జమునా కృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమునా కృష్ణన్
జననం (1943-03-12) 1943 మార్చి 12 (వయసు 81)
మరణం2016 మే 15(2016-05-15) (వయసు 73)
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరతనాట్యం
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు

జమునా కృష్ణన్ భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు.

విశేషాలు

[మార్చు]

ఈమె 1943, మార్చి 12వ తేదీన ఢిల్లీలో ఒక కళాకారుల కుటుంబంలో జన్మించింది.[1] ఈమె తల్లి కర్ణాటక సంగీతంలో గాత్రవిద్వాంసురాలు. ఆమెకు వీణావాదనలో కూడా ప్రవేశం ఉంది. ఈమె ఢిల్లీలోని త్రివేణి కళాసంఘానికి చెందిన కె.జె.గోవిందరాజన్ వద్ద తంజావూరు బాణీలో భరతనాట్యాన్ని మూడు దశాబ్దాలపాటు అభ్యసించింది. తరువాత అభినయాన్ని చెన్నైలోని కళానిధి నారాయణన్ వద్ద నేర్చుకుంది. ఎస్.గోపాలకృష్ణన్ వద్ద ఈమె కర్ణాటక సంగీతాన్ని కూడా అభ్యసించింది. ఈమె ఆర్థికశాస్త్రంలో స్నాతకోత్తర పట్టాను పొంది ఢిల్లీలోని ఇంద్రప్రస్థ మహిళా కళాశాలలో 25 సంవత్సరాల పాటు ఆర్థిక శాస్త్రాన్ని బోధించింది.

ఈమె భరతనాట్య కళాకారిణిగా, గురువుగా, నృత్య దర్శకురాలిగా పేరు సంపాదించింది. ఈమె భక్తి కవిత్వంపై ఎక్కువగా దృష్టి పెట్టి వాటికి నృత్యరూపాన్ని కల్పించింది. ఈమె ఉత్తరభారతదేశపు భక్తికవిత్వాన్ని ముఖ్యంగా 14వ శతాబ్దానికి చెందిన విద్యాపతి కవిత్వానికి భరతనాట్యంలో వర్ణాల రూపంలో ఆకృతిని కల్పించింది. తరువాత ఈమె సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, కబీర్‌ల కవిత్వాన్ని అధ్యయనం చేసి వాటిని కూడా నృత్యరూపంలో ప్రదర్శించింది. ఈమె తమిళ భాషలోని ఆళ్వారుల దివ్యప్రబంధాలను, మాణిక్య వాచకర్ తిరువాచకాన్ని, తిరుక్కురల్‌ను, సుబ్రహ్మణ్యభారతి రచనలను అధ్యయనం చేసి వాటికి కూడా భరతనాట్యంలో కొరియోగ్రఫీలను సృష్టించింది. ఈమె ఢిల్లీలో "కళాంగన్" అనే నృత్యపాఠశాలను ప్రారంభించి అందులో దేశ, విదేశీ శిష్యులకు భరతనాట్యంలో తర్ఫీదునిచ్చింది. ఈమె విదేశాలలో అనేక వర్క్‌షాపులను నిర్వహించింది.

ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో 2003లో సాహిత్య కళాపరిషత్, ఢిల్లీ వారి పరిషత్ సమ్మాన్, 2013లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి సంగీత నాటక అకాడమీ అవార్డు మొదలైనవి ఉన్నాయి.[2]

ఈమె 2016, మే 15వ తేదీన మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. web master. "Jamuna Krishnan". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 7 మే 2021. Retrieved 6 May 2021.
  2. Ranee Kumar (16 May 2019). "Jamuna Krishnan: A path-breaker". The Hindu. Retrieved 6 May 2021.