Jump to content

ఇన్నింగ్సు డిక్లరేషన్, వదులుకోవడం

వికీపీడియా నుండి
(డిక్లరేషన్ నుండి దారిమార్పు చెందింది)

క్రికెట్లో, కెప్టెన్ తమ జట్టు ఇన్నింగ్స్‌ను ముగించినట్లు ప్రకటించడాన్ని డిక్లరేషన్ అంటారు. అసలు బ్యాటింగ్ చేయకుండానే ఇన్నింగ్స్‌ను వదిలేయడాన్ని వదులుకోవడం (ఫర్‌ఫీచర్) అంటారు. వీటిని క్రికెట్ చట్టాల్లో, 15వ చట్టంలో నిర్వచించారు. ఈ భావన రెండు ఇన్నింగ్స్‌లు ఉండే మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ నియమం వర్తించదు.

డిక్లరేషన్

[మార్చు]

బ్యాటింగ్ చేస్తున్న జట్టు కెప్టెన్, మ్యాచ్ సమయంలో ఎప్పుడైనా, బంతి డెడ్ అయ్యాక, ఇన్నింగ్స్‌ను ముగించినట్లు ప్రకటించవచ్చు.[1] సాధారణంగా తమ జట్టు మ్యాచ్‌ని గెలవడానికి తగినంత పరుగులు చేసిందని కెప్టెన్ భావించి, ఆట డ్రా కాకుండా ప్రత్యర్థిని ఓడించేందుకు సరిపడేంత సమయం ఉండేలా, తమ బ్యాటింగులో ఎక్కువ సమయం తీసుకోకూడదని భావించినపుడు ఈ ప్రకటన చేస్తాడు. వ్యూహాత్మక ప్రకటనలను కొన్నిసార్లు ఇతర పరిస్థితులలో కూడా ఉపయోగిస్తారు.

1906 మే 2 న మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ వార్షిక సాధారణ సమావేశంలో ఫ్రాంక్ మే - రెండు రోజుల మ్యాచ్‌లో, బ్యాటింగ్ చేస్తున్న జట్టు కెప్టెన్‌కు ఎప్పుడైనా తమ ఇన్నింగ్స్‌ను ముగించినట్లు ప్రకటించే అధికారం ఉండాలని ప్రతిపాదించాడు. అయితే మొదటి రోజు ఆట ముగియడానికి ఒక గంటా నలభై నిమిషాల కంటే లోపునే అటువంటి ప్రకటన చేయాలి. కొంత చర్చ అనంతరం ఆ తీర్మానాన్ని ఆమోదించారు. [2]

డిక్లరేషన్‌ను చేయదలచిన కెప్టెన్ సరైన సమయంలో చేయాలి. మరీ ముందుగా చేస్తే ప్రత్యర్థికి గెలుపు లక్ష్యం మరీ తక్కువ గా ఉండి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. మరీ ఆలస్యంగా చేసినా, అసలే చెయ్యకున్నా ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

1890 లో చార్లెస్ రైట్ డిక్లరేషను ప్రకటించిన మొదటి కెప్టెన్. గ్రేవ్‌సెండ్‌లోని బ్యాట్ అండ్ బాల్ గ్రౌండ్‌లో కెంట్‌తో జరిగిన ఆటలో రైట్, నాటింగ్‌హామ్‌షైర్ రెండవ ఇన్నింగ్సును 5 వికెట్ల నష్టానికి 157 పరుగుల వద్ద ముగించినట్లు డిక్లేర్ చేసి కెంట్‌కు 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించాడు. కెంట్ 9 వికెట్లకు 98 పరుగులు చేసి గేమ్‌ను డ్రా చేసుకుంది. నాటింగ్‌హామ్‌షైర్ గెలుపుకు ఒకే వికెట్ దూరంలో ఆగిపోయింది. దాంతో ఈ డిక్లరేషను వ్యూహం దాదాపు ఫలించింది.[3]

డిక్లరేషను పద్ధతి రాక ముందు, అవతలి జట్టును త్వరగా బ్యాటింగుకు దించాలనుకునే జట్టు, తమ బ్యాట్స్‌మన్లను ఉద్దేశపూర్వకంగా ఔట్‌ చేసుకునేందుకు ప్రయత్నించేవారు. ఫీల్డింగ్ జట్టు, వాళ్లను అవుట్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించేది. దాంతో ఇది కొన్ని హాస్యాస్పద పరిస్థితులకు దారి తీసేది.

జప్తు

[మార్చు]

ప్రస్తుత చట్టాల ప్రకారం, జట్టు తమ ఇన్నింగ్స్‌లలో దేనినైనా కోల్పోవచ్చు.[1] వదులుకున్న ఇన్నింగ్స్‌ను పూర్తి చేసిన ఇన్నింగ్స్‌గా పరిగణించాలి. సాధారణంగా ఇది వ్యవధి తక్కువగా ఉండే, రెండు-ఇన్నింగ్సుల మ్యాచ్‌లలో జరుగుతుంది. కెప్టెన్‌లు, ఫలితం వచ్చేలా మ్యాచ్‌ను ఎలా సెటప్ చేయాలో ఒకరితో ఒకరు అంగీకరించాలి. గేమ్‌ని గెలవడం వల్ల జట్టు డ్రా చేయడం కంటే చాలా ఎక్కువ పాయింట్‌లను పొందుతుంది. కాబట్టి కెప్టెన్‌లు తరచూ ప్రత్యర్థి జట్టుకు గెలిచే అవకాశాన్ని కల్పించే రిస్క్ చేయడానికి ఇష్టపడతారు. లేకపోతే ఇలాంటి అవకాశం అవతలి వారి నుండి వారికి అందదు.

2020 ఆగస్టులో, 2020 బాబ్ విల్లిస్ ట్రోఫీలో డర్హామ్, లీసెస్టర్‌షైర్‌ల మధ్య వర్షం వల్ల దెబ్బతిన్న మ్యాచ్‌లో, ఫలితాన్ని అందించే ప్రయత్నంలో రెండు జట్లు ఇన్నింగ్స్‌ను కోల్పోవడానికి అంగీకరించాయి. [4]

టెస్ట్ క్రికెట్

[మార్చు]

టెస్టు క్రికెట్‌లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌ను స్వచ్ఛందంగా అప్పగించారు. ఇది 2000 జనవరి 18 న దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన ఐదవ, చివరి టెస్టు. మొదటి నాలుగు మ్యాచ్‌ల తర్వాత 2-0 (2 మ్యాచ్‌లు డ్రాగా) ఆధిక్యంలో ఉన్నందున, దక్షిణాఫ్రికా అప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. దక్షిణాఫ్రికా మొదటి రోజు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన తర్వాత, మిగతా మూడు రోజులు వర్షం కొట్టుకుపోయింది. ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

దక్షిణాఫ్రికా కెప్టెన్ హన్సీ క్రోన్యే, ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ నాజర్ హుస్సేన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దక్షిణాఫ్రికా 250 పరుగులకు చేరుకునే వరకు బ్యాటింగ్ కొనసాగించి, ఆపై డిక్లేర్ చేస్తుంది. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్సును, ఆ తర్వాత దక్షిణాఫ్రికా తమ రెండవ ఇన్నింగ్సునూ వదిలేసుకుని ఇంగ్లాండ్‌ రెండవ ఇన్నింగ్సులో గెలవడానికి దాదాపు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఆ విధంగా మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం సృష్టిస్తారు. ఇదీ వాళ్ళిద్దరి ప్లాను.

కానీ, ఆ సమయంలో ఉన్న చట్టాల ప్రకారం, ఒక జట్టు తన రెండవ ఇన్నింగ్స్‌ను మాత్రమే వదిలేసుకోడానికి వీలౌతుంది, మొదటి ఇన్నింగ్సును వదిలేసుకోలేదు.[5] అందుచేత ఇంగ్లండ్, తమ మొదటి ఇన్నింగ్స్‌ను 0 బంతుల తర్వాత 0 వికెట్లకు 0 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆ తరువాత దక్షిణాఫ్రికా తమ రెండవ ఇన్నింగ్సును వదిలేసుకుంది. ఇంగ్లాండ్ తమ రెండవ ఇన్నింగ్సులో 8 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసి 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[6] ఆ సమయంలో క్రోంజే చాలా తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించాడని విమర్శలు వచ్చాయి.

అయితే, క్రోన్యేను ఒక బుక్‌మేకర్ సంప్రదించాడని, గేమ్ డ్రాగా కాక, స్పష్టమైన ఫలితంతో ముగిసేలా చూడమని అతను క్రోన్యేని కోరినట్లూ తర్వాత తెలిసింది. [7] క్రోన్&యే ప్రతిపాదనను నిజాయితీతో స్వీకరించిన నాజర్ హుస్సేన్‌కు, ఇంగ్లండ్ జట్టుకూ ఆ సమయంలో దీని గురించి తెలియదు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Law 15 – Declaration and forfeiture". MCC. Retrieved 29 September 2017.
  2. "Wisden - Obitauries in 1907". ESPNcricinfo. 30 November 2005. Retrieved 2021-05-10.
  3. "Scorecard of the game in which Wright became the first captain to declare an innings closed". Cricketarchive.com. Retrieved 2013-08-09.
  4. "Durham and Leicestershire Forfeit An Innings Each To Set Up A Result". NDTV. Retrieved 18 August 2020.
  5. MCC (1980). "Law 14 – Declarations". Laws of Cricket 1980 Code. Cricinfo. Retrieved 2011-02-20.
  6. "Scorecard of 2000 RSA vs ENG Centurion Match in which Cronje & Hussein forfeited innings". Aus.cricinfo.com. Retrieved 2013-08-09.
  7. Stone, Simon (16 June 2000). "Cronje admits $100,000 in bribes". The Independent. London. Archived from the original on 1 September 2010. Retrieved 22 March 2010.