దీక్ష (1951 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీక్ష (1951 సినిమా)
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం జి.వరలక్ష్మి, రాంగోపాల్ .శివరాం, రమణారెడ్డి, లీల, కమల, రాజ్యం, రాజేశ్వరి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ప్రకాష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

దీక్ష 1951 లో విడుదలైన తెలుగు కుటుంబ కథాచిత్రం.[1] ఇది ప్రకాష్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించబడగా; జి. వరలక్ష్మి, రాంగోపాల్ ప్రధాన పాత్రలు పోషించారు. మనసుకవి ఆత్రేయ ఈ సినిమాలోని "పోరా బాబూ పో" పాటతో తన సినీ గేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.[2]

కథా సంగ్రహం

[మార్చు]

బాలయ్య (శివరాం), యశోదమ్మ (జి. వరలక్ష్మి) పల్లెటూరి దంపతులు. బాలయ్య సవతి తల్లి చనిపోతూ గోపీ (రామగోపాల్) ని యశోదమ్మ చేతుల్లో పెట్టిపోతుంది. నాటినుంచి గోపీ వదిన పోసిన ఉగ్గుపాలతో, పాడిన జోలపాటతో పెరిగి పెద్దవాడయ్యాడు. గోపీకి పధ్నాలుగేళ్లు వచ్చినాయి. ఏళ్ళతోపాటు వూళ్ళో రౌడీగా పెద్ద పేరు గడించాడు. గోపీ అంటే అందరికి గుండెల్లోదడే. ఆ గ్రామంలో చాలా సమస్యలకు గోపీయే కారణమని వూరంతా గోపీమీద కారాలు, మిరియాలు నూరుతున్నారు. గోపీ గొప్పవాడు అవుతాడని ఆమె ఆశ. వూళ్ళోవాళ్లు తలా ఒక మాటంటే ఓర్వలేక బాలయ్య నీ అలుసు చూచుకునే వాడిల్లా అయ్యాడని, యశోదమ్మమీద మండిపడతాడు. కాని యశోదమ్మ మాత్రం గోపీని మందలిస్తునే ఉంది. యశోదమ్మకు సీతారామ లక్ష్మణులు ఇలవేల్పులు. ఏ ఆపదైనా, ఆవేదనైనా వారితో మొర పెట్టుకోవటం ఆమె భక్తి. తనతో అల్లరికివచ్చే స్నేహితులముఠాకు రామదండని పేరు పెట్టుకున్నాడు. వాళ్లందరికి రామలక్ష్మణులనే జోడు పనసపండ్లంటే ఆచంచలమైన భక్తి.

యశోద తల్లి దుర్గమ్మ (శేషమాంబ), గయ్యాళి గంప. ఆమె ఇంటికి రావటంతోనే గోపితో కయ్యం పెట్టుకుంది. స్వంత కొడుకు రమణను చూడకుండ గోపీమీద యశోదమ్మ అనురాగం చూపుతూందని ఆమె వెక్కసపాటు. గోపీ అల్లరులు బాలయ్యకు సహించరానివై పోతున్నాయి. గోపీ మూలంగా భార్యాభర్తల మధ్య కొంత విఘాతం ఏర్పడుతూంది. ఇలావుండగా ఒకరోజు ఆవూరి జమీందార్ కొడుకు ఒక బక్కచిక్కిన కుర్రాడి మీద ఎక్కి గుర్రంస్వారీ చేస్తున్నాడు. గోపీ సహించలేక పోయాడు. జమీందారు కొడుకుని కొట్టాల్సి వచ్చింది. దాంతో జమీందారు నిప్పలు తొక్కాడు. బాలయ్యను పాలం నుంచి వెళ్ళగొట్టాడు. ఆ ఆవేదన కొద్ది బాలయ్య యశోదమ్మ మీద చేయి చేసుకున్నాడు. వదిన వంటిమీద దెబ్బ పడితే గోపి ఓర్చుకోలేడు. రామలక్ష్మణుల సాక్షి అని వదినకు మాట యిచ్చాడు. అలును చూచుకొని అందరు గోపీని కవ్వించారు. బడి నుంచి గెంటేసారు. క్షమించమని అడగబోతే జమీందారు నౌకర్లు, కొరడాతో కొట్టారు. ఎందరెన్ని విధాల కాలుదువ్వి కవ్వించి, కయ్యానికి లాగినా వదినకిచ్చిన మాటకోనం నహించి వూరుకున్నాడు. దుర్గమ్మ ఈమార్పు ఓర్వలేక పోయింది. ఆమె కళ్ళు రామలక్ష్మణులమీద పడ్డాయి. వీరాయిని కోసుకుతెమ్మంది. గోపీ అడ్డుపడి డొక్కచించి డోలు కడతానని బడికి వెళ్ళాడు. దుర్గమ్మ అవే రామలక్ష్మణులని తెలియనీకుండా యశోదమ్మ అల్లాడిపోయింది. గోపి బడి నుంచి తిరికి వచ్చాడు. రామలక్ష్మణుల మీదపడి ఏడ్చాడు. యశోదమ్మ స్తంభించిపోయింది. తప్పను తనమీద వేసుకొంది యశోద. గోపీ ఉగ్రుడయ్యాడు. వెర్రి అవేశంలో "నీకు నేను ఇచ్చిన మాట పోయింది” అంటూ చెలరేగి వెళ్ళాడు. ఉద్రేకంలో మంచీ చెడూ విచక్షణ లేకుండా రామదండుతో వూరిమీద పడ్డాడు. చేతికందిందల్లా ధ్వంసంచేసాడు. గోపీకోసం ఎదురుచూస్తూ కూచుంది. అలసిపోయిన గోపీ యింటికి తిరిగి వచ్చాడు. గయ్యాళి దుర్గమ్మమీద కసికొద్దీ విసిరిన రాయి తప్పి పొరపాటున వదినకు తగిలింది. రక్తం వెల్లువలైంది. గోపీ వణికి పోయాడు. ఇక నిలవలేక పారిపోయాడు.

బాలయ్య ఓర్పు ఇక నిలవలేక పోయింది. కుండ బద్దలు కొట్టుకుంటానన్నాడు. యశోదమ్మ అడ్డుపడ్డది. బాలయ్య ఆగలేదు. ఒకయిల్లు రెండైంది. ఒకరోజు, రెండు రోజులు! అడ్డకట్టిన తడికవతల నుంచే ఆశతో ఎదురు చూస్తున్నాడు గోపీ, వదిన మాట్లాడుతుందేమోనని, క్షమించి చేరదీస్తారేమోనని. కాని లాభంలేదు. ఆ యింట్లో ఆ వూళ్ళో వుంటేనే గుండెలు తరుక్కుపోయి, బస్తీకి ప్రయాణమయ్యాడు గోపి.

పట్నంలో పల్లెకన్నా బాగుంటుందని ఆశపడ్డాడు. కాని అక్కడ యింతకన్నా ఘోరాలు. అంతటా మోసం, దోపిడి, అన్యాయం! నిరాశ చెందాడు. పార్కులో ఆ గాంధీ విగ్రహం ముందు కూలబడి నిన్పృహతో చూసాడు. “బాగుపడే రాతేలేదు. ఆశపడి లాభంలేద”ని దిగజారాడు. మహాత్ముణ్ణి జాలిగా చూసాడు. అప్పడు వినిపించిందొక అశరీరవాక్కు. బాపూజీ నుంచి ఒక దివ్యనందేశం విన్నాడు. వదిన చెప్పిన మాటల్లో సత్యాన్ని గ్రహించాడు. “వదినా! వస్తున్నా” అంటూ పరుగెత్తాడు. కారు క్రిందపడ్డాడు. బలమైన గాయం తగిలింది. ఆస్పత్రికి చేర్చారు. ఈ వార్త విని యశోదమ్మ పరుగెత్తు కొచ్చింది. న్పృహ తప్పిన గోపీ, న్పృహలోలేని యశోదమ్మ కలుసుకున్నారు. నాటినుంచి వదిన శిక్షణలో, ఒకే దీక్షతో, చదివాడు. మహాత్ముల జీవిత చరిత్రలన్నీ చదివాడు. వదిన వ్యాఖ్యానాలు విన్నాడు. మంచి, చెడూ నిర్ణయించే తాహతు సంపాయించుకున్నాడు.

ఊళ్ళో పెద్ద మీటింగ్ జరుగుతూంది. నభలో “ ప్రజలు నాయకుల మాటలు శిరసావహించాలి " అన్నాడొక ప్రజానాయకుడు. “కాదు. మీరే ప్రజలమాట వినొలి” అన్నాడు గోపీ. సభనుంచి గెంటేసారు గోపీని. ఆ ప్రజానాయకుడు గుర్తించాడు గోపీలో వున్న గొప్పతనాన్ని. ఇంటికివెళ్లి యశోదమ్మ ఎదుటే గోపీ తర్కించాడు. గోపీ నిర్భయంగా వాదించాడు. యశోదమ్మ గోపీని ఆ నాయకుని చేతుల్లోపెట్టి ఇక మీ అడుగు జాడల్లో వీడొక దేశసేవకుడైతే చాలు” అన్నది. గోపీని స్వీకరించాడు ఆ నాయకుడు. అతని తర్ఫీదులో, అతని మార్గదఠ్శకత్వంలో గోపీ గోప్ప ప్రజానాయకుడయ్యాడు. "సర్దారు గోపాలంకి జై" అన్న ప్రజాభిమానం యశోదమ్మ తన వృద్ధాప్యదశలో విని తన్మయురాలైంది.

నీతి : తల్లి బోధించలేని ధర్మం, సాధించరాని పరమార్థం లేదు.

నటీనటులు

[మార్చు]
  • యశోద గా జి.వరలక్ష్మి
  • గోపీ గా రామగోపాల్
  • బాలయ్య గా శివరాం
  • డాక్టర్ గా రంగస్వామి
  • హెడ్ మాస్టర్ గా రామచంద్రరావు
  • లీడర్ గా సదాశివరావు
  • దుర్గమ్మ గా శేషమాంబ
  • అచ్చి గా అన్నపూర్ణదేవి

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అమ్మగారి ఇళ్ళు ధర్మలోగిళ్ళు అమ్మనీ ఇళ్ళు చల్లగా ఉండాలి- జి.వరలక్ష్మి బృందం
  2. ఇదిగో మీపప్పులుడకవండి మీగొప్ప తెలుసులెండి - ? - రచన: ప్రయాగ నరసింహశాస్త్రి
  3. ఏమంటా ఏమంటా నీకు నాకు పెళ్ళంట - పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి- రచన: తోలేటి వెంకటరెడ్డి
  4. ఏమవుతుందొ ఇంకేమవుతుందో చేతులార - వేణు - రచన: ఆత్రేయ
  5. చల్లనతల్లి భూదేవి మన పిల్లల చల్లగ - జి.వరలక్ష్మి, పిఠాపురం నాగేశ్వరరావు బృందం
  6. చిన్నినాన్న చిట్టినాన్న నన్నుకన్న చిన్ననాన్న - జి.వరలక్ష్మి
  7. తీయని కతయైతే తీరెనా అయో తీరని వ్యధే మిగులునా - కె. ప్రసాదరావు - రచన: ఆత్రేయ
  8. దేశమును ప్రేమించుమన్న మంచి యన్నది - జి.వరలక్ష్మి బృందం
  9. పసిడి పంటకు జై అనగా - ఎమ్. ఎస్. రామారావు, జి.వరలక్ష్మి బృందం - రచన: జంపన చంద్రశేఖరరావు
  10. పోరా బాబు పో పోయి చూడు ఈ లోకం పోకడ - ఎమ్.ఎస్. రామారావు - రచన: ఆత్రేయ
  11. శ్రీరామ సీతారామ కాపాడ రావ రామ హరే - జి.వరలక్ష్మి బృందం - రచన: జంపన చంద్రశేఖరరావు

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. దీక్ష సినిమా పాటల పుస్తకం.
  2. మనసు గతి ఇంతే (ఆత్రేయ సినీ హిట్స్), సంజయ్ కిషోర్, సంగం అకాడమీ, 2007.