నానీ పాల్కీవాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నానీ పాల్కీవాలా
2004 నాటి పోస్టలు స్టాంపుపై నానీ పాల్కీవాలా
పుట్టిన తేదీ, స్థలం(1920-01-16)1920 జనవరి 16
బొంబాయి, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం
మరణం2002 డిసెంబరు 11(2002-12-11) (వయసు 82)
ముంబై
వృత్తిన్యాయవేత్త, ఆర్థికవేత్త
జాతీయతభారతీయుడు
కాలం20 వ శతాబ్దం

నానాభోయ్ "నానీ" అర్దేషిర్ పాల్కీవాలా (1920 జనవరి 16 - 2002 డిసెంబరు 11) భారతీయ న్యాయవాది, న్యాయకోవిదుడు.[1] కేశవానంద భారతి v. ది స్టేట్ ఆఫ్ కేరళ, IC గోలక్‌నాథ్ తదితరులు v. పంజాబ్ రాష్ట్రం, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వంటి కేసుల్లో లీడ్ కౌన్సెల్‌గా ఉండటంతో అతనికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. భారతదేశ అత్యంత ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగా అతని కీర్తిని సుస్థిరం చేసింది.

1977 - 1979 మధ్య, పాల్కీవాలా యునైటెడ్ స్టేట్స్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశాడు.

తొలి నాళ్ళు

[మార్చు]

నానీ పాల్కీవాలా 1920 లో బొంబాయిలో అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో జన్మించాడు. అతని ఇంటి పేరు అతని పూర్వీకుల వృత్తి అయిన పల్లకీల ("పాల్కిలు") తయారీ నుండి వచ్చింది. పార్సీలలో ఇది మామూలే.

అతను మాస్టర్స్ ట్యుటోరియల్ ఉన్నత పాఠశాలలోను, తరువాత బొంబాయిలోని సెయింట్ జేవియర్ కళాశాలలోనూ చదువుకున్నాడు. అతనికి నత్తి ఉండేది.[2] కళాశాలలో, అతను ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.

గ్రాడ్యుయేషన్ తర్వాత, పాల్కీవాలా బొంబాయి విశ్వవిద్యాలయంలో అధ్యాపకుని పదవికి దరఖాస్తు చేసుకున్నాడు, కానీ ఆ పదవి రాలేదు. అతను తన విద్యా వృత్తిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం పొందడానికీ ప్రయత్నించాడు. చాలా కోర్సులకు అడ్మిషన్ గడువు ముగిసింది కాబట్టి, అతను బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చేరాడు.

బార్ ప్రవేశం

[మార్చు]

నానీ పాల్కీవాలాకు 1946లో బార్ అసోసియేషన్‌ నుండి ఆహ్వానం వచ్చింది.బొంబాయిలో సుప్రసిద్ధుడైన సర్ జంషెడ్జీ బెహ్రామ్‌జీ కంగా ఛాంబర్‌లో పనిచేశాడు. వాగ్ధాటి గల బారిస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తరచుగా న్యాయస్థానాలలో అతను అందరి దృష్టినీ ఆకర్షించేవాడు. న్యాయవాద విద్యార్థులు బార్ అసోసియేషన్‌లోని యువకులూ అతనిని చూడటానికి వెళ్ళేవారు.

ప్రారంభంలో పాల్కీవాలా వాణిజ్యం, పన్ను చట్టాలపై దృష్టి పెట్టాడు. సర్ జంషెడ్‌జీతో కలిసి, అతను రాసిన ది లా అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ అనే పుస్తకం ఇప్పటికీ పన్ను నిపుణులకు కరదీపిక లాగా ఉంటోంది. మొదటి ముద్రణ సమయంలో పాల్కీవాలా వయస్సు 30 సంవత్సరాలు. తరువాతి కాలంలో సర్ జంషెడ్జీ, ఈ పనికి ఘనత పాల్కీవాలాకు మాత్రమే చెందుతుందని అంగీకరించాడు.

1951లో రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత కలిగిన కేసులో పాల్కీవాలా మొదటిసారి వాదించాడు. అప్పుడు నుస్సర్వాన్‌జీ బల్సారా వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే [(1951) బోమ్ 210] కేసులో జూనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. బొంబాయి మద్య నిషేధ చట్టం లోని అనేక నిబంధనలను సవాలు చేయడంలో అతను సర్ నోషిర్వాన్ ఇంజనీర్‌కు సహాయం చేశాడు. సంవత్సరం ముగియకముందే, పాల్కీవాలా అనేక కేసులను స్వయంగా వాదించాడు. కానీ అతను బొంబాయి హైకోర్టు ముందు రాజ్యాంగ ప్రాముఖ్యత కలిగిన తన మొదటి కేసులో (భూ సేకరణ చట్టాలపై సవాలు) ఓడిపోయాడు.

1954 నాటికి, అతను బార్‌లో చేరిన 10 సంవత్సరాల లోపే, పాల్కీవాలా భారత సుప్రీంకోర్టులో వాదించాడు. ఈ కోర్టు ముందు వాదించిన తన మొదటి కేసులో ( భారత రాజ్యాంగంలోని మతపరమైన మైనారిటీల హక్కులను నియంత్రించే ఆర్టికల్ 29(2), ఆర్టికల్ 30 ల వివరణకు సంబంధించి) అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేని తత్వం గురించి స్పష్టంగా చెప్పాడు. తరువాతి కాలంలో ఇవి బాగా ప్రసిద్ధి పొందాయి.

1975లో, భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన కొద్దికాలానికే, ఇందిరా గాంధీ ప్రభుత్వం స్థాపించిన సవరణలను ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం ఏ స్థాయికి పరిమితం చేస్తుందో నిర్ణయించడానికి ప్రధాన న్యాయమూర్తి AN రే అధ్యక్షతన 13 మంది న్యాయమూర్తుల బెంచ్ హడావుడిగా సమావేశమైంది. నవంబరు 9న ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు, నవంబరు 10న 13 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేశవానంద భారతి కేసుపై విచారణను ప్రారంభించింది. బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎన్ రే, న్యాయమూర్తులు హెచ్‌ఆర్ ఖన్నా, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, వైవీ చంద్రచూడ్, పీఎన్ భగవతి, వీఆర్ కృష్ణయ్యర్, పీకే గోస్వామి, ఆర్‌ఎస్ సర్కారియా, ఏసీ గుప్తా, ఎన్‌ఎల్ ఉంట్వాలియా, ఎం. ఫజల్ అలీ, పీఎం సింఘాల్ సభ్యులుగా ఉన్నారు. నవంబరు 10, 11 తేదీలలో, పాల్కీవాలా నేతృత్వంలోని పౌర స్వేచ్ఛా న్యాయవాదుల బృందం - కేశవానంద నిర్ణయాన్ని పునఃపరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన దరఖాస్తుకు వ్యతిరేకంగా నిరంతరం వాదించింది. కొంతమంది న్యాయమూర్తులు మొదటి రోజున అతని వాదనను అంగీకరించగా, మరికొందరు మరుసటి రోజున అంగీకరించారు. రెండవ రోజు ముగిసే సమయానికి, ఒక్క ప్రధాన న్యాయమూర్తి తప్ప మిగతా అందరూ అంగీకరించారు. నవంబరు 12 ఉదయం, ప్రధాన న్యాయమూర్తి రే, బెంచి రద్దైందని కటువుగా ప్రకటించాడు. న్యాయమూర్తులు నిష్క్రమించారు.

కేశవానంద రివ్యూ బెంచిలో సభ్యుడైన జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా, తాను రాజీనామా చేసిన తర్వాత, ఆ కేసులో నానీ వాదాన్ని ప్రశంసించాడు. 'మాట్లాడింది నానీ కాదు, దైవం అతని ద్వారా మాట్లాడింది' అని అతను అన్నాడు. ఈ రెండు రోజులలో పాల్కీవాలా ప్రదర్శించిన వాక్చాతుర్యం, వాదనలో అతను అధిరోహించిన ఎత్తులూ నిజంగా అసమానమైనవని, ఆనాటి పాల్కీవాలా ఘనత బహుశా సుప్రీం కోర్టులో మరెప్పుడూ సాధ్యం చెయ్యలేరనీ జస్టిస్ ఖన్నా, ఇతర న్యాయమూర్తులూ అభిప్రాయపడ్డారు.

నానీ పాల్కీవాలా రాజ్యాంగాన్ని ఉద్దేశాలను సూచించే సందేశంగానే కాకుండా నైతిక కోణంతో కూడిన సామాజిక ఆదేశంగా కూడా చూశాడు. ప్రీవీ పర్స్ కేసులో మాధవ్ రావ్ జీవాజీ రావ్ సింధియా vs యూనియన్ ఆఫ్ ఇండియా, (1971) 1 SCC 85]లో అతను ఇలా అన్నాడు: "మన ప్రజాస్వామ్యం మనుగడ, దేశ ఐక్యత, సమగ్రతలు రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ చట్టబద్ధత కంటే తక్కువేమీ కాదని గ్రహించడంపై ఆధారపడి ఉంటాయి. ధర్మం ప్రజల హృదయాలలో నివసిస్తుంది. అదే గనక మరణిస్తే, ఏ రాజ్యాంగం, ఏ చట్టం, ఏ సవరణ కూడా దాన్ని రక్షించలేవు."

భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలకు పాల్కీవాలా బలమైన సమర్థకుడు. భిన్నాభిప్రాయాలను అణిచివేసే ప్రయత్నంలో, కేంద్ర ప్రభుత్వం 1972లో న్యూస్‌ప్రింట్‌ దిగుమతిపై నియంత్రణలను విధించింది. సుప్రీంకోర్టు [బెన్నెట్ కోల్‌మన్ & కో. వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, (1972) 2 SCC 788] ముందుకు వచ్చిన కేసులో పాల్కీవాలా, న్యూస్‌ప్రింట్ మామూలు వస్తువుల కంటే ఎక్కువ అని వాదిస్తూ, "న్యూస్‌ప్రింట్ ఉక్కు లాంటిది కాదు. ఉక్కు ఉక్కు ఉత్పత్తులను అందిస్తుంది. న్యూస్‌ప్రింట్ మానవుడి ఆలోచనలను ప్రతిఫలిస్తుంది" అన్నాడు.

1970 వ దశకంలో, భారత రాజ్యాంగం ద్వారా పరిరక్షించబడ్డ మైనారిటీ విద్యా సంస్థల హక్కులను అతిక్రమిస్తూ ప్రభుత్వాలు చట్టాలు (విద్య అనేది భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని ఉమ్మడి జాబితా పరిధిలోకి వచ్చే అంశం - అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దానిపై చట్టం చేయవచ్చు) చేసాయి. ఒక మైలురాయి కేసులో [అహ్మదాబాద్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ సొసైటీ వర్సెస్ గుజరాత్ రాష్ట్రం, (1974) 1 SCC 717], విద్యా సంస్థను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కు, దుర్నిర్వహణ చేసే హక్కు కాజాలదని పాల్కీవాలా వాదించాడు. మైనారిటీల హక్కులను గణనీయంగా బలోపేతం చేస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్‌లో మెజారిటీ సభ్యులు ఆయన వాదనను సమర్థించారు.

నానీ పాల్కీవాలా రాజ్యాంగ చట్టంపై వ్యాఖ్యానించేవారిలో ప్రముఖుడూ, రాజ్యాంగం హామీ ఇచ్చిన పౌర హక్కులకు అత్యంత బలమైన రక్షకుడూ అయినప్పటికీ, ది లా అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్‌ అనే పుస్తకం కూడా అతని ప్రతిభను పట్టిచూపేదే. ఆ పుస్తకాన్ని అతని గురువు సర్ జంషెడ్జీ బెహ్రంజీ కంగా కలిసి రచించాడు. ఈ పుస్తకం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వారి పన్ను చట్టం డ్రాఫ్టూకు గైడ్‌గా పనిచేసింది. పాల్కీవాలా 30 సంవత్సరాల వయస్సులో ఉన్నపుడు, 1950 లో, ఈ పుస్తకం మొదటి సంచిక ప్రచురితమైంది. 2014 లో దాని 10 వ ఎడిషన్ వెలువడింది. రచయితగా మొదట తన పేరు ఉన్నప్పటికీ, ఆ పుస్తకం ఘనత పాల్కీవాలాకే చెందుతుందని సర్ జంషెడ్‌జీ చెప్పాడు.

చాలా సంవత్సరాలుగా నానీ స్నేహితుడు, సహోద్యోగి, మాజీ అటార్నీ-జనరల్ అయిన సోలీ జె. సోరాబ్జీ, ఇలా గుర్తుచేసుకున్నాడు: "విషయాన్ని వివరించడంలో అతనికి ఉన్న ప్రతిభతో, వేలాది మంది శ్రోతలకు బడ్జెట్‌లోని చిక్కులను వివరించే అతని మేధ సరిపోతుంది. ప్రసిద్ధమైన అతని వార్షిక బడ్జెట్ ప్రసంగాలు 1958 లో బొంబాయిలోని గ్రీన్ హోటల్ అనే చిన్న హాలులో ప్రారంభమయ్యాయి. ఏమీ రాసుకోకుండా, కేవలం జ్ఞాపకశక్తి నుండే ఒక గంటకు పైగా మాట్లాడుతూ వాస్తవాలనూ, అంకెలనూ చెబుతూ, ప్రేక్షకులను చూపు తిప్పుకోనీయకుండా ఉంచేవాడు."

వార్షిక బడ్జెట్ సమావేశాల గురించి ఇంకా వివరిస్తూ సొరాబ్జీ, "ఈ సమావేశాలకు పారిశ్రామికవేత్తలు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, సాధారణ వ్యక్తులూ వచ్చేవారు. నానీ ప్రసంగాల్లోని సంక్షిప్తత, స్పష్టత ఆకట్టుకునేవి. అతని బడ్జెట్ ప్రసంగాలు భారతదేశం అంతటా బాగా ప్రాచుర్యం పొందాయి. వాటి కోసం ప్రేక్షకులు బాగా పెరగడంతో పెద్ద హాళ్లు, ఆ తరువాత ప్రేక్షకుల సంఖ్య 20,000 కు మించి పెరగడంతో బ్రాబౌర్న్ స్టేడియంను బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో, బడ్జెట్ ప్రసంగాలు రెండు ఉంటాయని చెప్పుకునేవారు - ఒకటి ఆర్థిక మంత్రి చేసేది, రెండవది నానీ పాల్కీవాలా చేసేది. పాల్కీవాలా ప్రసంగం నిస్సందేహంగా మరింత ప్రజాదరణ పొందింది.[3]

రచించిన పుస్తకాలు

[మార్చు]
  • లా అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇన్‌కం టాక్స్
  • టాక్సేషన్ ఇన్ ఇండియా
  • ది హైయెస్ట్ టాక్స్‌డ్ నేషన్
  • జుడిషియరీ మేడ్ టు మెజర్
  • అవర్ కాన్స్టిట్యూషన్ డిఫేస్‌డ్ అండ్ డిఫైన్‌డ్
  • ఇండియాస్ ప్రైస్‌లెస్ హెరిటేజ్
  • ఎస్సెంషియల్ యూనిటీ ఆఫ్ ఆల్ రెలిజియన్స్
  • వుయ్ ది పీపుల్
  • వుయ్ ది నేషన్

గుర్తింపు

[మార్చు]
నానీ పాల్కీవాలా (కుడి నుండి మూడవ వ్యక్తి, రెండవ వరుస) ప్రధాని మొరార్జీ దేశాయి, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో - 1978 లో కార్టర్ భారత పర్యటన సందర్భంగా.

విద్యావేత్తలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం నుండి పాల్కీవాలా గొప్ప గుర్తింపు పొందాడు.

1963 లో పాల్కీవాలాకు సుప్రీంకోర్టులో సీటు ఇచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించాడు.

1968 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయ మంత్రిగా ఉన్న గోవింద మీనన్ ఆయనకు అటార్నీ-జనరల్ పదవిని ఆఫర్ చేశాడు. పాల్కీవాలా తన పుస్తకం వి ది నేషన్‌లో ఇలా వివరించాడు: "చాలా సంకోచంతోనే నేను అంగీకరించాను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా అంగీకారాన్ని ఆయనకు తెలియజేయగా, మరుసటి రోజు దాన్ని ప్రకటిస్తానని అతను నాకు చెప్పాడు. అనిశ్చితితో కూడిన వేదన ముగిసిందని నేను సంతోషించాను. అకస్మాత్తుగా, వివరించలేని విధంగా, నేను తెల్లవారుజామున మూడు గంటలకు మేళుకున్నాను. నా నిర్ణయం తప్పనీ, ఉదయం ఆలస్యం కాకముందే నేను దానిని తిప్పికొట్టాలి అనీ నా మనసులో స్పష్టత ఏర్పడింది. పొద్దున్నే, నా మనసు మార్చుకున్నందుకు న్యాయ మంత్రికి క్షమాపణలు చెప్పాను. తరువాతి సంవత్సరాల్లో అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పౌరుల తరపున వాదించడం విశేషం. రాజ్యాంగ చట్టాన్ని[...] మలచిన కేసులు వాటిలో ఉన్నాయి".[1][4]

1977 లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం నానీ పాల్కీవాలాను అమెరికాలో భారత రాయబారిగా నియమించింది. 1979 వరకు ఆ హోదాలో పనిచేశాడు. ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, రట్జర్స్ యూనివర్శిటీ, లారెన్స్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్, అన్నామలై యూనివర్శిటీ, అంబేద్కర్ లా యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ ముంబై ల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. ప్రిన్స్‌టన్ అతనిని "... రాజ్యాంగ స్వేచ్ఛల రక్షకుడు, మానవ హక్కుల విజేత ..." అని వర్ణిస్తూ, "అతను స్వేచ్ఛను పణంగా పెట్టి పురోగతి పేరుతో ఇష్టం వచ్చినట్లు చేయడం సరికాదనే తన నమ్మకాన్ని ధైర్యంగా ముందుకు తెచ్చాడు. లాయరు, టీచరు, రచయిత, ఆర్థిక డెవలపరు అయిన పాల్కీవాలా భారత రాయబారిగా విజ్ఞానాన్ని, చక్కటి హాస్యచతురతను, అనుభవాన్నీ, అంతర్జాతీయ అవగాహననూ మాకు అందించారు...." అని పేర్కొంది.[1]

చివరి రోజులు

[మార్చు]

అతని జీవితంలోని చివరి సంవత్సరాల్లో, నానీ పాల్కీవాలా అల్జీమర్స్ వ్యాధితో బాధ పడ్డాడూ. మాజీ అటార్నీ-జనరల్ సోలి జె. సోరాబ్జీ, "ఒక వ్యక్తి చాలా అనర్గళంగా, చక్కగా మాట్లాడే అలాంతి వ్యక్తి, మాట్లాడలేకపోవడం, మనుషులను గుర్తించలేకపోవడాన్ని చూస్తే బాధగా ఉంది." అన్నాడు. [5]

2002 డిసెంబరు 7 న తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేర్చారు. 82 వయసులో 2002 డిసెంబరు 11 న పాల్కీవాలా మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Sorabjee, Soli J. (2003) Palkhivala and The Constitution of India. ebc-india.com
  2. "Nani Palkhivala: God's gift to India". Times of India Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-05-12. Retrieved 2022-11-23.
  3. Pai, M.R. (2002) The Legend of Nani Palkhivala
  4. Kumar, Maj Gen Nilendra (2009). Nani Palkhivala : A role model. Delhi: Universal Law Pub. Co. ISBN 9788175347854.
  5. India, Nnlrj. (21 February 2010) Nani Palkhivala | Law Resource India. Indialawyers.wordpress.com. Retrieved on 2018-11-15.