ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్
ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ | |
---|---|
దర్శకత్వం | డేవిడ్ లీన్ |
స్క్రీన్ ప్లే |
|
దీనిపై ఆధారితం | ది బ్రిడ్జ్ ఓవర్ ది రివర్ క్వాయ్ by పియరీ బౌల్ |
నిర్మాత | శామ్ స్పీగల్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జాక్ హిల్డ్‌యార్డ్ |
కూర్పు | పీటర్ టేలర్ |
సంగీతం | మాల్కమ్ ఆర్నాల్డ్ |
నిర్మాణ సంస్థ | హొరైజాన్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | కొలంబియా పిక్చర్స్ |
విడుదల తేదీs | 2 అక్టోబరు 1957(లండన్ - ప్రీమియర్) 11 అక్టోబరు 1957 (బ్రిటన్) 14 డిసెంబరు 1957 (అమెరికా) |
సినిమా నిడివి | 161 నిముషాలు |
దేశాలు | బ్రిటన్ అమెరికా[1] |
భాష | ఇంగ్లీషు |
బడ్జెట్ | $2.8 మిలియన్లు[2] |
బాక్సాఫీసు | $30.6 మిలియన్లు[2] |
ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ 1957, అక్టోబర్ 31న తొలి ప్రివ్యూ జరుపుకొని, 1957 డిసెంబర్ 18న విడుదలైన అమెరికన్ చలనచిత్రం.[3] ఈ సినిమాకు పియరీ బౌల్ వ్రాసిన ఫ్రెంచి భాషా నవల ది బ్రిడ్జ్ ఓవర్ ది రివర్ క్వాయ్ ఆధారం.
కథ
[మార్చు]సినిమా కథ అంతా 'దాదాపు' వాస్తవంగా జరిగిందే. సినిమా కోసం వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను కొంచెం మార్చారు. ఈ చిత్రకథ 1943లో ఫిబ్రవరి నుంచి మే వరకు జరిగినట్లు చూపిస్తారు. నిజానికి ఇదంతా రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగానూ, దానికితోడు ఆ సంఘటనలో బ్రిటిష్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఫిలిప్ టూసీ రాసిన జ్ఞాపకాల ఆధారంగానూ నిర్మితమయింది.
సినిమా కథ ప్రకారం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ సైన్యం కొంతమంది బ్రిటిష్ సైనికుల్ని, వారి అధికారులతో సహా యుద్ధ ఖైదీలుగా బందీలను చేస్తుంది. వారంతా ఒక దట్టమైన అడవిలో (థాయ్‌లాండ్ - బర్మా దేశాల సరిహద్దుల్లో) నడుస్తున్నపుడు సినిమా ఆరంభమవుతుంది. వీరు నడుస్తున్న సమయంలో ఆ దారికి పక్కనే ఇద్దరు బ్రిటిష్ సైనికులు (వీరూ యుద్ధ ఖైదీలే) - చనిపోయిన తమ తోటి సైనికుని ఖననం చేసేందుకు గోతులు తవ్వుతుంటారు. ఆ మండుటెండల్లో ఇలాటి గతే తమకూ, ఇప్పుడు వస్తున్న సైనికులకూ సైతం పడుతుందని ఆ యుద్ధ ఖైదీలను చూస్తూ వీరు జోకులు వేసుకుంటారు. ఈ యుద్ధ ఖైదీల బృందం చివరికి తమ క్యాంప్ దగ్గరకు చేరతారు. అక్కడ జపాన్ దళాల అధికారి కెప్టెన్ సయీతో వారికి లాంఛనంగా స్వాగతం చెప్పి "యుద్ధ ఖైదీలైన మీరంతా రేపు ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని, ఆ మర్నాటి నుంచి క్వాయ్ నది మీద బాంకాక్ నుంచి రంగూన్‌కు వెళ్ళే రైలు రహదారికోసం వంతెన కట్టాల్సి ఉంటుంది. సోమరులకు తిండి పెట్టే సంప్రదాయం జపాన్‌లో లేదు. ఈ వంతెన నిర్మాణం మీ నైపుణ్యానికి తగిన పని. సరిగ్గా మీరంతా పనిచేయండి. మిమ్మల్ని మీతోబాటు ఈ వనిలో పాల్గొనే మీ అధికారులనూ మేం చక్కగా చూసుకుంటాం. కానీ ఇక్కడనుంచి పారిపోయే ఆలోచన చేయకండి. ఇదో చీమలు దూరని చిట్టడవి. దీన్నుంచి పారిపోవడం మీ తరం కాదు. అందుకే మీరుండే ఈ శిబిరంచుట్టూ గోడలు, కంచెలు ఏవీ లేవు. వెళ్లండి పనిచేయండి. పనిచేస్తూ సంతోషించండి!" అంటాడు. ఇది విన్న బ్రిటిష్ ఆఫీసర్ నికొల్సన్ "జెనీవా ఒప్పందంలోని 27వ అధికరణం ప్రకారం యుద్ధ ఖైదీలు పనిచేయవచ్చు గానీ, ఆఫీసర్స్ మాత్రం శారీరకమైన పనిచేయాల్సిన అవసరం లేదు గనుక బ్రిటిష్ ఆఫీసర్స్ బ్రిడ్జ్ నిర్మాణం పనిని సూపర్‌వైజ్ చేస్తారే తప్ప శారీరక శ్రమ చేయరు!” అని స్పష్టం చేస్తాడు. అయితే అలా కుదరదు, అందరూ పనిచేసి తీరాల్సిందేనని సయీతో పట్టుబడతాడు. నికొల్సన్ దీనికి ఒప్పుకోకపోవటంతో నయీతో, ఆయన్ను ఆ మండుటెండలో ఒక కర్ర బందిఖానాలో బంధిస్తాడు. అయినా నికొల్సన్ తన పట్టు వీడకపోవటంతో మూడు రోజుల తర్వాత సయీతో అతన్ని విడిపిస్తాడు. చివరికి బ్రిటిష్ సోల్జర్స్ మాత్రమే బ్రిడ్జిని కట్టేలా ఒప్పందం కుదురుతుంది. అయితే జపనీస్ నిర్ణయించిన చోట కాకుండా వేరేచోట చక్కగా నిర్మించాలని నికొల్సన్ సూచిస్తాడు. దానికి సయీతో ఒప్పుకొంటాడు. నిర్మాణం పనిలో పర్యవేక్షణ బాధ్యత నికొల్సన్ చేపడతాడు. "ఏ పనినైనా బ్రిటిష్ సోల్జర్స్ అద్భుతంగా చేస్తారని నిరూపించేందుకు ఇదో అవకాశం" అంటూ ఆయన తన సైనికుల్ని ప్రోత్సహిస్తూ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతాడు. కానీ ఈ బ్రిడ్జ్ నిర్మిస్తే, దానిమీద జపాన్ రైళ్లు తిరుగుతూ సైనికుల్ని బర్మా, అక్కడ నుంచి ఇండియాకు చేరవేస్తూ, బ్రిటిష్ వారిమీదే దాడికి అది ఉపయోగపడుతుందని చాలా మంది సోల్జర్స్ నిరసన వ్యక్తం చేస్తుంటారు. గతంలో ఈ క్యాంప్ నుంచి పారిపోయిన వార్డెన్ అనే బ్రిటిష్ అధికారికి, బ్రిటిష్ యుద్ధ ఖైదీలు క్వాయ్ నది మీద నిర్మిస్తున్న ఈ వంతెనను కూల్చివేయాలని ఆజ్ఞలు అందుతాయి. అంటే బ్రిటిష్ యుద్ధఖైదీల బృందం వంతెన నిర్మాణాన్ని అద్భుతంగా పూర్తిచేసి తమ నైపుణ్యం నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంటే, మరో వైపు అదే వంతెనను కూల్చివేయాలని బ్రిటిష్ సైనికులు ప్రయత్నించటం జరుగుతుందన్నమాట!
వంతెనను కూల్చివేయాలన్న ఆదేశాలు పొందిన బృందం- ఆ వంతెన మీద మే 13వ తేదీన ఒక 'విఐపీ' రైలు ప్రయాణించబోతోందన్న సంగతిని రేడియో సిగ్నల్స్ ద్వారా తెలుసుకొంటారు. వెంటనే మే 12 నాటికి అక్కడికి చేరి, విఐపి రైలు వెళ్తున్న సమయంలో బ్రిడ్జిని డెటొనేటర్లతో పేల్చివేయాలని నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారమే డెటొనేటర్లను పెడతారు. మే 12 నాటికి అనుకున్నట్లు బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది. సగర్వంగా ఆ బ్రిడ్జిమీద నడుస్తున్న నికొల్సన్‌కు దూరంగా నీళ్లలో తేలుతున్న వైరు కనిపిస్తుంది. ఏదో కీడు శంకించి, అటువైపు దిగి ఈ వైరును పరిశీలించిన నికొల్సన్- అది డెటోనేటర్ల వైరుగా గుర్తిస్తాడు. వీళ్లు ఇటు ఆ వైరు ఎక్కడనుంచి వస్తుందో గుర్తిస్తున్నప్పుడు, వంతెన మీదకు ఆ విఐపి రైలు వచ్చేస్తుంది. డెటొనేటర్లను పేల్చటానికి సిద్ధంగా ఉన్న బ్రిటిష్ సైనికుల బృందాన్ని చూస్తాడు నికొల్సన్. 'ఏమిటిది? ఏం చేస్తున్నారు?' అని అడుగుతాడు. 'తాము ఆ బ్రిడ్జిని పేల్చివేస్తున్నాం!' అని వాళ్లు చెప్తారు. ఇదే సమయంలో కాల్పులు మొదలవుతాయి. ఒక మోర్టార్ నుంచి వచ్చిన గుండు నికొల్సన్‌కు తగులుతుంది. ఆయన 'డెటొనేటర్ ప్లంజర్' (డెటొనేటర్లను ఆన్ చేసే పరికరం) మీద పడతాడు. వెంటనే ఆయన నేతృత్వంలో నిర్మితమైన వంతెన, దానితోబాటు ఆ సమయంలో ఆ వంతెన మీద ఉన్న రైలు రెండూ పేలిపోతాయి. ఆ వంతెనకు వాడిన, చెక్కముక్కలు ఆ నది నీళ్లల్లో తేలుతుంటాయి. నది మాత్రం యధాప్రకారం నెమ్మదిగా ప్రవహిస్తూనే ఉన్నట్లు చూపడంతో సినిమా ముగుస్తుంది.[3]
నిర్మాణం
[మార్చు]సినిమా నిర్మాణాన్ని 1956 నవంబర్ 26వ తేదీన 30 లక్షల డాలర్ల (సుమారు ఇప్పటి 15 కోట్ల రూపాయల) బడ్జెట్టుతో ప్రారంభించారు. 1957 మే 11వ తేదీన షూటింగ్ పూర్తయింది. సినిమా కోసం వంతెన నిర్మాణానికి 8 నెలలు పట్టింది! సినిమాలో కథంతా థాయిలాండ్- బర్మా దేశాల సరిహద్దుల్లోని అడవుల్లో జరిగినా, షూటింగ్ మాత్రం శ్రీలంక (అప్పటి సిలోన్ )లో జరిపారు. షూటింగ్ ప్రారంభానికి - ఆమాటకొస్తే సినిమాలో నటించేందుకు ఏ ఒక్కరినీ ఎంచుకోకముందే వంతెన నిర్మాణాన్ని సినిమా కార్మికుల చేత, నిజమైన ఇంజనీర్ల చేత చేపట్టారు. నిజమైన క్వాయ్ నది మీద వంతెనను ఎలా కట్టారో - ఆ ప్లాన్‌ను తెప్పించి మరీ వంతెనను కట్టడం విశేషం. ఆ ప్లాన్ ప్రకారం ఒరిజినల్ బ్రిడ్జి, నది నీటి మట్టానికి 50 అడుగుల ఎత్తున 425 అడుగుల పొడవు ఉండగా, సినిమా కోసం కట్టిన వంతెన నది నీటిమట్టానికి 50 అడుగుల ఎత్తున 360 అడుగుల పొడవుతో ఉంది. ఈ సినిమా వంతెనను 500 మంది కార్మికులతో, 35 ఏనుగుల సాయంతో సరిగ్గా ఒరిజినల్ బ్రిడ్జ్ లాగే నిర్మాణాన్ని పూర్తిచేశారు. షూటింగ్ సమయంలో బ్రిడ్జి నిర్మాణానికి మాత్రమే ఒకటిన్నర కోటి రూపాయలు ఖర్చయ్యాయని అంచనా! బిడ్జిని షూటింగ్ కోసం పేల్చివేసిన తర్వాత ఆ షూటింగ్ రీళ్లను అయిదు వేర్వేరు విమానాల్లో హాలీవుడ్‌కు పంపి ఎడిటింగ్ చేయించారు. అలాగే షూటింగ్ సమయంలో - చివర్న బ్రిడ్జి మీద పేల్చివేసే రైలుకోసం భారతదేశంలోని ఓ మహారాజును సంప్రదించి, ఆయన దగ్గరున్న రైలును కేవలం షూటింగ్లో వాడి పేల్చేయటానికే నిర్మాతలు కొన్నారు.[3] పేల్చివేత దృశ్యాన్ని అప్పటి శ్రీలంక ప్రధానమంత్రి సాలమన్ బండారునాయకె, అతని పరివారం సమక్షంలో చిత్రీకరించారు..[4]
నటీనటులు
[మార్చు]- విలియం హోల్డెన్ - కమాండర్ షియర్స్, అమెరికన్ నేవీ మేజర్
- జాక్ హాక్సిన్స్ - మేజర్ వార్డెన్
- అలెక్ గిన్నీస్ - లెఫ్ట్‌నెంట్ కల్నల్ నికల్‌సన్, బ్రిటిష్ కమాండర్
- సుసీ హయకావా - కల్నల్ సయీతో, జపనీస్ కమాండర్
- జేమ్స్ డోనాల్డ్ - మేజర్ క్లిప్టన్, వైద్య అధికారి
- ఆండ్రీ మోరెల్ - కల్నల్ గ్రీన్
- పీటర్ విలియమ్స్ - కెప్టెన్ రీవ్స్
- జాన్ బాక్సర్ - మేజర్ హ్యూస్
- పెర్సీ హెర్బర్ట్ - గ్రోగన్
- హెరాల్డ్ గుడ్‌విన్ - బేకర్
- హెన్రీ ఒకావా - కెప్టెన్ కనెమత్సు
- కైచిరో కస్తుమొటొ - లెఫ్ట్‌నెంట్ మియుర
- ఎం.ఆర్.బి.చక్రబంధు - యై
- జెఫ్రీ హార్న్ - లెఫ్ట్‌నెంట్ జాయ్స్
పురస్కారాలు
[మార్చు]పురస్కారం | విభాగం | విజేత (లు) | ఫలితం |
---|---|---|---|
అకాడమీ పురస్కారాలు | ఉత్తమ చిత్రం | శామ్ స్పీగల్ | గెలుపు |
ఉత్తమ దర్శకుడు | డేవిడ్ లీన్ | గెలుపు | |
ఉత్తమ నటుడు | అలెక్ గిన్నిస్ | గెలుపు | |
ఉత్తమ సహాయనటుడు | సుసీ హయకావా | ప్రతిపాదన | |
ఉత్తమ స్క్రీన్ ప్లే | కార్ల్ ఫోర్‌మెన్, మైకేల్ విల్సన్, పియరీ బౌల్ | గెలుపు | |
ఉత్తమ ఛాయాగ్రహణం | జాక్ హిల్డ్‌యార్డ్ | గెలుపు | |
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ | పీటర్ టేలర్ | గెలుపు | |
ఉత్తమ సంగీతం | మాల్కమ్ ఆర్నాల్డ్ | గెలుపు | |
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ సినిమా | గెలుపు | |
ఉత్తమ బ్రిటిష్ సినిమా | గెలుపు | ||
ఉత్తమ బ్రిటిష్ నటుడు | అలెక్ గిన్నిస్ | గెలుపు | |
ఉత్తమ బ్రిటిష్ స్క్రీన్ ప్లే | పియరీ బౌల్ | గెలుపు | |
బ్రిటిష్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ | ఉత్తమ ఛాయాగ్రహణం | జాక్ హిల్డ్‌యార్డ్ | గెలుపు |
డేవిడ్ ది డొనాటెల్లొ అవార్డులు | ఉత్తమ విదేశీ నిర్మాణం | శామ్ స్పీగల్ | గెలుపు |
డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు | ఉత్తమ దర్శకత్వం | డేవిడ్ లీన్ | గెలుపు |
డివిడి ప్రత్యేక అవార్డులు | ఉత్తమ డివిడి మెనూ డిజైన్ | ప్రతిపాదన | |
ఉత్తమ డివిడి సినిమా | లారెంట్ బౌజిరూ | ప్రతిపాదన | |
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు | ఉత్తమ చిత్రం | గెలుపు | |
ఉత్తమ నటుడు | అలెక్ గిన్నిస్ | గెలుపు | |
ఉత్తమ సహాయనటుడు | సుసీ హయకావా | ప్రతిపాదన | |
ఉత్తమ దర్శకుడు | డేవిడ్ లీన్ | గెలుపు | |
గోల్డెన్ స్క్రీన్ అవార్డులు | గోల్డెన్ స్క్రీన్ | గెలుపు | |
గోల్డెన్ స్క్రీన్ విత్ 1 స్టార్ | గెలుపు | ||
గ్రామీ అవార్డులు | ఉత్తమ సంగీతం | మాల్కమ్ ఆర్నాల్డ్ | ప్రతిపాదన |
లారెల్ అవార్డులు | ఉత్తమ చిత్రం | ప్రతిపాదన | |
ఉత్తమ నటుడు | అలెక్ గిన్నిస్ | ప్రతిపాదన | |
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డులు | ఉత్తమ సినిమా | గెలుపు | |
టాప్ 10 సినిమాలు | గెలుపు | ||
ఉత్తమ దర్శకుడు | డేవిడ్ లీన్ | గెలుపు | |
ఉత్తమ నటుడు | అలెక్ గిన్నిస్ | గెలుపు | |
ఉత్తమ సహాయ నటుడు | సుసీ హయకావా | గెలుపు | |
నేషనల్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ బోర్డ్ | నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ | చేర్చబడింది | |
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు | ఉత్తమ సినిమా | గెలుపు | |
ఉత్తమ దర్శకుడు | డేవిడ్ లీన్ | గెలుపు | |
ఉత్తమ నటుడు | అలెక్ గిన్నిస్ | గెలుపు | |
ఆన్‌లైన్ ఫిల్మ్ & టెలివిజన్ అసోసియేషన్ ఆవార్డులు | హాల్ ఆఫ్ ఫేమ్ | గెలుపు | |
శాంట్ జోర్డి అవార్డులు | ఉత్తమ విదేశీ నటుడు | అలెక్ గిన్నిస్ | గెలుపు |
విశేషాలు
[మార్చు]- ఈ సినిమా ప్రాచుర్యం పొందిన తరువాత థాయ్‌లాండ్ కాంచనబురి సమీపంలోని నిజమైన వంతెన ఒక పర్యాటక స్థలంగా మారింది.
- జపనీస్ నటుడు సుసీ హయకావా ఈ చిత్రంలో నటించడం ద్వారా హాలీవుడ్‌లో నటించిన తొలి ఆసియా ఖండానికి చెందిన నటుడుగా చరిత్రలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ "ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ (1957)". బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. Archived from the original on 13 July 2012. Retrieved 7 July 2014.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 2.0 2.1 హాల్, షెల్డాన్ (2010). ఎపిక్స్, స్పెక్టకల్స్ అండ్డ్ బ్లాక్ బస్టర్స్: ఎ హాలీవుడ్ హిస్టరీ. వేన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్. p. 161. ISBN 978-0814330081.
- ↑ 3.0 3.1 3.2 పాలకోడేటి సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ మొదటి భాగం (1 ed.). హైదరాబాదు: శ్రీ అనుపమ సాహితి. pp. 109–113.
- ↑ "ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్(డిజాస్టర్స్ ఆన్ ది ఫిల్మ్ సెట్)", పర్‌బెక్ ఫిల్మ్ ఫెస్టివల్, published 08-24-2014. Retrieved 09-24-2015.
బయటి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- 1957 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- అమెరికన్ సినిమాలు
- ఆంగ్ల భాషా సినిమాలు
- నవల ఆధారంగా తీసిన సినిమాలు
- అకాడమీ అవార్డు విజేతలు