దోమకొండ సంస్థానం

వికీపీడియా నుండి
(దోమకొండ సంస్థానము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దోమకొండ కోటలోని మహాదేవుని ఆలయం

దోమకొండ సంస్థానం, తెలంగాణాలోని ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్న సంస్థానం. దోమకొండ, కామారెడ్డి జిల్లాలో ఉన్నది. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. ఈ సంస్థానానికి బిక్కనవోలు (మెదక్ జిల్లా) సంస్థానమని కూడా నామాంతరం కలదు. ఈ సంస్థానాధీశులు తొలుత గోల్కొండ సుల్తానులకు, ఆ తరువాత అసఫ్‌జాహీలకు సామంతులుగా, దోమకొండ కేంద్రంగా కాసాపురం, సంగమేశ్వరం, మహ్మదాపురం, విస్సన్నపల్లి, బాగోత్‌పల్లి, కుందారం, పాల్వంచ, దేవునిపల్లి వంటి నలభై గ్రామాలను పాలించారు.[1] 19వ శతాబ్దంలో ఈ సంస్థానపు సంవత్సర ఆదాయం రెండు లక్షల రూపాయలు. అందుకే దోమకొండ కోశాగారానికి కాపలాగా ఇరవై మంది అరబ్బులు ఉండేవారట.

1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. ఈ వంశానికి చెందిన రాజన్న చౌదరి 1760 కాలంలో రాజధానిని బిక్కనవోలు నుండి కామారెడ్డిపేటకు, ఇతని కుమారుడు రాజేశ్వరరావు కాలంలో కామారెడ్డి పేట నుండి దోమకొండకు మారినది. అప్పటి నుండి దోమకొండ సంస్థానంగా ప్రసిద్ధి చెందింది.[2] సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి.

ఇక్కడ దోమకొండ కోట ఉంది. ఈ కోటలోని అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందకం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.

కామినేని వంశం

[మార్చు]

కామినేని వంశానికి ఆద్యుడైన కామినేని చౌదరి తరువాత 15వ తరానికి చెందిన ఉమాపతిరావుకు రామేశ్వరరావు, రామచంద్రరావు, రాజేశ్వరరావు, సోమేశ్వరరావు, రాఘవేంద్రరావు అనే అయిదుగురు సంతానం. ఇందులో సోమేశ్వరరావుకు రెండవ ఉమాపతిరావు, అన్నారెడ్డి, రాజేశ్వరరావు అనే కొడుకులు కలిగారు. ఇందులో రెండవ ఉమాపతిరావుకు మూడవ రాజేశ్వరరావు, రామచంద్రరావు, వెంకటేశ్వరరావు అనే పుత్రులు కలిగారు. మరోవైపు రాజేశ్వరరావుకు రామేశ్వరరావు అనే ఏకైక కొడుకు కలిగాడు.

రాజా రాజేశ్వరరావు దాదాపు 30 సంవత్సరాలు ఈ సంస్థానాన్ని పాలించాడు. అతడి సోదరుడైన రాజా రామచంద్రరావు ఎక్కువ కాలం పరిపాలించలేకపోయాడు. మూడవవాడైన వెంకటేశ్వరరావును రాఘవేంద్రరావు కొడుకైన సదాశివరెడ్డి దత్తత తీసుకోవడంతో, రామచంద్రరావు తరువాత సంస్థానాధికారం గురించి సోమేశ్వరరావుతో గొడవలు ఆరంభమై కోర్టు వరకు వెళ్లాయి. కోర్టు తీర్పు ప్రకారం సోమేశ్వరరావుకు పరిపాలనాధికారం లభించింది కానీ ఆయన కూడా ఎక్కువ కాలం అధికారం చేయలేకపోయాడు.

దానిక్కారణం... ఓ రోజు గంగిరెద్దులవాడు అడుక్కోవడానికి గడీలోకి వచ్చి సోమేశ్వరరావు దొర దగ్గర రకరకాల విన్యాసాలు చేయించాడు. చివరగా అయ్యగారికి దండం పెట్టు అని ఎద్దుకు చెప్పగానే సోమేశ్వరరావు కాళ్ల దగ్గర ముందుకాళ్ళు వంచి దండం పెట్టే సమయంలో దాన్నోట్లోంచి కారిన సొంగ సోమేశ్వరరావు చేతులపై పడిందట. అది సహించలేని సోమేశ్వరరావు ఆవేశంతో గంగిరెద్దులవాడ్ని కొట్టి చంపేశాడట. పెద్ద సంచలనం సృష్టించిన ఈ ఘటనతో ప్రభుత్వం అతడికి ఆరు సంవత్సరాలు హైదరాబాదు విడిచి వెళ్లరాదని శిక్ష విధించారని స్థానిక గ్రామస్తుల కథనం.

కళాపోషణ

[మార్చు]

కామినేని వంశంలో అయిదవవాడైన మొదటి ఎల్లారెడ్డి కాలం నుండి సంస్థానంలో సాహితీ వికాసం జరిగింది. ఇతని కాలంలో సంస్థానంలో పలువురు కవులు ఉండేవారు. మొదటి ఎల్లారెడ్డి మనుమడైన రెండవ కాచిరెడ్డి కాలాన్ని సాహితీ స్వర్ణయుగంగా పేర్కొంటారు. మూడవ కాచిరెడ్డి కుమారుడైన మల్లారెడ్డి స్వయంగా కవియే కాకుండా పద్మపురాణోపరి భాగాన్ని అనువదించారు. మల్లారెడ్డి సోదరుడైన రెండవ ఎల్లారెడ్డి కూడా వాసిష్టము, లింగపురాణం అనే గ్రంథాలు రాసినట్టు చెబుతారు.

బహుభాషా విద్వాంసులైన మూడవ రాజేశ్వరరావు ఉర్దూ, పార్శీ, అరబ్బీ భాషల్లో చిరస్థాయిగా నిలిచే రచనలెన్నో చేశారు. ఈయన ఆధ్వర్యంలో పలు నిఘంటువులు, సంకలన గ్రంథాలు కూడా వెలువడ్డాయి. ఈయన 'అజ్గర్' అనే కలం పేరుతో రాసేవారు. దోమకొండ కోటకు తిరుపతి వేంకటకవులు కూడా వచ్చేవారట.

స్వాతంత్ర్యానంతరం

[మార్చు]

దోమకొండ సంస్థానాధీశుల పాలనకు మెచ్చి నైజాం రాజు హైదరాబాదులోని నాంపల్లి దగ్గర ఉమాబాగ్ అనే 30 ఎకరాలు ఇనాంగా ఇచ్చారు. సోమేశ్వరరావు పాలన సాగుతున్నప్పుడు తెలంగాణ భారత సమాఖ్యలో కలిసిపోవడంతో సంస్థానం రద్దయింది. దాంతో కామినేని వంశస్థులు హైదరాబాదులో స్థిరపడ్డారు. 1954 నుంచి ఆరేళ్లపాటు దోమకొండ కోటలో జనతా కాలేజీ నడిచింది. తర్వాత దాన్ని పాలెంకు తరలించారు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ గడీలు - 6 రెడ్డి దొరల కళావైభోగం దోమకొండ గడీ - ఆంధ్రజ్యోతి[permanent dead link]
  2. "ఆంధ్ర సంస్థానములు: సాహిత్యపోషణము - తూమాటి దొణప్ప" (PDF). Archived from the original (PDF) on 2010-12-27. Retrieved 2012-12-26.