టింగ్ రంగా
టింగ్ రంగా (1952 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎ. సుబ్బారావు |
---|---|
నిర్మాణం | పి. ఎస్. శేషాచలం |
తారాగణం | అద్దంకి శ్రీరామమూర్తి, ఎస్.వరలక్ష్మి , కనకం , నల్ల రామమూర్తి, సీతారాం |
సంగీతం | టి.వి.రాజు, ఎస్. బి. దినకరరావు |
నిర్మాణ సంస్థ | యువ పిక్చర్స్ |
భాష | తెలుగు |
టింగ్ రంగా 1957లో విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు
[మార్చు]- ఎస్.వరలక్ష్మి - శ్యామల
- తిలకం - రాణి
- టి.కనకం - బంగారం
- ఆశాలత - మోహిని
- సరళ - హేమ
- వీణావతి - వీణావతి
- శ్రీరామమూర్తి - మనోహర్
- రేలంగి- కోణంగి
- నల్ల రామమూర్తి - టింగు
- సీతారాం - రంగు
- వి.కోటేశ్వరరావు - విక్రమసేన మహారాజు
- ఎ.ఎల్.నారాయణ - మంత్రి
- పి.సూరిబాబు - సాధు మొదలైనవారు
కథాసంగ్రహము
[మార్చు]మోళీ, గారడీ చేసుకుంటూన్న టింగూ రంగూ అన్న యిద్దరు స్నేహితులు ఒక అడవిలో రెండు మహిమగల పిట్టలను చూస్తారు. అందులో ఒకదాని గుండెకాయ తిన్నవాడు రాజూ, రెండోదాని గుండె కాయ తిన్నవాడు మంత్రి అవుతారట. ఇద్దరూ కొడతారు ; ఒక్కటే చచ్చి పడుతుంది. మరొక్కటి ఎగిరిపోతుంది. చచ్చినపిట్టను రంగు తింటాడు. ఎగిరిపోయినపిట్టను వెంటాడుతారు. పిట్ట వేటసందడిలో విడిచివచ్చిన వారి సామాన్లు తీసుకురాడానికి టింగు వెనక్కి వెళ్ళి దారితప్పిపోయి ఒక గ్రామం చేర్తాడు. అక్కడ పూటకూటి యింటిలో ఉండగా, తలారులు వచ్చి టింగును బ్రహ్మరాక్షసికి బలిగా తీసుకుపోతారు. ఏడుస్తే లాభంలేదని, టింగు అడవిలోని విషపు మొక్కలతో కుంభం నింపుతాడు. బ్రహ్మరాక్షసి ఆ విషం తలకెక్కి చస్తుంది. టింగు మహానాయకు డయిపోతాడు. గ్రామ పెద్ద తనకూతురు బంగారునిచ్చి పెళ్ళిచేస్తాడు. టింగుకై చూచిచూచి రంగు తానే బయలుదేరి సామానులున్నచోటికి పోయి టింగు జాడ కనిపించక, సామానులతో బయలుదేరి పోయిపోయి ఒక చెట్టుకింద పండుకుంటాడు. అంత ఒక పావురంవచ్చి తనమీద వాలు తుంది ; వెంటనే రాజభటులువచ్చి రంగును మనోహరరాజుదగ్గరకు తీసుకుపోతారు. ఆ మనోహరమహారాజు రంగుని తన మంత్రిగా చేసు కుంటాడు. తాను తిన్నపిట్ట మంత్రిపిట్టే ఆనుకొని రంగు సంతోషిస్తాడు. ఒకనాడు రాజుగారి వీణ దొంగిలించుకుపోతూందని రాజభటులు వీణావతి అన్న గాయకురాలిని, వీణతోసహా తీసుకొస్తారు. తనవీణ మందిరంలోనే ఉండడం తెలుసుకొని, రాజు వీణావతిని ఆ వీణనుగురించి అడుగుతాడు. ఆమె విజయపురి రాజకుమారి శ్యామల కథ చెప్పతుంది.
విజయపురరాజు పూజలూ, యజ్ఞాలూ ఎన్నిచేసినా సంతానం కల గకపోవడం చూచి, దేవుడే లేడని దేవాలయాలు మూయించి, పూజలుచేసిన వారిని శిక్షిస్తానని ప్రకటించాడు. దేవుడున్నాడని పాడుకుంటున్న సాధుని దండించడానికి చూచాడు ; నిదర్శనంకోసం ఆ సాధు, రాజదంపతులను శబరిగిరిమీది శ్యామలాంబికను పూజచేయమన్నాడు. సాధుని చెరలో పెట్టి, రాజు భార్యతో ఆ శ్యామలాంబికను పూజచేశాడు. దాని ఫలితంగా ఒక ఆడపిల్ల కలిగింది. సాధుని చెరనుంచి విడిచిపెట్టడానికి రాజు వెళ్లాడు. సాధు రాజు లోపాలను తెలియపరిచి, అంతర్థానమయిపోయాడు. ఆ బాలిక శ్యామల పెద్దదయింది. పెళ్ళీ, ప్రేమవిషయాలూ ఆమెకు పడవు. ఆమెకు వివాహం చేసి అల్లుడికి రాజ్యమిచ్చి విశ్రాంతి తీసుకోవాలని రాజు చూస్తున్నాడు. కాబట్టి, ఆమె మనసు మార్చాలని ప్రయత్నించి కోణంగి - ఆచారిచేత నాటకాలాడించారు. శ్యామలకు పేమ కలగలేదుగాని, కోణంగికి శ్యామల మీద మోహంకలిగింది. వీణావతి గాన సభ పెట్టించారు. వినినంతసేపు హాయిగా విని, పాటలో ప్రేమవిషయం రాగానే మండిపడి శ్యామల ఆమె వీణను ముక్కలు చేసింది. తరువాత చల్లబడి తన మెడలోని హారం ఆమెకిచ్చి, పంపివేసినది. ఆ వీణావతి తన విరిగిన వీణను మనోహరరాజుకు చూపుతుంది. రాజు తనదగ్గరనున్న అలాంటి వీణనే ఆమెకిస్తాడు; ఆమె తనకిచ్చిన హారాన్ని రాజు కిచ్చివేస్తుంది. రాజుకా శ్యామలను చూడాలని అభిలాష కలిగింది. అయినా, ఆమె తండ్రి ఈ మనోహర్ తండ్రికి పరమ శత్రువు. కాబట్టి యతి వేషంలో శ్యామల ఉన్న ఊరుకివెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఇలాగా చేతులుమారిన హారం దేవతాదత్తం ; అది ఎవరిచేతిలో పడితే వారు ఈ రాజ్యానికథిపతి అవుతారు. అందుచేత ఆ వీణావతిని పట్టుకురమ్మని రాజభటులను పంపుతాడు.
టింగూ బంగారూ కలిసి రంగును వెదుకుకుంటూవచ్చి ఈ శ్యామల పట్నంలోనే గారడీచేస్తారు. కోణంగి వారి నాశ్రయించి, శ్యామలాదేవిని తమ మంత్రప్రభావంచేత తనవశం చేయించమని కోర్తాడు. అదే సమయంలో యతిశిష్యుడు వేషంలో ఉన్న రంగు, వీరినందరిని చూచి, గురుస్వాముల దగ్గరకు తీసుకుపోతాడు. కోణంగి భార్య హేమ, శ్యామలకు చెలికత్తె. ఆమెద్వారా యతీశ్వరుని గురించి విని, రాజు సకుటుంబంగా వారిని దర్శించడానికి శబరిగిరికి వెళ్తారు. వివాహం చేయకుండా కూతురుని ఇంటిలో నుంచిన పాపం ఉన్నందువల్ల రాజును యతీశ్వరులు చూడరనీ, హారం త్వరగానే వారికి దొరుకుతుందని చెప్పి పంపించివేస్తారు. ఇందులో ఏమి తప్పందో తెలుసుకోవాలని శ్యామలా హేమా బాలసాధుల వేషంలో యతిదగ్గరకు వెళ్తారు. శ్యామలకు మనోహర్‌కు మనసులు కలుస్తాయి. చాలా సంతోషంగా శ్యామల కోటకు వస్తుంది. యతినే తాను పెళ్ళి చేసుకుంటానని శ్యామల హేమ ద్వారా వార్తపంపుతుంది. ఇంతలో వీణావతిని రాజభటులు తీసుకొస్తారు. ఆమెవల్ల ఆ హారం శత్రురాజు కొడుకు స్వాధీనంలో ఉందని రాజు తెలుసుకుంటాడు. ఆతడికి పిల్లనివ్వవలసివస్తుంది కదా అని రాజు భయపడి, యతీశ్వరుడికిచ్చి పెళ్ళిచేయడానికే నిశ్చయిస్తాడు. వీణావతి పట్టుపడ్డదన్నమాట విని తమసంగతి బైటపడుతుందన్న భయంతో యతీ రంగూ వేషాలుతీసివేసి తమ నగరానికి బయలుదేరుతారు. టింగూ బంగారు ఇక్కడుంటారు. పెళ్ళిసంగతి ముందుగా స్వామిగారికి తెలియజేయడానికి పోయి కోణంగి అక్కడ పడిఉన్న వేషాలు చూచి, శ్యామల దక్కుతుందన్న ఆశతో, తానే ఆ వేషంలో యతిలాగ కూర్చుంటాడు. భటులు కోణంగిని కోటకు తీసుకుపోతారు. ఈ సంగతి తెలిసి, బంగారు నిక్కడుంచి, టింగు తనరాజుతో చెప్పడానికి పోతాడు. బంగారుద్వారా ఇతడు దొంగయతి అని తెలుసుకొని శ్యామల దుఃఖిస్తుంది. వివాహప్రయత్నాలు సాగుతున్నాయి. మనోహరుని మనోవాంఛ ఈడేరుతుందా? లేక దొంగయతికి శ్యామలకు వివాహం జరుగుతుందా? అనేది తరువాతి కథ.
పాటలు
[మార్చు]- ఇది యేమి మాయో కదా మహా చోద్యమాయే జగమంతా మారేపొయే - ఎస్. వరలక్ష్మి
- ఏలగయ్యా దేవా ఇక బ్రతకడమెలాగ దేవా బజారిలా మండుతు ఉంటే - రేలంగి
- కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముమ్మాటికి ఈ మూటికి ముమ్మాటికి సాటి - ఘంటసాల, రచన: తాపీ ధర్మారావు
- తల్లీ శాంకరీ చల్లని చూపులు చల్లవే మాపై తల్లీ శాంకరీ - ఎస్. వరలక్ష్మి, యు. సరోజిని
- బేలవుగా కనజాలవుగా జీవులలో గల కీలకము కనజాలవుగా - ఘంటసాల, రచన: తాపీ ధర్మారావు
- రాజా మహారాజా రవికోటిరాగ సురలోక భోజా - ఘంటసాల, రచన: తాపీ ధర్మారావు
- లేదా మునిపిది కనుగొనలేదా ఈ లోకములో ఇంత విలాసము లేదా ఎంతో - ఎస్. వరలక్ష్మి, ఘంటసాల, రచన: తాపీ ధర్మారావు
- లోకప్రియా హే శ్యామలా లోకప్రియా హే శ్యామలా - ఘంటసాల, రచన: తాపీ ధర్మారావు
- హాయీ హాయీ నా సంతోషం హాయీ హాయీ ఆనందం ఈ సంతోషం - ఎస్. వరలక్ష్మి
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- టింగ్ రంగా (1952) - సినిమా పాటల పుస్తకంలోని వివరాలు