తూర్పు ఆఫ్రికా చీలిక
తూర్పు ఆఫ్రికా చీలిక (ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ - EAR) లేదా తూర్పు ఆఫ్రికా చీలిక వ్యవస్థ (ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ - EARS) అనేది తూర్పు ఆఫ్రికాలో క్రియాశీలంగా ఉన్న ఖండాంతర భూమి చీలిక ప్రాంతం. 2.2-2.5 కోట్ల సంవత్సరాల క్రితం మియోసిన్ ప్రారంభంలో ఈ చీలిక మొదలైంది.[1] గతంలో దీన్ని ఉత్తరాన ఆసియా మైనర్ వరకు విస్తరించి ఉన్న పెద్ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో భాగంగా పరిగణించారు.
సన్నపాటి ఈ చీలిక, విడిపోతున్న టెక్టోనిక్ ఫలకాల వలన ఏర్పడుతోంది. ఇక్కడ ఆఫ్రికన్ ప్లేట్ సోమాలి ప్లేట్, నూబియన్ ప్లేట్ అనే రెండు టెక్టోనిక్ ప్లేట్‌లుగా విడిపోయే ప్రక్రియలో ఉంది. ఇది సంవత్సరానికి 6–7 mమీ. (0.24–0.28 అం.) చొప్పున చీలుతోంది. ఈ చీలిక వ్యవస్థలో మూడు మైక్రోప్లేట్‌లున్నాయి - ఉత్తరాన విక్టోరియా మైక్రోప్లేట్, దక్షిణాన రోవుమా, ల్వాండిల్ మైక్రోప్లేట్‌లు. విక్టోరియా మైక్రోప్లేట్ ఆఫ్రికన్ ప్లేట్‌కు సంబంధించి అపసవ్య దిశలో తిరుగుతోంది. EARSలో యాంత్రికంగా బలహీనమైన, బలమైన లిథోస్పిరిక్ ప్రాంతాల వల్ల ఈ భ్రమణం ఏర్పడుతోంది.[2][3]
ఈ చీలిక వ్యాలీలో (రిఫ్ట్ వ్యాలీ) అనేక మహా సరస్సులు ఉన్నాయి.
పరిధి
[మార్చు]విభిన్నమైన చీలిక బేసిన్లతో కూడిన తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యవస్థ వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.[4] అఫార్ ట్రిపుల్ జంక్షన్‌కు ఉత్తరాన, ఈ చీలిక రెండు మార్గాలను అనుసరిస్తుంది: పశ్చిమాన ఎర్ర సముద్రపు చీలిక, తూర్పున ఏడెన్ గల్ఫ్‌లోని ఏడెన్ రిడ్జ్.
అఫార్ ట్రిపుల్ జంక్షన్ నుండి దక్షిణం వైపున, ఈ చీలికకు రెండు ప్రధాన శాఖలున్నాయి. తూర్పు చీలిక లోయలో (దీన్నే గ్రెగొరీ రిఫ్ట్ అని కూడా పిలుస్తారు) ప్రధాన ఇథియోపియన్ రిఫ్ట్ ఉంది. ఇది అఫార్ ట్రిపుల్ జంక్షన్ నుండి దక్షిణం వైపు వెళ్ళి, దక్షిణంగా కెన్యా రిఫ్ట్ వ్యాలీగా కొనసాగుతుంది,[5] ఆపై కాంగో DR, ఉగాండా, రువాండా, బురుండి, జాంబియా, టాంజానియా, మలావి, మొజాంబిక్ ల గుండా పోతుంది. పశ్చిమ చీలిక లోయలో ఆల్బర్టైన్ రిఫ్ట్, దక్షిణాన మలావి సరస్సు లోయలు ఉన్నాయి.
ఈ చీలిక మొజాంబిక్ తీరం నుండి కెరింబా, లాసెర్డా గ్రాబెన్స్‌ల వెంట కూడా కొనసాగుతుంది. వీటితో, టాంజానియా, మొజాంబిక్ ల మధ్య సరిహద్దులో పశ్చిమ సోమాలి బేసిన్ మీదుగా ఉన్న 2,200 కి.మీ. పొడవైన డేవి రిడ్జ్ కలుస్తుంది. డేవి రిడ్జ్ వెడల్పు 20-120 కి.మీ. ఉంటుంది.
వాతావరణంపై ప్రభావం
[మార్చు]తూర్పు ఆఫ్రికా చీలిక వ్యవస్థ ప్రాంతీయ, ఖండాంతర, ప్రపంచ వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తూర్పు ఆఫ్రికాలో పల్లపు ప్రాంతాలు పాక్షికంగా పొడిగా, పొడిగా ఉండగా, ఇథియోపియన్ హైలాండ్స్, కెన్యా హైలాండ్స్‌తో వంటి ఎత్తైన ప్రాంతాల్లో అధిక వర్షపాతం కలుగుతుంది. విక్టోరియా సరస్సుతో సహా, చీలికలో ఏర్పడే సరస్సులు ప్రాంతీయ వాతావరణంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. నీటి ఆవిరికి అవే మూలం. తూర్పు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో వాతావరణాన్ని ప్రభావితం చేసే సరస్సుల గాలి వ్యవస్థల ఏర్పాటుకు ఇవి మూలం. ఉత్తర కెన్యాలోని తుర్కానా ఛానల్, జాంబేజీ నది లోయతో సహా చీలిక వ్యవస్థలో తూర్పు నుండి పడమరగా ఉండే నదీ లోయలు, తక్కువ-స్థాయి తూర్పు గాలులను కేంద్రీకరించి, వాటిని మధ్య ఆఫ్రికా వైపుగా వేగంగా నడిపిస్తాయి. దీనివలన తూర్పు ఆఫ్రికా ఇతర ప్రాంతాల కంటే పొడిగా ఉంటుంది. కాంగో బేసిన్ లోని వర్షారణ్యాల్లో అధిక వర్షపాతానికి తోడ్పడుతుంది. మిలియన్ల సంవత్సరాల అవధుల్లో తూర్పు ఆఫ్రికా పొడిబారడానికి, తూర్పు-పడమర లోయల ఉద్భవం ముఖ్యమైన కారణం.
తూర్పు ఆఫ్రికా చీలిక వ్యవస్థ వలన ఏర్పడిన అవరోధం కారణంగా రుతుపవనాలు (సోమాలి జెట్ అని పిలుస్తారు) పశ్చిమ హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమౌతాయి. సోమాలి జెట్, భారతీయ రుతుపవనాల సమయంలో అధిక వర్షపాతం కలిగేలా నీటి ఆవిరిని సరఫరా చేస్తుంది.
మానవ పరిణామ సంబంధ ఆవిష్కరణలు
[మార్చు]తూర్పు ఆఫ్రికాలోని చీలిక లోయ, మానవ పరిణామాన్ని అధ్యయనం చేయడానికి పనికివచ్చే అనేక హోమినిడ్ శిలాజాలకు మూలం.[4][6] ఎత్తైన ప్రాంతాలు వేగంగా క్షీణించడంతో, ఈ లోయ అవక్షేపాలతో నిండిపోయింది. తద్వారా అవశేషాల సంరక్షణకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. మానవ శాస్త్రవేత్త డొనాల్డ్ జోహన్సన్ కనుగొన్న 30 లక్షల సంవత్సరాల నాటి పాక్షిక ఆస్ట్రలోపిథెసిన్ అస్థిపంజరం "లూసీ"తో సహా ఆధునిక మానవులకు చెందిన అనేక హోమినిడ్ పూర్వీకుల ఎముకలు ఇక్కడ లభించాయి. రిచర్డ్ లీకీ, మేరీ లీకీ కూడా ఈ ప్రాంతంలో గణనీయమైన కృషి చేసారు.[7] 2008 లో, ఇక్కడ మరో రెండు హోమినిడ్ పూర్వీకుల శిలాజాలను కనుగొన్నారు. తూర్పు ఇథియోపియాలోని అఫార్ చీలికలో కనుగొన్న కోటి సంవత్సరాల నాటి కోరోరాపిథెకస్ అబిసినికస్, కోటి సంవత్సరాల వయస్సు గల నకాలిపిథెకస్ నకాయమై లు వీటిలో ఉన్నాయి.[8]
ఇవి కూడా చూడండి
[మార్చు]- బైకాల్ రిఫ్ట్ జోన్
- విక్టోరియా సరస్సు
మూలాలు
[మార్చు]- ↑ (April 2005). "Continental break-up: The East African perspective".
- ↑ Osborne, Hannah (9 June 2020). "One of Africa's Tectonic Plates Is Rotating in a Different Direction to All the Others". Newsweek.
- ↑ GFZ GeoForschungsZentrum Potsdam, Helmholtz Centre (8 June 2020) "Why the Victoria Plate in Africa rotates" Science Daily
- ↑ 4.0 4.1 Corti, G. "The Ethiopian Rift Valley". National Research Council of Italy, Institute of Geosciences and Earth Resources. Retrieved 19 March 2014.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ "Great Rift Valley Ecosystem – UNESCO World Heritage Centre". UNESCO. Retrieved 14 March 2008.
- ↑ . "Profile: Michel Brunet: One Scientist's Quest for the Origin of Our Species".
- ↑ Seward, Liz (2007). "Fossils belong to new great ape". BBC News London. Retrieved 14 March 2008.