Jump to content

డి.వి. సుబ్బారావు (సీనియర్)

వికీపీడియా నుండి
డి.వి. సుబ్బారావు (సీనియర్)

డి.వి. సుబ్బారావు రంగస్థల నటుడు. ఆంధ్రాతాన్ సేన్ బిరుదాంకితుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆధ్రనాటకరంగ అభిమానులు ప్రేమగా పిలుచుకునే "డి.వి" సుబ్బారావు గారి పూర్తి పేరు దుబ్బు వెంకట సుబ్బారావు. అతను నేటి ప్రకాశం జిల్లాలోని వేటపాలెం గ్రామంలో. సన్నకారు రైతు కుటుంబంలో దుబ్బు రాఘవయ్య, మహలక్ష్మీ దంపతులకు 1939 జూన్ 27న జన్మించాడు. స్వగ్రామం లో ప్రాధమివిద్య పూర్తి గావించుకుని బాల్యంలోనే నాటకాలపట్ల అభిమానం పెంచుకుని ఆంధ్రాప్యారిస్‌గా, కళలకు నిలయమై వెలుగొందుచున్న తెనాలి చేరాడు. నాటక రంగంలో శిక్షణ కోసం వల్లూరు వెంకట్రామయ్య చౌదరిని ఆశ్రయించారు. అమిత ఉత్సాహంగా, కఠోర శ్రమతో, సాధనతో, తొలిసారిగా బాలనాగమ్మ నాటకంలో బాలవర్ధి పాత్ర నేర్చుకుని అధ్భుతంగా ప్రదర్శించాడు. తర్వాత కార్యవర్ధి పాత్రను అతి తక్కువ సమయంలో నేర్చుకున్నాడు. రామరావణయుధ్ధంలో శ్రీరామునిగా, చింతామణి నాటకంలో భవానీశంకరం పాత్ర ను, శ్రీకృష్ణ రాయబారం నాటకంలో శ్రీకృష్ణ పాత్ర ను, అభ్యసించాడు. అతను తెనాలి లో రామకుమారి గారి వద్ద కూడా శిక్షణ పొందాడు. అతను ఎన్నోప్రదర్శనలు ఇచ్చాడు. అనంతరం అతను శ్రీ రామా నాట్యమండలిలో చేరాడు. బలిజేపల్లి లక్ష్మీ కాంతకవి రచించిన సత్యహరిశ్చంద్రీయం నాటకంలో హరిశ్చంద్ర పాత్రను స్వీకరించాడు. హార్మోనిష్టు ప్రకాశరావు సహకారంతో బండారు రామారావు స్ఫూర్తితో సందర్భోచితమయిన వాచకాభినయం , రాగాల ఎంపిక, గుఱ్ఱం జాషువా కవి రచించిన శ్మశానవాటికలోని పద్యాలను కొన్ని కాటిసీను లో కలుపుకుని, నూతన ఒరవడిని సంతరింపచేసుకుని, పల్లె పట్టణం అని లేకుండా ఒక జైత్రయాత్రలా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు చరగులా సుడిగాలి పర్యటన చేసి ప్రదర్శన లు ఇచ్చాడు. సుమారు 1969 నుండి 20 సంవత్సరాలు పాటు వేలాది ప్రదర్శన లు ఇచ్చాడు. హరిశ్చంద్ర పాత్రలో ఇన్ని వేల ప్రదర్శనలు దేశచరిత్రలో మరొకరు ఎవ్వరూ ఇచ్చి యుండలేదని కళారంగ నిపుణులు చెబుతున్నారు. ఈరికార్డును వారి మనవడు జూనియర్ డీ వీ సుబ్బారావు మాత్రమే అధిగమించ గలడని చెప్పుకుంటున్నారు. 1970 నుండి 1989లో మరణించే దాకా రాష్ట్రంలో డీవీ సుబ్బారావు నాటకాలు ఒక ప్రభంజనాన్ని సృష్టించినాయి. ఒక ప్రక్క సినిమాలు జోరు, మరోప్రక్క రేడియో మరికొంత కాలానికి టీవీ ల సందడి ఎన్ని ఉన్నా రంగస్థల అభిమానులు నాటకాలు చూడడానికి టిక్కెట్ కొని ఆదరించి నటులకు నీరాజనాలుపట్టారు..

డీ వీ హరిశ్చంద్ర పాత్ర పోషించిన తొలి నాళ్ళలో తెలుగు నాట మహోద్దండులైన కళాకారులు ఉన్నారు. ఎన్నోపౌరాణిక నాటకాలు ఆంధ్రప్రదేశ్ నలుమూలల ప్రదర్శనజరుగుచుండేవి. హరశ్చంద్ర కు బండారు రామారావు నూతన

ప్రయోగాలకు నాంది పలికితే, దానిని ఉన్నతశిఖరాలకు చేర్చి, ఉర్రూతలూగించిన ఘనత మాత్రం డీ వీ సుబ్బారావు దే అనుట నిర్వివాదాంశము. వారిహరిశ్చంద్ర పద్యాల క్యాసెట్లు లక్షల్లో విక్రయించారు. .టేపురికార్డర్లు కొనుగోలుసంఖ్య కూడా అమాంతంగా పెరిగింది. ఈసందర్భం, ఆసందర్భం అనిలేదు, మైకు మ్రోగిందంటే గ్రామాల్లో డీ.వీ.సుబ్బారావు గారి హరిశ్చంద్ర పద్యాలే. ఓ రకంగా చెప్పాలంటే...ఆనాడు గ్రామ గ్రామాన నాటక సమాజాలు ఆవిర్భావం కూడా అసంఖ్యాకంగా జరిగింది. వర్ధమాన కళాకారులు అందరూ హరిశ్చంద్ర నాటకాలు ఆడటానికి శ్రీ కారంచుట్టారు. వారందరికీ డీ వీ .సుబ్బారావుగారి గళం ,బాణీలే పెద్దబాలశిక్ష. ఈ మహానటుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందాడు. నాటకం మధ్యలో, పద్యప్రదర్శన లోఅనేక మార్లు వన్సుమోరులు, చదివింపులు, .కరెన్సీ దండలతో అభిమానులు సత్కారాలు చేసేవారు. నక్షత్రకునిగా, విశ్వామిత్ర, వశిష్ఠుడు మొదలగు పాత్రలు వీరితో కలిసి మహామహులు పోషించారు.

చంద్రమతిగా గూడూరు సావిత్రి, విజయరాజు ,హేమలత ,యం.ఆర్.తిలకం ,బండారు సుశీల , రేబాల రమణ వంటి నటీమణులు పోటాపోటీ నటించి ఈనాటకానికి, బలిజేపల్లి వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు కల్గించారు.

పురస్కారాలు

[మార్చు]

కనకాభిషేకాలు, గండపెండేరాలు, సింహతలాటాలు, సువర్ణకంకణాలు, అంగుళీయకములు వీరికి ఎన్నో బహూకరించారు.

ఇతర విషయాలు

[మార్చు]

డీవీ సుబ్బారావుగారు నిండైన అందమైన విగ్రహం. అతని గాత్రంలో..ఏదో చెప్పలేని ..సుమధుర నాదం ఉంది. శ్రావ్యమైన వినూత్న ఆలాపన ఆయనకే సొంతం. విస్పష్టమైన వాచకాభినయం. పాత్రోచిత నటనావైదుష్యాన్ని కలిగిన అరుదైన వ్యక్తి. ఆనాడు ప్రజల ఆదరణతగ్గి నాటకరంగం కళావిహీనమవుతుందేమో అనే సందేహం కలుగుతోన్న రోజుల్లో హరిశ్చంద్ర పాత్రలో నూతన పోకడలు ఒలికించి నాటకరంగంలో పెను సంచలనం సృష్టించిన ఈ గానకోవిదుడు నిరాడంబరుడు.

తన 50 వ ఏట 1989 నవంబరు 9న మరణించాడు.

మూలాలు

[మార్చు]