Jump to content

నిర్మలా రామచంద్రన్

వికీపీడియా నుండి
నిర్మలా రామచంద్రన్
వ్యక్తిగత సమాచారం
జననం(1936-02-09)1936 ఫిబ్రవరి 9
మరణం2011 ఫిబ్రవరి 23(2011-02-23) (వయసు 75)
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్య కళాకారిణి,
భరతనాట్యం గురువు
జీవిత భాగస్వామిఎస్.రామచంద్రన్
పిల్లలు2

నిర్మలా రామచంద్రన్ భరతనాట్య కళాకారిణి. ఈమె రష్యా దేశంలో మొట్టమొదటి భరతనాట్య శిక్షణ నిచ్చే నృత్యపాఠశాలను స్థాపించింది.[1]

విశేషాలు

[మార్చు]

ఈమె 1936, ఫిబ్రవరి 9న జన్మించింది.[2] ఈమె తండ్రి తరఫు పూర్వీకులు తంజావూరు జిల్లాలోని నీదమంగళానికి చెందినవారు. ఈమె తండ్రి వ్యాపారవేత్త. తల్లి శివకాముకు లలితకళల పట్ల ఆసక్తి ఉండేది. ఆమె ప్రోద్బలంతో నిర్మల మైలాపూర్ గౌరి అమ్మ వద్ద తొలుత భరతనాట్యం నేర్చుకుంది. తరువాత ఈమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో పి.చొక్కలింగం పిళ్ళై వద్ద 3 సంవత్సరాలు కఠినమైన శిక్షణ తీసుకుని "నాట్య కళాభూషణం" డిప్లొమాను సంపాదించింది.[3] 1947లో ఈమె తన తొలి నృత్యప్రదర్శనను ఇచ్చింది. తరువాత ఈమెకు బాలసరస్వతి రూపొందించిన ఒక నృత్యనాటకంలో నటించే అవకాశం లభించింది. ఐతే ఆ నాటకంలో ఈమె నటించడం గురువు పి.చొక్కలింగం పిళ్ళైకు నచ్చలేదు. దానితో ఈమెకు చొక్కలింగం పిళ్ళైతో, పందనల్లూరు బాణీ నృత్యంతో సంబంధాలు తెగిపొయాయి. తరువాత ఈమె ఇ.కృష్ణ అయ్యర్ సహకారంతో టి.కె.స్వామినాథ పిళ్ళై వద్ద తిరిగి పందనల్లూరు బాణీలో భరతనాట్యాన్ని అభ్యసించింది. తరువాత ఈమె మద్రాసు, ముంబైలలో అనేక వేదికలపై తన నృత్యప్రదర్శనను ఇచ్చింది. 1954లో మద్రాసు సంగీత అకాడమీలో తన నాట్యాన్ని ప్రదర్శించింది. 1956లో చెన్నైలోని క్వీన్స్ మేరీ కళాశాలనుండి కర్ణాటక సంగీతంతో డిగ్రీని సంపాదించుకుంది.

ఈమె 1958లో ఎస్.రామచంద్రన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె భర్త ఎయిర్ ఇండియా ఉద్యోగి కావడంతో ఈమె తన భర్తతోపాటు తూర్పు ఐరోపా దేశాలు, అమెరికా, సింగపూర్, హాంగ్ కాంగ్, కౌలాలంపూర్ వంటి అనేక ప్రదేశాలు తిరిగి అక్కడ తన నృత్యప్రదర్శనలు ఇచ్చింది. ఈమె తన భర్తతో పాటు 1984-89ల మధ్యకాలంలో రష్యా దేశంలో నివసించింది. ఈమె రష్యా దేశంలో భరతనాట్య ప్రదర్శనను ఇచ్చిన మొట్టమొదటి భారతీయురాలు. ఈమె 1987లో మాస్కోలో మొట్టమొదటి భరతనాట్యం స్కూలును ప్రారంభించింది. అలెగ్జాండ్రా డెనిసోవా మొదలైన వారు ఈ స్కూలులో ఈమె వద్ద భరతనాట్యం అభ్యసించారు.

2004లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈమెకు భరతనాట్యంలో అవార్డును ప్రదానం చేసింది.

ఈమె 2011, ఫిబ్రవరి 23వ తేదీన తన 75వ యేట చెన్నైలో మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. ఎడిటర్ (1 April 2011). "Nirmala Ramachandran". Sruti Magazine (319). Retrieved 27 April 2021.
  2. V. P. DHANANJAYAN (10 March 2011). "Epitome of grace". The Hindu. Retrieved 27 April 2021.
  3. web master. "Obit: Nirmala Ramachandran". Mylapore Times. Retrieved 27 April 2021.