Jump to content

తెలంగాణ ఆసరా పింఛను పథకం

వికీపీడియా నుండి
తెలంగాణ ఆసరా పింఛను పథకం
ఆసరా పింఛను పథకం చిహ్నం
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఆసరా పింఛను పథకం, వృద్ధుల, వికలాంగులకు ఇవ్వవలసిన పింఛను కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు, హెచ్.ఐ.వి. - ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు. దేశంలోనే బీడి కార్మికులకు ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.[1]

ప్రతిపాదన-అమలు

[మార్చు]

పింఛన్లను పెంచుతామని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.200 నుంచి రూ. 1000, వికలాంగులకు రూ.500 నుంచి 1500 రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించాడు.[2]

రెండవసారి ఎన్నికల తరుణంలో మరోసారి పింఛన్లను పెంచుతామని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2018 డిసెంబరు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ. 2,016, వికలాంగులకు రూ.1,500 నుంచి 3,016 రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించాడు.[2] ఈ పెరిగిన పింఛన్లు 2019, ఏప్రిల్ 1 నుండి ఇవ్వబడుతున్నాయి.

2020, మార్చి 8 ఆదివారం నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వృద్దులకు ఇచ్చేపెన్షన్ అర్హత వయసును 65 ఏళ్ళ నుండి 57 ఏళ్ళకు తగ్గించింది. దీంతతో ఆసరా లబ్ధిదారుల సంఖ్య 7 నుంచి 8 లక్షలకు పెరిగింది. ఈ పథకంకోసం 2019-20లో రూ. 9402 కోట్లు కేటాయించగా, 2020-21 బడ్జెట్‌లో రూ. 2356 కోట్లు పెంచి రూ.11758 కోట్లు కేటాయింపులు చేశారు. అర్హత వయసు కుదించడంతో వృద్ధాప్య కేటగిరిలో అదనంగా ఏడు లక్షలమందికి లబ్ధి చేకూరనుంది. దాంతోపాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిష్కరిస్తూ దాదాపు మరో లక్ష మందికి ఆసరా అందనుంది. దీనివల్ల ఈ పథకంలో లబ్ధి దారుల సంఖ్య దాదాపు 47 లక్షలకు చేరింది.[3]

భర్త చనిపోతే ఆయన భార్యకు వెంటనే ఆసరా పింఛన్‌ అందించేందుకు ప్రభుత్వం 2023 జనవరి 10న ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య పింఛను పొందుతున్న వ్యక్తి చనిపోతే, ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఆధార్‌ కార్డు, మృతుడి డెత్‌ సర్టిఫికెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను పంపించి మృతుని భార్యకు ఆసరా పింఛను మంజూరు చేసేలా ఆసరా పోర్టల్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.[4][5]

2023, జూన్ 9న మంచిర్యాలలో జరిగిన సభలో వికలాంగుల ఫించను రూ. 3,016 రూపాయల నుండి రూ. 4,106 లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించాడు.[6] ఈ పెరిగిన పింఛన్లు 2023, జూలై నుండి ఇవ్వబడుతున్నాయి.[6][7] మెదక్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల ప్రారంభోత్సవం సందర్భంగా 2023, ఆగస్టు 23న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది.[8]

బడ్జెట్ వివరాలు

[మార్చు]
  • 2016-17 బడ్జెటులో ఆసరా పింఛన్లకు 4,693 కోట్ల రూపాయలు కేటాయించబడింది.
  • 2017-18 బడ్జెటులో ఆసరా పింఛన్లకు 5,330 కోట్ల రూపాయలు కేటాయించబడింది.

2016 నాటికి ఇస్తున్న పింఛన్లు సంఖ్య

[మార్చు]
2016 నాటికి ఇస్తున్న పింఛన్లు సంఖ్య తాజాకరించు
నెం పెన్షన్ రకం పెన్షన్ రూపాయలు లబ్ధిదారుల సంఖ్య
1 వృధ్ధులు 2016 12,27,824
2 వితంతువులు 2016 14,33,837
3 వికలాంగులు 3016 4,92,680
4 చేనేత కార్మికులు 2016 36,872
5 కల్లు గీత కార్మికులు 2016 62,164
6 బీడి కార్మికులు 2016 4,07,374
7 ఒంటరి మహిళలు 2016 1,33,936
8 ఎచ్.ఐ,వి. రోగులు 2016 32,718
9 బోదకాలు 2016 14,907
10 కళాకారులు 2016 30,487
మొత్తం 38,42,312
  • వృధ్ధులు - 12,27,824 మంది
  • వికలాంగులు - 4,92,680 మంది
  • వితంతువులు - 14,33,837 మంది
  • చేనేత కార్మికులు - 36,872 మంది
  • కల్లు గీత కార్మికులు - 62,164 మంది
  • బీడి కార్మికులు - 4,07,374 మంది
  • ఒంటరి మహిళలు - 1,33,936
  • HIV రోగులు - 32,718
  • మలేరియా - 14,907
  • కళాకారులు - 30,487 మంది
  • మొత్తం - 38,42,312 మంది[9]

జిల్లాలా వారిగా ఇస్తున్న ఫింఛన్ల సంఖ్య[10]

పింఛను పథకానికి అర్హతలు

[మార్చు]
  • వృద్ధులు: ది. 01.04.2019 నుండి 57 సంవత్సరాలు ( ది. 31.03.2019 వరకు 65 సంవత్సరాలు) లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వృధ్ధులు ఆసరా పింఛను పథకానికి అర్హులు. జనన ధ్రువీకరణ పత్రము లేదా ఆధార్ కార్డు లేదా వయస్సుని సూచించే ఏదైనా ఇతర పత్రములు ధరఖాస్తుకు అవసరమవుతాయి. పైన తెలిపిన పత్రాలు లేకపోతే గవర్నమెంటు అధికారి లభ్ధిదారుని పిల్లల వయస్సు, మనుమలు, మనుమరాళ్ళ వివాహ వయస్సు ఆధారంగా గుర్తించవచ్చు అలా గుర్తించలేని పరిస్థితిలో మెడికల్ బోర్డుకు సూచిస్తారు.
  • చేనేత కార్మికులు: 50 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వారు అర్హులు.
  • వితంతువులు: 18 సంవత్సరాలు నిండినవారై, భర్త మరణ ధ్రువీకరణ పత్రము కలిగిన వారు అర్హులు. నిర్ధారణ సమయంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి. మరణ ధ్రువీకరణా పత్రం లేకపొతే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మూడు నెలల్లో ధ్రువీకరణ పత్రం పొందాలి. లబ్ధిదారుని పునర్వివాహం విషయంలో విలేజి సెక్రెటరీలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి.
  • కల్లు గీత కార్మికులు: 50 సంవత్సరాలు నిండినవారై ఉండాలి. లబ్ధిదారుడు కల్లు గీత కార్మికుల సహాయక సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి.
  • వికలాంగులు: వీరికి వయస్సుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం వైకల్యం కలిగి ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారైతే 51 శాతం వైకల్యం కలిగి ఉండాలి. వికలాంగులకు అందించే SADAREM సర్టిఫికెట్ లో 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు.
  • హెచ్.ఐ.వి - ఎయిడ్స్ ఉన్నవారు: యాంటీ రిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్నవారు అర్హులు. వ్యాధిని నిర్ధారిస్తూ ఏదైనా ఆసుపత్రి యాజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిర్ధారణ సమయంలో అవసరమవుతాయి.

సామాజిక-ఆర్ధిక అనర్హతలు:

[మార్చు]

వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం ఆసరా పింఛను పథకాన్ని ప్రారంభించారు. మిగతావారు ఈ ఆసరా పింఛను పథకానికి అనర్హులు. ఈ క్రింద పేర్కొన బడినవారు ఆసరా పింఛను పథకానికి అనర్హులు:

  1. 3 ఎకరాల సాగునీటి సదుపాయం ఉన్న భూమి/ 7.5 ఎకరాల బీడు భూమి ఉన్నవారు
  2. ప్రభుత్వ/ప్రభుత్వ రంగ / ప్రైవేటు రంగ /కాంట్రాక్టరు ఉద్యోగం ఉన్న పిల్లలు కలవారు
  3. వైద్యులు, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన పిల్లలు కలవారు
  4. పెద్దవ్యాపార సంస్థలు (నూనె మిల్లులు, బియ్యం మిల్లులు, పెట్రోలుపంపులు, షాపు యజమానులు) ఉన్న వారు
  5. ఇప్పటికే ప్రభుత్వం నుండి పింఛను పొందుతున్నవారు
  6. తేలికపాటి, భారీ వాహనములు కలిగినవారు
  7. జీవన శైలి, వృత్తి, ఆస్తుల ఆధారంగా అనర్హులని అధికారులచే గుర్తించబడ్డ కుటుంబాలు మొదలైన వారు ఆసరా పింఛను పథకానికి అర్హులు కాదు.

పింఛనుకు అర్హులు:

[మార్చు]

ఈ క్రింద పేర్కొన బడినవారు ఆసరా పింఛను పథకానికి అర్హులు:

  1. ఆది వాసి, అసహాయ గిరిజన గ్రూపుల వారు
  2. మహిళల నేతృత్వంలోని కుటుంబాలు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేనివారు
  3. వికలాంగుల కుటుంబాలవారు
  4. వికలాంగులు, వితంతువులు తప్ప అన్ని రకాల ఆసరా పింఛనుకు కుటుంబములో ఒక్కరు మాత్రమే అర్హులు
  5. భూమి లేని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కళాకారులు (కుమ్మరి, చేనేత, వడ్రంగి, కమ్మరి) మురికి వాడల ప్రజలకు, రోజు వారీ వేతనం మీద ఆధార పడే వారు, పూలు, పండ్ల వ్యాపారులు, రిక్షా కార్మికులు, పాము మంత్రం వేయువారు, చెప్పులు కుట్టేవారు, నిరాశ్రయులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందినవారు.
  6. ఇళ్ళు లేని వారు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో తాత్కాలిక గృహ నివాసాలను ఏర్పాటు చేసుకున్నవారు
  7. వృధ్ధులు, వితంతువులు, వికలాంగులు, జీవనాధారం లేని వ్యక్తుల నేతృత్వంలోని కుటుంబాలు మొదలైన వారు

దరఖాస్తుల స్వీకరణ

[మార్చు]
  1. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతి సెక్రెటరి/విలేజి రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతాలలో బిల్ కలెక్టరు దరఖాస్తులను పరిశీలిస్తారు.
  2. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ/జోనల్ అధికారి, దరఖాస్తులను పరిశీలించి వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే మార్గదర్శకాల ఆధారంగా పింఛను మంజూరు చేస్తారు.
  3. లబ్ధిదారులను గుర్తించే క్రమంలో గృహ సర్వే సమాచారాన్ని, జనాభా లెక్కలను, వికలాంగులు, వితంతువులు, వృధ్ధులు, కమ్యూనిటీలకు చెందిన వివిధ వర్గాలను పరిగణలోనికి తీసుకుంటారు.
  4. దరఖాస్తు పరిశీలనలో లేదా ఆకస్మిక తనిఖీలో ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నచో, అటువంటి వారిపై క్రమశిక్షణా చర్య తీసుకుంటారు లేదా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేస్తారు.

ఇతర వివరాల కోసం

[మార్చు]
  1. టోల్ ఫ్రీ నంబరు: 1800-200-1001
  2. ఇ-మెయిల్: aasarapensions@gmail.com
  3. అధికారిక వెబ్ సైట్: http://www.aasara.telangana.gov.in/

మూలాలు

[మార్చు]
  1. "ఆసరాతో భరోసా... ఆడుతూ..పాడుతూ.. బీడీలు చుడుతూ..!". Sakshi. 2019-03-24. Archived from the original on 2022-06-30. Retrieved 2022-06-30.
  2. 2.0 2.1 తెలంగాణ రాష్ట్ర అధికారిక జాలగూడు. "Beedi karmika Aasara Pension Scheme". www.telanganastateofficial.com. Archived from the original on 2 ఏప్రిల్ 2016. Retrieved 3 February 2017.
  3. "తెలంగాణ వృద్ధులకు శుభవార్త.... పెన్షన్ అర్హత వయసు 57 ఏళ్లకు కుదింపు". Samayam Telugu. 2020-03-09. Archived from the original on 2021-01-30. Retrieved 2021-11-23.
  4. "వితంతువులకు ఆసరా." EENADU. 2023-01-18. Archived from the original on 2023-01-20. Retrieved 2023-01-20.
  5. telugu, NT News (2023-01-11). "భర్త చనిపోతే భార్యకు 'ఆసరా'". www.ntnews.com. Archived from the original on 2023-01-11. Retrieved 2023-01-20.
  6. 6.0 6.1 Velugu, V6 (2023-06-10). "ధరణి పోతే దళారీ రాజ్యం వస్తది". V6 Velugu. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. "సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పెన్షన్ రూ.4116కు పెంపు". Samayam Telugu. 2023-06-09. Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-10.
  8. telugu, NT News (2023-08-23). "CM KCR | మెదక్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-25. Retrieved 2023-08-25.
  9. ఆసరా, తెలంగాణ. "Tentative Live Pensioners in Telangana State". www.aasara.telangana.gov.in. Retrieved 3 February 2017.
  10. ఆసరా, తెలంగాణ. "Aasara Scheme-Tentative Live Pensioners in Telangana State". www.aasara.telangana.gov.in. Retrieved 3 February 2017.