Jump to content

జవహర్ సొరంగం

వికీపీడియా నుండి
జవహర్ సొరంగం
జవహర్ సొరంగం రోడ్డు
అవలోకనం
అక్షాంశ,రేఖాంశాలు33°30′29″N 75°12′32″E / 33.508°N 75.209°E / 33.508; 75.209
స్థితిActive
మార్గముC2 ఎన్‌హెచ్ 44
బనిహాల్ ---- ఖాజిగుండ్
మొదలుబనిహాల్
చివరఖాజిగుండ్
నిర్వహణ వివరాలు
ప్రారంభ తేదీ1954
నిర్మాణంసి, బరేసెల్ ఎ.జి & ఎ.కుంజ్ అండ్ కో
ప్రారంభం22 డిసెంబరు 1956 (1956-12-22)
ట్రాఫిక్మోటారు వాహన యోగ్యం
టోల్లేదు
1 రోజులో వాహనాలు7000
సాంకేతిక వివరాలు
పొడవు2.85 కి.మీ. (1.77 మై.)
సందుల సం.2
అత్యధిక ఎత్తు2,194 మీటర్లు (7,198 అ.)[1]

జవహర్ సొరంగం సముద్ర మట్టం నుండి 2,194 మీ. (7,198 అ.) ఎత్తున ఉన్న రహదారి సొరంగం. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో దిగువ హిమాలయాల్లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణిలోని బనిహాల్ కనుమ క్రింద దీన్ని నిర్మించారు. దీన్ని బనిహాల్ సొరంగం అని కూడా పిలుస్తారు. దీనికి భారత మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పేరు పెట్టారు. 1954 - 1956 మధ్య నిర్మించిన ఈ సొరంగం, 1956 డిసెంబరు 22 నుండి పని చేస్తోంది. సొరంగం పొడవు 2.85 కి.మీ. ఇరువైపులా ఒక్కొక్క వరుస రహదారి ఉండే రెండు సమాంతర గొట్టాలు ఉన్నాయి. ఇది NH 1A పై బనిహాల్, ఖాజిగుండ్‌ల మధ్య ఉంది. ఈ రహదారి పేరును ఇపుడు NH 44 అని మార్చారు.[2] ఈ సొరంగం నిర్మాణంతో శ్రీనగర్, జమ్మూల మధ్య ఏడాది పొడవునా రోడ్డు రవాణా సౌకర్యం ఏర్పడింది. 

చరిత్ర

[మార్చు]

1947 అక్టోబరులో పాకిస్తాన్ రైడర్లు కాశ్మీర్ లోయను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, జమ్మూ నుండి బనిహాల్ కనుమ మీదుగా శ్రీనగర్ వరకు ఉన్న 300 కిలోమీటర్ల రహదారి మట్టిబాటగా ఉండేది. లోయలోకి భారత సైనికులను తీసుకువెళ్ళడానికి అనువుగా లేదు. మొదటి భారత దళాలను శ్రీనగర్‌కు విమానంలో తరలించాల్సి వచ్చింది. 1947 తర్వాత రహదారి మెరుగుపరచారు. అయితే శీతాకాలంలో మంచుతో కనుమ మూసుకుపోయేది. కనుమ క్రింద సొరంగం అవసరం పడింది.

సొరంగం 1954, 1960 మధ్య జర్మనీకి చెందిన ఆల్ఫ్రెడ్ కుంజ్, సి. బార్సెల్ లు నిర్మించారు [3] ఇది ఒక్కో దిశలో రోజుకు 150 వాహనాలు ప్రయాణించేలా రూపొందించారు. అయితే యాభై సంవత్సరాల కాలంలో ఈ సొరంగం గుండా ప్రయాణించే వాహనాల సంఖ్య రెండు దిశలలో 7,000 కు పెరిగింది.

దానికి 24 గంటలూ మిలటరీ కాపలా ఉంటుంది. సొరంగం లోపల లేదా సమీపంలో ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ కచ్చితంగా నిషేధించారు.[4] వాహనం సొరంగంలోకి ప్రవేశించిన తర్వాత, సొరంగం అంతటా ఒకే వేగంతో వెళ్ళాలి. నిరంతర పర్యవేక్షణ కోసం సొరంగంలో సీసీటీవీలను ఏర్పాటు చేశారు.

1997లో BEACON ప్రాజెక్ట్ కింద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ సొరంగాన్ని పునరుద్ధరించింది. 2009 వరకు, సొరంగం అర్ధరాత్రి నుండి ఉదయం 08:00 వరకు పౌర ట్రాఫిక్ వెళ్ళకుండా కోసం మూసి ఉంచేవారు. ప్రస్తుతం ఇది 24 గంటలూ తెరిచి ఉంటుంది.

తక్కువ ఎత్తులో కొత్త సొరంగం

[మార్చు]

సొరంగానికి చేరుకునే రోడ్లు కుంభకోణాలకు గురవుతాయి. తక్కువ ఎత్తులో మరో సొరంగం నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. సముద్రమట్టం నుండి 1,790 మీ. (5,870 అ.) ఎత్తున కొత్త 8.5 కి.మీ. ల పొడవుండే సొరంగాన్ని 2011-2019 మధ్య నిర్మించారు. ఒక్కో దిశలో రెండు లేన్ల రహదారి ఉండే రెండు గొట్టాలతో ఉన్న ఈ సొరంగం, జవహర్ సొరంగం కంటే 400 మీటర్ల తక్కువ ఎత్తున ఉంది. దీన్ని 2021 లో ప్రారంభించారు. దీనితో జమ్మూ శ్రీనగర్‌ దూరం 16 కి.మీ. తగ్గింది. చాలా వాహనాలు ఇప్పుడు ఈ కొత్త బనిహాల్ ఖాజిగుండ్ రహదారి సొరంగాన్ని ఉపయోగిస్తున్నాయి. జవహర్ సొరంగం గుండా రాకపోకలు తగ్గాయి.

ప్రస్తుత స్థితి

[మార్చు]

కొత్త సొరంగంలోకి ఇంధనం నింపే ట్యాంకర్లు, గ్యాస్ సిలిండర్లు, ఇతర పేలుడు పదార్థాలను తీసుకువెళ్లే ట్రక్కులను అనుమతించరు. అవి జవహర్ సొరంగం గుండానే వెళ్ళాలి. సమీప గ్రామాలు, పట్టణాల నుండి కొన్ని వాహనాలు కూడా జవహర్ సొరంగాన్నే ఉపయోగిస్తాయి.

1997 లో చేసిన పునరుద్ధరణలో భాగంగా, సొరంగంలో రెండు దిశల వెంటిలేషన్ వ్యవస్థ, కాలుష్య, ఉష్నోగ్రత సెన్సార్లు, లైటింగ్ వ్యవస్థ, ఏదైనా సహాయం కోసం అత్యవసర ఫోన్‌లు ఏర్పాటు చేసారు. 2021లో, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ సొరంగాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించి, రూ 80 కోట్లకు టెండరు విడుదల చేసింది. కానీ కాంట్రాక్టు సంస్థ ఆ పని చేయడంలో విఫలమైంది. సొరంగం వెంటిలేషను, ఇతర వ్యవస్థలను పునరుద్ధరించడానికి, ఉన్నతీకరించడానికీ, సొరంగం అందాన్ని మెరుగుపరచడానికి, దానిని పర్యాటక కేంద్రంగా ప్రచారం చేయడానికి 2023 మధ్యలో మళ్ళీ తాజాగా టెండర్ పిలిచారు.[5]

జవహర్ సొరంగం గుండా వెళ్ళే ట్రాఫిక్ త్గ్గడం, దాదాపుగా లేఖపోవడం, వలన స్థానిక ప్రజలపై చాలా ప్రతికూల ప్రభావం కలిగింది. జవహర్ సొరంగానికి ఇరువైపులా దుకాణాలు, కియోస్క్‌ల ద్వారా జీవనోపాధి పొందుతున్న వందలాది మంది నిరుద్యోగులుగా మారారు. దిగువ ముండా కాశ్మీర్ నుండి బనిహాల్‌లోని షైతానీ నల్లా, చకూర్ నల్లా, నౌగామ్, తేథార్, చీరెల్ వరకు ఉన్న ప్రజలు జవహర్ సొరంగం సుందరీకరణ, పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడం ద్వారా జీవనోపాధిని కల్పించే ప్రాజెక్ట్‌పై తమ ఆశలన్నీ పెట్టుకున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Jawhar Tunnel".
  2. pahalgam.com/travelogue-road-travel-from-punjab-to-pahalgam/
  3. SPK Singh (1 September 2012). "Beacon Light in the Tunnel". mod.nic.in. Archived from the original on 1 September 2012.
  4. "Beacon Light in the Tunnel". Archived from the original on 2012-09-01. Retrieved 2011-10-03.
  5. Taskeen, Muhammad (2023-03-27). "Beacon authorities shelve project, cancel tender after 6 months of work". Greater Kashmir (in ఇంగ్లీష్). Retrieved 2023-04-12.