దాదాసాహెబ్ ఫాల్కే

వికీపీడియా నుండి
(దాదా సాహెబ్ ఫాల్కే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే
దాదాసాహెబ్ ఫాల్కే
జననంధుండిరాజ్ గోవింద్ ఫాల్కే
ఏప్రిల్ 30, 1870
మరణంఫిబ్రవరి 16, 1944
ఇతర పేర్లుభారతీయ సినిమా పితామహుడు
ప్రసిద్ధిభారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగాడు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కాడు

ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి.[1]. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు నిర్మించాడు.

బాల్యం

[మార్చు]

ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే మహారాష్ట్ర సమీప త్రయంబకేశ్వర్ లో 1870 ఏప్రిల్ 30 న జన్మించాడు. ఫాల్కె తండ్రితో ఉద్యోగ నిమిత్తం బొంబాయి చేరాడు. కళాత్మక అభిరుచి ఉండటంతో 1885 లో జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. చిత్రలేఖనం చేర్చుకున్నాడు. బరోడా లోని ప్రఖ్యాత "కళాభవన్"లో ఫోటోగ్రఫీ, మౌల్డింగ్, ఆర్కిటెక్చర్ వంటి అనేక కళలనే కాక మాజిక్ విద్యను కూడా నేర్చుకున్నాడు.

ప్రారంభ దశలో డ్రామా కంపెనీల నిమిత్తం ఒక ఫోటోగ్రఫర్ గా, సీన్ పెయింటర్ గా జీవితాన్ని మలుచుకున్నాడు. ఆర్కియాలాజికల్ ప్రభుత్వ శాఖలో డ్రాప్ట్స్ మన్, ఫోటోగ్రాఫర్ గా 1903 లో చేరాడు. రాజా రవివర్మ పెయింటింగ్ లను ఆకళింపు చేసుకుని, ఒక ఎగ్జిబిషన్ లో తాను రచించిన తైల వర్ణ చిత్రాలను ప్రదర్శించి రజత పతకం పొందాడు. తర్వాత "స్వదేశీ ఉద్యమం"లో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగానికి తిలోదకాలిచ్చి, స్వతంత్ర జీవనంలోకి ప్రవేశించాడు.

రాజా హరిశ్చంద్ర 1913, దాదాసాహెబ్ ఫాల్కేచే దర్శకత్వం వహింపబడింది.

లఘుచిత్రం నిర్మాతగా

[మార్చు]

భవిష్యత్తు అగమ్య గోచరమై మనసు చెడిపోయి 1910 డిసెంబరు 25 సాయంత్రం "అమెరికా-ఇండియా సినిమా"లో "లైఫ్ ఆఫ్ క్రీస్ట్" సినిమాను చూశాడు. అతని అశాంతి, నిర్వేదం మటుమాయమయ్యాయి. తెరమీద జీసస్ క్రీస్తు ప్రతిబింబాలు కదలడమే అతనికి అనేక రాత్రులు నిద్రలేకుండా చేశాయి. రాముడు, కృష్ణుడు రూపనిర్మాణాలు అతని మస్తిష్కంలో ఊపిరి పోసుకున్నాయి. ఇక, బైస్కోపులన్నిటినీ వరుసగా చూడనారంభించాడు. రెండు నెలల పాటు ధియేటర్లలో కూర్చుని, "మనం ఈ విధంగా చేయలేమా?" అన్న ప్రశ్న వేసుకుని ఉద్యమించే తపనను పెంచుకున్నాడు.

నలభై ఏళ్ళ వయసు వచ్చినా స్థిరమైన ఆదాయం లేదు. స్థిరాస్థులు లేవు. భవిష్యత్తు అభద్రతతో, నిశీధితోనూ ఉంది. ఉన్న కొద్దిపాటి డబ్బును మూట కట్టాడు. చిత్రీకరణకు సంబంధించి పరికరాల జాబితాలు, పుస్తకాలు యితర వస్తు సముదాయం పోగు చేయడం ప్రారంభించాడు. విస్తృతంగా చదివాడు. అసంఖ్యాక బైస్కోపులను చూశాడు. రోజుకు మూడే మూడు గంటలు నిద్రపోయేవాడు. అవిరామ శ్రమకు తోడు ఆదుర్దా, మానసిక పరిశ్రమ ఉండటంతో దృష్టి లోపం దాపురించింది.

ఎట్టకేలకు, లండన్ తదితర పాశ్చాత్య దేశాలకు వెళ్లాడు. తన ప్రయోగాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రయత్నించాడు. అయిదు పొండ్లకు సాధారణ కెమేరా తో స్వదేశం చేరాడు. ఒక బఠాణీ చెట్టు ఎదుగుదలను ఒక లఘుచిత్రం తీసి, తన పూర్వ స్నేహితుడు యశ్వంత్ నాదకర్ణి కి చూపాడు. అతని వద్ద కొంత పెట్టుబడిని సంపాదించాడు. తన బీమా పాలసీని కుదువబెట్టి మరో పదివేల రూపాయలు ఋణంగా తీసుకున్నాడు.

రాజా హరిశ్చంద్ర

[మార్చు]

1912, ఫిబ్రవరి 1 న లండను వెళ్ళి, 'బైస్కోప్' వారపత్రిక ఎడిటర్ కాబౌర్న్ ను కలిశాడు. అతను ప్రారంభంలో నిరుత్సాహపరిచినా ఆ తరువాత ఎంతో సాయం చేశాడు. ఏప్రిల్ 1 న ఒక కొత్త కెమేరాతో తిరిగి వచ్చాడు. ఒక 200 అడుగుల చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల మీద తీశాడు. శ్రీమతి సరస్వతీ బాయి ఫాల్కే తన బంగారు ఆభరణాలనన్నింటినీ అమ్మి డబ్బు సమకూర్చింది. ఇక నటీనటుల సమస్య ఎదురైంది. నటించడమే అతి హేయమైన, నీచ కార్యంగా భావించిన ఆ రోజుల్లో నటీమణులకోసం వేశ్యా వాటికలకు తెగ తిరిగాడు. ఆఖరుకు హోటల్ కార్మికుడు సాలుంకి హరిశ్చంద్రుని భార్య తారామి (చంద్రమతి) పాత్రను పోషించారు.

1913, ఏప్రిల్ 21 న " ఒలెంపియా సినిమా" ధియేటర్ లో ప్రీవ్యూ ఏర్పాటు చేసి "రాజా హరిశ్చంద్ర"ను తిలకించడానికి అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాడు. మే 13 నుంచి వాణిజ్యపరంగా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. "కార్పొరేషన్ సినిమా" ధియేటర్ లో వరుసగా 23 రోజులు ప్రదర్శించి రికార్డు బద్దలు కొట్టాడు.

మోహినీ భస్మాసుర, సావిత్రీ సత్యవాన్

[మార్చు]

మలిచిత్ర నిర్మాణానికి స్వగ్రామం నాసిక్ కు వెళ్ళి, మూడు నెలల కాలంలో "మోహినీ భస్మసుర" చిత్రీకరించి, 1914 జనవరిలో విడుదల చేశాడు. ఆంగ్ల సినిమా ప్రదర్శనకు మాదిరిగా, ఈ సినిమా ప్రదర్శనలో ఒక రీలు కామెడీ చిత్రం "పిధాచెపజ"ను జతపరిచాడు. మొదటి రెండు సినిమాలు దిగ్విజయం సాధించగా "సావిత్రి సత్యవాన్"ను చిత్రీకరించి 1914 లో విడుదల చేసాడు. ఆదాయం కుప్పలు తెప్పలుగా వచ్చి పడటంతో ఋణ సౌకర్యం కూడా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుకున్నాయి. ప్రతి చిత్రానికి 20 కాపీల వరకు డిమాండును సాధించుకోగలిగాడు.

ఇతర సినిమాలు

[మార్చు]

1914 లో లండను పయనమయ్యాడు. మొదటి ప్రపంచ యుద్ధ వాతావరణం ప్రారంభమవడంతో ఈయన భారీ ప్రణాళికలు చెల్లాచెదురైపోయాయి. అయినా సంబాళించుకుని పరిమిత అవసరాలను తీర్చుకుని స్వదేశం వచ్చాడు. లఘు చిత్రాలను నిర్మించాడు. మ్యాజిక్ ట్రిక్స్ మీద ఒక సినిమా తీసాడు. బుద్ధగయ, ఎల్లోరాల మీద డాక్యుమెంటరీలు నిర్మించాడు. బుద్ధ పూర్ణిమ, గణేశ ఉత్సవాల మీద పర్వదిన సంరంభాలను చిత్రీకరించాడు.

అయినా ఎన్నో శ్రమాదులకు లోనయ్యాడు. "లంకా దహనం" సినిమా తీయగా, "ది వెస్ట్ ఎండ్" ధియేటర్ మొదటి పదిరోజులలోనే రూ. 32 వేలు సంపాదించుకుంది. పూనా లోని "ఆర్సెన్ సినిమా" థియేటర్ కూడా అంతే. రాముడు, సీత పాత్రలు రెంటినీ సలుంకీలే నటించారు. ఫాల్కే సినిమాలలో అద్వితీయ విజయం సాధించిన సినిమా ఇదే!

"నవయుగ్" పత్రికలో సినిమా చిత్రీకరణ, సాంకేతిక విలువలు గూర్చి ధారావాహిక వ్యాసాలు వ్రాశాడు. అయినా ఏ మాత్రం ప్రతిస్పందన రాలేదు. జాతీయ సినిమా పరిశ్రమ వ్యవస్థాపనకు ఎవరూ సుముఖత చూపలేదు. 1917 లో ఫాల్కే సినిమాలు హిందుస్థాన్ ఫిలిం కంపెనీకి ధారాదత్తమైపోయాయి. కొత్త బేనర్ తో 1918 లో "శ్రీకృష్ణజన్మ" తర్వాత వెంటనే "కాళీయమర్దన్" విడుదలయ్యాయి. ఈ రెండింటిలో బాలకృష్ణునిగా ఫాల్కే కూతురు మందాకిని నటించింది. తర్వాత కాలంలో అనేక సినిమాలు నిర్మించాడు. 1932 లో హిందూస్థాన్ ఫిలిం కంపెనీ మూతపడింది. అది చివరి మూకీ సినిమా "సేతు బంధన్", కొద్ది పాటి పొదుపు ధనంతో స్వచ్ఛందంగా సినిమా లోకం నుంచి వైదొలిగాడు.

సత్కారాలు

[మార్చు]
  • బొంబాయిలో భారతీయ సినిమా జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 1939 లో ఫాల్కేకు అయిదువేల రూపాయలు పర్సు బహూకరించారు.
  • 1966లో ఇతని పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత ప్రభుత్వంచే స్థాపించబడింది.[2].

దయనీయ జీవితం

[మార్చు]

దాదాసాహెబ్ ఫాల్కే సంస్కృత పండితుని కుమారుడు. 1870లో నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జెజె కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో, బరోడాలోని కళాభవన్ విద్యార్థి. మంచి చిత్రకారుడు, నాటకాల్లో మేకప్ వేశారు. మంచి మెజీషియన్ కూడా... ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే ప్రింటింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం జర్మనీ వెళ్లాలనుకున్నారు. సినిమాకు సంబంధించిన వార్త ఒకటి పత్రికలో వచ్చింది. తనను ఆ వార్త బాగా ఆలోచింపజేసింది. మన దేశంలో కూడా సినిమాను ఎందుకు తీయకూడదు అనే ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. తన వద్ద ఉన్న డబ్బు, మిత్రుల నుంచి తీసుకున్న అప్పు, జీవిత బీమా డబ్బు మొత్తం తీసుకొని సినిమా నిర్మాణానికి సంబంధించిన పరికరాలు కొనడానికి 1912లో ఇంగ్లాండ్ వెళ్లారు. అయితే ఫాల్కేకు తాను చరిత్ర సృష్టించబోతున్నానని తెలియదు, అదే తన జీవితాన్ని పేదరికంలోకి నెట్టివేస్తుందనీ ఊహించలేదు.

ఫాల్కే 1913లో రాజా హరిశ్చంద్ర, ఆదే సంవత్సరం మోహినీ భస్మాసుర, సత్యవాన్ సావిత్రి (1914) శ్రీకృష్ణ జననం (1918) కాళీయ మర్దన్ (1919) నిర్మించారు. ఆ తరువాత సినిమా రంగంలో క్రమంగా వ్యాపార ధోరణి మొదలైంది. దాంతో పాల్కే పక్కకు తప్పుకున్నారు. సినిమా ప్రేమ ఆయన్ని నిలువనివ్వలేదు. తన పలుకుబడి, పరిచయాలు ఉపయోగించి నిధులు సమీకరించి 1937లో గంగావతరణ సినిమా తీశారు. నిండా మునిగిపోయారు. సినిమాను వ్యాపారంగా చూసి ఉంటే ఆయన పరిస్థితి బాగానే ఉండేది. సినిమాను విపరీతంగా ప్రేమించి దెబ్బతిన్నారు. తన వారసులను పేదరికంలోకి నెట్టేశారు. ఆయన దేశానికి తీసుకు వచ్చిన సినిమాతో సినీ వ్యాపారులు కోట్లు సంపాదించారు. పాపులారిటీని, రాజకీయాల్లో పదవులు సంపాదించారు కానీ ఫాల్కే మాత్రం కఠిక దరిద్రంలో మరణించారు. ఆయన కుమారుడు ముంభై వీధుల్లో చిల్లర వ్యాపారిగా జీవితం గడిపారు. బాగున్న రోజుల్లో ఫాల్కే ఫోర్డ్ కారును ఉపయోగించేవారు. 1920 ప్రాంతంలో ఆ కారులోనే షూటింగ్‌కు వెళ్లేవారు. తిరిగి సినిమా తీయాలని నిర్ణయించుకున్న కాలంలో దాన్ని అమ్మేశారు. ఆ కారు పెళ్ళిళ్ల ఊరేగింపునకు ఉపయోగించారు. ఐదేళ్ల క్రితం ఈ కారు నాసిక్ డంప్ యార్డ్‌లో లభించింది. తొలి భారతీయ సినిమా కెమెరాను ఫాల్కే జర్మనీ నుంచి తెప్పించారు. అదేమైందో ఇప్పుడు ఎవరికీ తెలియదు. సినిమా నిర్మాణానికి ఎలాంటి ఏర్పాట్లు లేని కాలంలో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఫాల్కే తొలి సినిమా తీశారు. ఫాల్కే భార్య సరస్వతి భారతీయ తొలి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆమెనే తొలి భారతీయ సినిమా టెక్నీషియన్. సరస్వతి షూటింగ్ సమయంలో వెలుతురు కెమెరాపై పడకుండా బెడ్ షీట్‌ను అడ్డుగా పట్టుకుని ఉండేవారట. షూటింగ్‌కు కావలసినవన్నీ సమకూర్చేవారు. రాత్రి పూట క్యాండిల్ వెలుగులోనే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు నిర్వహించేవారు. సినిమా బృందం 60-70 మందికి ఆమెనే వంట చేసి పెట్టేవారు. రాజా హరిశ్చంద్రలో హరిశ్చంద్రుని కుమారునిగా ఫాల్కే కుమారుడు బాలచంద్ర నటించారు. తొలి భారతీయ బాలనటుడు అతనే. శ్రీకృష్ణ జననం, కాళీయ మర్దన్‌లో బాల శ్రీకృష్ణునిగా మందాకిని నటించారు. ఆమె ఫాల్కే పెద్ద కూతురు. ఆమెనే తొలి భారతీయ బాలనటి.

భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఒక అనామకుడిగా కూర్చోవడం చూసిన శాంతారాం ఆయన్ని గుర్తించి వేదికపైకి తీసుకు పోయి 1938లో అప్పటికప్పుడు వేదికపై ఐదువేల రూపాయల పర్స్ అందజేశారు. ఆ డబ్బుతో ఫాల్కే తిరిగి సినిమా తీస్తాడేమోనని చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే సినిమా అంటే ఆ మహనీయునికి అంత పిచ్చి. అందరూ ఒత్తిడి తెచ్చి ఆ డబ్బుతో నాసిక్‌లో ఒక ఇంటిని కొనిపించారు. అప్పటి వరకు ఫాల్కేకు సొంత ఇల్లు కూడా లేదు. ఆ ఇంటిలోనే తుది శ్వాస విడిచారు.

ముగింపు

[మార్చు]

బొంబాయిలో జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బహుమతి పొందిన తర్వాత ఫాల్కే పేదరికంతోనే స్వగ్రామం చేరుకున్నాడు. దాదాపు అందరూ మర్చి పోయిన తరుణంలో 1944, ఫిబ్రవరి 16 న తుది శ్వాస విడిచాడు. 90 సినిమాలను నిర్మించిన భారతీయ సినిమా పితామహుడు దరిద్రంతోనే కన్నుమూసినా, ఈ నాటికీ అతని జీవన మూల్యాలు ఆదర్శంగా, స్ఫూర్తినిచ్చేవిగానే ఉన్నాయి. అతని పేరు మీద జాతీయ అవార్డుల సంరంభం ప్రతి యేటా జరుగుతున్నా, అతని జీవిత చరమాంకం ఎంతటి దైన్యావస్థలో గడిచిందో ఎవరూ తలచకపోవటం శోచనీయం.

సినీ ప్రస్థానం

[మార్చు]

ఇతర పఠనాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]