1790ల వరకూ మైసూరు సామ్రాజ్యంలో భాగంగా ఉండే ప్రాంతమిది. 1796-98 ప్రాంతాల్లో మూడవ మైసూరు యుద్ధంలో బ్రిటీష్ వారి చేతిలో టిప్పుసుల్తాన్ ఓటమిపాలు కావడంతో మైసూరు సామ్రాజ్యంలోని భాగాలను కొన్నిటిని విజేతలు పంచుకున్నారు. విజేతలైన ఈస్టిండియా కంపెనీ వారు తమ మద్రాసు ప్రెసిడెన్సీకి, యుద్ధంలో సహాయం చేసిన మిత్రుడు నిజాం రాజుకి పంపకాలు పెట్టినప్పుడు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలు నిజాం కిందికి వచ్చాయి. తీరా రెండేళ్ళు గడవకుండానే 1800లో బ్రిటీష్ వారు నిజాం నుంచి తమకు రావాల్సిన సైన్యం ఖర్చుల బాకీ పద్దుకింద ఆ ప్రాంతాన్ని అంతా లెక్కకట్టుకోవడంతో ఇది తిరిగి ఈస్టిండియా కంపెనీ చేతికి వచ్చింది. అలా బ్రిటీష్ వారు నిజాం నుంచి పొందినందుకు ఈ ప్రాంతానికి దత్తమండలం అన్న పేరు స్థిరపడింది[1].