Jump to content

టపోరీ

వికీపీడియా నుండి

టపోరి అనేది ఒక హిందీ పదము. ఆవారా అని దీని అర్థము. ఈ పదము ఎక్కువగా ముంబైలోని వీధి రౌడీలను సూచించడానికి వాడబడినది. ఈ టపోరీలు మాట్లాడే హిందీని టపోరీ భాష అంటారు. వారి వస్త్రధారణను టపోరీ శైలి అని పిలుస్తారు. ఈ టపోరి సంస్కృతిని చాలా మంది అసహ్యించుకున్నప్పటికీ, ఇంకా చాలా మంది సరదాగా అనుకరిస్తుంటారు. "రంగీలా", "గోల్ మాల్", "చశ్మే బద్దూర్" వంటి బాలీవుడ్ చిత్రాలతో, ఈ సంస్కృతి ఆ పరిశ్రమలో ప్రాచూర్యము పొందింది. [1] హాలీవుడ్ చిత్రాల్లోని ముఠా రౌడీల (గ్యాంగ్‌స్టర్ (gangster (en))) పాత్రల మాదిరిగా హిందీ చిత్రాల్లో వీరి పాత్రలు ఉండేవి.

భాషా విశేషాలు

[మార్చు]

టపోరీ అనేది నిజానికి ఒక మరాఠీ పదము. దీని అసలు అర్థము 'వికసించినది', 'పక్వానికి వచ్చినదీ', 'వయసుకు వచ్చినది', 'కోడెది' అని. క్రమంగా ఉడుకు రక్తముతో, ఒక రకమైన జంతు ప్రవృత్తితో దాదాగిరీలూ, గొడవలూ చేస్తూ, అమ్మాయిల వెంట పడుతూ ఇతర చెడు అలవాట్లు కల నవయువకులను సూచించడానికి దీన్ని వాడటము మొదలైనది. తెలుగులో దీని సమానార్థకము 'అచ్చోసిన ఆఁబోతు'.

నాటి హిందీ చిత్ర పరిశ్రమ మహారాష్ట్రాలో ఉండడముతో, ఈ పదము హిందీలోకి వచ్చింది. హిందీలో ఈ హీనమైన అర్థము కొంచెము తగ్గి, రాటుదేలి, దూకుడుగా ఉంటూ, జీవితములో ఇంకా స్థిరపడని, ఆవారాగా తిరిగే, ఒక రకమైన ఆకర్షణీయమైన నాటుదనము కల పేద/దిగువ మధ్యతరగతి కుర్రాడు అనే అర్థము సంతరించుకుంది.

టపోరీ సంస్కృతి

[మార్చు]

టపోరీ భాష

[మార్చు]

వీరు మాట్లాడే మరాఠీని టపోరీ భాష అనేవారు. ఈ టపోరీ భాషలో వాడే మరాఠీ పదాలు గౌరవనీయులు, సంస్కారవంతులూ వాడని, ఒకరకముగా అభ్యంతరకరమైన పదాలు. ఈ పదాలూ, ఇంకా స్థానిక భాషల్లోని ఇతర పదాలూ కూడా బొంబాయి హిందీలోకి వచ్చాయి.

వీరు మాట్లాడే హిందీ ముంబైలోని ప్రజలు మాట్లాడే అనేక భాషల మిశ్రమం. ఇది ఎక్కువగా మరాఠీ పదాలనూ, కొంత వరకు గుజరాతీ పదాలను కలిగి ఉంది. తరువాతి క్రమములో టపోరీల హిందీ, బొంబాయి హిందీలో భాగమైంది.

టపోరీ ఆహర్యము

[మార్చు]

వీరు బన్యన్ లేదా టీ-షర్టు వేసుకుని, పైన చొక్కా, కింద ప్యాంటూ (ఎక్కువగా జీన్సు) వేసుకుంటారు. లోపలి షర్టు కనబడేలా చొక్కా బొత్తాలు పూర్తిగా వదిలేస్తుంటారు. మెడలో చిన్న తుండు కట్టుకుంటుంటారు. చొక్కా రెండు సగాలను కింది భాగములో ముడి వేయవచ్చు. ఇలా ముడివేసుకున్నప్పుడు, ప్యాంటుకు బదులు లుంగీ వేసుకున్నట్లు కూడా కొన్నిసార్లు చలనచిత్రాలూ, ఇతరాత్రా వినోద మూధ్యమాల్లో చూపబడింది. కొన్నిసార్లు లేత రంగు చౌకబారు చొక్కాలను పై బొత్తాలు వదిలేసి, కిందవి వేసుకుని టక్ చేసుకునే ఆహర్యము కూడా వీరికి ఆపాదించబడుతుంది.

సామాజిక కారణాలు

[మార్చు]

1990ల్లో భారతదేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులు, విద్యావంతులైన దిగువ మధ్యతరగతి యువకులలో నిరుద్యోగానికి దారితీశాయి. [2] దానితో వీరు టపోరీలు అవ్వడము ఎక్కువైంది. 1990లు, 2000లలో భారతీయ చిత్రాల్లో టపోరీ పోకడ ఎక్కువవడము బయటి సమాజములో వారి సంఖ్య పెరగడాన్ని ప్రతిబింబిస్తుంది.[1]

కళలూ, వినోద మాధ్యమాల్లో టపోరీలు

[మార్చు]

తాడూ, బొంగరము లేని ఈ టపోరీలను నాటి ముంబాయి నేర సంస్థలు తమ కిరాయి పనులకు వాడుకునేవి. దీని వలన ముంబాయిలో ఉన్న నాటి హిందీ పరిశ్రమ చిత్రాల్లో ముఠా రౌడీల పాత్రలకు టపోరీ పోకడలు ఇచ్చేవారు. క్రమంగా టపోరీ పాత్రలు నాయకులుగా చలనచిత్రాలు రాసాగాయి. నాటి హాలివుడ్‌లో గ్యాంగ్‌స్టర్ పాత్రలకు స్థానిక ప్రత్యామ్నాయాలుగా ఈ టపోరీలను బాలీవుడ్‌లో వాడేవారు.

ముంబాయ్ న్వార్ (Mumbai Noir)[గమనిక 1] చిత్రాలు పెరగడముతో చిత్రాల్లో టపోరీ పాత్రలూ పెరిగాయి.

అబ్బాయిలను చూపించినంత ఎక్కువగా కాకపోయినా అమ్మాయి పాత్రను నాటుగా చూపించేందుకు వారిని టపోరి ఆహర్యములో చిత్రించడము కూడా జరిగింది. ఇదిగాక, ప్యాంటు బదులు షార్ట్స్ వేసుకుని, బన్యన్ బదులు క్రాప్ టాప్ వేసుకుని, టపోరీ తరహాలో బొత్తాలు వదిలేసి చొక్కాని కింద ముడివేసుకునే అహర్యాన్ని అమ్మాయిలను ఆకర్షణీయంగా చూపించేందుకు కొన్ని చిత్రాల్లో వాడారు. ఈ ఆహర్యములో చొక్కా ముడి టపోరీ తరహాలో పొట్ట కిందకు కాకుండా, ఛాతీకి కిందా, పొట్టకు పైనా ఉంటుంది.

తెలుగు చిత్రాల్లో టపోరీలు

[మార్చు]

తెలుగువారైన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ చిత్రాల్లో ఈ టపోరీ తరహా పాత్రలు ఎక్కువగా కనిపించేవి.

పనిగట్టుకుని టపోరీ శైలి అనుకరించనప్పటికీ, నాటి ప్రభావము వలన నేటి చిత్రాల్లోని రౌడీల ఆహర్యములో ఆ ఛాయలు కనిపిస్తుంటాయి. ఈ మధ్యకాలములో మహేశ్ బాబు టపోరీగా ప్రధాన పాత్రలో నటించిన 'పోకిరి' చిత్రానికి చాలా ఆదరణ దక్కింది. ఇది హిందీలోకి టపోరీ వాంటెడ్‌గా అనువదించబడింది. చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక పాటలో "టప్పు టప్పు టప్పోరి" అనే ప్రస్తావన ఉంది. [3]

విజయవంతమైన తెలుగు ధారావాహిక మొగలిరేకులులో నటుడు సాగర్ పోషించిన మున్నా అనే పాత్రలో టపోరీ ఛాయలు ఉంటాయి.

ఇతర సామాజిక పోకడలపై ప్రభావము

[మార్చు]

ఎ.టి.డి ఫోర్త్ వరల్డ్ (International Movement ATD Fourth World (en)) అనే స్వచ్ఛంద సంస్థ పిల్లల విభాగము పేరు టపోరి. ATD వ్యవస్థాపకుడు జోసెఫ్ వ్రెసిన్‌స్కీ ([[Joseph Wresinski ]] (en)) ముంబై రైల్వే స్టేషన్లలో ఉంటున్న వీధిబాలలను కలిసారు. తమ దగ్గర ఉన్న కాస్త తిండిని తమలో తాము పంచుకుంటున్న ఈ పిల్లల్ని చూసి కదిలిపోయిన ఆయన, తన ATD పిల్లల విభాగాన్ని స్థానికులు ఆ పిల్లల్ని సూచించడానికి వాడుతున్న టపోరి అనే పేరుతో పిలవాలని నిర్ణయించుకున్నాడు. [4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. ఇది నియొ-న్వార్‌లో (Neo-noir (en)) ఒక రకము. ముంబాయి నేరసమాజముపై నియొ-న్వార్ శైలిలో తీసే చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Mazumdar, R. 2007. Bombay Cinema: An Archive of the City. Minneapolis: University of Minnesota Press
  2. Jeffrey, Craig (14 July 2010). "Timepass: Youth, class, and time among unemployed young men in India".
  3. "Gang Leader (1991) | A To Z Telugu Lyrics". www.atoztelugulyrics.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-07. Archived from the original on 2022-06-27. Retrieved 2022-06-27.
  4. Tapori Children's Network - ATD Fourth World
"https://te.wikipedia.org/w/index.php?title=టపోరీ&oldid=3891790" నుండి వెలికితీశారు