టోలుండ్ మనిషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టోలుండ్ మనిషి తల - చక్కగా సంరక్షించబడిన స్థితిలో ఉంది

టోలుండ్ మనిషి అనేది క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో, స్కాండినేవియాలో రోమన్ పూర్వ ఇనుప యుగంగా వర్ణించబడిన కాలంలో సహజసిద్ధంగా మమ్మీ అయిన శవం. [1] 1950 లో డెన్మార్క్‌లోని జట్ల్యాండ్ ద్వీపకల్పంలో బోగ్ బాడీగా భద్రపరచిన స్థితిలో ఈ మమ్మీని కనుగిన్నారు. [2] ఆ వ్యక్తి భౌతిక లక్షణాలు ఎంతలా చెక్కుచెదరకుండా ఉన్నాయంటే, ఆ మమ్మీని చూసినవాళ్ళు అతడు ఇటీవలే హత్యకు గురైన వ్యక్తి అని పొరపాటుగా భావించారు. [3] దాన్ని కనుగొనడానికి పన్నెండు సంవత్సరాల ముందు ఎల్లింగ్ ఉమెన్ అనే మరో బోగ్ బాడీని, అదే బోగ్‌లో కనుగొన్నారు. [4]

మరణానికి కారణం ఉరి వేయడమని తేలింది. అతని శరీరాన్ని ఒక పద్ధతిలో అమర్చిన తీరును బట్టి, అతని కళ్ళూ నోరూ మూసుకుని ఉండడాన్ని బట్టీ, మరణశిక్ష విధించిన నేరస్థుడిగా కంటే, నరబలి అయిన వ్యక్తిగా అతణ్ణి భావించారు. [5]

కనుగోలు[మార్చు]

1950 లో టోలుండ్ మనిషిని కనుగొన్న కొద్ది కాలం తరువాత అతని అవశేషాలు.

1950 మే 8 న, విగ్గో, ఎమిల్ హోయ్‌గార్డ్ అనే ఇద్దరు పీట్ కట్టర్లు డెన్మార్క్‌ లోని సిల్కేబోర్గ్‌కి పశ్చిమాన 12 కి.మీ. దూరంలో ఉన్న బ్జోల్డ్‌స్కోవడల్ పీట్ బోగ్ అనే చెట్లు కుళ్ళి ఘనీభవించిన మురుగ్గుంట (ఇంగ్లీషులో దీన్ని పీట్ బోగ్ అంటారు) లోని పీట్ పొరలో ఒక శవాన్ని కనుగొన్నారు. [6] ఆ శవం చాలా తాజాగా కనిపించింది. ఇటీవలే హత్య చేయబడ్డ వ్యక్తి ఎవరైనా అయి ఉండవచ్చని వారు అనుకున్నారు.

టోలుండ్ మనిషి గట్టి నేల నుండి 60 మీ. దూరంలో2.5 మీ. లోతున దొరికాడు. అతని దేహం పిండం ఆకారంలో ముడుచుకుని ఉంది. [7] అతను గొర్రె చర్మం, ఉన్నిలతో చేసిన మొనదేరిన టోపీని ధరించాడు. ఆ టోపీని గడ్డం కిందుగా తోలు తాడుతో కట్టుకున్నాడు. నడుము చుట్టూ మృదువైన తోలు బెల్టు ధరించాడు. అదనంగా, జంతువుల చర్మంతో జడలాగా అల్లిన ఉచ్చు అతని మెడ చుట్టూ బిగుసుకుని ఉంది. అది అతని వీపుమీదుగా కిందికి దిగి ఉంది. [8] ఇవి కాకుండా, శరీరం నగ్నంగా ఉంది. అతని జుట్టు చాలా కురచగా కత్తిరించబడి ఉంది. ఎంత కురచగా నంటే, ఆ టోపీ అతడి జుట్టును పూర్తిగా కప్పేసింది. గడ్డం, మీసం కొద్దిగానే (1 మి.మీ. పొడవున) పెరిగి ఉన్నాయి. దాన్నిబట్టి అతను మామూలుగా చక్కగా షేవింగు చేసుకునేవాడని, మరణించిన రోజున మాత్రం షేవింగు చేసుకోలేదనీ తెలుస్తోంది. [9]

శాస్త్రీయ పరీక్షలు, తీర్మానాలు[మార్చు]

టోలుండ్ మనిషిపై చేసిన C14 రేడియోకార్బన్ డేటింగ్ ప్రకారం, అతను సామాన్యశకపూర్వం 375–210 లో మరణించాడని తెలుస్తోంది. [10] కుళ్ళిన చెట్ల (పీట్) లోని ఆమ్లాలు, ఆ లోతున ఆక్సిజన్ లేకపోవడం, నార్డిక్ దేశాల్లో ఉండే చల్లని వాతావరణం మొదలైన వాటి కారణంగా అతని శరీరం లోని మృదువైన కణజాలం నాశనం కాకుండా బాగానే ఉన్నాయి. మానవ శరీరాన్ని కాపాడటానికి అవసరమైన పీట్ లోని ఆమ్లం, స్పాగ్నమ్ అనే బ్రయోఫైట్ వల్ల జనిస్తుంది. స్పాగ్నమ్ వాటి సెల్ గోడలలో ఉండే నిరోధక ఫినోలిక్ సమ్మేళనాల కారణంగా శిథిలక్రియకు వ్యతిరేకంగా పోరాడుతుంది. [11] పీట్ లోని ఆమ్లత్వం కారణంగా, ఎముకలు సంరక్షించబడకుండా అందులో కరిగిపోతాయి.

సైంటిస్టులు స్ట్రాంటియం మూలకపు ఐసోటోప్ విశ్లేషణను నిర్వహించారు. దీని వలన, పరిమాణాలను సూక్ష్మస్థాయి వరకూ కొలిచి మరణానికి ముందు అతను ఎక్కడ ప్రయాణించాడో ఖచ్చితమైన అంచనా వేసారు. వారు అతని తొడ నుండి జుట్టు నుండి నమూనాలను తీసుకున్నారు. అతని వెంట్రుకలు పొట్టిగా ఉన్నందున మరణానికి ఒక సంవత్సరం ముందు వరకు మాత్రమే కొలవగలిగారు. ఫలితాలలో స్ట్రోంటియం ఐసోటోప్ నిష్పత్తిలో చిన్న తేడాలు మాత్రమే కనిపించాయి. దీన్నిబట్టి అతను తన చివరి సంవత్సరం డెన్మార్క్‌లో గడిపాడనీ, తన చివరి ఆరు నెలల్లో కనీసం 20 మైళ్లు ప్రయాణించి ఉండవచ్చని భావించారు. [12]

పరీక్షలు, X- రేల వలన, ఆ మనిషి తల దెబ్బతినలేదని, అతని గుండె, ఊపిరితిత్తులు, కాలేయం బాగా భద్రంగా ఉన్నాయనీ తేలింది. అతని వయస్సు సుమారు 40 సంవత్సరాలు, ఎత్తు 1.61 metres (5 ft 3 in) ఉంటుందని సిల్క్‌బోర్గ్ మ్యూజియం అంచనా వేసింది. ఈనాటి ప్రమాణాలతోనే కాక, ఆ కాలానిక్కూడా అతడు పొట్టి అని చెప్పవచ్చు. పీట్ బోగ్‌లో ఉండగా శరీరం కుంచించుకుపోయి ఉండే అవకాశం ఉంది.

1950 లో ప్రారంభ శవపరీక్ష నివేదిక ప్రకారం, టోల్లండ్ మనిషి గొంతు పిసకడం వలన కాక, ఉరి వేసుకోవడం వలన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. [13] తాడు బిగుసుకోవడం వలన అతని గడ్డం క్రింద, మెడకు పక్కలా చారలు ఏర్పడ్డాయి. అయితే ఉరితాడు ముడి ఉండే మెడ వెనుక భాగంలో ముడి ఉన్న గుర్తులు కనబడలేదు. 2002 లో తిరిగి పరీక్షించిన ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు, ఈ తొలి పరిశోధనలకు మద్దతుగా మరిన్ని ఆధారాలను కనుగొన్నారు. [14] వెన్నుపూస దెబ్బతినకపోయినా (ఈ వెన్నుపూసలు తరచుగా వేలాడటం వల్ల దెబ్బతింటాయి), నాలుక ఊడిపోయిందని రేడియోగ్రఫీలో కనబడింది -ఉరి వలన మరణించాడనడానికి ఇది సూచన. [15]

కడుపు, ప్రేగులను పరీక్షించారు. వాటిలో ఉన్న వస్తువులపై పరీక్షలు జరిపారు. [16] ఆ మనిషి తిన్న చివరి భోజనంలో గింజలు, విత్తనాల నుండి తయారు చేసిన గంజి లేదా జావ అయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు. అవి సాగు చేసి పండించినవి కావచ్చు, లేదా అటవీ ఉత్పత్తులైనా కావచ్చు. సుమారు 40 రకాల గింజలను గుర్తించినప్పటికీ, గంజిలో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి: బార్లీ, అవిసె, తప్పుడు అవిసె (కామెలీనా సాటివా), నాట్‌గ్రాస్. [16] ఈ ఆహరపదార్థాలు జీర్ణక్రియలో ఏ దశలో ఉన్నాయో గమనించిన తరువాత ఆ మనిషి, మరణానికి 12 నుండి 24 గంటల ముందు తిన్నట్లు నిర్ధారించారు. ఈ కాలపు ప్రజలు గంజి తాగడం మామూలే. [16] చివరి భోజనంలో మాంసం గానీ, తాజా పండ్లు గానీ కనిపించనందున, ఈ వస్తువులు అందుబాటులో లేని శీతాకాలంలో గానీ, వసంత ఋతువులోగానీ చివరి భోజనం తిన్న కాలం అది అయి ఉండవచ్చని భావించారు. [16]

పీట్ కారణంగా రెండు పాదాలు, కుడి బొటనవేలు చక్కగా భద్రంగా ఉన్న స్థితిలో ఉన్నాయి. తరువాతి పరీక్షల కోసం వాటిని ఫార్మాలిన్‌లో భద్రపరచారు. 1976 లో, డానిష్ పోలీసులు వేలిముద్ర విశ్లేషణ చేశారు. ఆ విధంగా టోలుండ్ మనిషి వేలిముద్ర, రికార్డులో ఉన్న అత్యంత పురాతన ముద్రల్లో ఒకటయింది. [17]

ప్రదర్శన[మార్చు]

సిల్కేబోర్గ్ మ్యూజియంలో ప్రదర్శనలో టోల్లుండ్ మనిషి

టోలుండ్ మనిషి శరీరం డెన్మార్క్‌లోని సిల్క్‌బోర్గ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. అయితే అందులో తల మాత్రమే అసలైనది. మొత్తం శరీరాన్నంతటినీ సంరక్షించేందుకు 1950 ల ప్రారంభంలో సేంద్రీయ పదార్థాల పరిరక్షణ పద్ధతులు అంతగా అభివృద్ధి చెందనందున, తలను మాత్రం వేరుచేసి భద్రపరచాలని మిగిలిన శరీరాన్ని సంరక్షించలేమనీ ఫోరెన్సిక్ ఎగ్జామినర్లు సూచించారు. తదనంతరం, శరీరం ఎండిపోయి, కణజాలం అదృశ్యమైంది. 1987 లో, సిల్కేబోర్గ్ మ్యూజియం అస్థిపంజర అవశేషాలను ఉపయోగించి శరీరాన్ని పునర్నిర్మించింది. అసలు తలను ఆ శరీరానికి అతికించారు. [18]

ఇతర దేహాలు[మార్చు]

డెన్మార్క్‌లో, 500 కంటే ఎక్కువ బోగ్ బాడీలను, ఇనుప యుగానికి చెందిన అస్థిపంజర అవశేషాలనూ కనుగొన్నారు. [19] జూట్‌ల్యాండ్‌లోని నమూనాలలో సాపేక్ష సంరక్షణ స్థితిలో ఉన్న బోరెమోస్ బాడీలు, హల్‌డ్రెమోస్ ఉమన్, గ్రాబల్లె మ్యాన్ లు ఆర్హస్ సమీపంలోని మోస్‌గార్డ్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి. అదేవిధంగా సంరక్షించబడిన హరాల్డ్స్‌కర్ మహిళ కూడా ఆ మ్యూజియంలో ఉంది. వీటిలో దాదాపు 30 బోగ్ బాడీలు డానిష్ మ్యూజియంలలో నిరంతర పరిశోధన కోసం లేదా ప్రదర్శన కోసం ఉంచారు. [19]

ప్రజా బాహుళ్య సంస్కృతిలో[మార్చు]

నోబెల్ బహుమతి గెలుచుకున్న ఐరిష్ కవి సీమస్ హీనీ పివి గ్లోబ్ జట్లాండ్ పీట్ బోగ్స్‌లో కనుగొన్న ఇనుప యుగం నాటి మమ్మీలను అధ్యయనం చేసి, ఆ ప్రేరణతో పద్యాలు రాసాడు. ఆచారాల కోసం చేసిన హత్యల అవశేషాలలో సమకాలీన రాజకీయ సంబంధాన్ని కనుగొన్నాడు. [20] హీనీ కవిత "ది టోలుండ్ మ్యాన్", తన వింటరింగ్ ఔట్ సేకరణలో ప్రచురించాడు. మతపరమైన హింసలో మరణించిన "ట్రబుల్స్"తో కర్మల్లో చేసే బలిని పోల్చాడు. [20] హీనీ 1973 లో టోలుండ్ మ్యాన్ ఎగ్జిబిట్ అతిథి పుస్తకంలో, తన కవిత నుండి ఒక సారాంశాన్ని వ్రాసాడు. [21]

బ్రిటిష్ రచయిత్రి మార్గరెట్ డ్రాబెల్, తన 1989 నవలలో ఎ నాచురల్ క్యూరియాసిటీ లో టోలుండ్ మనిషి పట్ల ఒక పాత్ర కున్న వ్యామోహం నేపథ్యంగా, మార్గరెట్ థాచర్ ఆధునిక ఇంగ్లాండ్‌పై వ్యంగ్య విమర్శలు చేసింది. [22] [23]

టోలుండ్ మనిషి అనేక పాటలలో చోటుచేసుకుంది: అమెరికన్ జానపద బ్యాండ్ ది మౌంటైన్ గోట్స్ పాడిన " టోలుండ్ మ్యాన్ " (1995), ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ ది డార్క్నెస్ పాడిన " కర్స్ ఆఫ్ ది టోలుండ్ మ్యాన్ " (2004) వాటిలో కొన్ని.

అమెరికా టెలివిజన్ సిరీస్ బోన్స్ [24] లోని "మమ్మీ ఇన్ ది మేజ్" ఎపిసోడ్‌లో టోలుండ్ మనిషి ప్రస్తావన ఉంది. షెట్‌ల్యాండ్ దీవులలో ఒక బోగ్ బాడీ కనుగొనబడిన 2016 చిత్రం శాక్రిఫైస్ లో కూడా ప్రస్తావించబడింది.

అన్నే యంగ్సన్ రాసిన ఆధునిక నవల మీట్ మీ ఎట్ ది మ్యూజియంలో కూడా టోలుండ్ మనిషి ఉన్నాడు. ప్రాథమిక పాత్రలలో ఒకటి సిల్కేబోర్గ్ మ్యూజియంలో ఒక కల్పిత క్యూరేటర్, అతను టోలుండ్ మనిషి జీవితం, మరణం గురించి ఆంగ్ల మహిళకు లేఖలు వ్రాస్తాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మరింత చదవడానికి[మార్చు]

 • Coles, Bryony; John Coles (1989). People of the Wetlands: Bogs, Bodies and Lake-Dwellers. London: Thames and Hudson.
 • Fischer, Christian (2007). Tollundmanden: gaven til guderne: mosefund fra Danmarks forhistorie. Silkeborg: Silkeborg Museum. ISBN 978-87-7739-966-4. (Danish)

ఆకరాలు[మార్చు]

 • PV గ్లోబ్ : ది బోగ్ పీపుల్: ఐరన్-ఏజ్ మ్యాన్ ప్రిజర్వ్డ్, న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ (న్యూయార్క్) 2004,  . డానిష్ ఒరిజినల్ నుండి అనువదించబడింది: మోస్‌ఫోల్కెట్, 1965  .

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Susan K. Lewis—PBS (2006). "Tollund Man". Public Broadcasting System—NOVA. Archived from the original on 18 November 2020. Retrieved 22 September 2007.
 2. Glob, P. (2004). The Bog People: Iron-Age Man Preserved. New York: New York Review of Books. p. 304. ISBN 978-1-59017-090-8.
 3. Silkeborg Public Library; Silkeborg Museum (2004). "A Body Appears". The Tollund Man—A Face from Prehistoric Denmark. Silkeborg Public Library. Archived from the original on 9 December 2013. Retrieved 22 September 2007.
 4. "Violence in the Bogs", Archaeological Institute of America
 5. Hart, Edward, dir. "Ghosts of Murdered Kings". NOVA. Prod. Edward Hart and Dan McCabe, PBS, 29 January 2014
 6. Silkeborg Public Library; Silkeborg Museum (2004). "A Body Appears". The Tollund Man—A Face from Prehistoric Denmark. Silkeborg Public Library. Archived from the original on 9 December 2013. Retrieved 22 September 2007.
 7. "The discovery of Tollund Man". Museum Silkeborg. Retrieved 16 February 2021.
 8. Glob, P. (2004). The Bog People: Iron-Age Man Preserved. New York: New York Review of Books. p. 304. ISBN 978-1-59017-090-8.
 9. Silkeborg Public Library; Silkeborg Museum (2004). "The Tollund Man: Hair and beard". Silkeborg Public Library. Archived from the original on 1 May 2012. Retrieved 10 October 2009.
 10. Van Der Plicht, J.; Van Der Sanden, W.A.B; Aerts, A.T; Streurman, H.J (1 April 2004). "Dating bog bodies by means of 14C-AMS". Journal of Archaeological Science. 31 (4): 471–491. CiteSeerX 10.1.1.520.411. doi:10.1016/j.jas.2003.09.012.
 11. Reece, Urry, Cain, Wasserman, Minorsky, Jacckson. "L'importance écologique et économique des Bryophytes". Campbell Biologie 4th Edition (2012): p.705, 17 October 2014.
 12. Levine, Joshua (May 2017). "Europe's Famed Bog Bodies Are Starting to Reveal Their Secrets". Smithsonian Magazine.
 13. Silkeborg Museum, The Tollund Man's Appearance Archived 2011-07-19 at the Wayback Machine, Silkeborg Museum and Amtscentret for Undervisning, Silkeborg Public Library, 2004
 14. Silkeborg Museum, Latest Research Archived 2011-07-19 at the Wayback Machine, Silkeborg Museum and Amtscentret for Undervisning, Silkeborg Public Library, 2004
 15. Silkeborg Museum, Was the Tollund Man Hanged? Archived 2011-07-19 at the Wayback Machine, Silkeborg Museum and Amtscentret for Undervisning, Silkeborg Public Library (SPL), 2004
 16. 16.0 16.1 16.2 16.3 Silkeborg Museum, The Last Meal Archived 2017-04-30 at the Wayback Machine, Silkeborg Museum and Amtscentret for Undervisning, Silkeborg Public Library, 2004
 17. Silkeborg Public Library; Silkeborg Museum (2004). "Finger-Prints". The Tollund Man—A Face from Prehistoric Denmark. Silkeborg Public Library. Archived from the original on 23 September 2007. Retrieved 22 September 2007.
 18. Silkeborg Public Library; Silkeborg Museum (2004). "Preservation of the Tollund Man". The Tollund Man—A Face from Prehistoric Denmark. Silkeborg Public Library. Archived from the original on 4 March 2016. Retrieved 22 September 2007.
 19. 19.0 19.1 Dell'Amore, Christine (July 18, 2014). "Who Were the Ancient Bog Mummies? Surprising New Clues". National Geographic. Archived from the original on November 18, 2020. Retrieved March 13, 2017.
 20. 20.0 20.1 O'Donoghue, Bernard (January 1, 2009). The Cambridge Companion to Seamus Heaney. Cambridge University Press. pp. 194–196. ISBN 978-0-521-83882-5.
 21. "The Nobel Prize Winner's Poem about the Tollund Man". The Tollund Man. Silkeborg Public Library. 2004. Archived from the original on 20 February 2016. Retrieved 20 November 2015.
 22. Boxer, Sarah (2 June 1991). "A New Literary Hero: The Limp, Silent Type". The New York Times.
 23. Sanders, Karin (December 1, 2009). Bodies in the Bog and the Archaeological Imagination. University of Chicago Press. pp. 254–55. ISBN 978-0-226-73404-0.
 24. Williams, Scott. "Mummy in the Maze." Bones. Dir. Marita Grabiak. Fox. 30 Oct. 2007. Web. 15 Nov. 2016.