నాథ సంప్రదాయము
నాథ సంప్రదాయము, ఒక ప్రాచీనమైన మత సంప్రదాయము. ఇది బౌద్ధ మతం వ్యాప్తి చెందుతూ ఉన్న సమయంలో ఆవిర్భవించింది.[1][2] ఇందులో యోగానికి ప్రాధాన్యం అధికం. కాలానుగణంగా యోగీశ్వరుడైన శివుణ్ణి ఆలంబన దేవతగా వీరు ఆరంభించారు. శంకరాచార్యుల తరువాత హిందూమతంలో ఈ నాథ సంప్రదాయము సమన్వయాన్ని సాధించింది. శంకరుని అద్వైతం సంస్కృతజ్ఞుల్లో, అగ్రజాతిల్లోనే వ్యాపించగా, నాథ సంప్రదాయము సామాన్య జనుల్లో ముఖ్యంగా నిమ్నజాతుల్లో వ్యాపించింది. వీరు అత్మసిద్దాంతాన్ని అంగీకరిస్తారు.కర్మ సిద్ధాంతం, ఏకేశ్వరవాదం వీరు ఆమోదిస్తారు. ఇది కాలానుగుణంగా ఆయాభక్తి ఉద్యమాల ప్రభావానికి గురై వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలను ధరించింది.ఉత్తరభారతంలో నాథ సంప్రదాయము వైష్ణవభక్తిగా, రామోపాసన, సూఫీప్రేమ తత్త్వాలకు గురై ఒక గొప్ప భక్తి ఉద్యమంగా పరిణమించింది. వేమన పద్యాలైన, వీరబ్రహ్మం సిద్ధయ్యల తత్త్వాలైనా ఆధ్యాత్మిక, దార్మనిక, నీతి సందేశాలతో ఈ నాథ సంప్రదాయము ప్రజలకు తత్త్వబోధ చేసింది.[3]
పూర్వ చరిత్ర
[మార్చు]యోగసాధన ప్రధానంగా గల నాథసంప్రదాయము ఒకటి పూర్వపు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణా, గుంటూరు ప్రాంతాలలో బాగా వ్యాప్తించి ఉండేది. ఈ నాథ సంప్రదాయ ప్రభావం తత్త్వకవుల, కవయిత్రుల మీద కనిపిస్తుంది.యోగ ప్రధానమైన నాథ సంప్రదాయము ఒక్కసారే హఠాత్తుగా పుట్టి వ్యాపించింది కాదు. దీని చరిత్ర, పరిణామం చాలా ప్రాచీనమైనది. ఇది మొదట బౌద్ధమతంలో శాఖగానే ఉండేది. అపుడు దానికి సిద్ధ సంప్రదాయమని పేరు. బౌద్ధ మతం నీతిని, శిల్పాన్ని, సదాచారాన్ని బోధించేమతం. యోగ విద్యా ప్రభావానికి గురై దానిలో ఒక కొత్త సంప్రదాయం సిద్ద సంప్రదాయం పేరుతో బయలు దేరింది.ఈ సిద్ద సంప్రదాయం భారతదేశంలోనే కాక టిబెట్టు, నేపాల్ దేశాల్లోను బాగా విస్తరించి వ్యాపించింది. సిద్ద సంప్రదాయంలో 84 మంది సిద్దాచార్యులు అంగీకరించిబడినారు. వీరిని సిద్ద గురువులని అంటారు.ఈ సిద్దా చార్యుల మూల రచనలు ఇప్పుడు లభించడంలేదు. కాని టిబెట్ అనువాదాలు మాత్రం దొరుకుతున్నవి.యోగ విద్య క్రీ.పూ.150 ప్రాంతం వాడైన పతంజలి శాస్త్రబద్దం చేసాడు. కాని యోగ విద్య అంతకన్న ప్రాచీనమైనది. మొహంజదారో మట్టినీళ్ళమీద బొమ్మలను బట్టి ఆనాటికే యోగవిద్య ఉండేదని చెప్పవచ్చును.[3]
హిందూమతంలోని ప్రతి సంప్రదాయమూ యోగాన్ని ఏదో విధంగా అంగీకరించి అనుసరిస్తున్నది.కొన్ని హిందూమత సంప్రదాయాలు యమ నియమ ప్రాణాయామ ధారణ ధ్యానదులను పాటించడంతో సరిపుచ్చుకోగా మరికొన్ని యోగవిద్య ద్వారా ఆత్మను పరమాత్మలో లీనం చేయవచ్చునని విశ్వసించినవి.ఇంకా కొన్ని సంప్రదాయాలు యోగసాధన ద్వారా అతీత శక్తులను సంపాదించవచ్చునని బోధించినవి.బౌద్ధ మత నాథ సంప్రదాయములో కాయసాధన ప్రాధాన్య మెక్కువ.షడంగ యోగసాధన ద్వారా శారీరంలోని ప్రజ్ఞ లేక శక్తి ఊర్ధ్వముఖం చేసి సహస్రదళపద్మస్థానంలో అనుసంధింప జేయాలి. సహస్రదళపద్మ స్థానానికే మహాముఖ స్థానమని పేరు. అట్లా అనుసంధింప జేసిన సాధకుడు తానే సత్యమని, తానే బ్రహ్మాండమని, తానే బుద్ధుడని అనుభవాన్ని పొందుతాడు.చుట్టూ ఉన్న ప్రపంచం దూది పింజలాగా లేచిపోయి దాని అస్తిత్వం నశిస్తుంది అని బోధిస్తుంది నాథ సంప్రదాయం.[3]
నాథ సంప్రదాయమును సహజయానమని కూడా పిలుస్తారు.సిద్ధాచార్యులు కులవ్యవస్థకు, వైదిక కర్మకాండలకు పూర్తిగా వ్యతిరేకులు. సిద్ధగురువుల్లో మొదటివాడైన నరహసా బ్రాహ్మణ భిక్షువు.అయినా ఆయన కులాధికత్యతను వ్యతిరేకించారు.వీరు రసవాద విద్యను బోధించేవారు. శరీరంలోని శక్తిపేరు బోధిచిత్త.బోధిచిత్తను ఊర్ధ్వముఖం చేసి సహస్రదళ పద్మం వైపు ప్రవహింపజేసి వజ్రంగా మార్చాలి.రసరూపంలోని కదిలే పాదరసాన్ని గట్టిలోహంగా అంటె బంగారంగా మార్చేవిద్య. సాధనకు గురువు చాలా అవసరం.నాథ సంప్రదాయము స్త్రీ పురుష సంయొగ సుఖము మహాసుఖంగా పరిగణింపజేసింది. ఇదే అటుపై మద్య మైధునాల సేవనం, క్షుద్ర విద్యలను సాధించటం వీటితో దిగజారిపోయి వజ్రయానం పేరుతో ప్రచారంలోకి వచ్చింది అని కొందరి ప్రాచీనుల అభిప్రాయము.[3]
సా.శ.14వ శతాబ్దంవాడైన నవనాథ చరిత్ర అను పేరుతో ఈ నాథ సంప్రదాయుల చరిత్రలను కావ్యంగా రచించారు.ఇందులో శ్రీశైలం నాథ సంప్రదాయుల ఆధీనంలో ఉండేది అనివ్రాసిఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Jones & Ryan 2006, p. 308
- ↑ Nesbitt 2014, pp. 360–361
- ↑ 3.0 3.1 3.2 3.3 నాథ సంప్రదాయము-1983 భారతి మాసపత్రిక, వ్యాసకర్త:డా.ముదిగంటి సుజాతా రెడ్డి.