బలిజేపల్లి లక్ష్మీకాంతం
బలిజేపల్లి లక్ష్మీకాంతం | |
---|---|
![]() బలిజేపల్లి లక్ష్మీకాంత కవి | |
పుట్టిన తేదీ, స్థలం | డిసెంబరు 23, 1881 బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా |
మరణం | జూన్ 30, 1953 శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా |
కలం పేరు | బలిజేపల్లి లక్ష్మీకాంత కవి |
జాతీయత | భారతీయులు |
పౌరసత్వం | భారత దేశము |
విద్య | మెట్రిక్యులేషన్ |
పూర్వవిద్యార్థి | హిందూ కళాశాల గుంటూరు |
రచనా రంగం | నాటక రచయిత, కవి,అవధాని,నటుడు |
గుర్తింపునిచ్చిన రచనలు | సత్య హరిశ్చంద్ర నాటకం |
ప్రభావం | భాగవతుల చెన్నక్రిష్ణన్ |
బంధువులు | బలిజేపల్లి సీతారామయ్య |
బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 - జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధిచెందినది.
జీవిత సంగ్రహం[మార్చు]
వీరు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడులో 23 డిసెంబర్, 1881 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు.
కర్నూలులో మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి అవధానాలు ప్రదర్శించారు.
చల్లపల్లి రాజావారి సాయంతో 1922లో గుంటూరులో చంద్రికా ముద్రణాలయం స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 1926 లో గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో నక్షత్రకుడు పాత్ర వీరికిష్టమైనది.
తర్వాత కాలంలో చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు.
వీరు 30 జూన్, 1953 సంవత్సరం కాళహస్తిలో పరమపదించారు.
బలిజేపల్లి రచనలు[మార్చు]
- శివానందలహరి శతకం (శంకరుని కృతికి ఆంధ్రీకరణం)
- స్వరాజ్య సమస్య (పద్య కృతి)
- బ్రహ్మరథం (నవల)
- మణి మంజూష (నవల)
- బుద్ధిమతీ విలాసము (నాటకము)[1] : శివ భక్తాగ్రేసరుల్లో ఒకరిగా పేరొందిన శిరియాళుని కథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ నాటకాన్ని రచించారు.
- సత్యహరిశ్చంద్రీయము (నాటకము)[2]
- ఉత్తర గోగ్రహణము (నాటకము)
- సాత్రాజితీ పరిణయము (నాటకము)
- ఉత్తర రాఘవము (భవభూతి రచించిన నాటకానికి ఆంధ్రీకరణం)[3]
చిత్ర సమాహారం[మార్చు]
- లవకుశ (1934) (మాటలు, పాటల రచయిత)
- హరిశ్చంద్ర (1935) (రచయిత)
- అనసూయ (1936) (రచయిత)
- మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు, మాటల రచయిత)
- వర విక్రయం (1939) (నటుడు, మాటల రచయిత)
- భూకైలాస్ (1940) (మాటల రచయిత)
- విశ్వమోహిని (1940) (మాటల చయిత)
- బాలనాగమ్మ (1942) (నటుడు, రచయిత)
- తాసిల్దార్ (1944) (నటుడు, మాటల రచయిత)
- సీతారామ జననం (1944) (విశ్వామిత్ర)[4]
- రక్షరేఖ (1949) (నటుడు, కథ, మాటల రచయిత)
- బ్రహ్మరథం (1947) (నటుడు, కథ, పాటల రచయిత)
- భీష్మ (1944) (నటుడు)
- నా చెల్లెలు (1953)
- మంజరి (1953) (నటుడు, మాటల రచయిత)
- జీవిత నౌక (1951) (మాటలు, పాటల రచయిత)[5]
సత్య హరిశ్చంద్ర[మార్చు]
ఈ నాటకము వీరి అత్యంత ప్రసిద్ధమైన రచన. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది. ఉదాహరణకు కొన్ని పద్యాలు:
మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.
అరయన్ వంశము నిల్పనేగద వివాహంబట్టి వైవాహిక
స్పురణంబిప్పటికెన్నడోజరిగెసత్పుత్రుండుపుట్టెన్ వయః
పరిపాకంబునుదప్పుచున్నయది యీ ప్రాయంబునన్ వర్ణసం
కరపుంబెండిలి యేల చుట్టెదవు నాకఠంబునన్ గౌశికా
**
భక్తయోగపదన్యాసి వారణాసి
భవదురితశాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీతటసంఖాసివారణాసి
పావనక్షేత్రములవాసి వారణాసి
**
తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికే
సరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె
వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం
కరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్'
**
మూలాలు[మార్చు]
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో బుద్ధిమతీ విలాసము నాటకం పుస్తక ప్రతి.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో సత్యహరిశ్చంద్రీయము పుస్తకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో ఉత్తర రాఘవము నాటకం పుస్తక ప్రతి.
- ↑ The Hindu, Cinema (25 February 2012). "Blast From The Past: Sri Sita Rama Jananam (1944)" (in Indian English). M.L. Narasimham. Archived from the original on 18 September 2019. Retrieved 29 September 2020.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch (help) - ↑ జీవిత నౌక (1951) సినిమా పాటల పుస్తకం.
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- నటరత్నాలు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, రెండవ ముద్రణ, 2002 పేజీలు: 370-72.
బయటి లింకులు[మార్చు]
- CS1 Indian English-language sources (en-in)
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా రచయితలు
- తెలుగు రంగస్థల నటులు
- 1881 జననాలు
- 1953 మరణాలు
- తెలుగు నాటక రచయితలు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- గుంటూరు జిల్లా రంగస్థల నటులు
- గుంటూరు జిల్లా సినిమా నటులు
- గుంటూరు జిల్లా సినిమా రచయితలు
- శతక కవులు
- సంస్కృతం నుండి తెలుగు లోకి అనువాదాలు చేసినవారు