Coordinates: 28°39′21″N 77°14′25″E / 28.65583°N 77.24028°E / 28.65583; 77.24028

ఎర్రకోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

28°39′21″N 77°14′25″E / 28.65583°N 77.24028°E / 28.65583; 77.24028

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఎర్రకోట - لال قلعہ
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
దస్త్రం:Charminar Ffacade.jpg
The Red Fort is a prominent fort in Delhi
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంii, iii, iv
మూలం231
యునెస్కో ప్రాంతంఆసియా , ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
శిలాశాసన చరిత్ర
శాసనాలు2007 (31st సమావేశం)
ఎఱ్ఱకోట వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

ఎర్రకోట మొఘల్ చక్రవర్తి షాజహాన్ 15వ శతాబ్దములో పాత ఢిల్లీ నగరంలో (ప్రస్తుతం ఢిల్లీ, ఇండియా) నిర్మించిన కోట. 1857 సంవత్సరములో మొఘల్ చక్రవర్తి బహాదుర్ షా జఫర్ బ్రిటీషువారి పాలన లోని భారత ప్రభుత్వంచే దేశబహిష్కరణకు గురయ్యే వరకు, ఢిల్లీ పట్టణం మొఘలులకు రాజధానిగా వ్యవహరించింది. బ్రిటీషువారు ఈ కోటను 1947 సంవత్సరములో భారతదేశం స్వాతంత్ర్యం పొందేవరకు, ఒక సైన్య శిబిరములాగ వాడారు. ఈ కోట ప్రస్తుతము ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలముగా ఉండటమే కాకుండా, భారతదేశం సార్వభౌమాధికారానికి ఒక శక్తిమంతమైన చిహ్నంగా ఉంది. ఇది యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2007లో గుర్తించబడింది.[1]

భారత ప్రధాన మంత్రి ఈ కోటలోని లాహోరి గేట్ ప్రాంగణము నుండి ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారత పతాకాన్ని ఎగురవేస్తారు. అలాగే జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఆనవాయతీ. అయితే సిక్కుల గురువు తేగ్ బహదూర్ 2022 ఏప్రిల్ 21న 400వ జయంతిని పురస్కరించుకుని మొదటిసారిగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.[2]

చరిత్ర[మార్చు]

ప్రాంతములో ఎర్రకోట యొక్క ఢిల్లీ గేట్
సిపాయిల తిరుగుబాటు అనంతరం, ఆక్రమిస్తున్న బ్రిటిష్ వాళ్ళు అనేక ముఘల్ కట్టడాలని పగలకొట్టి, వాళ్ళ యొక్క శిబిరాలని నిర్మించుకున్నారు

మొఘల్ చక్రవర్తి షాజహాను, ఈ బ్రహ్మాండమైన కోట నిర్మాణాన్ని 1639 మే 13 న ప్రారంభించాడు. 1648 ఏప్రిల్ 6 న నిర్మాణం పూర్తి అయింది. మొదట్లో ఎర్రకోటను ఖిలా-ఇ-ముబారక్ (దీవించబడ్డ కోట) అని పిలిచేవారు. ఎందుకంటే అది అప్పట్లో రాజుల కుటుంబానికి నివాస స్థలముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, సలీమ్‌గఢ్ కోటతో అనుసంధానంగా ఉండే విధముగా రూపొందించబడింది. ఈ రాజభవన కోట, పురాతనమైన షాజహానాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన కేంద్రముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, అందము , అలంకారము షాజహాన్ చక్రవర్తి పాలనలోని అధ్బుత మొఘల్ సృజనాత్మకతకు అద్దం పట్టింది. షాజహాన్ చక్రవర్తి నిర్మించిన తరువాత ఎర్రకోటలో అనేక కొత్త నిర్మాణాలు చేయబడ్డాయి. వీటిలో ముఖ్యమైన నిర్మాణ దశలు, ఔరంగజేబు తదితర మొఘల్ పాలకులు కాలంలో జరిగాయి. బ్రిటిష్ పాలన సమయములో 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య యుద్ధం తరువాత, ఎర్ర కోట స్థలములో ముఖ్యమైన భౌతిక మార్పులు జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత, ఎర్రకోట భవనాలకి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళ కాలములో ఈ కోటని ముఖ్యంగా ఒక సైనిక శిబిరముగా వాడారు. స్వాతంత్ర్యం తరువాత కూడా, 2003వ సంవత్సరము వరకు, కోటలో ఎక్కువ భాగం, భారత సైన్యం ఆధ్వర్యంలోనే ఉండేది.

ఎర్రకోట, మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క కొత్త రాజధాని అయిన షాజహానాబాదుకు రాజభవనముగా ఉండేది. షాజహానాబాద్, ఢిల్లీ ప్రాంతములో ఉన్న ఏడవ గొప్ప నగరం. ఆయన, తన పాలనకి గొప్ప గౌరవం కలిగించాలని , నిర్మాణ రంగములో తనకున్న ఉన్నత ఆశలకు , పధకాలకు అవకాశం కలిగించాలనే ఉద్దేశముతో తన రాజధానిని ఆగ్రా నుండి మార్చారు.

ఈ కోట యమునా నదిని ఆనుకొని ఉంది. ఈ నది నీరు కోట చుట్టూ త్రవ్వబడిన కందకాలకు చేరేది. కోటకి ఈశాన్యము మూలలో ఉన్న గోడ, 1546 సంవత్సరములో ఇస్లాం షా సూరి కట్టిన పాత రక్షణ కొటైన సలిమ్గార్ కోటకి ప్రక్కనే ఉంది.ఎర్ర కోట యొక్క నిర్మాణం 1638లో మొదలయి 1648లో ముగిసింది.

1783 మార్చి 11 నాడు సిక్కులు స్వల్పకాలము ఢిల్లీలో ఉన్న ఎర్ర కోటలోకి ప్రవేశించి, దివాన్-ఇ-ఆమ్‌ను ఆక్రమించారు. మొఘలు వజీరు తన సన్నిహితులయిన సిక్కులతో కలిసిపోయి నగరాన్ని వారికి అప్పగించారు. ఈ కార్యము కరోర్ సిన్ఘియా మిస్ల్కి చెందిన సర్దార్ బఘెల్ సింగ్ ధలివాల్ సేనాధిపత్యంలో జరిగింది.

భారత పతాకం ఢిల్లీ గేట్ నుండి ఎగురుతూ ఉంది

ఈ కోటలో నివసించిన ఆఖరి మొఘలు చక్రవర్తి బహదూర్ షా II "జఫర్". ఈ కోట మొఘల్ శక్తికి , దాని రక్షణ సామర్ధ్యానికి కేంద్రముగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా 1857 సంవత్సరములో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు, ఎర్రకోటకి రక్షణ కల్పించలేదు. 1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, 17 సెప్టెంబరు నాడు జఫర్ కోటని వదిలి వెళ్లాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళ ఖైదీగా ఎర్రకోటకు తిరిగి వచ్చాడు. జఫర్ మీద న్యాయ విచారణ 1858 జనవరి 27 న ప్రారంభమయింది. అక్టోబరు 7 న ఆయనను రాజ్యబహిష్కరణ చేశారు.

1947 ఆగస్టు, 15 న భారత్ స్వతంత్ర దేశంగా మారింది. ఈ సందర్భములో, భారత ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ పతాకాన్ని ఎగుర వేశాడు. స్వాతంత్ర్యదినోత్సవం రోజు, ప్రధాన మంత్రి దేశీయ పతాకాన్ని ఎగరవేసి ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఈనాటికీ కొనసాగుతూ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫై జరిగిన ప్రసిద్ధమైన విచారణ ఎర్రకోటలోనే జరిగింది.

వాస్తుశిల్ప రూపకల్పన[మార్చు]

View of the pavilions in the courtyard
View of the pavilions in the courtyard
నక్క్యర్ ఖానా

ఎర్రకోట అత్యుత్తమ స్థాయి కళా రూపానికి , అలంకారపు పనితీరుకి అద్దం పడుతుంది. ఈ కోటలో ప్రదర్శించబడిన కళారూపము ఐరోపా, పర్షియా , భారత దేశాలకి చెందిన కళల యొక్క సంయోగము. ఈ కలయిక రూపము, భావవ్యక్తికరణం , వర్ణములలో అత్యుత్తమంగా ఉండే షాజహాని శైలి అనే ఒక విలక్షణమైన అపూర్వమైన వాస్తుకళారూపం వికసించడానికి దారి తీసింది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట, భారతదేశములో ఉన్న ముఖ్యమైన భవన సముదాయాలలో ఒకటి. ఈ కోట భారతదేశపు చిరకాల చరిత్ర , కళలను తనలో ఇముడ్చుకున్నది. ఈ కోట యొక్క ప్రాముఖ్యత కాలానికి , అంతరానికి అతీతంగా నిలుస్తంది. ఈ కట్టడము భవననిర్మాణ కళయొక్క శక్తికి, మేధస్సుకు చిహ్నంగా నిలుస్తుంది. 1913లో ఈ కోటని ఒక దేశీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడముగా ప్రకటించక ముందు నుండే ఎర్రకోటని భావితరాల వారికోసం కాపాడి నిక్షేపించడానికి ప్రయత్నాలు చేయబడ్డాయి.

కోట యొక్క గోడలు నున్నగా అలంకరించబడి, పై బాగాములో భారీగా తీగల అలంకారాలు కలిగి ఉన్నాయి. కోటకి రెండు ముఖ్యమైన ముఖద్వారాలు ఉన్నాయి. అవి ఢిల్లీ దర్వాజా , లాహోర్ దర్వాజ. లాహోర్ దర్వాజానే ప్రధాన ప్రవేశము; ఈ ద్వారం చట్టా చౌక్ అనే ఒక పొడుగైన కప్పబడిన బజార్ వీధికి దారి తీస్తుంది. ఈ వీధి గోడలకు ఆనుకుని దుకాణాల కోసం అంగడులు నిర్మించారు. చట్టా చౌక్ తరువాత ఒక విశాలమైన ఖాళి స్థలం ఉంటుంది. ఆ తరువాత, పెద్ద ఉత్తర-దక్షిణ వీధి వస్తుంది. ఈ వీధి పూర్వం కోటని సైన్య కార్యకలాపాలు పడమర వైపున, రాజభవనాలు తూర్పు వైపున ఉండే విధముగా రెండుగా విభజించేది. ఈ వీధి యొక్క దక్షిణము వైపు చివరలో ఢిల్లీ ద్వారం ఉంటుంది.

కోట లోపల ఉన్న ముఖ్యమైన భవనాలు[మార్చు]

దివాన్-ఇ-ఆమ్[మార్చు]

దివాన్-ఎ-ఆమ్

ఈ ద్వారం అవతల మరింత పెద్ద ఖాళి స్థలం ఒకటి ఉంది. ఈ స్థలం పూర్వం దివాన్-ఇ-ఆమ్ యొక్క దర్బారుగా వాడబడింది. ఈ పెద్ద ప్రాంగాణంలోనే సామాన్య ప్రజలకు రాజు దర్శనం ఇచ్చేవారు. ఇక్కడ చక్రవర్తి కోసం, (ఝారోఖ) అనే బాగా అలంకరించబడిన సింహాసన మేడ ఉంది. స్తంభాలకు బంగారము రంగు వేయబడింది. ఒక బంగారం , వెండి కంచె సింహాసనాన్ని ప్రజల నుండి వేరుచేస్తుంది.

దివాన్-ఇ-ఖాస్[మార్చు]

దివాన్-ఐ-ఖాస్

దివాన్-ఇ-ఖాస్, పూర్తిగా పాలరాయితో చేయబడిన ఒక మంటపము. ఇక్కడ స్తంభాలలో పూల చిత్రాలు చెక్కబడి విలువైన రాళ్ళతో అలంకరించబడి ఉంటాయి.

నహర్-ఇ-బెహిష్త్[మార్చు]

రాజుల అంతరంగ భవనాలు సింహాసనానికి వెనుక ఉంటాయి. కోట యొక్క తూర్పు అంచున, యమునా నదిని చూస్తూ ఉండే విధముగా, ఒక ఎత్తైన వేదిక మీద వరుసగా మంటపాలు ఉన్నాయి. ఈ మంటపాలు అన్నిటిని నహర్-ఎ-బెహిష్త్ (స్వర్గం యొక్క ప్రవాహము) అని పిలవబడే ఒక నిరంతర నీటి కాలువ కలుపుతుంది. ఈ కాలువ ప్రతి మంటపము మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. కోట యొక్క ఈశాన్యము మూలలో ఉన్న షా బుర్జ్ అనే స్తంభముఫై నుండి ఈ కాలువకి యమునా నది నీళ్ళు చేదబడతాయి. రాజభవనము ఖురాన్లో వర్ణించబడే స్వర్గాన్ని పోలి ఉన్నట్టు ఉంటుంది; రాజభవనంలో తరుచూ చెక్కబడిన రెండు వాక్యాలు ఏమనగా, "భూమి మీద స్వర్గం కనగ ఉంటె, అది ఇక్కడే ఉంది, అది ఇక్కడ ఉంది". ఈ రాజభవనము యొక్క ప్రణాళిక, ఇస్లాం యొక్క నమూనాలు మీద ఆధారబడి ఉన్నాయి. అయితే ప్రతి మంటప నిర్మాణంలో, ఇతర మొఘల్ భవనాలలో మాదిరిగా హైందవ ప్రభావం ఉంటుంది. ఎర్రకోట యొక్క రాజభవన సముదాయం, మొఘలుల శైలికి ఒక ఉత్తమ ఉదాహరణగా చెప్పబడుతుంది.

జేనానా[మార్చు]

రంగ మహల్

దక్షిణ మూలలో ఉన్న రెండు మంటపాలు, జనానాలు (స్త్రీల నివాసము) : ముంతాజ్ మహల్ (ప్రస్తుతం ఒక మ్యూజియం) , పెద్ద విశాలమైన రంగ్ మహల్. ఈ రంగ్ మహల్ యొక్క బంగార పూతతో అందముగా అలంకరించబడిన లోకప్పు , నహర్-ఇ-బెహిష్త్ నుండి నీరు వచ్చే పాలరాయి జలాశయము చాల ప్రసిద్ధి చెందినవి.

మోతి మస్జిద్[మార్చు]

మోతి మస్జిద్

హమాం యొక్క పడమర దిశలో ముత్యాల మసీదు అయిన మోతి మస్జిద్ ఉంది. ఈ మసీదు తరువాత కాలములో కట్టబడింది. షాజహాన్ యొక్క వారుసుడైన ఔరంగజేబ్ కోసం అంతరంగ మసీదులాగ 1659లో నిర్మంచబడింది. ఇది తెల్ల పాలరాయితో నిర్మించబడి మూడు కలశాలు కలిగి ఉన్న ఒక చిన్న మసీదు. ఈ మసీదులో మూడు వంపుల తెర ఉండి, అది క్రింది ఆవరణ వరకు వస్తుంది.

హయాత్ బఖ్ష్ బాగ్[మార్చు]

ఉత్తర దిశలో హయత్ బక్ష్ష్ బాగ్ (జీవితం ఇచ్చే ఉద్యానవనం) అనే ఒక పెద్ద ఉద్యానవనం ఉంది. రెండు నీళ్ళ కాలవలు ఈ ఉద్యానవనమునకు మధ్యగా ప్రవహిస్తాయి. ఉత్తర-దక్షిణ కాలువ యొక్క రెండు చివర్లలో మంటపాలు ఉన్నాయి. ఆఖరి చక్రవర్తైన బహాదుర్ షా జఫర్ 1842 సంవత్సరములో కట్టించిన మూడవ మంటపము కాలువలు కలియటం ద్వారా ఏర్పడిన జలాశయము యొక్క మధ్య భాగములో నిర్మితమైవుంది.

కోట ఈనాడు[మార్చు]

రాత్రిలో ఎర్రకోట

పాత ఢిల్లీలో ఉన్న ఎక్కువ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఎర్రకోట ఒకటి. ఈ కోట ప్రతి ఏడాది వేలాది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోట నుండే భారతదేశం బ్రిటీషు వారి నుండి స్వాతంత్ర్యం పొందిన రోజైన ఆగస్టు 15వ తారీఖున, భారత ప్రధాన మంత్రి, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదే పాత ఢిల్లీలోని అతి పెద్ద చారిత్రాత్మిక నిర్మాణము.

ఒక కాలములో, 3000 మంది కంటే ఎక్కువ జనము ఢిల్లీ కోట సముదాయము లోపల నివసించేవారు. కాని 1857 సంవత్సరములోని సిపాయిల తిరుగుబాటు అనంతరం, బ్రిటన్ ఈ కోటని కైవసం చేసుకొని, నివాస రాజభవనాలని నాశనం చేసింది. ఈ కోట బ్రిటిష్ ఇండియన్ సైన్యం యొక్క కేంద్ర స్థావరముగా మార్చబడింది. తిరుగుబాటు జరిగిన వెనువెంటనే బహదూర్ షా జఫర్ మీద ఎర్రకోటలో విచారణ జరిపించారు. ఇక్కడే 1945 నవంబరులో, ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన ముగ్గురు అధికారుల మీద, ప్రసిద్ధి చెందిన సైన్య విచారణ జరిగింది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారత సైన్యం, ఈ కోటని తన కైవసం చేసుకుంది. 2003 డిసెంబరులో భారత సైన్యం, ఈ కోటని భారత పర్యాటక అధికారులకు స్వాధీనం చేసింది.

ప్రస్తుతం మొఘల్ చరిత్రని వివరించే ఒక ధ్వని , కాంతి ప్రదర్శన సాయంత్రం జరిగుతుంది. ఇది పర్యాటకులని ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యమైన వాస్తుశిల్ప కళారూపాల యొక్క పరిస్థితి మిశ్రమంగా ఉంది. విస్తరించి ఉన్న నీటి వనరులలో వేటిలోనూ నీరు లేదు. కొన్ని కట్టడాలు ఒక మోస్తరుగా మంచి పరిస్థితిలోనే ఉన్నాయి. వాటి అలంకరణలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. మరి కొన్నిట్లో పాలరాతి పూల చెక్కుడులని జులాయిలు , దోపిడీదార్లు తీసివేశారు. తేనీరు భవనము చారిత్రాత్మిక పరిస్థితిలో లేనప్పటికీ, ప్రస్తుతం ఇది ఒక పనిచేస్తున్న ఫలహారశాల వలె ఉంది. మసీదు , హమాం ప్రజల దర్శనానికి మూసివేయబడినా, గాజు కిటికీల ద్వారా కాని పాలరాతి జాలకం ద్వారా కాని లోపలకు తొంగి చూడవచ్చు. నడక దారులు అన్ని నాశనమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ప్రజా మరుగుగదులు ఉద్యానవనానికి ప్రవేశద్వారము వద్దను లోపల కూడా ఉన్నాయి. అయితే కొన్ని అపరిశుభ్రంగా అనారోగ్యకరంగా ఉన్నాయి.

లాహోర్ ద్వారము నుండి ఆభరణాలు, చేతిపనికారుల తయారు చేసిన వస్తువుల చిల్లర విక్రయము చేసే ఒక దుకాణ సముదాయం వస్తుంది. "రక్తపు చిత్రాలని" ప్రదర్శించే ఒక మ్యూజియుం ఉంది. దీంట్లో 20వ శతాబ్దానికి చెందిన ప్రాణత్యాగం చేసిన భారతీయ యువకుల చిత్రాలు, వాళ్ళ త్యాగానికి సంబంధించిన వివరాలు ప్రదర్శించారు. భవన నిర్మాణ కళకి సంబంధించిన మ్యూజియుం , భారత యుద్ధ స్మారక చిహ్నాల మ్యూజియం ఉన్నాయి.

కోటపై ఉగ్రవాదుల దాడి[మార్చు]

2000 డిసెంబరులో, లష్కర్-ఎ-తోయిబా అనే ఉగ్రవాద సంస్థ ఎర్రకోటపై దాడి చేసింది.అప్పుడు ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు హతులయ్యారు. ఇది భారత్-పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ గురించి జరుగుతున్నశాంతి ప్రక్రియని నిరోధించే ప్రయత్నమని కొన్ని వార్తా ప్రసార సంస్థలు వర్ణించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

వెలుపటి వలయము[మార్చు]

{{{1}}} గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

సూచనలు[మార్చు]

  1. "Red Fort Complex". World Heritage List. UNESCO World Heritage Centre. Retrieved November 15, 2009.
  2. "మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం". ETV Bharat News. Retrieved 2022-04-18.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎర్రకోట&oldid=3966975" నుండి వెలికితీశారు