Jump to content

జాంపల్లె

వికీపీడియా నుండి

జాంపల్లె, జోగులాంబ గద్వాల జిల్లా, ధరూర్ మండలానికి చెందిన గ్రామం. ధరూర్ గ్రామానికి అతి సమీప పల్లె. ఈ గ్రామ పంచాయతీలోనే ఒకప్పుడు జాంపల్లె భాగంగా ఉండేది. ప్రస్తుతం పంచాయతీగా ఏర్పడింది.

ఉనికి

[మార్చు]

జాంపల్లె గ్రామానికి తూర్పున రెవెన్యూ గ్రామమైన ధరూర్, పడమర కోతులగిద్ద గ్రామం, ఉత్తర దిక్కున మన్నాపూర్, దక్షిణాన మార్లబీడు గ్రామం ఉన్నాయి.

ఊరు పేరు-నేపథ్యం

[మార్చు]

పూర్వం ధరూర్ గ్రామానికి చెందిన కొంతమంది జంగమ వంశస్థులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వారి పేరు మీదుగా ఈ గ్రామానికి జంగమపల్లె అని పేరు వచ్చింది, జంగమపల్లె కాలక్రమేనా జాంపల్లెగా మారినది.

గ్రామ రాజకీయాలు

[మార్చు]

మొదట్లో ఈ గ్రామం ధరూర్ గ్రామ పంచాయతీలో అంతర్భాగంగా ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడినది. అప్పటి పంచాయతీ రాజ్ శాఖా మంత్రి డి.కె. సమరసింహారెడ్డి చొరవతో గ్రామానికి ప్రత్యేక పంచాయతీ హోదా దక్కింది. 1995లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో పాలెం సుజాత గ్రామ మొదటి సర్పంచుగా ఎన్నికయినది. తరువాత 2001లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో చింతరేవుల శ్రీరాములు గ్రామ రెండవ సర్పంచుగా ఎన్నికయ్యాడు. 2006లో వెంకటరామిరెడ్డి సర్పంచుగా ఎన్నిక కాగా, 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో పాలెం చిన్నారెడ్డి సర్పంచుగా ఎన్నికయ్యాడు[1].

విద్యాలయాలు

[మార్చు]

గ్రామంలో 1977 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. పాఠశాల భవన నిర్మాణానికి రాజోలి వంశస్థులైన రైతులు స్థలాన్ని దానం చేశారు. ఇక్కడ ఐదవ తరగతి దాకా చదువుకునే అవకాశం ఉంది. ఉన్నత పాఠశాల విద్య కొరకు అత్యంత సమీపంలోని ధరూర్ ఉన్నత పాఠశాలకు వెళ్తుంటారు. 2007లో అంగన్‌వాడి కేంద్రం కూడా ఏర్పాటు చేశారు.

సవారమ్మ జాతర

[మార్చు]

ఈ గ్రామ ప్రజలు మూడు సంవత్సరాలకొక సారి సవారమ్మ జాతర చేస్తుంటారు. ఈ జాతర జాంపల్లె సమీప గ్రామమైన పార్చర్లలో జరుగుతుంది. ఈ సవారమ్మ దేవత పుట్టినిల్లు జాంపల్లెగా భావించి, తమ ఆడపిల్ల జాతరగా వీరు పార్చర్లకు పోయి జాతర చేసుకొని వస్తుంటారు. జాతర రోజుల్లో సవారమ్మ పార్చర్ల పొలిమేరల్లో తమ పుట్టినూరు వారు వస్తున్నారా? లేదా? అని ఎదురుచూస్తూ ఉంటుందని వీరి నమ్మకం.

మూలాలు

[మార్చు]
  1. గ్రామాధికారుల నుండి సేకరించిన విశ్వసనీయ సమాచారం
"https://te.wikipedia.org/w/index.php?title=జాంపల్లె&oldid=4107505" నుండి వెలికితీశారు