డి.కె.సమర సింహారెడ్డి
ధర్మవరపు కొట్టం సమరసింహారెడ్డి | |||
![]() ధర్మవరపు కొట్టం సమరసింహారెడ్డి | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ఆగస్టు 04,1945 ధర్మవరం, ఇటిక్యాల మండలం, మహబూబ్ నగర్ జిల్లా | ||
నివాసం | హైదరాబాదు, భారతదేశం | ||
మతం | హిందూ |
ధర్మవరపు కొట్టం సమరసింహారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పలు కీలక శాఖల మంత్రిగా పనిచేసాడు. హైకోర్టు న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి, రాజకీయాలలో ప్రవేశించాడు. ఒకనాడు ఇతని తండ్రి డి.కె.సత్యారెడ్డి, నేడు తమ్ముడు డి.కె. భరతసింహారెడ్డిలు కూడా రాజకీయనాయకులే. శాసనసభ మాజీ సభ్యులే. మరదలు డి.కె.అరుణ ప్రస్తుత గద్వాల నియోజక వర్గ శాసనసభ్యురాలు. ఈమె మాజి మంత్రివర్యురాలు కూడా. వీరందరు ప్రాతినిధ్యం వహించింది గద్వాల నియోజకవర్గం నుండే.
బాల్యం[మార్చు]
డి.కె.సత్యారెడ్డి కుమారుడైన సమరసింహారెడ్డి 04.08.1945లో అలంపూర్ నియోజక పరిధిలోని ఇటిక్యాల మండలంలోని ధర్మవరం గ్రామంలో జన్మించాడు[1].
విద్యాభ్యాసం[మార్చు]
రాయచూరులోని సేంట్ మేరీ కాన్వెంట్ స్కూలులో ప్రాథమిక విద్యను, గద్వాలలోని ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని బద్రుకా కాళాశాల నుండి బాచిలర్ డిగ్రీని, ఉస్మానియా న్యాయ కళాశాల నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీని పొందాడు.
న్యాయవాదిగా[మార్చు]
1966లో ప్రసిద్ధ న్యాయవాది ఏరాసు అయ్యపురెడ్డి దగ్గర జూనియర్ లాయర్‌గా న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. రెండు సార్లు హైకోర్ట్ న్యాయవాదుల సంఘ కార్య నిర్వాహక సభ్యులుగా, కార్యదర్శిగా పనిచేశాడు.
చలనచిత్ర పరిశ్రమ సేవలో[మార్చు]
1980-83 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ అధ్యక్షుడుగా పనిచేశాడు. 1983-87 మధ్య కాలంలో నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ సంస్థ డైరెక్టర్‌గా పనిచేశాడు.
రాజకీయ జీవితం[మార్చు]
1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. 1980లో తండ్రి మరణానంతరం, రాజకీయాలలోకి అడుగుపెట్టాడు. తండ్రి మరణంతో కాలీ అయిన గద్వాల నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసి, గెలిచాడు. అది మొదలుకొని 1983, 1985, 1989 ఎన్నికలలోనూ వరుసగా భారత జాతీయ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, విజయాలు సాధించాడు. శాసన సభ్యులుగా ఉన్న కాలంలో ప్రజా పద్దుల కమిటీ, ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. కాంగ్రేస్ ప్రభుత్వ హయామంలో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గాలలో రెవిన్యూ, వ్యవసాయ, పంచాయతీ రాజ్, న్యాయ శాఖల వంటి పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. రోశయ్యతో సమ ఉజ్జిగా నిలిచాడు. అప్పటి కాంగ్రేస్ అసమ్మతి నాయకుడిగా ముద్రపడ్డ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రాభవం పెరిగాక, సమరసింహారెడ్డి రాజకీయంగా తెరమరుగయ్యాడు. క్రమంగా కాంగ్రేస్ పార్టీకి దూరమయ్యాడు. 1994 ఎన్నికలలో సొంత తమ్ముడు డి.కె.భరతసింహారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 1999ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి, టిడిపి అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓటమి పాలయ్యాడు. 2004 ఎన్నికలలో మరదలు డి.కె.అరుణ సమాజ్ వాది పార్టీ నుండి పోటీ చేసి, గెలవడానికి కృషి చేశాడు. తరువాత తమ్ముడు, మరదలుతో రాజకీయంగా పొసగక మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డితో జతకట్టాడు. మేనల్లుడుతో కలిసి గద్వాలలో నగర సుధార్ సమితిని స్థాపించాడు. గద్వాల పట్టణ మున్సిపాలిటి ఎన్నికలలో తన అభ్యర్థులను నిలబెట్టి పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకుంటున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నుండి బయటకు వచ్చిన టైగర్ నరేంద్రతో కలిసి తెలంగాణ సాధన సమితిని స్థాపించాడు. అది ఆ తరువాత తెలంగాణ రాస్ట్ర సమితిలో విలీనం చేశారు. కొంత కాలం తర్వాత బి.జె.పి. లోనూ ఉన్నాడు. అక్కడా కుదురుకోలేక పోయాడు. ఇటీవల (2014) జరిగిన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. గద్వాల నియోజక వర్గంలో పాదయాత్ర చేబట్టి ప్రతి పల్లెను సందర్శించాడు. అయినా ఆఖరి నిమిషంలో పొత్తులో భాగంగా గద్వాలను టి.డి.పి. బి.జె.పి.కి కేటాయించడంతో నిరాశకు గురైన సమర సింహారెడ్డి రాజకీయలకు దూరం జరిగాడు.
అతని రాజకీయ జీవిత పతనానికి అతని అహమే కారణమని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కొందరు చెవులు కొర్కున్నా, మంచి వాగ్ధాటి కలిగిన నేతగా, మేధావిగా, అవినీతి మచ్చ అంటని నేతగా గద్వాల నియోజక వర్గంలోనే కాకా అలంపూర్ నియోజక వర్గంలో సైతం పేరుండటం విశేషం.
మూలాలు[మార్చు]
- ↑ మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి, మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట -675