జయ విజయులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయంలో ద్వారపాలకులు విగ్రహాలుగా చెక్కియున్న జయ విజయుల విగ్రహాలు.

జయ విజయులు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణంలో ఉంది.[1][2]

ఒక సారి బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకంలో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు.

దాంతో వారిరువురూ వెళ్ళి శ్రీ మహా విష్ణువుకు సంగతి నివేదిస్తారు. సర్వాంతర్యామినైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ వారి నిర్ణయాన్ని తప్పు పడతాడు. తరువాత తానే స్వయంగా వెళ్ళి తీసుకు వస్తాడు. ఆ మహర్షులు అందుకు అమితానందం పొందుతారు. వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో ఆయనకే వదిలి వేస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు.

అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు.

దాని ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కలియుగంలో వారికి శాపవిమోచనం కలిగింది. కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులుగా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. Bhattacharji, Sukumari (1998). Legends of Devi. Orient Blackswan. p. 16.
  2. Gregor Maehle (2012). Ashtanga Yoga The Intermediate Series: Mythology, Anatomy, and Practice. New World Library. p. 34.