చివరన " లోక పావని" పుష్కరిణి వరకు ఉన్నది." ఇది అందులోని విషయం. ఆలయ ముఖ ద్వారం ముందు ఒక పెద్ద శిలా స్తంభం పడి ఉన్నది. అది ధ్వజ స్తంభం. 1856 వ సంవత్సరంలో "జాన్ గోలింగ్స్" తీసిన ఫోటోలో ఈ స్తంభం నిలబడి ఉన్నది చూసి ఉంటారు. ఆలయం లోపలికి వెళ్లడానికి పది రూపాయలు టికెట్టు. ముఖ ద్వారం శిఖర పైభాగం కొంత శిధిల మైనది. ఆలయం లోనికి అడుగు పెట్టగానే కనుపించే దృశ్యం:....... ఎదురుగా ఏక శిలా రథం, దాని ముందు ఆలయ సభా మంటపం, లేదా నాట్య మండపం., కుడి ప్రక్కన పురందర దాసు భజన మండపం., ఎడం ప్రక్కన నూరు స్తంభాల మండపం. ఇది ప్రధమ దృశ్యం. లోనికి వెళ్లి వివరంగా చూస్తే...............

విఠలాలయం ముందు మండపాలతో ఉన్న వీధి
విఠలాలయం ముందు మండపాలతో ఉన్న వీధి

విఠలాలయం వెనుకనున్న ఆలయాలు.

[మార్చు]

విఠలాలయం వెనుక అనగా తులాభారానికి ఎదురుగా ఒక చక్కని వీధి లాగ అటు ఇటు ఆలయాలు ఉన్నాయి. అన్నీ శిధిలమైనవే. ఇక్కడున్న రెండు స్తంభాల మధ్య చక్కని వేదిక కలదు. దాని చుట్టు అనేక శిల్పాలు చెక్కి ఉన్నాయి. అందులో గుర్రాలను పట్టుకొని ఉన్న అరబ్బులు, నాట్య గత్తెలు మొదలగు శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ వేదిక ప్రక్కనే ఒక శిధిలాలయము ఉన్నది. దాని గర్భగుడి ద్వారం పై లక్ష్మీ దేవి ప్రతిమ అటు ఇటు ఏనుగు శిల్పాలు ఉన్నాయి. ఇది విశాలమైన నదీ తీర ప్రాంతం. ఇక్కడ అనేక ఆలయాలున్నాయి. ఇంకా శిలా శాసనాలు చెక్కిన శిలా ఫలకాలు పాతి ఉన్నాయి. ఇక్కడే మరో ఆలయం ఉన్నది. దాని గర్భ గుడి మాత్రమే ఉన్నది. ఈ ఆలయ ముఖ ద్వారం పై లక్ష్మీ దేవి విగ్రహం, అటు ఇటు శంకు చక్రాలు ఉన్నాయి. మరో ద్వారం పై ఆది శేషశయన శిల్పాలు చిత్రించ బడి ఉన్నాయి. ఈ ఆలయం ముందున్న గోడకు శిలా శాసనం చెక్కి ఉన్నది. ఒక ఆలయ గోడకు ఒక బల్లి చిత్రం చెక్కబడి ఉన్నది. ఈ గుడికి ఎదురుగా ఒక పొడవాటి వీధి ఉన్నది. ఈ వీధికి ఒక వైపు విఠలాలయ ప్రహరి గోడ, మధ్యలో మూసి ఉన్న ద్వారం ఉన్నది. ఈ ద్వారంలోనే విజయనగర రాజ ముద్రిక చిత్రించి ఉన్నది. వీధికి మరో వైపు శిధిలమైన ఆలయాల పునాదులు ఉన్నాయి. ఈ ప్రహరీ చివరకు వెడితే అక్కడ ఎడం వైపున ఒక పెద్ద వీధి ఉన్నది. ఆ ఎదురుగా ఒక ఆలయం ఉన్నది. దాని ప్రక్కన ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి. దేనిలోను విగ్రహాలు లేవు. ఈ వీధి సరాసరి విఠలాలయ ముఖ ద్వారం వరకు ఉన్నది. ఈ ఆలయాల నిర్మాణ క్రమం చాల అద్భుతం. ఏ ఆలయం ముందు కూడ దాని వివరాలు తెలిపే సూచిక ఫలకాలు లేవు. అందు చేత వాటి వివరాలు తెలియకున్నవి. ఈ ప్రాంతం తుంగభద్రా నదీ పరీవాహక ప్రాంత మైనందున, వరదల సమయాలలో ఈ ప్రాంతం మునిగి ఉండవచ్చు. ఆ కారణంగా చాల శిలా సంపద భూస్థాపితమై ఉండ వచ్చు.

ఏకశిలా రథం

[మార్చు]
విఠలాలయం ప్రక్కన ఏకశిలారథం

రథం పై ఇటుకలు, సున్నంతో చేయ బడిన శిఖరం ఉండేది. గతంలో తీసిన ఫోటోలో చూశారు. అదిప్పుడు పక్కన పడి ఉన్నదని గమనించ వచ్చు. మధ్యలో గరుడుడు ఆశీనుడై ఉన్నాడు. ముందు భాగంలో రెండు ఏనుగులు మధ్యలో మెట్లు ఉన్నాయి. చక్రాలు, ఇరుసు అంతా ఏక శిలా నిర్మితమే. ఈ రథ చక్రాలు నిజంగానే తిరుగుతాయి. కాని పర్యాటకులు వాటిని మాటి మాటికి త్రిప్పి చూస్తున్నందున ఆ చక్రాలు తిరగ కుండా సిమెంటు వేసినారు. ఈ ఏకశిలా రథాన్ని హంపి విజయనగరానికి గుర్తుగా వాడతారు.

పురందర దాసు భజన మండపం

[మార్చు]

ప్రధాన ఆలయం ముందు ప్రహరీకి ఆనుకొని ఉన్న మండపమే పురందర దాసు మండపం. ఆ రోజుల్లో పురందర దాసు ఇక్కడ భజనలు చేసే వాడు. ఇతడు మహారాష్ట్ర లోని పాండురంగని భక్తాగ్రేసరుడు. ఇతని పేరున తుంగభద్రా నదీ గర్భంలో ఒక మండపం ఇదివరకే చూసారు.

నూరు స్తంభాల మండపం

[మార్చు]
నూరు స్తంభాల మండపం.

ఆలయం లోని నాట్య మండపానికి ప్రక్కన ఉన్నదే నూరు స్తంభాల మండపం. ఇది మూడడుగుల ఎత్తైన పీఠం పై శిల్పకళా శోభితమైన స్తంభాలు కలిగి, మధ్యలో మరో పీఠం పై నాలుగు స్తంభాలు ఉండి, మొత్తానికి ఒకే కప్పు కలిగి ఉన్నది. దీనిపైకి ఎక్కడానికి ఇరు వైపుల ఏనుగు శిల్పాలు ఉన్న మెట్ల దారి కలదు. పీఠం చుట్టూ కూడ శిల్ప కళ అమోఘం..

వీర నరసింహ మండపం

[మార్చు]

నూరు స్తంభాల మండపానికి వెనుక నున్నదే వీర నారసింహ మండపం. దీనిలో ఉన్న స్తంభాలు పెద్దవిగా ఉండి, వాటిలో పిల్ల స్తంభాలు కూడ ఉన్నాయి. మధ్యలో చిన్న వేదిక ఉన్నది. సమావేశాలకు సభా మండపంగాను, పెళ్ళిళ్లకు పెళ్లి మండపం గాను ఉపయోగింపబడినది. దీని వెనుక ప్రహరీకి ఆనుకొని మరో మండపం కలదు. దీని వెనుక ఒక చిన్న ఆలయం కలదు. ఇది దేవి ఆలయం. ప్రధాన గర్భాలయం వెనుక ప్రహారీకి ఆనుకొని స్తంభాలు కలిగిన వరండా కలదు.

నాట్య మండపం

[మార్చు]

విఠలాలయంలో ప్రధానంగా చెప్పుకో దగినది నాట్య మండపం. ఇందులోని శిల్పకళా విన్యాసం అత్యంత అద్భుతం. విజయనగర శిల్పకళా చాతుర్యానికి ఇది పరాకాష్ఠ.. ఏకశిలలో చెక్కిన పెద్ద స్తంభాలలో నలుదిక్కులలో మరో నాలుగు పిల్ల స్తంభాలు ఉండి అనగా ఒక్క స్తంభానికి చుట్టూ అన్నీ కలిపి పదహారు చిన్న స్తంభాలు ఉండి, అందులోనే ఒక వాయిద్యాన్ని ధరించిన వాయిద్య కారిణి ప్రతిమ మొత్తం కలిపి ఒకే శిలలో చెక్కి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కో స్తంభంలో ఒక్కో వాయిద్యాన్ని వాయిస్తున్నట్లున్న ఒక ప్రతిమ ఉన్నది. ఆ వాయిద్యాలు, మద్దెల, డమరుకం, ఘటం, గంట, శంఖం వంటివి ఉన్నాయి. స్తంభాలలో సంగీతం పలికించ డానికి "గైడ్" అందరిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పి, పెద్ద స్తంభానికి ఉన్న చిన్న స్తంభాలపై చిన్న కర్రతో మెల్లిగా మీటగా, ఆ స్తంభంలోని ప్రతిమ ధరించిన వాయిద్య శబ్దం వీనుల విందుగా విన వస్తుంది. ఆ కాలంలో ఈ సభా మంటపంలో నాట్య కారిణులు నాట్యమాడగా, వాయిద్య కారులు ఆయా స్తంభాలపై గంధపు చెక్కలతో లయ బద్ధంగా మీటుతుంటే, ఆ సంగీతానికి కనుగుణంగా నాట్యమాడేవారట. అప్పట్లో ఈ సంగీతం చాల దూరం వరకు వినిపించేదట. కాని ఇప్పుడు ఆ శబ్దం అంత స్పష్టంగాను, అంత దూరం వినిపించక పోవడానికి కారణం........ విధ్వంసక చర్యలో కొన్ని స్తంభాలు ధ్వంసం కావడం, కొన్ని స్థాన భ్రశం కావడం, మండపం పై కప్పు కూలి పోవడం కారణంగా చెప్పుతారు మండపంలో పై కప్పు అతి పెద్ద శిలా ఫలకాలతో కొంత మాత్రామే మిగిలి ఉన్నది. మిగతాది విరగ గొట్ట బడినదని గమనించ వచ్చు.. మధ్యలో నిలబడి పైకప్పుకేసి చూస్తే ఎడం చేతి మూల పైకప్పు క్రింద ఉన్న దూలానికి శ్రీకృష్ణ దేవరాయలు , వారి సతీమణి, ప్రక్కనే విఠల స్వామి ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఆ విఠల స్వామి రూపమే ఈ ఆలయంలో ప్రతిష్టించిన విఠలుని ప్రతి రూపమట. కనుక ఇప్పుడు కనీసం ఆ విఠలుని దర్శించు కుంటే మంచిది. ఈ మండపం మధ్యలో కొత్తగా ఒక పెద్ద శిలా స్తంభాన్ని చేర్చారు. దానిని సంగీత స్తంభం లాగ చెక్కించాలని ప్రయత్నం. సంగీతం పలకకున్నను, కనీసం ఆకారాన్నైనా ఆపాదించ గలిగితే చాలు.

రంగ మండపం

[మార్చు]

నాట్య మండపానికి ఆనుకుని ఉన్నదే రంగ మండపం. ఇది చుట్టు గోడలు కలిగి, ఉత్తర దక్షిణ దిక్కులకు కూడ ద్వారాలతో ఉన్నది. గర్భ గుడి లోనికి వెళ్లే ద్వారానికి ఇరు వైపుల జయ విజయుల శిల్పాలుండేవి. ప్రస్తుతం ఒకే శిల్పం ఉన్నది. రెండింటిని ధ్వంసం చేసి పార వేయగా, అందులో ఒకటి మాత్రమే దొరికిందట. దానినే ఇక్కడ ప్రతిష్టించారు. రెండోది దొరకనందున, ఆ స్థానం ఖాళీగా ఉన్నది. దీని కెదురుగా ఉన్నదే గర్భాలయం.

గర్భాలయం

[మార్చు]

ఆంగ్లేయుల కాలంలోనే భద్రత కొరకు మూల విరాట్టును మహారాష్ట్రకు తరలించి భద్రపరిచారట. గర్భాలయం ముందు రెండు మూడు మెట్లు క్రిందికి ఉన్నాయి. గర్భాలయం చుట్టు ప్రదక్షిణం చేయడానికి ఆవరణ ఉన్నది. కాని ఇదంతా చీకటిగాను, అపరిశుభ్రంగాను ఉన్నది. ఈ ప్రదిక్షిణావరణానికి, గర్భాలయానికి కలిపి ఒకే పైకప్పు ఉన్నది. ప్రదక్షిణాపథం లోనికి వెళ్ల డానికి వీలు లేదు. ఇప్పుడు మరొక సారి నాట్యమండపం లోనికి వచ్చి, మరొక సారి ఆ శిల్ప సౌందర్యాన్ని చూసి, బయటికి వెళ్ల వచ్చు.

విఠలాలయం ముందున్న రాచ వీధి.

[మార్చు]
విఠలాలయం ముందున్న హంపి బజారు లాంటి వీధి

ఆలయ ప్రధాన ముఖ ద్వారం ముందు నుండి సుమారు ఒక కిలో మీటరు దూరం వెడల్పైన వీధి ఇరు వైపులా మండపాలు కలిగిన రాచ వీధి కలదు. మండపాలపై స్తంభాలు ఉన్నాయి కాని పైన కప్పు చాల వరకు శిధిలమైనది. దీన్ని చూస్తే, హంపి బజారు గుర్తుకు వస్తుంది. వీధి చివరన కోనేరు ఉన్నది. కోనేరు మధ్యలో నాలుగు స్తంభాల మండపం కలదు. ఇందు లోని నీరు చాల శుభ్రంగా ఉన్నది. ఈ కోనేరు పేరు "లోక పావని" ఇక్కడ రోడ్డుకు కుడి ప్రక్కన ఒక చిన్న శివాలయం ఉన్నది. ఈ రోడ్డులో ఇంకొంచెం ముందుకు వెడితే ఎడం వైపు పొలాల్లో ఒక అందమైన మండపం కలదు. దీని పేరు "గజ్జల మండపం" . ఇక్కడ నుండి ఇంకొంత ముందుకు వెడితే అక్కడ పొలాల మధ్య రెండు రోడ్ల కూడలి వస్తుంది అక్కడ కుడి వైపు వెడితే కమలా పురం వెళ్లవచ్చు. ఎడం వైపు వెడితే తుంగభద్రా నది, దానిని "తలారిగట్ట" అంటారు. దానికి అవతల ఉన్నది "ఆనె గొంది".

ఆనె గొంది

[మార్చు]

శతాబ్దాల క్రితం "ఆనె గొంది" గురించి "డొమింగో పీస్ " ఏమన్నాడో నాలుగు మాటలు చూసి తరువాత ఈ నాటి ఆనె గొందిని చూద్దాం. డొమింగోపీస్ మాటలు:... "వీరు చెప్పే దాన్ని బట్టి విజయనగరం స్థాపించక ముందు వీరి రాజధాని ఆనె గొంది. అక్కడ చాల కొద్ది మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. ఒక సేనాపతి అక్కడ నివసిస్తాడు. పురాతన కోట గోడలు, ఇతర కట్టడాలు అక్కడ ఉన్నాయి. ఆక్కడికి వెళ్ళాలంటే, నదిని దాటి వెళ్లాలి. ఆ నదిని దాటడానికి బుట్ట పడవలను ఉపయోగిస్తున్నారు. వాటిని చెక్కతో చేసి, క్రింద భాగం చర్మంతో చేయబడి ఉంటుంది. అది నీళ్లలో తిరుగుతూ వెడుతుంది. ఇందులో పది మంది దాక ప్రయాణించ వచ్చు. అవసరాన్ని బట్టి ఎద్దులు గుర్రాలను కూడ ఈ పడవల్లో నదిని దాటిస్తారు. సాధారణంగా అవి నదిలో ఈదుకుంటూ నదిని దాటుతాయి." అని అన్నాడు.

అత్యంత ఆశ్చ్యర్య కరమైన విషయ మేమంటే, ఇక్కడ ఈ తుంగభద్రా నదిని దాటడానికి వందల సంవత్సరాల క్రితం వాడిన ప్రయాణ సాధానాలైన బుట్ట పడవలే ఈ నాటికి వాడుకలో ఉన్నాయి. వేరు మార్గం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం నది పై వంతెన అటునుండి కొంత ఇటు నుండి కొంత కట్టి మధ్యలో ఆపేశారు. కనుక ఆ వంతెన ఉపయోగంలోకి రాలేదు. ఆనాడు వాహనాలైన ఎద్దులు, గుర్రాలు ఈ పడవల్లో నదిని దాటితే, ఈ నాటి వాహనాలైన స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, మామూలు సైకిళ్ల తో బాటు మనుషులు కూడ ఈ బుట్ట పడవల్లోనే నదిని దాటుతున్నారు. ఈ పడవలనే పుట్టి అంటారు. నదిని దాటడానికి ఇవే ఆధారం. వేరు మార్గం లేదు.

నదిని దాటగానే మొదటగా కనిపించేది పురాతన కోట ద్వారం, కోటగోడ. ఈ గోడ అలా తుంగభద్రా నది వెంబడి చాల దూరం వ్యాపించి ఉన్నది. అదిప్పుడు పునరుద్ధరించ బడుతున్నది.. ఇక్కడి నుండి కొంత దూరంలో పొలాల మధ్యన ఒక పెద్ద మండపం కలదు. అది మూడడుగుల ఎత్తైన పీఠం పై సాధారణ స్తంభాలపై ఉన్నది. అందులోని రాతి స్తంభాలు సాధారణమయినవే అయినా, ముందున్న ఒక వరుస రాతి స్తంభాలు ఆకు పచ్చ రాతిలో, అత్యంత నునుపుగా సాన బట్టి ఉన్నాయి. చాల అందంగాను ఉన్నాయి. దీని తర్వాత "ఆనె గొంది" పల్లెటూరు. ఊరి మధ్యలో ఒక పురాతన ఆలయం, దానికెదురుగా ఒక పురాతన కట్టడం ఉన్నది. ఈ అలయం అనంతశయన ఆలయం. ఆవరణ విశాలమైనా, ఆలయం చిన్నది. అందమైనది కూడ. ఆలయం ఆవరణంలోనే నివాస గృహాలు ఉన్నాయి. ఇక్కడ నిత్య పూజాదికాలు జరుగుతున్నాయి. గర్భ గుడిలో అనంత శయనుని విగ్రహం చిన్నది, అందమైనది ఉన్నది.

ఆలయానికి ఎదురుగా ఉన్న పురాతన కట్టడం ప్రస్తుతం, గ్రామ పంచాయతీ చావిడిగా ఉపయోగంలో ఉన్నది. గుడి ముందున్న రోడ్డులో కొంత దూరం వెడితే నది ఒడ్డుకు వస్తారు. అక్కడ నది చాల విశాలంగా ఉన్నది. నది గర్భంలో చాల దూరంలో బృందావనం, నవ నందులు, రాజుల సమాధులు ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే పడవలో వెళ్లాలి. పడవకు సరిపడ జనం లేక పోతే పడవ వాడు పడవను నడపడు. ఇక్కడికి జనం అంతగా రారు.

చింతామణి ఆశ్రమం

[మార్చు]

ఆనె గొంది గ్రామంలో ఆలయం తర్వాత ఇది చూడదగిన రెండవ చారిత్రక ప్రదేశం " చింతామణి ఆశ్రమం" గతంలో ఎంతో గొప్పగా వెలుగొందిన ఈ ప్రాంతం ప్రస్తుతం జన సంచారం లేక పాడుబడిన కట్టడాలతో కళా విహీనంగా ఉన్నది. ఇక్కడికి వెళ్లడానికి మంచి రహదారి అంటూ ఏమి లేదు. గ్రామంలోని సందులు, గొందులలో వీధులలో తుంగభద్ర నది గట్టు వద్దకు వెడితే అక్కడే ఉన్నది "చింతామణి ఆశ్రమం." తుంగభద్ర నదీ తీరంలో, ఉన్న గుట్టల్లో ఉన్నది. ఇక్కడ కాశీ విశ్వేశ్వరాలయం ఉన్నది. ఈ ఆలయం, ఆశ్రమం లోని ఆలయం లాగే ఉన్నది. ఈ ఆలయానికి ఆనుకునే పెద్ద బండ రాళ్ల మధ్యన రెండడుగుల చదరంతో ఒక చిన్న ద్వారం ఉన్నది. అందులో నుండి లోనికి వెడితే అక్కడ విశాలమైన ప్రదేశం ఉన్నది. ఈ గుహ లోపల గతంలో చాల మంది మునులు తపస్సు చేశారట. ఇప్పుడు కూడ చింతామణి స్వామి వారు అప్పుడప్పుడు వచ్చి ఈ గుహలో తపస్సు చేస్తారట.

ఇక్కడి నుండి పైకి వెళ్లే కొద్ది, చిన్న చిన్న ఆలయాలు చాల ఉన్నాయి. ఎక్కువగా శివాలయాలు, కాళికాలయం కూడ ఉన్నది. ఈ ఆలయాలన్నీ చిన్నవైనా చాల వైవిధ్యంగా అందంగా కూడ ఉన్నాయి. కాల గమనంలో చాల వరకు శిధిల మైనవి. అక్కడక్కడా " సతీ శిల్పాలు" ఉన్నాయి ఆలయాలలో విగ్రహాలున్నా నిత్య పూజలు జరగడం లేదు. ఈ వరసలో చివరగా ఉన్నది ఒక పెద్ద బండ రాళ్ల కుప్ప. ఆ బండల సందులో ఒక గుహ ఉన్నది. గుహ ప్రారంభం లోనే ఒక సతీ శిల్పం ఉన్నది. లోపల రాళ్లతో కట్టిన ఒక తిన్నె ఉన్నది. దీనిని " రామ గుహ" అంటారు. లోపల విశాలమైన ప్రదేశం ఉన్నది. ఇక్కడ ఎటువంటి కట్టడాలు లేవు. అంతా ప్రకృతి సిద్ధంగా రాళ్ల మధ్యన ఏర్పడిన గుహే. ఇలాంటి గుహలు చిన్నవి ఆ చుట్టు ప్రక్కల ఇంకా కొన్ని ఉన్నవి. రామ లక్ష్మణులు, సుగ్రీవుడు, ఆంజనేయుడు ఇక్కడ సమావేశమై వాలి సంహారానంతరం, సుగ్రీవునికి ఇక్కడే పట్టాభిషేకం జరిగినదని స్థానికుల కథనం. ఈ ప్రాంతమంతా నదీ తీరంలోనే ఉన్నది. ఇంతకన్న ఈ ఆనెగొంది గ్రామంలో చూడవలసినవి ఏమీ లేవు. ఈ గ్రామానికి కొంత దూరంలో "పంపా సరోవరం" ఉన్నది.

తిరిగి నది వద్దకు వచ్చి, బుట్ట పడవ (పుట్టి) లో నదిని దాటి, నేరుగా హోస్పేటకు రావాలి. హోస్పేటకు శివార్లలోనే తుంగభద్ర ఆన కట్ట ఉన్నది. అక్కడ అపారమైన జలరాసి, చూసి ఉద్యానవనాల్లో సేదతీరి, మనస్సును ఆహ్లాద పరచుకొని తిరుగు ప్రయాణం కావచ్చు.

విరూపాక్షాలయం

[మార్చు]

.(అ) క్రీ.. శ.. 1520 వ సంవత్సరంలో డొమింగో పీస్ చూసిన విరూపాక్షాలయం

[మార్చు]

విరూపాక్షాలయాన్ని గురించి "డొమింగో పీస్" ఏమన్నాడో చదవండి. "ఈ ఆలయం చాల పురాతనమైనందున, దీనిని వీరు చాల పవిత్రంగా భావిస్తారు. యాత్రికులు ఎక్కువగా వస్తుంటారు. ఈ ఆలయ ప్రధాన ద్వారం పైన అందమైన చెట్టు కలదు......చుట్టూ స్త్రీ, పురుషుల చిత్రాలతో ఉన్నది. ఈ ద్వారం పై అతి ఎత్తైన గోపురం ఉన్నది. అందులో మనుషుల ఆడ, మగ చిత్రాలు ఉన్నాయి. ఈ గోపురం క్రింద నుండి పైకి పోను పోను సన్నగా ఉన్నది. ద్వారం లోనుండి లోపలికి వెళ్ళగానే, విశాలమైన ఆవరణ ఉండగా అందులో మరొక ప్రవేశ ద్వారం ఉన్నది. ఇది మొదటి దాని లాగే ఉన్నది కాని చిన్నది. దీని లోపలికి వెళ్ళ గానే మరొక అవరణ ఉన్నది. అందులో ఒక కట్టడం వరండాలతో చుట్టు స్తంభాలతో ఉన్నది. దీనికి మధ్యలో గర్భ గుడి ఉన్నది. ఈ గర్భ గుడి ముందు నాలుగు స్తంభాలున్నాయి. అందులో రెండు బంగారు పూతతోను, రెండు రాగి రేకు తాపడం తోను ఉన్నాయి. ఈ గుడి చాల పురాతనమైనది. అందువల స్తంభాలపై నున్న బంగారు పూత కొంత వెలిసి పోయి లోపలున్న రాగి రేకు కనిపిస్తున్నది. అంటే ఆ నాలుగు స్తంభాలు రాగివే నన్న మాట. దేవుని కెదురుగా ఉన్న స్తంభాలను ప్రస్తుతం రాజ్య మేలుతున్న రాజు శ్రీకృష్ణ దేవ రాయలు ఇవ్వగా, మిగతావి అతని పూర్వీకులు ఇచ్చారు. ద్వారానికి ముందు పై కప్పు వరకు, రాగితో తాపడం చేయబడి ఉన్నది. పైకప్పులో పులి లాంటి జంతువుల బొమ్మలు,చిత్రించ బడి వున్నాయి. విగ్రహం ముందున్న స్తంభాలలో రంద్రాలున్నాయి. వాటిలో రాత్రులందు నూనె దీపాలు పెడతారు. ....... .... .... దీని తర్వాత ఒక చిన్న భూగర్భ గది లాగ ఒకటున్నది. అందులో ఒక విగ్రహం నిలబడి ఉన్నది. దీనికన్న ముందు మూడు తలుపులున్నాయి. ఇదంతా చీకటిగా ఉన్నది. ఇక్కడ ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడున్న ద్వారపాలకులు పూజారిని తప్ప వేరెవ్వరిని లోనికి వెళ్లనివ్వరు. నేను వారికి కొంత ధనమిచ్చి నందున వారు నన్ను లోపలికి పోనిచ్చారు. ఈ రెండు ద్వారాల మధ్య రెండు చిన్న విగ్రహాలున్నాయి. ఇందులోని ప్రధాన విగ్రహం ఏ అకారము లేని గుండ్రటి రాయి మాత్రమే. దీనికి వీరు చాల భక్తి తో పూజ చేస్తారు. ఈ ఆలయం వెలుపలి భాగమంతా రాగి తో తాపడం చేయబడి ఉన్నది. గుడి వెనక వైపున వరండాకు దగ్గిరగా తెల్లని చలువ రాతి విగ్రహం ఉన్నది. దానికి ఆరు చేతులు ఉన్నాయి. ఒక చేతిలో.........., ఇంకో చేతిలో కత్తి..........,...... మిగతా చేతులలో ఏవో పవిత్రమైన వస్తువులు ఉన్నాయి. దాని పాదాల క్రింద ఒక బర్రె, ఇంకొక వింత జంతువు ఉన్నాయి. ఈ వింత జంతువు బర్రెను చంపడానికి సహాయం చేస్తున్నట్లున్నది. గుడిలో నిత్యం నేతి దీపాలు వెలుగుతుంటాయి. ఈ చుట్టు ప్రక్కల ఇతర చిన్న ఆలయాలున్నాయి. ఇవి కూడ అన్ని ఆలయాల లాగే ఉన్నాయి కాని ఇది ప్రధానమైనది, పురాతన మైనది.. ఈ ఆలయాలకు చాల భూములు, తోటలు ఉన్నాయి. వాటిలో బ్రాహ్మణులు, తాము ఆ పొలాలలో తినడానికి కూరగాయలు, ఇతర పంటలు పండించు కుంటారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భాలలో చక్రాలున్న రథాన్ని గుడి ముందున్న వీధిలో లాగుతారు. ఇటువంటి ఉత్సవ సందర్భం నేను ఈ నగరంలో ఉండగా రాలేదు కనుక నేను చూడలేక పోయాను. ఈ నగరంలో ఇంకా చాల ముఖ్యమైన ఆలయాలున్నాయి. వాటినన్నింటి గురించి వ్రాయాలంటే చాల ఎక్కువ అవుతుంది." అన్నాడు.

ప్రస్తుత విరూపాక్షాలయం

[మార్చు]
విరూపాక్షాలయ రాజగోపురము

తూర్పు ముఖంగా ఉన్న ఈ విరూపాక్షాలయం ప్రధాన రాజ గోపురం పదకొండంతస్తులు కలిగి చాలా ఎత్తుగా ఉన్నది. ఈ ఆలయం విజయ నగర నిర్మాణాని కన్న ముందే నిర్మితమైనది. రాజగోపురము పై స్త్రీ పురుషుల, జంతువుల, శిల్పాలు చాలా ఉన్నాయి. గోపురం ద్వారం లోపల ఒక ప్రక్క ఒక చిన్న నంది, ఇంకొక ప్రక్క మూడు తలల నంది ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఆవరణ కలదు. ఇక్కడే ఆలయ కార్యాలయం, ప్రక్కన యాత్రికులకు విశ్రాంతి గదులు ఉన్నాయి. ఆవరణ మధ్యలో ఒక నీటి కాలువ ఉన్నది. ఇది ఆ ప్రక్కనున్న హేమ కూటము నుండి ప్రవహిస్తున్నది. ఇందులో ఎల్ల వేళలలో నీరుండును. ఆవరణ లోపల ఫొటోలు తీయదలిస్తే మామూలు కెమెరాకి 50 రూపాయలు, వీడియో కెమెరాకి 500, రూపాయలు కట్టాలి. ఈ ఆవరణకు ఎదురుగా మరో గోపురమున్నది.

ఈ రెండో గోపురం మొదటి దానికన్న చిన్నది. దీనిని శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించి నందున దీనికి రాయల గోపురం అని పేరు. ఈ గోపుర ద్వారం లో ఒక శిలా శాసనం పలక ఉన్నది. ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణ. ఇందులో మధ్యన ముఖ మంటపం, దాని తర్వాత గర్భ గుడి ఉన్నాయి. గర్భ గుడి చుట్టు ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి. అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ, శ్రీ వేంకటేశ్వర , మహిషాసుర మర్దని వంటి దేవతా మూర్తులు ఉన్నాయి. విరుపాక్ష స్వామి వారికి పంపాపతి అని నామము కూడ కలదు. పూర్వం పంపానదిగా పిలువ బడినదే ఈ నాటి తుంగభద్రా నది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణలో దీప స్తంభం, ధ్వజ స్తంభం, నాలుగు కాళ్ల మంటపం, ఆ మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో, మూడు నందులు ఉన్నాయి. తర్వాత ముఖ మంటపం ఉన్నది. ముఖ మంటపం లోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలా శాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉన్నది. ముఖ మంటపం అనేక స్తంభాలతో, వాటి పై సుందర శిల్పాలతో ఉన్నది. పై కప్పుకు సున్నంతో తాపడం చేసి అందు రంగులతో పులి లాంటి వింత జంతువుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. కాలగమనం లో చిత్రాలు చాల వరకు వెలసి పోయినా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. వీటి గురించే ఆ నాడు డొమింగో పీస్ చెప్పినది. ముఖ మండపంలోనుండి గర్భగుడి లోనికి దారి లేదు. ఉగ్ర రూపుడైన స్వామి వారికి ఎదురుగా వెళ్ల కూడదనే నియమాన్ని అనుసరించి, స్వామి దర్శనానికి భక్తులు వెళ్లడానికి గర్భగుడికి ఇరువైపులా మెట్ల దారి ఉన్నది. గర్భలయానికి ఇరువైపులా రెండు సొరుగులు ఉన్నాయి. అందులో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. గర్భాలయం ముందు నాలుగు అందమైన నల్ల రాతి స్తంభాలతో మండపం కలదు. ఈ స్తంభాలలో మనోహరమైన శిల్పకళ కలదు. వీటిని గురించే ఆనాడు "డొమింగో పీస్" చెప్పినది. అందులో స్వామి వారి వాహనాలైన గుర్రం, నెమలి, ఏనుగు వంటి వాహనాలు ఉన్నాయి. గర్భ గుడికి కుడి ప్రక్కన కొంత ఎత్తులో స్వామి వారి బంగారు రత్న ఖచిత కిరీటం యొక్క చిత్ర పటం ఉన్నది. అసలు కిరీటాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు చేయించాడు. ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్ర పరచ బడి ఉన్నది. ఉత్సవాల సందర్బాలలో దాన్ని స్వామివారికి ధరింప జేస్తారు.

గర్భాబాలయానికి వెనుక, బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉన్నది. అక్కడ పది మెట్లు ఎక్కగానే, కుడి వైపు ఒక చీకటి గది ఉన్నది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉన్నది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడ పై పడి బయట ఉన్న రాజ గోపురం నీడ తల క్రిందులుగా చాల స్పష్టంగా కనబడుతుంది. దాని కెదురుగా ఒక తెల్లని గుడ్డ అడ్డం పెడితే దాని మీద కూడ ఆ గోపురం ప్రతి బింబం కనబడుతుంది. అందరూ దీన్ని చాల వింతగా చూస్తుంటారు. ఆ వస్తున్నది సూర్య కిరణాలు కాదు, కేవలం వెలుగు మాత్రమే. ఈ వింత బయట వెలుగు ఉన్నంత సేపు ఉంటుంది. ఇది తప్పక చూడాల్సిందే.

(ఇ) విద్యారణ్య స్వామి వారి మఠం

[మార్చు]

గర్భ గుడికి వెనుకనున్న ద్వారం గుండా బయటకు వెడితే, అక్కడ శ్రీ విద్యారణ్య స్వామి వారి మఠం, చిన్న ఆలయం, వుస్తక విక్రయశాల ఉన్నాయి. ఈ విద్యారణ్య స్వామి వారే విజయనగర సామ్రాజ్య నిర్మాణ కర్త. అక్కడ ప్రత్యేకంగా చూడ వలసినవి ఏమీ లేవు. అక్కడి నుండి తిరిగి గుడి లోపలికి వచ్చి, మెట్లు దిగితే అక్కడ ఎడమ చేతి వైపు గోడకు అందమైన ఆర్చి కలదు ఆర్చి క్రింద కంచు తో చేసిన తాబేలు ప్రతిమ కలదు., ఆర్చిలో ప్రస్తుతం ఏమి లేదు. గతంలో అందులో ఏదేని దేవతా ప్రతిమ ఉండెనేమో. ఇక్కడ గర్భ గుడికి దక్షిణ దిక్కున ఉన్న వరండాలో పంపా దేవి, భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి. ప్రక్కనే గులగంజి మాధవ ఆలయం ఉన్నది ఆ వరండాలోనే నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడే పెద్ద గోపురం ఉన్నది. ఈ గోపుర ద్వారం గోడకు ఒక చిన్న అందమైన రాజుగారి శిల్పం చెక్క బడి ఉన్నది. దాని క్రింద "యాయినీ రాజ " అని చెక్కబడి ఉన్నది. గోపుర ద్వారం మధ్యలో అటు ఇటు రెండు శిలా శాసనాలు చెక్కిన శిలా ఫలకాలు పెట్టి ఉన్నాయి. ఈ ద్వారం లోనే ఒక వైపు రత్న గర్భ గణపతి, మరో ప్రక్క చాముండేశ్వరి విగ్రహాలు ఉన్నాయి. ద్వారం దాటి బయటకు వెడితే, అక్కడ అందమైన కాళికా దేవి విగ్రహం ఉన్నది. బర్రె మీద పులి, పులి మీద దేవి స్వారీ చేస్తున్నట్లున్న విగ్రహం చాల అందంగా ఉన్నది. ఈ ప్రక్కనే అనేక శివాలయాలు ఉన్నాయి. అన్నీ చాల వరకు శిధిలమై ఉన్నవి. ఈ ఆలయాల కెదురుగా లోతైన కోనేరు ఉన్నది. ఇందులో స్వామి వారికి తెప్పోత్సవం జరుగు తుంది. కోనేరు ప్రక్కనే ఒక చిన్న రోడ్డు ఉన్నది. రోడ్డునకు అవతల ఒక మండపం ఉన్నది. అందులో నుండి వెడితే, అతి కొద్ది దూరం లోనే తుంగ భద్ర నది ఉన్నది. అక్కడ స్నానం చేయడానికి అనువుగా ఉన్నది. సేద తీరడానికి పచ్చిక బయళ్లు ఉన్నాయి. స్నానం చేసి తిరిగి గుడి ముందున్న రాజ గోపురం వద్దకు వస్తే, అక్కడినుండి " హేమ కూటం" వెళ్లవచ్చు.

హేమ కూటం

[మార్చు]
హేమకూటం పై అందమైన గుడి

విరూపాక్షాలయానికి ప్రక్కనే ఒక చిన్న గుట్టపై అనేక ఆలయాలు కనిపిస్తాయి. అదే హేమకూటం. రాజ గోపురం పక్కనుండి వెడితే, అక్కడ కోట ద్వారం లాగ ఉన్నది అదే హేమకూటానికి ద్వారం. అక్కడ హేమకూటం వివరాలు తెలిపే పురావస్తు శాఖ వారి ఫలకం ఉన్నది. అందు లోని వివరాల ప్రకారం..........".ఏటవాలుగా ఉన్న ఈ హేమకూటం గుట్టపై అనేక ఆలయాలున్నాయి. ఈ గుట్టకు మూడు ప్రక్కల బలిష్ఠమైన కోట గోడ రక్షణగా ఉన్నది. ఒకవైపు విరూపాక్షాలయ ప్రహరీ గోడ ఉన్నది. దీనికి మూడు ద్వారాలుండగా మధ్యలో ముప్పై మూడు దేవాలయాలు ఉన్నాయి. రెండు ఆలయాలలో శిలాశాసనాలు ఉన్నాయి. ప్రసిద్ధమైన త్రికూటాలయం లోని, శాసనాన్ని బట్టి ముమ్మడి శింగయ్య నాయక్ కుమారుడు వీర కంపలి దేవుడు ఈ శివాలయాలను నిర్మించి, శివ లింగాలను ప్రతిష్టించాడు. ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉన్న ఒక శాసనాన్ని బట్టి సా.శ. 1398 లో విరూపాక్ష పండితుడు, అతని సోదరుడు విరూపాక్షాలాయాన్ని కట్టించి, ఒక చెరువును త్రవ్వించెనని ఉన్నది. అక్కడే రాతిపై ఉన్న శాసనంలో జయ దేవ సమదేవ ఆలయంలో, దీప స్తంభన్ని, రెండవ హరిహరుని భార్య, 1397 వ సంవత్సరం లో నిర్మించెను. ఈ హేమకూటం లోని దేవాలయ సముదాయం హంపిలో, మొదటగా నిర్మించిన ఆలయాలుగా, సా.శ. తొమ్మిది నుండి పదనాలుగవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలియుచున్నది. ఈ దేవాలయాలన్నీ శివాలయాలు కావడం మరో విశేషం. " ఇది అందులోని సారాంశం.

ఈ హేమకూటం లోని త్రికూటాలయాలు పిరమిడ్ ఆకారంలో ఉండి, అంతా రాతి కట్టడమే. ఏ గుడిలోను విగ్రహం గాని, శివ లింగం గాని లేవు. విరూపాక్షాలయ ప్రహరీకి ఆనుకొని ఉన్న ఒక ఆలయం చాల ప్రత్యేకతను కలిగి ఉన్నది. శిల్పకళ అంతగా లేకున్నా, నిర్మాణం చాల వైవిధ్యంగా ఉన్నది. గుట్టపై మధ్యలో రెండంతస్తుల మండపం ఉన్నది. దాని మధ్యలోనే హేమకూటానికి దారి. ఇది అతి సాధారణ స్తంభాలు కలిగి, సున్నంతో చాల నునుపుగా చేయబడి ఉన్నది. మండపం మధ్యలో రంగులతో చిత్రాలు చిత్రించి ఉన్నాయి. చాల వరకు వెలసి పోయినా, ఇంకా కొంత అనవాళ్లుగా మిగిలి ఉన్నవి.

ఆ నాటి సాంఘిక విషయాలు, విశేషాలు

[మార్చు]

ఇంత వరకు ఈ హంపి విజయ నగర ప్రాంతంలో ఉన్న చారిత్రక కట్టడాలను, ఇతర నిర్మాణాలను వరుస క్రమంలో ఏ ఒక్కటి తప్పి పోకుండా చుశారు. దక్షిణా పథంలోనే అతి పెద్ద సామ్రాజ్యానికి రాజధానిని చూసారు. రాజధానిలో రాచరికపు కట్టడాలు ఉండడం సాధారణ విషయమే. అక్కడక్కడా ప్రసిద్ధమైన ఆలయాలు కూడ ఉండడం కూడ మామూలు విషయమే. కాని ఇక్కడ మీరు గమనించి ఉండవచ్చు, ఎక్కువగా ఆలయాలే ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో కుప్పలు తెప్పలుగా ఆలయాలుండడం గమనించారు. హంపి లో హేమకూట ప్రాంతంలో ముప్పై మూడు ఆలయాలున్నట్లు అక్కడున్న సూచిక ఫలకం పైన వ్రాసి ఉన్నది. అదే విధంగా విఠలాలయ ప్రాంతంలో అంతకు రెట్టింపు సంఖ్యలోనే ఆలయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. అదే విధంగా యల్లమ్మ గుడి నుండి హజరా రామాలయం వరకు ఉన్నవన్నీ ఆలయాలే. వీటన్నిటిని లెక్క పెట్ట సాధ్యం కాదు. "డొమింగో పీస్" ఈ ఆలయాలను గురించి రాస్తూ " ఇక్కడ చాల ఆలయాలున్నాయి. వాటన్నిటిని గురించి వ్రాస్తే చాల పెద్ద గ్రంథం అవుతుంది" అని అన్నాడు. ఇన్ని ఆలయాలు ఒకేచోట ఉంటే? వాటిల్లో పూజారులు ఎంతమంది ఉండాలి, ఆలయాలకు వచ్చే ప్రజలు ఎంతమంది ఉండాలి? అందుకేనేమో ఆనాడు "డొమింగో పీస్" అన్నాడు.... "ఈ నగర జనాభా గురించి వ్రాస్తే ఇదేదో కట్టు కథ అనుకుంటారు. అంచేత దాని గురించి నేను వ్రాయను. ఒక్కటి మాత్రం నిజం. ఈ నగరాన్ని ఏ ఒక్క ప్రదేశం నుండి చూడ వీలు గాదు. అందుచేత నేనొక కొండ నెక్కి చూశాను. నాకు కనిపించిన ఆ ప్రాంతమే మన "రోమ్" నగరమంత ఉన్నది............" అన్నాడు. ఈ నగరంలో ఇన్ని ఆలయాలుండడానికి కారణం ఒక్కటే. అదేమంటే ఈ రాజ్య స్థాపనకు ముఖ్య కారణం హిందుమతోద్ధరణ. దానిలోని భాగంగానే, ఇన్ని ఆలయాలు కట్టారు.

ఇంత వరకు కళ్ళకు కనిపించిన నిర్మాణాలను చూశారు. అందులోని శిల్ప కళారీతుల ననుసరించి ఆనాటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవన విధానం కూడ కొంత అవగాహన అయి ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఈ నగరానికి వచ్చిన విదేశీ యాత్రికులు, మన సాంస్కృతిక జీవన విధానంపై ఏమాత్రం అవగాహన లేని విదేశీయులు. ఇక్కడి విశ్హేషాలను ప్రత్యక్షంగా చూసి, ఆశ్చర్య పడి, తాము చూసిన దానిని యథాతథంగా మన కళ్ళకు కట్టినట్లుండే వారి మాటలను క్లుప్తంగానైనా స్మరించు కోవడం ఇక్కడ ఎంతో సందర్భోచితంగా ఉంటుంది.

ముందుగా డొమింగో పీస్ మాటలు

[మార్చు]

"............ ముఖ్యమైన విషయం ఏమంటే ఈ దేశ వాసులు ఆవులను, ఎద్దులను చంపరు, వాటి మాంసమును తినరు. ఎద్దులు వీరి సామానును మోస్తాయి. అంతే గాక వీరు ఎద్దులను, ఆవులను పూజిస్తారు. దేవాలయాలల్లో వీటి విగ్రహాలు కూడ ఉన్నాయి. వీరు కొన్ని ఎద్దులను దేవాలయాలకు అంకిత మిస్తారు. అటువంటి ఎద్దులు ఎక్కడ తిరిగినా వాటికి ఎవరూ ఎటువంటి హానీ చేయరు..

  • ధార్వార్ నగరాన్ని గురించి

"విజయనగర సామ్రాజ్యం లోని పల్లెలు, పట్టణాల గురించి వ్రాయాలంటే చాలా అవుతుంది. ఒక్క ధార్వార్ నగరాన్ని గురించి మాత్రం వ్రాస్తాను.................... ఈ నగరంలో ఉన్న కట్టడం ఒక దేవాలయం. ....... ఇందులో శిల్ప కళ ఎంతో కళాత్మకంగా ఉన్నది. అందులోని శిల్పాలు రాయి నుండి ఒక మూర ముందుకు ఉన్నందున ఆ ప్రతిమను ఆన్ని వైపుల నుండి చూడ గలము. ..........రాతి స్తంభాలతో నిర్మితమైన ద్వారంలో దానిపైనున్న శిల్ప కళను బట్టి అది ఇటలీ లో తయారైన దనిపిస్తున్నది. దీనికున్న అడ్డపట్టీలు, దూలాలు అన్నీ శిలా నిర్మితాలే. పలకలుగాని, కర్రలు గాని వాడలేదు. ఈ ఆలయానికి మూడు ద్వారాలున్నాయి. తూర్పున ఉన్న ద్వారానికి చిన్న వరండాల వంటివి ఉన్నాయి. అందులో జోగినులు కూర్చొని ఉన్నారు. ఈ ఆవరణలో ఎర్రటి చిన్న చిన్న ఆలయాలున్నాయి. అందులో ఓడ స్తంభంలాంటి రాతి స్తంభం ఉన్నది. అది మొదట నాలుగు పలకలుగా ఉండి, తర్వాత పైకి పోను పోను ఎనిమిది పలకలుగా ఆకాశం వైపు నిలబడి ఉన్నది. ఇలాంటి దాన్ని నేను ఇటలీలోని "రోమ్" నగరంలో చూసి ఉన్నందున నాకు అంత ఆశ్చర్యాన్ని కలిగించ లేదు. ఈ దేవాలయంలోని విగ్రహాలు కొన్ని, ఆడ మగ రూపంలోను, కొన్ని ఎద్దు రూపంలోను, కోతి రూపంలోను, ఉన్నాయి. మరి కొన్నింటిలో ఒక గుండ్రటి రాయి మాత్రమే ఉన్నది. వీటినే ఈ ప్రజలు పూజిస్తారు.

ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం.... శరీరం అంతా మానవాకారంలో ఉండి ముఖం మాత్రం ఏనుగు ముఖం ఉన్నది. దీనికి ఆరు చేతులు ఉన్నాయి. వీరు చెప్పేదాన్ని బట్టి ఈవిగ్రహానికి ఇప్పటికే నాలుగు చేతులు పడి పోయాయిట. ఇక మిగిలిన చేతులు పడిపోతే అప్పుడు ఈ భూ ప్రపంచం అంతా మునిగి పోతుందట. దీన్ని దైవ నిర్ణయంగా భావించి దీని పై వీరందరికి చాల నమ్మకం. వీరు ఈ విగ్రహానికి ప్రతి రోజు ఆహారం పెట్టి, అది తింటుందని నమ్ముతారు. భోజన సమయంలో ఈ ఆలయానికి సంబంధించిన స్త్రీలు నాట్య మాడతారు. ఈ స్త్రీలకు జన్మించిన ఆడ పిల్లలందరు ఈ ఆలయానికే చెందుతారు. వీరందరు గుణ హీనులు, కాని వీరు గౌరవంగా ప్రధానమైన వీధులలోనే నివసిస్తుంటారు. వీరికి సమాజంలో మంచి గౌరవం ఉన్నది. గౌరవ ప్రథమైన వ్యక్తులు కూడ ఈ స్త్రీల ఇంటికి వెళ్లి వస్తారు. రాజు తన రాణులతో ఉన్నప్పుడు కూడ ఈ స్త్రీలు తమలపాకులు నములుతూ వెళ్లి రావడానికి అనుమతి ఉంది. ఇటువంటి అవకాశం సంఘంలో ఎంతటి పరపతి ఉన్న వ్యక్తి కైనా వీలుకాదు.

  • బ్రాహ్మణులు

బ్రాహ్మణులు తమకు తాము అతి పవిత్రులమని భావిస్తారు. ఈ రాజ్యంలో ఇతర బ్రాహ్మణులున్నా, వారు రాజు వద్ద వివిధ హోదాలలో అధికారులు గాను, కొందరు వ్యాపారస్తులు గాను, కొందరు వ్యవసాయదారులు గాను జీవిస్తున్నారు. ఈ పౌరోహిత్యం వహిస్తున్న వారు మాత్రం తమకు తాము అత్యున్నతులుగా భావిస్తారు. వీరు చేపలు, మాంసం వంటి మాంసాహారం తినరు.

  • శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉన్నాడు?

రాజు సాధారణ ఎత్తు కలిగి సన్నగాను గాక , అంత లావుగాను గాక మధ్యస్థంగా ఉన్నాడు. ఇతడు ఇతర దేశస్తులను చాల మర్యాద పూర్వకంగా గౌరవిస్తాడు. ..........ఇతనికి ముగ్గురు మహారాణులు..... అందరికి ప్రత్యేకంగా భవనములు, స్త్రీ జన పరివారము సేవకులు వారికి కావలసిన ఆవాసములు అన్ని ఉన్నాయి. పురుషులెవ్వరు అందు ప్రవేశించరు. వీరు కూడ బయటకు వెళ్ళరు. తప్పని సరై వెళ్ల వలసి వస్తే, మూసివున్న పల్లకిలో వెడతారు. ప్రజలు కూడ వీరికి దూరంగా ఉంటారు. చాల మంది నపుంసకులు వీరికి రక్షణగా ఉంటారు. నేను విన్న దాని ప్రకారం ఈ అంతఃపుర స్త్రీలు అత్యంత ధనవంతులు. వీరి వద్ద ధనమే కాకుండా, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రత్నాల వంటి జాతి రత్నాల సంపద చాల ఉంది. ఒక ఉత్సవ సందర్భంలో వారి అభరణాల అలంకరణ చూసి నిశ్చేష్టుడనయ్యాను. ఆ సందర్భాన్ని తర్వాత వివరిస్తాను. ...స్త్రీ జన పరివారంలో కత్తి, డాలు, పట్టగల వారు, వీర వనితలు, కుస్తీ పట్టగల వారు, పాడగల వారు, నాట్యగత్తెలు ఉన్నారు. ఈ ముగ్గురు మహారాణులు తమ మధ్య ఎటువంటి పొర పొచ్చాలు లేకుండా స్నేహ శీలురుగా మెలుగు చున్నారు.

  • ప్రభాత కాలాన రాజుగారి దిన చర్య.

రాజుగారు ప్రతి రోజు, సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, నడుముకు మాత్రం చిన్న గుడ్డ కట్టుకొని, శరీరం అంతా నువ్వుల నూనెతో మర్దనా చేయించుకొని, రెండు చేతులతో, మట్టితో చేసిన బరులను ఎత్తుతాడు. ఆ తర్వాత కత్తి తీసుకొని చెమట పట్టునంత వరకు వ్యాయామం చేస్తాడు. అప్పటికి నూనె అంతా చెమటతో బయటికి వస్తుంది. ఆ తర్వాత తన కుస్తీ వీరులలో ఒకనితో కుస్తీ పట్టుతాడు. ఈ శ్రమ అయిన తర్వాత తన గుర్రమును ఎక్కి మైదానంలో అటు ఇటు స్వారీ చేస్తాడు. ఈ కార్యక్రమం అంతా సూర్వోదయానికి ముందే పూర్తవుతుంది. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి మంత్రోత్సారణతో, రాజు గారికి స్నానం చేయిస్తాడు. ఆ తర్వాత అంతఃపురంలోని ఒక ఆలయం లోనికి వెళ్లి ప్రార్థన, ఇతర పూజ కార్యక్రమాలు చేస్తాడు. ఆ తర్వాత రాజు గారు ఇంకొక భవనం లోనికి వెడతాడు. ఆ భవనం గోడలు లేకుండా స్తంభాలతో ఉంటుంది. ఇక్కడ పరిపాలనా సంబంధ మైన అధికారులు ఉంటారు. రాజుగారికి అత్యంత ప్రముఖుడైన తిమ్మరుసు అనే వృద్ధుడుంటాడు. అతడు అంతఃపురంలోని అందరిని శాసించ గలిగి ఉంటాడు. అక్కడ రాజుగారు పరిపాలనా సంబంధ విషయాలను మాట్లాడిన తర్వాత ఆ ప్రముఖులందరూ సెలవు తీసుకొని వెళ్లి పోతారు. అప్పటి వరకు రాజు గారి దర్శనార్థం బయట వేచి ఉన్న సామంతులు, సేనా నాయకులు, ఇతర ప్రముఖులు ప్రవేశిస్తారు. వారు ఒక్కొక్కరుగా రాజుగారికి విన్నవించ వలసిన దానిని విన్నవించి, నమస్కరించి సెలవు తీసుకుంటారు. వీరి నమస్కార విధానం ప్రత్యేకంగా ఉంటుంది. రెండు చేతులు పైకెత్తి రెండు అర చేతులను కలుపుతారు. వీరందరు ఈ నమస్కార కార్యక్రమం ప్రతి రోజు ఉదయం చేస్తారు.

పెర్నానో న్యూనిజ్ ఇతను 1535-- 1537 సంవత్సరంలో విజయనగరానికి వచ్చాడు. అప్పుడు అచ్యుతరాయలు రాజ్య పాలన చేస్తున్నాడు. అతని మాటలు

[మార్చు]
  • రాజు గారి పర్యటన.

రాజు గారు బయట ప్రదేశానికి ప్రయాణమైతే అతని వెంట కొంతమంది ఆంతరంగికులను తీసుక వెడతాడు. రాజుగారు ఎవ్వరితో ఏమి మాట్లాడినా వారికి ఏమి హామి ఇచ్చినా ఎటువంటి వాగ్దానాలు చేసినా వీరు అన్నింటిని ఒక పుస్తకంలో వ్రాస్తారు. వీరి మాటలకు చాల గౌరవం ఉంటుంది.. కనుక రాజు గారిచ్చిన హామీలకు ఎటువంటి లిఖిత పూర్వక మైనది ఉండదు. కొన్ని సందర్భాలలో లిఖిత పూర్వకంగా ఇవ్వవలసి వస్తే దాని మీద రాజు గారి ఉంగరం ముద్ర లక్క మీద వేస్తాడు. దాంతో ఆ వ్యక్తికి హక్కు లభిస్తుంది.

  • ప్రముఖులను గౌరవించే విధానము.

రాజు గారు ఎవరి పైన అయినా ప్రత్యేకమైన గౌరవం చూపాలంటే, అతనికి బంగారు పిడి కలిగి దానికి వజ్రాలు వంటి విలువైన రాళ్లు పొదిగిన వింజామర ను బహూకరిస్తాడు. ఇది అత్త్యుత్తమైన గౌరవంగా భావిస్తారు.

ఎవరికైనా ఆపద సంభవించి నపుడు వెంటనే రాజుగారి దర్శనం కావాలంటే ఒక ప్రత్యేక పద్ధతి ద్వార లభిస్తుంది. బాధితుడు తాను దొంగలచే దోచుకో బడ్డానని చెప్పితే, ఆ దొంగతనం ఏ ప్రదేశంలో జరిగిందో తెలుసుకొని ఆ ప్రదేశపు అధికారి ద్వారా వెంటనే ఆ దొంగను పట్టి దొంగలించ బడిన సొత్తును అతనికి అప్పగించే ఏర్పాటు చేస్తారు. దొంగ దొరకక పోతే, ఆ అధికారి ఆ వస్తువు యొక్క విలువను స్వంతంగా అతనికి ఇప్పిస్తాడు. జరిగిన దొంగ తనాల గురించిన వివరాలు, దొంగ ఆనవాలు చెప్ప గలిగితే వెంటనే మంత్ర గాళ్లను పిలిపించి దొంగ ఆచూకి కనుగొంటారు. అటు వంటి మంత్రగాళ్లు ఈ దేశంలో చాల మంది ఉన్నారు. అందు చేత ఇక్కడ దొంగలు తక్కువ. దొంగకి కాలు, చెయ్యి తీసెయ్యడం, దొంగతనం పెద్దదయితే, మాన భంగం వంటి నేరాలకు మరణ శిక్ష, నమ్మక ద్రోహులకు బ్రతికుండగానే కడుపులో ఒక కర్రను గుచ్చి నాలుగు వీధుల కూడలిలో నిలబెడతారు. ఏనుగులచే తొక్కించడం, బండ రాయిని వీపున పెట్టి వీధులలో నిలబెట్టడం వంటివి మరి కొన్ని శిక్షలు. నీచ కులస్తులు ఎటువంటి నేరం చేసినా వారి తల నరకడమే శిక్ష

విజయనగర సామ్రాజ్యంలో సతీ సహగమనం జరుగు విధానం. నూనిజ్ స్వయంగా చూసి, వివరించిన వివరాలు

[మార్చు]

{సతీ సహగమనం} ఈరాజ్యంలో ప్రజలందరూ విగ్రహారాధకులే. స్త్రీలు, చనిపోయిన తమ భర్తలతో బాటు చితిలో దూకి మరణించటము వీరి ఆచారం. దీన్ని వీరు గౌరవ ప్రథమైన చర్యగా భావిస్తారు. భర్త మరణించినపుడు భార్య బందువులతో కలిసి రోదిస్తుంది. కాని ఆ రోదన ఒక స్థాయిని మించి ఉంటే ఆ స్త్రీ తన భర్త తో బాటు సహ గమనానికి సిద్ధంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానే ఆమెను సహ గమనానికి పురుగొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఆచారానికి/ సంప్రదాయానికి భంగం కలిగించ వద్దని బోధిస్తారు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తిని కర్రలతో చేసిన వేదికపై ఉంచి పూలతో అలంకరిస్తారు. అతని భార్యను ఒక గుర్రం పై కూర్చోబెట్టి శవం వెంబడి పంపుతారు. అప్పుడామె తనకున్న అన్ని ఆభరణాలను ధరించి ఉంటుంది. అన్ని రకాల పూలను కూడ ధరించి ఉంటుంది. చేతిలో అద్దం కూడ ఉంటుంది. వెనుక అనేక సంగీత వాయిద్యాలు, బాజా బజంత్రీలు రాగా వెనుక బంధు వర్గం నడుస్తుంది. వీరందరూ చాల సంతోషంగా ఉంటారు. ఒక వ్యక్తి ఒక వాయిద్యాన్ని వాయిస్తూ, ఆ స్త్రీ వైపు చూసి ఇలా పాట పాడుతాడు. నీవు....నీ....భర్తను....చేరడానికి.వెడుతున్నావు" అని. ఆ స్త్రీ దానికి సమాధానంగా..", అవును..... నేను నా భర్త వద్దకు వెడుతున్నాను అని పాట ద్వారా తెలుపుతుంది. శవాన్ని శ్మశానికి తీసుకెళ్లి, అక్కడ అదివరకే సిద్ధం చేసిన చితిపై పెడతారు........... మరణించిన వ్యక్తి యొక్క దగ్గరి బంధువు ఒకరు తలమీద ఒక నీటితో నిండిన కుండ నెత్తుకొని ఆ చితి చుట్టూ మూడు సార్లు తిరుగుతాడు. ప్రతి చుట్టుకు ఆ కుండకు ఒక రంధ్రం చేస్తారు. చివరగా అతడు ఆ కుండను అక్కడ పడేసి చేతిలో వున్న కాగడాను చితి పైకి విసురుతాడు. అప్పుడు అక్కడున్న వారు ఆ చితికి నిప్పు పెడతారు.......... .............. శవం కాలాక ఆ స్త్రీ పూజారులతో కలిసి ఆక్కడికి వస్తుంది. అక్కడున్న వారు ఆమె పాదాలను కడిగి వారి ఆచారాలకు సంబంధించిన కార్యాక్రమా లేవో చేస్తారు. అప్పుడు ఆమె తన శరీరం మీదున్న అభరాణలను తీసి తన బంధువు లైన స్త్రీలకు పంచి ఇస్తుంది. ఆమెకు కొడుకులున్నచో, వారిని తన ముఖ్యమైన బంధువులకు అప్పజెప్తుంది. ఆమె శరీరంపై నున్న బట్టలను తీసేశాక ఆమెకు ఒక సాధారణ పసుపు బట్టను కట్ట బెడతారు. ఆమె బంధువులు ఆమె చేతిని పట్టుకోగా, ఆమె మరో చేతిలో ఒకచెట్టు కొమ్మను పట్టుకొని ఉంటుంది. ఆమెను ఆ చితి చుట్టు మూడు సార్లు త్రిప్పుతారు. అప్పుడు ఒక చాపను ఆమె ముందు అడ్డంగా పట్టుకొని చితి మంటలు కనబడకుండా చేస్తారు. అప్పుడు ఒక బట్ట, బియ్యం, దువ్వెన, అద్దం, తమల పాకులు, వంటి వాటిని ఆ మంటలో వేస్తారు. ఇవన్నీ తన భర్త తరుఫున వస్తువులని వారి నమ్మకం. చివరగా ఆమె అక్కడున్న వారందరి వద్ద సెలవు తీసుకొని నెత్తిన నూనెతో నిండిన కుండతో తనంతట తాను ధైర్యంగా మండుతున్న అగ్ని కీలలలోకి ప్రవేశిస్తుంది. వెనువెంటనే అప్పటికే చేతులలో కర్రలతో సిధందంగా ఉన్న అమె బంధువులు అందరూ ఆ కర్రలతో ఆమెను కప్పేస్తారు. ఆ తర్వాత బిగ్గరగా తమ విచారాన్ని వ్యక్త పరుస్తారు. ఈ విధానము చాలా ధైర్యంతో కూడుకున్నదే గాక, నాకు చాల ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ పద్ధతి ఇక్కడి ప్రజలకే గాక, అధికారులకు, రాజుకు కూడా వర్తిస్తుంది.

ఒక వేళ ఎవరికైనా చాలా మంది భార్యలు ఉంటే, అతని మరణాంతరం వారందరూ ఇలా అగ్ని ప్రవేశం చేయ వలసిందే. తెలుగు వారికి మాత్రం ఈ ఆచారంలో కొంత మార్పు ఉంది. వారు శవాన్ని భూమిలో పాతి పెడతారు గనుక ....... భర్త శవాన్ని పూడ్చి పెట్టే గోతిలోనే, భార్య కొరకు ఇంకో స్థానం సిద్ధం చేస్తారు. భర్త శవం ప్రక్కన భార్యను పడుకో బెట్టి ఇద్దరిని పూడ్చి పెడ్తారు. అప్పుడు భార్య కూడా మరణిస్తుంది.

ఆనాటి మరణానంతర కర్మలు జరుగు విధానము

[మార్చు]

మరణించిన వ్యక్తిని కాల్చిన చితి వద్దకు, పదవ రోజున వెళ్ళి, తలకొరివి పెట్టిన వ్యక్తితో అక్కడున్న చితా భస్మానికి కొన్ని పూజాకార్యక్రమాలు చేసి, తర్వాత ఆ చితా భస్మాన్ని ఒక పాత్రలోకి సేకరించి, ఆభస్మాన్ని అక్కడే ఒక గొయ్యి త్రవ్వి పూడ్చి పెడ్తారు. ఆ తర్వాత ఆ చితా భస్మాన్ని ఇక్కడికి చాల దూరంలో ఉన్న పవిత్ర నదిలో, నిమజ్జనం చేయడానికి దాన్ని జాగ్రత్తగా కాపాడుతారు. చాలా దూరంలో ఉన్న ఆ పవిత్ర నదీ ప్రాంతంలో అతి పెద్ద ఆలయం ఉంది. అక్కడికి వచ్చిన భక్తులు అక్కడే మరణిస్తే వారు నేరుగా స్వర్గానికి వెడతారని వీరి నమ్మకం. అలాగే మరణించిన వ్యక్తి చితా భస్మాన్ని ఆ పవిత్ర నదిలో కలిపితే ఆ మరణించిన వ్యక్తి కూడా పుణ్య లోకాలకు వెదతాడని కూడా వీరి నమ్మకం. అయినా అక్కడిక వెళ్లే వారు చాల తక్కువ. ఎందుకంటే ఆ ఆలయం ఇక్కడికి చాల దూరంలో ఉంది. (ఈ ప్రస్తావన హిందువులకు అతి ముఖ్యమైన ప్రదేశం కాశి. అక్కడు ఉన్న కాశీ విశ్వేశ్వరాలయం గురించి, గంగానది గురించి అన్నదని సుస్పష్టం)

గ్యాలరీ

[మార్చు]