Jump to content

జయహే కృష్ణావతారా (పాట)

వికీపీడియా నుండి
(జయహే కృష్ణావతారా నుండి దారిమార్పు చెందింది)

జయహే కృష్ణావతారా పాటను శ్రీకృష్ణావతారం (1967) చిత్రం కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల, సరోజిని, స్వర్ణలత లతో కలిసి మధురంగా గానం చేయగా టి.వి.రాజు సంగీతాన్ని అందించారు.

జయహే కృష్ణావతారా అనే ఈ పాటను రాసిన సముద్రాల రాఘవాచార్య చిత్రం

జయహే కృష్ణావతారా !

నంద యశోద పుణ్యావతార ! | | జయహే | |

పాపుల నడచీ - సాధుల బ్రోవగ

వ్రేపల్లె వెలసిన - గోపకిశోరా ! | | జయహే | |

ఎన్నో జన్మల పున్నెము పండీ

నిన్ను కంటిరా చిన్నారి తండ్రి !

కన్నతల్లి నీ కడుపెరుగదు నా

చన్నుగుడువ కనుమూసెదు రారా !

విష పూతన ప్రాణాపహారీ

శకటాసు సంహారీ ! శౌరీ ! | | జయహే | |

కాపురమ్ము సేయలేమమ్మా - రేపల్లెలోన

ఓ యశోదా ! ఈ పాపమెందూ చూడలేదమ్మా !

పాలు వెన్న మనగనీడు

పడుచు నొంటిగ చనగనీడు

కలిమి ఉంటే కట్టి కుడుతురు

కన్న సుతు నిటు విడుతురా !

కాపురమ్ము సేయలేమమ్మా !

జయహే కృష్ణావతారా !

నందకుమారా ! నవనీత చోరా | | జయహే | |

కాళింగ మడుగున, కాళీయు పడగల

కాలుని ధిమి ధిమి నాట్యముచేసి

సర్పాధీశుని దర్పము నణచిన

తాండవ నాట్యవినోదా ! | | జయహే | |

కాళీయ మణిగణ రంజిత చరణా !

జయహే కృష్ణావతారా !

తనువులపై అభిమానము వీడినగాని

తరుణులారా ! ననుజేర తరముగాదులే

సిగ్గువదలి యిరుచేతులు జోడించండి

చెల్లింతును మనసుదీర మీ కోరికలా

జయహే కృష్ణావతారా !

గోపకుమారీ ! వస్త్రాపహారా ! | | జయహే | |

బాలు డితడనీ - శైలము

చాల బరువనీ

మీ భయము వదలుకొండీ

నా అండను చేరగరండీ

ఈ కేలల్లాడదు నమ్మండీ

గోవర్ధన గిరిధారి !

సురనాయక గర్వాపహారీ ! | | జయహే | |

కృష్ణా !

రాధా మానసచోరా !

నీ మధు మురళీ గానమునా

నా మనమూ బృందావనమూ

నిలువున పూచీ - నీ పద పూజకు

పిలిచేనోయీ ! రావోయీ !

సేవలు చేకొన - రావోయీ ! | | జయహే | |

వివరణ

[మార్చు]

ఈ పాట శ్రీకృష్ణుని లీలలలో జననంతో మొదలౌతుంది. పూతన, శకటాసురుల్ని వధించడంతో మొదలైన రాక్షస సంహారం కంసని వధతో అంతమౌతుంది. రెండవ చరణంలో గోపకాంతలు శ్రీకృష్ణుని ఆగడాలను తల్లి యశోదతో మొరపెట్టుకోవడం, కాళీయ మర్ధనం, గోపికల చీరలను దొంగిలించడం మొదలైన విశేషాలలో కొన్ని తత్వాలను పొందుపరిచారు. తర్వాత గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి దేవేంద్రుని గర్వాన్ని అణచడంతో తన అండతో ఎలాంటి కష్టాలనైనా తీర్చుతానని నిరూపిస్తాడు. చివరగా గోపస్త్రీలతో బృందావనంలో మురళీకృష్ణుడిగా అలరించడంతో ముగిస్తారు.

బయటి లింకులు

[మార్చు]