తమనపల్లి అమృతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Amrutarao.jpg
విశాఖ స్టిలు ప్లాంటు ఏర్పాటు చేసిన విగ్రహం

తమనపల్లి అమృతరావు (1920 - 1989) ప్రముఖ నాయకుడు, గాంధేయవాది.స్వాతంత్ర్య సమర యోధుడు.మన పుణ్య భూమి వార పత్రిక సంపాదకులు.

జీవిత సంగ్రహనం[మార్చు]

వీరు 1920 అక్టోబరు 21 తేదీన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో ఆరుళప్ప అన్నమ్మ దంపతులకు జన్మించారు. కర్నూలు జిల్లా ప్యాపలిలో చదువుకొన్నారు. వీరికి చిన్నతనం నుండి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. విద్యార్థిగా ఉండగానే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. కొంతకాలం భారత విమానదళంలో పనిచేశారు. తర్వాత నిజాం స్టేట్ రైల్వేలో పనిచేశారు.

వీరు తమ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయదలచి గాంధీజీ మిషన్ అనే సంస్థను స్థాపించారు. తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు.

వీరు 1978లో తాడికొండ నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. షెడ్యూల్డు కులాల శాసనసభ కమిటీ అధ్యక్షుడిగా 1982 నుండి వారి అభ్యున్నతికి కృషిచేశారు. వీరు 1989 ఏప్రిల్ 27 తేదీన పరమపదించారు.

జీవిత భాగస్వామి[మార్చు]

విశాఖ ఉక్కు సాదకులు స్వర్గీయ టి. అమృతరావు గారి సతీమణి శ్రీ చిరంజీవి.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అమృతరావు గారు విశాఖలో ఆమరణ దీక్ష చేస్తున్నప్పుడు ,ఆమె కూడా గుంటూరులో విశాఖ ఉక్కు కోసం పది రోజులు ఆమరణ దీక్ష చేసారు[1]

ఈమె 14 నవంబరు 2018 రాత్రి స్వర్గస్తులైనారు.

నిరాహార దీక్ష[మార్చు]

విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించాలని 1966 అక్టోబరు 15న గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన అమృతరావు అనే నేత విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు.. "విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు"నినాదంతో ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. ఆ ఉద్యమంలో 32 మంది ప్రాణాలను కోల్పోయారు. విద్యార్థులు బందులు నిర్వహించారు. ఈ దీక్ష రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులను కదిలించింది. వామపక్షాలను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, యం.వి.భద్రం, రావిశాస్త్రి తదితరులు ప్రసంగించారు. అమృతరావు దీక్షకు మద్దతుగా జనసంఘ్‌ పార్టీ నాయకులు, ప్రజాపార్టీ నాయకులు దీక్ష చేశారు. నిరాహార దీక్షల వల్ల ఫ్యాక్టరీలు రావని అప్పట్లో కొందరు హేళన చేశారు. మరోవైపు అమృతరావు దీక్ష విరమింపజేయాలని అప్పటి పీసీసీ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, అప్పడు దొర, భాట్టం శ్రీరామ్మూర్తి కొందరు కాంగ్రెస్‌ నాయకులు కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రధాని ఇందిరతో భేటీ అయ్యారు. ప్లాంటు ఏర్పాటుకు ఇందిర సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్పి, అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి 1966 నవంబర్‌ 3న దీక్ష విరమింపజేశారు. ఆ విధంగా విశాఖలో 1971లో ఉక్కు కర్మాగారం ఏర్పడింది.[2]

మూలాలు[మార్చు]

  1. ఆంద్రపత్రిక దిన పత్రిక 30 అక్టోబరు 1966
  2. ఆంధ్రప్రదెశ్ ముఖ్యాంశాలు, ఆంధ్రజ్యోతి దిన పత్రిక 26 జూన్ 2018

బయటి లంకెలు[మార్చు]

1. సాక్షి 21.10.2013 http://epaper.sakshi.com/apnews/Guntur/21102013/Details.aspx?id=2020118&boxid=25333384

2. https://www.facebook.com/photo.php?fbid=1344311392267514&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater