నందకరాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందకరాజ్యం
రచయిత వావిలాల వాసుదేవశాస్త్రి
అసలు భాష తెలుగు
విషయం తొలి తెలుగు సాంఘిక పద్యనాటకం

నందకరాజ్యం తొలి తెలుగు సాంఘిక పద్యనాటకం. దీనిని వావిలాల వాసుదేవశాస్త్రి 1880లో రచించగా, అదే సంవత్సరంలో ముద్రించబడింది. తెలుగు స్వతంత్ర రూపకాలలో మంజరీ మధుకరీయము మెదటిదికాగా, నందకరాజ్యం రెండవది. అంతేకాకుండా, ముద్రించబడిన తొలి తెలుగు స్వతంత్ర నాటకం ఇది.[1][2]

కథ[మార్చు]

ఇది కల్పిత సాంఘీక కథతో గల ఐదు అంకముల నాటకం. నందకుడు అనే జమీందారు రాజ్యానికి రాగానే బ్రహ్మణులు, ప్రజలు సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కాని, రాజోద్యుగులు వచ్చి సంపద దోచుకొని వెళ్లి ప్రజలను బాధిస్తుంటారు. ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది. ద్వితీయాంకంలో దివాన్ అయిన శరభోజీరావు పంతులు యొక్క దుష్టచర్యలు, రాజుగారి కొలువులో అష్టావధానం గురించి చెప్పబడింది. తృతీయాంకంలో శరభోజీ ఠాణాలను తనిఖీ చేసే విధానం, రాణీరంగయ్యమ్మ రాజుకు హితబోధ చేయడం వంటివి వివరించబడింది. చతుర్థాంకంలో రాజపురోహితుడైన శారదానందుని సహాయంతో సుబ్బారావు న్యాయకత్వంలో వైదికులు రాజుకు జరిగిన విషయాలు తెలియజేయడం, అప్పుడు రాజు మంత్రులను దేశ బహిష్కరణ చేసి సుబ్బారావును మంత్రిని చేయడం గురించి చెప్పబడింది. పంచమాంకంలో మంత్రులు దేశాన్ని విడిచి కాశికి బయలుదేరుటను వివరించబడింది. కాని, రాజు అనాలోచితంగా శారదానందుని శిక్షిస్తాడు.

విశ్లేషణ[మార్చు]

ఈ నాటకంలో శరభోజి పాత్ర చివరి వరకు చక్కగా పోషించబడింది. పంచమాంకంలో స్త్రీ విద్య గురించి, ప్రాచీనాంధ్ర కవుల గురించి, పాత కొత్త నాటక ప్రదర్శనల గురించి, ద్విపద-తేటగీతుల రచనాసౌలభ్యం గురించి చర్చించడం జరిగింది.

భాషా విషయంలో వావిలాలశాస్త్రి సరళంగా ఉండాలని కోరుకున్నాగానీ, గ్రామ పదాలను ఉపయోగించినాగానీ వ్యవహారిక భాషను మాత్రం ఆదరించలేదు. శాస్త్రి దీనిని నాటకం అని చెప్పినాకానీ దీనికి నాటక లక్షణాలు మాత్రం లేవు.

మాలాలు[మార్చు]