Jump to content

తెలుగు నాటకరంగ దినోత్సవం

వికీపీడియా నుండి
తెలుగు నాటకరంగ దినోత్సవం
తెలుగు నాటకరంగ దినోత్సవం
కందుకూరి వీరేశలింగం పంతులు
యితర పేర్లుతెలుగు రంగస్థల దినోత్సవం
జరుపుకొనే రోజుఏప్రిల్ 16
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

తెలుగు నాటకరంగ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న నిర్వహించబడుతుంది. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడం జరిగింది.[1][2]

ప్రారంభం

[మార్చు]

నాటక ప్రదర్శనతోపాటు నాటకానికి సంబంధించిన అనేక అంశాలపై సదస్సులు జరగాలని, నాటక కళాకారుల జయంతులను వర్ధంతులను నిర్వహించడం ద్వారా ప్రజల్లో నాటక కళ పట్ల ఉత్సాహం, విలువలు పెరుగుతాయని, వీటన్నింటిని సమతుల్యం చేసేలా ఉండేందుకు నాటకరంగ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలుగు నాటక కళాకారులు భావించారు. అయితే, ఏ రోజును నాటకరంగం దినోత్సవంగా చేయాలన్న అంశంపై అనేక చర్చలు జరిగాయి. అనేకమంది అనేక పేర్లూ, తేదీలు సూచించారు.[3]

దీనికి 2000వ సంవత్సరంలో బీజం పడింది. 2000వ సంవత్సరంలో కొంతమంది యువనాటక కళాకారులతో కలిసి డా. పెద్ది రామారావు ఆధ్వర్యంలో యవనిక త్రైమాసిక నాటకరంగ పత్రిక ప్రారంభమయింది. నాలుగేళ్ళపాటు నడిచిన ఈ పత్రికలో ప్రపంచ, భారతీయ, తెలుగు నాటకరంగాలకు సంబంధించి నాటక ముఖ్యులు, ఔత్సాహికులు రాసిన అనేక వ్యాసాలను యవనిక ప్రచురించడంతోపాటు నాటకరంగ కార్యక్రమాలు, నాటకోత్సవాలను కూడా నిర్వహించింది. నాటకరంగాన్ని మరింత పటిష్టపరచడంకోసం ఇతర దేశాల, రాష్ట్రాల నాటకరంగానికి ఉన్నట్లుగా తెలుగు నాటకరంగానికి కూడా ఒక దినోత్సవం ఉంటే బాగుంటుందని భావించి, "ఏప్రిల్ 16 తెలుగు నాటక దినోత్సవం" శీర్షికతో 2000 ఏప్రిల్-జూన్ ప్రత్యేక యవనిక సంచికను ప్రచురించింది. యవనిక ఆలోచనకు "ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక" సహకారం తోడైంది. తెలుగు నాటక కళాకారులంతా నాటకరంగ దినోత్సవ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు.[4]

19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపంచేశాడు.[5] అంతేకాకుండా తెలుగు నాటకరంగంలో తొలి నాటక సమాజాన్ని కూడా వీరేశలింగమే స్థాపించాడు. ఆధునిక తెలుగు నాటకరంగానికి విశిష్ట సేవలను అందించిన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని వివిధ నాటక సంస్థలు 2001 నుండి తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరిపాయి.

ఈ క్రమంలో డా. కె.వి. రమణాచారి ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగా, కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటిస్తూ 2007 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ. విడుదలచేసింది. 2007, ఏప్రిల్ 16న తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగు నాటకరంగ దినోత్సవం జరుపబడింది.[6]

కార్యక్రమాలు

[మార్చు]

వివిధ సంస్థల ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా అనేక ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారు. తెలుగు నాటకరంగంలో విశేష కృషి చేసిన నాటక కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, బిరుదులు అందజేస్తారు.

  1. 2011: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ - ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగంణం (విజయవాడ) - కందుకూరి జయంతి కార్యక్రమం, గయోపాఖ్యానం నాటక ప్రదర్శన[7]
  2. 2016: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, నాటకరంగ అభివృద్ధి సంస్థ - గురజాడ కళాభారతి ఆడిటోరియం (విజయనగరం) - కందుకూరి జయంతి కార్యక్రమం, మీరైతే ఏం చేస్తారు నాటక ప్రదర్శన[8]
  3. 2016: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, నాటకరంగ అభివృద్ధి సంస్థ - వైఎంహెచ్‌ఎ హాలు (ఏలూరు) - కందుకూరి జయంతి కార్యక్రమం, కందుకూరి విశిష్ట పురస్కారాల అందజేత, గరుత్మంతుడు గర్వభంగం పౌరాణిక పద్మనాటకం ప్రదర్శన[9]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, కరీంనగర్ (16 April 2019). "సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యానికి కృషి". Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.
  2. విశాలాంధ్ర, ప్రకాశం (16 April 2011). "వీరేశలింగం పంతులు గొప్ప సంఘ సంస్కర్త". Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.
  3. ఎందుకీ తెలుగు నాటక దినోత్సవం ?, సి.హెచ్. నటరాజ్, యవనిక (రంగస్థల త్రైమాసపత్రిక), ఏప్రిల్-జూన్ 2001, పుట.3
  4. ఏప్రిల్ 16 తెలుగు నాటక దినోత్సవం, డా. పెద్ది రామారావు, యవనిక (రంగస్థల త్రైమాసపత్రిక), ఏప్రిల్-జూన్ 2000.
  5. సాక్షి, ఫీచర్స్ (16 April 2015). "కలమే కరవాలం.. సంస్కరణే కలకాలం..." డా. పి.వి. సుబ్బారావు. Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.
  6. విశాలాంధ్ర, ప్రకాశం (16 April 2011). "వీరేశలింగం పంతులు గొప్ప సంఘసంస్కర్త". Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2020.
  7. The Hindu, Friday Review (Theatre) (21 April 2011). "Telugu theatre day celebrated". P. Surya Rao. Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.
  8. ప్రజాశక్తి, విజయనగరం (16 April 2016). "నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం". Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.
  9. ప్రజాశక్తి, పశ్చిమ గోదావరి (15 April 2016). "నేడు ఏలూరులో తెలుగు నాటకరంగ దినోత్సవం". Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.