చౌడమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చౌడమ్మ
దేవనాగరి: चामुण्डा
తెలుగు: చాముండేశ్వరి
Affiliation: శక్తి దేవి
నివాసం: నందవరం
ఆయుధం: త్రిశూలం, ఖడ్గం, భిండివాల, చక్రం, పాశం,
వాహనం: సింహం లేదా పులి

చౌడమ్మ లేక చౌడేశ్వరి రాయలసీమలో తొగుట వీర క్షత్రియ లనుబడువారిచే కొలువబడుచున్న శక్తి. చండి, చాముండి, చౌడేశ్వరి, త్రిపురసుందరి, భగళాముఖి, చాముండేశ్వరి అను పేర్లతో పిలవబడుచున్నది.

చౌడమ్మ పుట్టుక

[మార్చు]

రాక్షసులను సంహరించుటకై ఆదిశక్తి యోగమాయచే విష్ణవంశమున మహిషాసురునకు కుమార్తెగా జన్మించినది. పితృగండమున ఉద్బవించుటచే ఆమెఒక శిలామందసమున బంధించి భూస్థాపితము చేసిరి. శివుడు త్రిపురాసుర సంహారముచేయగా రాక్షసులు విజృంభించి శివుని చీకాకుపరచిరి. ఆయుద్ధమున మిక్కిలి అలసిపోయిన శివుడు, ఆదిశక్తి భూస్థాపితము చేయబడిన ప్రదేశమునకు వచ్చి తన నుదుటి చమటను వ్రేలితో నూడ్చి అచట విదిపెను.అప్పుడామె చమటబిందువులచే శిలామందసము బ్రద్దలై అందుండి ఘోరభీకరరూపంబున శ్రీ వీర చౌడేశ్వరి ఉద్భవించెను. శివుడామెను రాక్షస సంహారిణి యగుదన పుత్రికగా నెరంగి, ఆమెకు ఖడ్గ డమరుక భిండివాల చక్ర త్రిశూల పాశంబు మొదలుగా గల ఆయుధముల నొసంగి, ఆశీర్వదించెను.

తొగటవీరుల జననము

[మార్చు]

ఆటనుండి వీరచౌడేశ్వరి తనకొరకు తపస్సు చేయుచున్న పుష్పాండజుని కడకువచ్చి ఆతనికి ప్రత్యక్షమయ్యెను.అతడు పుత్రులను వేడగా ఒక అగ్నిగుండమును నిర్మించి, అందు వేయుమని కొన్ని అక్షత లిచ్చెను. అవి వేయగా మున్నూట అరువది యేకాంగవీరులు ఉద్భవించిరి. వీరే తొగటవీరులు. చౌడేశ్వరి ఆవీరులను దనవెంట తీసుకొని రాక్షసులపై దండెత్తి, యంధకార మహిషాసురులను సంహరించి, దేవతల బాధలను బాపెను.అటుపై ఆవీరులకు దేవకన్యలనిచ్చి వివాహమొనర్చెను.అటుపై ఆమె వారి కులదేవతగా ఉండె వారిని ఆచంద్ర తారార్కము రక్షింతునని వరమొసగి కాశీపురంబునకు జేరెను.

చౌడమ్మ రాయలసీమకు వచ్చుట

[మార్చు]

కాశీక్షేత్రమున వెలసియున్న ఈ చౌడేశ్వరి రాయలసీమకు వచ్చుటకు చక్కటి కథ ఉంది. దీనిని పెదభూపతి పాట అందురు. కాశీలోని బ్రాహ్మణులచే చౌడేశ్వరి కర్నూలు మండలములోని నందవరము నకు గొనితేవబడినది. ఆనందవరమును పాలించురాజు దానిని ఆకాశీబ్రాహ్మణులకు దానముచేసెను. అప్పటినుండియు ఆబ్రాహ్మణులు నందవరీక బ్రాహ్మణులైరి. ఈ కధను రాయలసీమ గ్రామ వృద్ధులీవిధముగా వివరింతురు.

భూలోకమున పుణ్యక్షేత్రమగు అహోబిలము క్షేత్రమునకు, శ్రీశైలము కు ఆదర్శమై వెలయు మహానంది క్షేత్రమునకు సమీపమున నందివరము పట్టణంబును చంద్రవంశీయులగు నందివర్ధనుడును, అతని పుత్రుండగు నుత్తుంగభుజుండును రాజ్యపాలన మొనర్చిరి. వీరిలో నుత్తుంగభుజుండు సంతానము లేక అనేక పుణ్యక్షేత్రములు సేవించి ఆ దేవతల అనుగ్రహము వలన ఒక పుత్రుడు బడసెను. అతడే నందభూపాలుడు. అతడు పెరిగి వీరప్రతాపవంతుడై నందపట్టణంబునకు రాజై రాజ్యపాలన చేసెను. ఇట్లుండగా ఒకనడొక సిద్ధుడు నందభూపాలుని ధర్మపాలంబుని మెచ్చి యోగాతీతమహాత్మ్యముగల పావుకోళ్ళను బహూకరించెను. దాని మహిమతో తన కులదేవతయైన కాశీనాధుని నిత్యారాధనజేయ, వేకువజామున ఎవ్వరికీ తెలియకుండా పాదుకల మహిమచే కాశీపురముజేరి గంగానదిలో స్నానమాడి, విశ్వేశ్వరుని సేవించి, తెల్లవారునంతలో మరల నందవరము జేరి యధాప్రకారము రాజ్యపాలన చేయుచుండెను. కాని ఆతని భార్యకు మాత్రము తన భర్త వేకువజామున కలబడకుండ ఉండుట యెంతయో యోచించెను. ఒకదినము భర్త లేచిన సమయమున చూచి ఆతనిని యెంతయో ప్రార్ధించి ఆమెకూడా కాశీకి పోయెను. ఆ దినము వారిరువురు స్నానమాడి విశ్వేశ్వరుని దర్సనము ముగిసినాక తిరుగు ప్రయాణమునకు సన్నద్దము అవుచుండ, ఆమె బహిష్ఠు అయినది. పాదుకలు పని చేయుట మాని వేసెను. ఇప్పుడు రాజ్యమునకు తిరిగి పోవుట ఎటులనో అని యోచించుచుండెను. ఇంతలో శ్రీ చౌడేశ్వరి ఆరాధనాతత్పరులైన బ్రాహ్మణులు ఆచటికేతెంచి ఆతని భార్యకు చౌడేశ్వరిని సాక్షిగా నుంచి సునందను పవిత్రురాలిగా చెసి తిరిగి పాదుకల సహాయముతో రాజ్యమునకు పంపగా వారికి రాజు అర్ధ రాజ్యమును బహూకరించెను.

జాతరల గురించి

[మార్చు]
పూజారి భోషాణమును కాపలాకాయు చిల్లరవేల్పుల సేవజేసి
గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున ద్రేచు కరకు సత్తులకు జాతరలు సల్పి
ఏటేట పెండ్లి జేయించుకొం చుదయించు కృతకరాముల పల్లకీలు మోసి
నిలువుదోపిడి చేసి తలకాయ గొరిగించు ఏడుకొండలవాని మేడలెక్కి
అంబుధీశుని కళ్యాణులని తలంచి ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి
పాతకము వోలె నా వెన్ను వాయకున్న గోచితో నిల్చియున్నాడ పేచకంబ

—గుఱ్ఱము జాషువా గబ్బిలం

చౌడమ్మ జాతర

[మార్చు]

రాయలసీమలో ఈచౌడమ్మ ప్రధానాలయము నేటికిని నందవరములో (నంద్యాల దగ్గరలో) ప్రతి 10సం.కు కార్తీకమాసమున చౌడమ్మ జాతర బ్రహ్మాండముగా జరుగును.ఈ జాతరలో తొగటవీరులు చౌడమ్మ పాటలు పాడుచు, నెత్తిపై జ్యోతులను పెట్టుకొని వీరావేశమున నృత్యము చేయుదురు.అగ్నికుండమున నడిచెదరు. రాయలసీమలో జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకుని నృత్యం చేస్తూ చౌడమ్మ దేవతను ఆరాధిస్తారు. దీన్నే జ్యోతి నృత్యమని, జ్యోతుల బోనాలని పిలుస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే జరిపే ఈ నృత్యంలో కంచుతో చేసిన తాళాలకి సాయంగా చేతులతో చప్పట్లు కొడుతూ పాటకు తగ్గట్టుగా తాళగతిని మారుస్తుంటారు. ఒకరు జ్యోతిని ఎత్తుకుని నట్టనడుమ నిలబడి పాటకనుగుణంగా, చుట్టూ వృత్తాకారంగా నిలబడి ఉన్నవారంతా అడుగులు మారుస్తూ తిరుగుతారు. * పార్వతీ పుత్రుని పరమేశ్వరుని సూడ

  • ఎలుక వాహనమెక్కి వెళ్లే తన వేడ్క
  • అమరంగ బెనకయ్యను ఆత్మలో తలచేరు

సంతోషమున కల్గు సకల జనులకును అంటూ ఈ చౌడమ్మ జాతరని గణపతి ప్రార్థనతోనే ప్రారంభిస్తారు.[1]

జ్యోతి నృత్యం,కులపరమైన జానపద కళారూపం. రాయలసీమలో,తొగట వంశస్థులు భక్తితో తయారు చేసిన జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకుని చౌడేశ్వరీదేవిని వర్ణించే పాటల కనుగుణంగా చేసే నృత్యం జ్యోతి నృత్యం.ఈ నృత్యాన్ని, పల్లెల్లో జ్యోతుల బోనాలు అని అంటారు. ఈ నృత్యాని ఏడాదికి ఒక సారి మాత్రమే కుల వృత్తి పరంగా చేస్తుంటారు. నేసే కులస్థులంతా ఏకమై నృత్యం చేస్తూ తృణమో పణమో వసూలు చేస్తారు. (తొగట వంశస్థులే, నేసే కులస్థులు. ఈ నృత్యానికి కంచు తో చేసిన తాళాలు, తేతులు చప్పట్లు వుంటాయి. వీటి కనుగుణంగా పాట ననుసరించి తాళ గతిని మార్పు చేస్తూ వుంటారు. పాటలన్నీ శివుని పైనా, చౌడమ్మ పైనా వుంటాయి. ఇది వ్యష్టి నృత్యం. కానీ సామూహికంగా పాటలు పాడుతుంటే ఒక వ్యక్తి జ్యోతి నృత్యం చేస్తుంటాడు. చౌడమ్మ కదిలి వచ్చిందన్న పాటలోని దృశ్యం బిరబిర సాగుతుంది. అడుగులు వేగంగా వేయడం, గుండ్రంగా తిరగడం జరుగుతుంది.

కదిలె చౌడమ్మయత తొడను గాభీర్య నాదములతో
గొడుగులు పడిగెలు గోరా శంఖాలు యింతట్ సిద్దులు యిరుజడలు
రంగులునే మగరాడు చౌడమ రానువు కదలెను,
రమ్యముతొ ఎప్పుడు మనకు యిచ్చిన వరములు ఏకొదువాలేదు.
తప్పక కొలువుండి దారుని లోపుల దైవంబనలే చౌడమ్మ ఎప్పుడు మనకు

మూలములు

[మార్చు]
  • 1972 భారతి మాస పత్రిక. వ్యాసము:రాయలసీమ జానపద సంస్కృతి చౌడమ్మ పాటలు.

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు వెలుగు వ్యాసం". Archived from the original on 2020-10-01. Retrieved 2020-07-10.
"https://te.wikipedia.org/w/index.php?title=చౌడమ్మ&oldid=4306317" నుండి వెలికితీశారు