దరిశి అన్నపూర్ణమ్మ
దరిశి అన్నపూర్ణమ్మ తెలుగు కవయిత్రి, సామాజిక కార్యకర్త, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె 1907లో బళ్ళారిలో రొట్టగల్ నీలప్ప, గౌరమ్మ దంపతులకు జన్మించింది. బాల్యంలో తండ్రి మరణించాడు. దీనితో బంధువులు గౌరమ్మను మైత్రేయ దివ్యజ్ఞాన మహిళా సమాజంలో చేర్చారు. ఆ సమాజ సభలు సమావేశాల కారణంగా ఆమె తల్లి గౌరమ్మ తరచుగా చెన్నైలోని అడయారు వస్తుండేది. తల్లి ఇలా వస్తున్న కారణంగా ఆమె అడయారు థియోసాఫికల్ సొసైటీలో చదువుకొన్నది. ఆర్యవైశ్యుల కులానికి చెందిన వారి కులంలో స్త్రీ విద్యకు అవకాశం ఉండేది కాదు. ఆమెకు విప్లవవాదిగా ప్రసిద్ధి పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు దరిశి చెంచయ్యతో వివాహమయింది. అతను వృత్తి రీత్య వ్యవసాయ శాస్త్రజ్ఞుడు అయినా స్త్రీ జనోద్ధరణకు అధికంగా కృషిచేసాడు. ప్రముఖ సంఘసంస్కర్తగా పేరు గడించాడు. వివాహానంతరం ఆమె బాల వితంతువుకు వివాహం చేయాలని సంకల్పించింది. ఆ కాలంలో ఆర్యవైశ్య కులాల్లో అటువంటి వివాహాలు జరుగలేదు. ఆమె భర్తతోకలసి తమ కులానికి చెందిన 12 యేళ్ళ వితంతువుకు 1926లో గుంటూరులో వైభవంగా వివాహం జరిపించింది. అప్పటి సమాజంలో కొందరికి ఈ వివాహం నచ్చక అల్లరిచేయడమే కాక రాళ్ళ వాన కురిపించారు. 18 యేళ్ళ అన్నపూర్ణమ్మ అందరికీ ధైర్యం చెప్పి ముందుకు సాగిపొమ్మని ప్రోత్సహించింది. ఆ కార్యక్రమం సజావుగా సాగింది. ఆమె గద్దర్ పార్టీ స్థాపించింది. చెంచయ్య కూడా అందులో సభ్యునిగా చేరాడు. ఆ పార్టీకి చెందిన పంజాబీ యువకులు దేశభక్తి అనేది తమ సొత్తు అనే భావాన్ని ప్రదర్శించేవారు. ఈ చర్య వీరికి నచ్చేది కాదు. దేశభక్తి అనేది ప్రతి ఒకరికీ ఉంటుందనేది ఆమె అభిప్రాయం. బ్రిటిష్ సైన్యంలో మొదట పేరిచ్చి చేరిన పంజాబీ యువకులు విదేశాల్లో యుద్ధం చేస్తూ దేశభక్తి అని గర్వించవలసిన అవసరం లేదని వాదించింది. దీంతో గద్దర్ పార్టీలో గౌరవం పెరిగింది. చివరకు వీరు స్వదేశానికి బయలుదేరారు. బ్రిటిష్ ప్రభుత్వం నడిదారిలో రాజద్రోహిగా పేర్కొని అరెస్టు చేసి నాలుగున్నరేళ్ళు భారతదేశపు జైల్లో ఉంచారు. జైలు అధికారులు వీరిని తిప్పలు పెట్టారు. 1929లో బొంబాయిలో జరిగిన అఖిలభారత మహాసభకు ప్రతినిధులుగా హాజరైన తెలుగుదేశపు సభ్యురాండ్రలో ఈమె కూడా ఉంది[2]. ఆమె నిత్యం ఖద్దరు ధరించేది. ఆమె వర్ణాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు, కులం అడ్డుగోడలు లేని విశాల హిందూ సంఘాన్ని ఆమె వాంఛించేది. పాప పంకిలంతో కూరుకుపోయిన దేవదాసీల ఉద్దరణకు ఆమె కృషిచేసింది.[3]
ఆమె నవంబరు 28, 1931న తన 25వ యేట గుండెపోటుతో మరణించింది[2].
మూలాలు
[మార్చు]- ↑ Women Writing in India: 600 B.C. to the early twentieth century By Susie J. Tharu, Ke Lalita పేజీ.452 [1]
- ↑ 2.0 2.1 కె.ఎన్.కేసరి (1 January 1932). "కీ.శే.దరిశి అన్నపూర్ణమ్మ (సంపాదకీయం)". గృహలక్ష్మి మాసపత్రిక. 4 (11): 949–950. Retrieved 23 May 2020.[permanent dead link]
- ↑ "సమతకి మారుపేరు దరిశి అన్నపూర్ణమ్మ".[permanent dead link]