జనవాహిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనవాహిని
కృతికర్త: బీరేంద్ర కుమార్ భట్టాచార్య
అసలు పేరు (తెలుగులో లేకపోతే): యారుఇంగం
అనువాదకులు: అమరేంద్ర (చతుర్వేదుల నరసింహశాస్త్రి)
దేశం: భారతదేశం
భాష: తెలుగు(మూలం:అస్సామీ)
ప్రక్రియ: నవల
ప్రచురణ: సాహిత్య అకాడమీ
విడుదల: అనువాదం: 1987
మూలం: 1960
ఆంగ్ల ప్రచురణ: 1983
పేజీలు: 291
బీరేంద్ర కుమార్ భట్టాచార్య

జనవాహిని పుస్తకం ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, అస్సామీ సాహిత్యవేత్త బీరేంద్ర కుమార్ భట్టాచార్య రచించిన నవలకు తెలుగు అనువాదం. మూలగ్రంథం యారుఇంగం అస్సామీ భాషలో వెలువడి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొంది, భారతీయ సాహిత్యంలోని క్లాసిక్స్ లో ఒకటిగా గుర్తింపు సాధించిన విశిష్ట నవల.

రచన నేపథ్యం[మార్చు]

బీరేంద్ర కుమార్ భట్టాచార్య రచించిన అస్సామీ నవల యారుఇంగం ఈ నవలకు మాతృక. యారుఇంగంను ప్రముఖ అస్సామీ సాహిత్యవేత్త బీరేంద్ర కుమార్ భట్టాచార్య 1960లో రచించారు. మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రూల్ ప్రాంతంలో వెంచర్ క్రిస్టియన్ హైస్కూలులో బీరేంద్ర కుమార్ 1950-60 దశాబ్ది చివరి సంవత్సరాల్లో పనిచేశారు. ఆ సమయంలో ఉఖ్రూల్ ప్రాంతంలోని తంఖూల్ నాగజాతి తెగ ప్రజలను రచయిత దగ్గరగా పరిశీలించారు. వారి చిత్తవృత్తులు, సంప్రదాయ జీవన విధానం, 1940ల నుంచి వివిధ రాజకీయ కల్లోలాల వల్ల వారి జీవితంలో వచ్చిన బాధలు, రెండవ ప్రపంచ యుద్ధంలో వారి దెబ్బతిన్న మానసిక వృత్తులు వంటివి పరిశీలించి ఈ నవలను రచించారు.[1]
యారుఇంగం నవలను అమరేంద్రగా ప్రఖ్యాతులైన చతుర్వేదుల నరసింహశాస్త్రి తెలుగులోకి జనవాహిని శీర్షికన అనువదించారు. ఈ గ్రంథాన్ని సాహిత్య అకాడమీ సంస్థ 1987 నుంచీ ప్రచురిస్తోంది.

రచయిత గురించి[మార్చు]

ప్రధాన వ్యాసం: బీరేంద్ర కుమార్ భట్టాచార్య
బీరేంద్ర కుమార్ భట్టాచార్య అస్సామీ భాషలో సాహిత్యసృజన సాగించిన ప్రముఖ సాహిత్యవేత్త. అస్సామీ సాహిత్యరంగానికి తొలి జ్ఞానపీఠ్ పురస్కారం సంపాదించిపెట్టిన సాహిత్యవేత్తగా ఆయన చరిత్రకెక్కారు. సాహిత్య అకాడమీ పురస్కారం, జ్ఞానపీఠ్ పురస్కారం వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ, అస్సాం సాహిత్య సభలకు అధ్యక్ష పదవి వంటి హోదాలు పొందారు.[2] ఆయన రచించిన యారుఇంగం, మృత్యంజయ వంటి నవలలు అస్సామీ భాషలోనే కాక భారతీయ సాహిత్యంలో క్లాసిక్ గా గుర్తింపు పొంది[3], బహు భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.

ఇతివృత్తం[మార్చు]

మణిపూర్ రాష్ట్రంలో ఉఖ్రూర్ ప్రాంతానికి చెందిన నాగజాతి వారి చరిత్రను హృదయం కదిలించే విధంగా ఈ నవల ఇతివృత్తంగా మలిచారు. రెండవ ప్రపంచయుద్ధంలో భాగంగా ఈశాన్యరాష్ట్రాల్లో జరిగిన జపాన్-బ్రిటన్ సేనల సంకుల సమరం, భారత స్వాతంత్ర్యానంతరం ఈశాన్యరాష్ట్రాల్లో విభజనవాదం రేకెత్తించిన ఫిజో ఉద్యమం వంటి వాటి ఫలితంగా ఆ ప్రాంత నాగాజాతివారి జీవితంలో ఏర్పడ్డ సంఘర్షణలను కథాంశంగా స్వీకరించి యారుఇంగం (జనవాహిని మూలరచన) రచించారు బీరేంద్ర.[4]

ప్రాచుర్యం[మార్చు]

జనవాహిని మూలరచన యారుఇంగం రచనకు గాను బీరేంద్ర కుమార్ భట్టాచార్య భారతీయ సాహిత్యంలో అత్యున్నత పురస్కారంగా పరిగణించే సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. యారుఇంగం 18భారతీయ భాషల్లోకి అనువాదమై భారతీయ సాహిత్యంలో మాస్టర్ పీస్ స్థాయిని పొందింది.

మూలాలు[మార్చు]

  1. జనవాహిని నవలలో ప్రచురించిన బీరేంద్రకుమార్ భట్టాచార్య ఉపోద్ఘాతం(తెలుగు అనువాదం)
  2. "బీరేంద్ర కుమార్ భట్టాచార్య జీవన సంగ్రహం". Archived from the original on 2014-03-06. Retrieved 2014-02-23.
  3. జార్జ్.కె.ఎం.(1997), మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ (వాల్యూం I). నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా పేజీ.19
  4. జనవాహిని:మూ.బీరేంద్ర కుమార్ భట్టాచార్య, అ.అమరేంద్ర:సాహిత్య అకాడమీ ప్రచురణ
"https://te.wikipedia.org/w/index.php?title=జనవాహిని&oldid=3326302" నుండి వెలికితీశారు