Jump to content

జి.వి. జగ్గారావు వేధశాల

వికీపీడియా నుండి
1882 లో వీనస్ ట్రాన్సిట్ పరిశీలన సందర్భంగా వేధశాల వద్ద తీసిన ఫొటో

జి.వి. జగ్గారావు వేధశాల, విశాఖపట్నంలో 1840 లో స్థాపించిన ఖగోళ వేధశాల. జమీందారు గోడే వెంకట జగ్గారావు తన స్వంత ఖర్చులతో ఈ వేధశాలను స్థాపించాడు. ఈ వేధశాలలో 4.8 అంగుళాల ఎపర్చరు గల టెలిస్కోపు ఉండేది. ఇది వేధశాలగానే కాక, వాతావరణ పరిశీలన కేంద్రంగా కూడా పనిచేసేది. అనేక సంవత్సరాల పాటు పనిచేసిన ఈ వేధశాల యాజమాన్యం, జగ్గారావు వారసుల నుండి మద్రాసు ప్రభుత్వానికి, మళ్ళీ గోడే వారసుల చేతికీ మారింది. 19 వ శతాబ్దం చివరి వరకు చురుగ్గా పనిచేసిన ఈ వేధశాల, 20 వశతాబ్దపు తొలినాళ్ళలో మూతపడింది.[1]

వేధశాల స్థానం

[మార్చు]

జి.వి. జగ్గారావు వేధశాలను, జమీందారు గోడే వెంకట జగ్గారావు విశాఖపట్నం లోని డాబా గార్డెన్స్‌లో 1840 లో తన స్వంత ఖర్చులతో తన ఇంటిలోనే స్థాపించాడు. ఈ డాబా ఇంటి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి డాబా గార్డెన్స్ అనే పేరు వచ్చింది. దీని భౌగోళిక నిర్దేశాంకాలు 17°42'09'' ఉత్తర అక్షాంశం, 83°22'30'' E తూర్పు రేఖాంశం అనీ, దీనిలోని బరోమీటరు సముద్రమట్టం నుండి 30 అడుగుల ఎత్తున ఉందనీ 1894 సంవత్సరపు వేధశాల నివేదికలో పేర్కొన్నారు.[2] అయితే ఆధునిక జీపీయెస్ ప్రకారం ఈ బిందువు తీరం నుండి సముద్రంలో సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాటికీ నేటికీ జిపిఎస్ లెక్కింపు ఖచ్చితత్వంలో వచ్చిన తేడా కారణంగా ఈ లోపం వచ్చిందనీ, వేధశాల స్థానం నేటి డాల్ఫిన్ హోటల్ అనీ భావిస్తున్నారు.[3]

చరిత్ర, పరిశీలనలు

[మార్చు]

జమీందారు గోడే వెంకట జగ్గారావు స్వయంగా ఖగోళవేత్త, అబ్సర్వేషనల్ ఏస్ట్రానమర్. మద్రాసు ప్రభుత్వ వేధశాలలో ఖగోళ శాస్త్ర పరిశీలనల్లో పనిచేసాడు. అక్కడినుండి విశాఖ తిరిగివచ్చి ఈ వేధశాల స్థాపించాడు. అందులో ఒక ట్రాన్సిట్ పరికరాన్ని స్థాపించాడు.[4] దానితో పాటు తాను స్వయంగా కనిపెట్టిన రెయిన్ గేజిని ఈ వేధశాలలో నెలకొల్పాడు. డాల్ఫిన్స్ నోస్‌పై ఫ్లాగ్‌స్టాఫ్‌ను కూడా స్థాపించాడు. ప్రతిరోజు ఉదయం సరిగ్గా 9 గంటలకు ఫ్లాగ్‌స్టాఫ్‌పై జెండాను కిందికి పడవేసేవారు.[2] దీనితో విశాఖ ప్రజలకు సమయం తెలిసేది. వేధశాల కోసం 4.8 అంగుళాల టెలిస్కోపు కోసం ఆర్డరు వేసాడు గానీ అది వచ్చేలోపే ఆయన మరణించాడు.

1856 లో జగ్గారావు మరణించాక ఈ వేధశాల అతని కుమార్తె అంకితం అచ్చయ్యమ్మ, అల్లుడు అంకితం వెంకట నరసింగరావుల అధీనం లోకి వెళ్లింది. నరసింగరావు కూడా ఖగోళ వేత్త. బ్రిటిషు ప్రభుత్వంలో చేస్తున్న డిప్యూటీ కలెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసి వేధశాల అభివృద్ధిపై దృష్టి పెట్టాడు. వేధశాలకు అనుబంధంగా ఒక వర్కుషాపును స్థాపించాడు. వేధశాలలో 4.8 అంగుళాల టెలిస్కోపును అమర్చాడు. 1868 ఆగస్టులో వచ్చిన సూర్యగ్రహణం సందర్భంగా ఒక పత్రాన్ని అతను ప్రచురించాడు. దీనితో పాటు 1871, 1872, 1882 లలో వచ్చిన సూర్యగ్రహణాలను కూడా పరిశీలించాడు. ఈ వేధశాలలో నరసింగరావు 1868, 1882, 1891 లలో వివిధ గ్రహాలు సూర్యుని నేపథ్యంలో ట్రాన్సిట్ అయినపుడు పరిశీలనలు చేసాడు.[1]

నరసింగరావు ఈ వేధశాలలో 6 అంగుళాల ఎపర్చరు, 7.5 అడుగుల నాభ్యంతరం గల టెలిస్కోపును అమర్చాడు. వేధశాలకు 12 అడుగుల వ్యాసం, 9 అడుగుల ఎత్తూ ఉన్న ఒక డోమ్‌ను ఏర్పాటు చేసాడు. 1870 లో వచ్చిన పెను తుఫానులో గాలులు గంటకు 100 మైళ్ళ వేగంతో వీచాయని ఈ కేంద్రం చెప్పింది. 1876 అక్టోబరు 7,8 తేదీల్లో వచ్చిన పెను తుఫానులో డోమ్‌పై ఉన్న రేకుల కప్పు ఎగిరిపోయింది.[5] డాల్ఫిన్స్ నోస్‌పై ఉన్న టైమ్‌గన్‌ను 1871 లో మోగించడం ఆపేసారు (సమయాన్ని సూచించేందుకు గాను, ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు దాన్ని మోగించేవారు). నరసింగరావిఉ తన స్వంత ఖర్చులతో దాన్ని తిరిగి పనిచేయించే ఏర్పాటు చేసాడు. అలాగే అక్కడ తన మామ జగ్గారావు స్థాపించిన ఫ్లాగ్‌స్టాఫ్ స్థానంలో కొత్తదాన్ని స్థాపించాడు. ప్రతిరోజూ వేధశాల నుండి వాతావరణ సూచనలు వెలువరించేవారు. ఖగోళాన్ని ఫొటోలు తీసేందుకు అవసరమైన పరికరాలు తెప్పించాడు కాని వాటిని స్థాపించే లోపే మరణించాడు.

1892 లో నరసింగరావు మరణించాక, అతని భార్య అచ్చయ్యమ్మ కొన్నాళ్ళు వేధశాలను నిర్వహించింది. అయితే ఈ సమయంలో ఖగోళ పరిశీలనలేమీ జరగలేదు.[2] భర్త చేపట్టిన సెలెస్టియల్ ఫొటోగ్రాఫిక్ టెలిస్కోపు స్థాపనను ఆమె ముగించింది. వేధశాలకు 3 లక్షల రూపాయల నిధులు సమకూర్చి ట్రస్టీల ఆధ్వర్యంలో నడిపేందుకు 1894 నవంబరు 8 న దాన్ని మద్రాసు ప్రభుత్వానికి ఇచ్చేసింది.[2][6]

ఆ తరువాత జమీందారీ పాలన, అచ్చయ్యమ్మ కుమారుడు అంకితం వెంకట జగ్గారావు చేతికి వచ్చింది. తండ్రి, తాతల లాగానే అతను కూడా ఖగోళ శాస్త్రం చదువుకున్నాడు. అతను మద్రాసు ప్రభుత్వం నుండి వేధశాలను తిరిగి తన అధీనం లోకి తెచ్చుకున్నాడు. వేధశాలలో అతను ఒక అయస్కాంత అబ్సర్వేటరీని, సీస్మిక్ అబ్సర్వేటరీని స్థాపించాడు.[1]

తదనంతర కాలంలో ఈ వేధశాల మూతబడి పూర్తిగా కనుమరుగై పోయింది. ప్రస్తుతం ఈ వేధశాల స్థానం లోనే ప్రస్తుత డాల్ఫిన్ హోటల్ ఉంది.[3]

వేధశాల లోని పరికరాలు

[మార్చు]

ప్రభుత్వం చేతికి వెళ్ళాక, వేధశాల లోని కొన్ని పరికరాలను తీసివేసి కొత్త పరికరాలను అమర్చారు. 1897 నాటికి వేధశాలలో కింది పరికరాలు ఉండేవి.[7]

  1. ఫోర్టిన్ బరోమీటర్లు - 2
  2. డ్రై బల్బ్ హైగ్రోమీటర్ - 1
  3. వెట్ బల్బ్ హైగ్రోమీటర్ - 1
  4. డ్రై మినిమం థెర్మోమీటరు - 1
  5. వెట్ మినిమం థెర్మోమీటరు - 1
  6. మ్యాగ్జిమం థెర్మోమీటరు - 1
  7. సన్ మ్యాగ్జిమం థెర్మోమీటరు - 1
  8. గ్రాస్ మినిమం థెర్మోమీటరు - 1
  9. రెయిన్ గేజి - 1
  10. సన్‌షైన్ రికార్డర్ - 1
  11. రిచర్డ్ ఫ్రేర్స్ సింగిల్ డే బరోగ్రాఫ్ - 1
  12. రిచర్డ్ ఫ్రేర్స్ సింగిల్ డే థెర్మోగ్రాఫ్ (డ్రై & వెట్) - 1
  13. రాబిన్‌సన్ యానిమోమీటర్ - 1

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 ఎన్., కామేశ్వరరావు; ఎ., వాగీశ్వరి; బిర్డీ, క్రిస్టినా. "Early pioneers of telescopic astronomy in India: G. V. Juggarow and his observatory" (PDF). Archived from the original (PDF) on 2023-06-18. Retrieved 2023-06-18.
  2. 2.0 2.1 2.2 2.3 W. A. Bion. Notes on the meteorology of Vizagapatam, Part 1 (in English). Harvard University. Baptist Mission Press, 1899. p. 3.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  3. 3.0 3.1 Vizag, Team Yo! (2022-05-04). "Riddle of the Jagga Rao Observatory in Vizag". Vizag (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-08-20. Retrieved 2023-12-07.
  4. The Rev. Isaac Vale Mummery (in English). Oxford University Press (OUP). 1893-02-10.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  5. Francis W. (1907). Madras District Gazetteers Vizagapatam Vol-i. p. 154.
  6. Francis W. (1907). Madras District Gazetteers Vizagapatam Vol-i. p. 332.
  7. General Committee G V Juggaraw Observatory (1899). Report On The Condition And Progress Of G V Juggaraw Observatory Vizagapatam. p. 14.