నెల్లూరు వెంకట్రామానాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెల్లూరు వెంకట్రామానాయుడు
నెల్లూరు వెంకట్రామానాయుడు
జననం(1891-05-28)1891 మే 28
India పొట్లపూడి గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1959 ఫిబ్రవరి 7(1959-02-07) (వయసు 67)
నెల్లూరు
మరణ కారణంపక్షవాతం
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు
మతంహిందూ
తండ్రినెల్లూరు రాఘవులు నాయుడు
తల్లిఅచ్చమ్మ

నెల్లూరు వెంకట్రామానాయుడు పత్రికా సంపాదకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు నెల్లూరు రాఘవులు నాయుడు, అచ్చమ్మ దంపతులకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొట్లపూడి గ్రామంలో 1891, మే 28వ తేదీన జన్మించాడు.[1] ఇతడు ప్రాథమిక స్థాయి వరకు మాత్రమే విద్యను అభ్యసించగలిగాడు. తన సొంత జిల్లాలోని ఇందుకూరుపేట గ్రామానికి కరణంగా పనిచేశాడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఉద్యోగాన్ని వదిలి సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. ఇతడు వివాహం చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటూ ఉద్యమాలకే తన జీవితాన్ని అంకితం చేశాడు. జమీందారీ వ్యవస్థ రద్దు కోసం పొణకా కనకమ్మతో కలిసి పోరాడాడు.

నెల్లూరు వెంకట్రమానాయుడు తాను సంపాదకుడిగా పొణకా పిచ్చిరెడ్డితో కలిసి 1930 మార్చి 7న 'జమీందారీ రైతు' అనే వార్తాపత్రికను ప్రారంభించాడు. 1934, సెప్టెంబర్ 21నుండి ఈ పత్రిక 'జమీన్ రైతు' అని పేరు మార్చుకుని వెలువడసాగింది. ఈ పత్రిక భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించింది. దోపిడీ జమీందారీ వ్యవస్థలో రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు వంటి అంశాలపై ఈ పత్రిక దృష్టి సారించింది. పత్రిక గ్రామస్తుల కోసం ఉండాలని, వారే తన వార్తాపత్రికకు పోషకులని ఆయన అభిప్రాయం. ఒకసారి ఇతడు పత్రికలో తన పాత్ర గురించి వ్రాసుకున్నాడు. "నేను ఎడిటర్, క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్వీపర్."

జమీందార్లు మరియు బ్రిటీష్ ప్రభుత్వం ఇతడిని పదే పదే పోలీసు దాడులు, హత్యాప్రయత్నాలు, నిషేధ ఉత్తర్వులతో ఇబ్బంది పెట్టినప్పటికీ ఇతడు ధైర్యంగా పత్రికను కొనసాగించాడు. చివరగా ప్రభుత్వం ఈ వార్తాపత్రికను పూర్తిగా నిషేధించింది. దీనిని కలిగి ఉన్నవారిని అరెస్టు చేసింది. కానీ వెంకట్రామానాయుడు పత్రికను కొనసాగించి రహస్యంగా ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లాడు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఇతడు పత్రికకు జీవం పోశాడు. ఈ పత్రిక గత ఏడు దశాబ్దాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తూ జిల్లాకు ప్రతీకగా నిలిచింది.

రచనలు[మార్చు]

ఇతడు చదువుకున్నది తక్కువే అయినా పద్యాలు, పాటలు, జావళీలు చక్కగా వ్రాస్తాడు. 1905లో మైకా గనులలో పనిచేస్తున్నప్పుడు ఇతడు పోతన మహాభాగవతాన్ని చదివాడు. దానితో ఇతనికి తెలుగుభాష పట్ల మమకారం ఏర్పడింది. 1913లోనే జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కృష్ణాపత్రికలో వ్యాసాలు వ్రాశాడు.[2] ఇతడు వ్రాసిన "మాకొద్దీ జమీందారీ పొందు", "దండాలండోయ్ బాబు మేముండలేమండోయి", "రండయ్య పోదాము రైతు యుద్ధము చేయ", "రైతుకే ఓటివ్వవలెనన్నా! నీ కష్టములు రైతు ప్రతినిధె చెప్పగలడన్నా!", "మిన్నుమున్నెరుగక మీదుకిందెరుగక మెలిగెదవేటికే చిలుకా", "రావే రావే రైతు తుమ్మేదా యింక రాపేల జేసేవె తుమ్మెదా" మొదలైన పాటలద్వారా ఇతడు ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమంవైపు కార్యోన్ముఖుల్ని గావించాడు. తన ఆత్మకథను "నా జీవిత విశేషాలు" పేరుతో రచించాడు.

మరణం[మార్చు]

నెల్లూరు వెంకట్రమానాయుడు 1957 ఆగస్టు 15న పక్షవాతానికి గురై, 1959 ఫిబ్రవరి 7న కన్నుమూశాడు.

మూలాలు[మార్చు]

  1. web master. "Unsung Heroes Detail Paying tribute to India's freedom fighters - Nellore Venkatarama Naidu". Azadi Ka Amrit Mahotsav. MINISTRY OF CULTURE, GOVERNMENT OF INDIA. Retrieved 22 March 2024.
  2. ఈతకోట సుబ్బారావు (2014). ఆనాటి నెల్లూరోళ్ళు (1 ed.). నెల్లూరు: ఈతకోట సుబ్బారావు. pp. 259–260.