దామరాజు పుండరీకాక్షుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దామరాజు పుండరీకాక్షుడు
దామరాజు పుండరీకాక్షుడు
జననం(1898-07-06)1898 జూలై 6 [1]
పాటిబండ్ల, పెదకూరపాడు మండలం, గుంటూరు జిల్లా
మరణం1975
ప్రసిద్ధిన్యాయవాది, స్వాతంత్య్రసమరయోధుడు, పాత్రికేయుడు, సంపాదకుడు, కవి, నాటకకర్త
తండ్రిగోపాలకృష్ణయ్యలు
తల్లిరంగమాంబ

దామరాజు పుండరీకాక్షుడు న్యాయవాది, స్వాతంత్య్రసమరయోధుడు, పాత్రికేయుడు, సంపాదకుడు, కవి, నాటకకర్త[2].

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన 1898జూలై 6వ తేదీన గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలం, పాటిబండ్లలో మాతామహుల ఇంట్లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రంగమాంబ, గోపాలకృష్ణయ్యలు. తండ్రి నూజివీడు జమీలో ఉద్యోగం చేసేవారు. స్వగ్రామం అమరావతి మండలానికి చెందిన పెద్ద మద్దూరు. పుండరీకాక్షుడి ప్రాథమిక విద్య అంతా నూజివీడులో సాగింది. స్కూలు ఫైనలు, ఇంటర్మీడియెట్‌ మాత్రం గుంటూరులో చదివారు. డిగ్రీ కోసం మద్రాసు వెళ్లారు. అక్కడ పచ్చయప్ప కళాశాలలో చదివారు. స్వాతంత్ర్యోద్యమం రోజుల్లో యువకులు కాంగ్రెస్‌ పిలుపునందుకొని కళాశాలలకు, పాఠశాలలకు గైర్హాజరై ఆందోళనలు చేపట్టడం చాలా సహజంగానే జరిగింది. అలాగే పుండరీకాక్షుడు కూడా కొన్నాళ్లు విద్యకు స్వస్తిపలికారు. ఆ తర్వాత ఎలాగో మద్రాసు లా కళాశాల్లో చేరి పరీక్షలు పూర్తిచేశారు. చిన్నతనంలోనే కురుగంటిశాస్త్రి, శిష్టా హనుమచ్ఛాస్త్రి, కాశీ కృష్ణమాచార్యులు వంటి విద్వాంసులు, పండితుల శిష్యరికం చేశారు. శాస్త్రాధ్యయనంలో మెలకువలు తెలుసుకొన్నారు. కవిత్వ కళలోనూ శిక్షణ పొందారు. అలా రచనా వ్యాసంగంలో చిన్నతనంలోనే బీజాలు పడ్డాయి.

ఈయన 1926 ప్రాంతంలో గుంటూరులో న్యాయవాద వృత్తి చేపట్టారు. న్యాయవాదిగా వృత్తిసాగిస్తూనే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1956 వరకు గుంటూరులోనే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటవ్వడంతో హైదరాబాదు చేరుకొన్నారు. అయితే హైదరాబాదులో ఏడేళ్లుకన్నా ఎక్కువ ఉండలేకపోయారు. తిరిగి 1963లో గుంటూరు వెళ్లారు. రచయితగా ఆయన 1921లోనే ‘స్వరాజ్య సోపానం’ అనే నాటకం రాశారు. దాన్ని బ్రిటిషు ప్రభుత్వం నిషేధించింది. దీనితో పాటు మరికొన్ని నాటకాలు రాశారు. ఇవన్నీ స్వాతంత్ర్యోద్యమ భావాలను వ్యాప్తి చేసినవే కావడం గమనార్హం. నాటకాలతోనే రచనావ్యాసంగం పరిమితంచేయక హరికథలు, జంగం కథలు ఇతర రచనలు కూడా సాగించారు. మొత్తం పదమూడు తెలుగు నాటకాలు, రెండు ఆంగ్ల నాటకాలు ఇరవై ఇతర గ్రంథాలు వ్రాశారు.

పాత్రికేయుడిగా, సంపాదకుడిగా కూడా ఈయన విశేషకృషిచేశారు. 1920లోనే ఈయన ‘స్వరాజ్యసోపానం’ అనే మాసపత్రికని కొంతకాలం నడిపారు. అలాగే ‘రామరాజ్యం’ అనే మాసపత్రికను కూడా తెచ్చారు. అప్పట్లో పుస్తకాలు ముద్రించడం కష్టంగా ఉండడంతో తానే స్వయంగా ‘‘సంఘసేవ గ్రంథమాల’’ను స్థాపించారు. కొన్నేళ్ల తర్వాత ఆ సంస్థని ‘స్వరాజ్య సోపాన గ్రంథమాల’గా మార్చారు. తన రచనలేకాక ఇతరులవీ ఆ సంస్థ ద్వారా ప్రచురించారు. దామరాజు నాటకాల్ని గాంధీనాటకాలని పిలిచేవారు. ‘సంఘసేవా నాట్యమండలి’ పక్షాన దామరాజు తన నాటకాలను ఆంధ్రదేశమంతటా ప్రదర్శించారు.

దామరాజు నాటకాలలో రచించిన పాటలు, పద్యాలు ఎంతో ప్రచారం పొందాయి. అవి రాజకీయ బీజాలను లోతుగా నాటినాయనడంలో సందేహం లేదు. ‘‘గాంధీ నామం మరువాం మరువాం’’ అనే పాట అనేక రూపాలలో పాడబడింది. అలాగే ‘‘కత్తులు లేవు శూలమును గాండీవమున్ మొదలె హుళక్కి’’ అనే పద్యాలు ప్రజల కంఠాలలో స్థిర చిరునామాలుగా మారాయి[3].

ఈయన రాసిన నాటకాలను ప్రభుత్వం నిషేధిచడమేకాక ఆ ప్రతుల్ని స్వాధీనం చేసుకొని తగులబెట్టింది. జాతీయోద్యమంలో పోలీసుల లాఠీఛార్జికి ఊ­పిరితిత్తులు పాడైపోవడంతో చాలాకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. రాజకీయ నాటకాలతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కలిగిస్తున్నారని పుండరీకాక్షుడిని రెండుసార్లు జైల్లో పెట్టారు.

ఈయనకు దేశంలోనే తొలిసారి జాతీయ నాటకాలు రాసిన రచయితగా పేరు రావడానికి ప్రధాన కారణం ‘స్వరాజ్య సోపానమే’. బ్రిటిషు ప్రభుత్వం నిషేధించిన ఆ నాటకాన్ని తిరిగి స్వాతంత్య్రం వచ్చాక 1961లో ప్రచురించడం విశేషం. ఈయన న్యాయవాదిగా బాధితుల హక్కుల కోసం కూడా పోరాడారు. ఈయన 1975లో మరణించాడు.

రచనలు[మార్చు]

 1. గుంటూరు గొప్ప - జంగం కథ
 2. స్వరాజ్య సోపానము -నాటకము
 3. గాంధీ మహోదయము - నాటకము
 4. నవయుగము గాంధీ విజయము - నాటకము
 5. పాంచాల పరాభవము (పంజాబు దురంతములు) - నాటకము
 6. సంస్కారిణి - నాటకము
 7. చైనాసుర - నాటకము
 8. కలియుగభారతం - నాటకము
 9. విజయవిహారం - నాటకము
 10. క్విట్‌ ఇండియా - నాటకము
 11. కలియుగ ప్రహ్లాద - హరికథ
 12. జర్మనీ యుద్ధం - జంగం కథ
 13. కమల్‌పాషా
 14. కలియుగ కురుక్షేత్రం
 15. విజయభారతం
 16. నిలువీత
 17. రష్యారాజ్యం
 18. ఇదా స్వరాజ్యం

మూలాలు[మార్చు]

 1. కురుగంటి సీతారామయ్య (1956). నవ్యాంధ్ర సాహిత్యవీధులు (3 ed.). హైదరాబాదు: కురుగంటి సీతారామయ్య. p. 393. Retrieved 24 April 2020.
 2. [https://web.archive.org/web/20160120020641/http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=pratibhavantulu23 Archived 2016-01-20 at the Wayback Machine జాతీయ నాటక కర్త దామరాజు పుండరీకాక్షుడు -చీకోలు సుందరయ్య]
 3. [permanent dead link] నాటకాలను ఫిరంగులు చేసిన దామరాజు - జయధీర్ తిరుమలరావు