నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్
![]() | |
| Established | 1954 |
|---|---|
| Location | జైపూర్ హౌస్, న్యూఢిల్లీ, భారతదేశం |
| Collection size | 17 000 |
| Owner | భారత ప్రభుత్వం |
| Website | http://ngmaindia.gov.in/ |
నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (National Gallery of Modern Art or NGMA) ఒక ప్రసిద్ధిచెందిన చిత్రకళా ప్రదర్శనశాల. ఇది భారత ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక మంత్రిత్వం అధీనంలో పనిచేస్తుంది.[1] దీనికి చెందిన ప్రధాన మ్యూజియం జైపూర్ హౌస్, న్యూఢిల్లీలో 1954 మార్చి 29 తేదీన స్థాపించబడింది. తదనంతరం దీని శాఖలను ముంబై, బెంగుళూరు పట్టణాలలో తెరిచారు. ఇందులో ఆధునిక చిత్రకళకు సంబంధించిన 14,000 కు పైగా చిత్రకళాఖండాలు పరిరక్షించబడ్డాయి. థామస్ డేనియల్, రాజా రవివర్మ, అబనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్, జెమిని రాయ్, అమ్రితా షేర్-గిల్ మొదలైన భారతీయ, పాశ్చాత్య చిత్రకారుల చిత్రాలను పొందుపరిచారు.[1]
చరిత్ర
[మార్చు]జాతీయ స్థాయి ఆర్ట్ గేలరీ కావాలని మొదటిసారిగా 1938లో ఢిల్లీ స్థావరంగా ఉన్న ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ అనే సంస్థ ప్రతిపాదించింది. 1949లో కలకత్తాలో జరిగిన ఆర్ట్ కాన్ఫరెన్స్‌లో భారతప్రభుత్వం జి.వెంకటాచలం, నందలాల్ బోస్, జెమినీరాయ్, ఓ.సి.గంగూలీ, అతుల్ బోస్, జేమ్స్ హెచ్. కజిన్స్, పెర్సీ బ్రౌన్ వంటి కళాకారులను, విమర్శకులను ఆహ్వానించి నేషనల్ మ్యూజియం, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ వంటి సంస్థల ఏర్పాటుకు అవసరమైన సలహాలను, సూచనలను కోరింది. ఆ సమావేశంలో జాతీయ ఆర్ట్ గ్యాలరీ స్థాపించాలని తీర్మానం జరిగింది. 1954లో నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ను అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించాడు. జర్మన్ చరిత్రకారుడు హెర్మన్ గోయిట్జ్ ఈ గేలరీకి మొదటి క్యూరేటర్‌గా వ్యవహరించాడు. సుమారు 200 కళాఖండాలతో ప్రారంభమైన ఈ గేలరీలో ప్రస్తుతం 17000కు పైగా పెయింటింగులు, డ్రాయింగులు, శిల్పాలు, ఛాయాచిత్రాలు ఇతర కళాఖండాలు ప్రదర్శనకు ఉన్నాయి.
భవనం
[మార్చు]ఢిల్లీ నగరంలోని రాజ్‌పథ్ కు చివరలో, ఇండియా గేట్‌కు సమీపంలో ఉన్న ఈ భవనం పూర్వం జైపూర్ మహారాజు నివసించే ప్యాలెస్. కాబట్టి దీనిని జైపూర్ హౌస్ అని పిలుస్తారు. సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఈ భవనాన్ని సర్ ఆర్థర్ బ్లోమ్‌ఫీల్డ్ డిజైన్ చేయగా 1936లో నిర్మించారు. 2009లో ఈ భవనం కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అది ఇంతకు ముందున్న వైశాల్యానికి ఆరు రెట్లు పెద్దది. మొత్తం 12000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రదర్శనశాల ఉంది.[2]
గత డైరెక్టర్లు, డైరెక్టర్ జనరల్స్
[మార్చు]న్యూఢిల్లీలోని నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ కు నాయకత్వం వహించిన అత్యంత ప్రముఖులైన గత డైరెక్టర్లు, డైరెక్టర్ జనరల్స్ జాబితా:
- హెర్మన్ గోయెట్జ్ (1954–1955): ఈయన ప్రముఖ జర్మన్ కళా చరిత్రకారుడు. NGMA ప్రారంభ దినాల్లో కీలక పాత్ర పోషించాడు. మ్యూజియం మొట్టమొదటి క్యూరేటర్, డైరెక్టర్‌గా పనిచేస్తూ దానికి పునాది వేశాడు.
- ప్రదోష్ దాస్ గుప్తా (1957–1970): ప్రసిద్ధ భారతీయ శిల్పి, కలకత్తా గ్రూప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. డైరెక్టర్‌గా తన సుదీర్ఘ పదవీకాలంలో, మ్యూజియంలోని సమకాలీన భారతీయ కళాఖండాల సేకరణను గణనీయంగా విస్తరించాడు.
- లక్ష్మీ ప్రసాద్ సిహారే (1971–1984): NGMA రూపురేఖలను మార్చిన వ్యక్తి డాక్టర్ సిహారే. డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందడానికి ముందు ఆయన ఒక దశాబ్దానికి పైగా డైరెక్టర్‌గా పనిచేశాడు. అగస్టే రోడిన్ (Auguste Rodin) కళాఖండాల వంటి అంతర్జాతీయ ప్రదర్శనలను భారతదేశానికి తీసుకువచ్చాడు. మ్యూజియం క్యూరేషన్, సేకరణ ప్రమాణాలను కచ్చితమైన వృత్తిపరమైన స్థాయికి చేర్చాడు.
- అనిస్ ఫారూఖీ (1980ల చివరలో–1990లలో): కళా చరిత్రకారుడు, అడ్మినిస్ట్రేటర్. 80ల చివరలో, 90లలో గ్యాలరీని నడిపించాడు. ప్రధాన జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలను నిర్వహించే పనిని కొనసాగించాడు.
- ప్రొఫెసర్ రాజీవ్ లోచన్ (2001–2016): కళాకారుడు, విద్యావేత్త అయిన ఈయన డైరెక్టర్‌గా ఆధునిక కాలంలో సుదీర్ఘ పదవీకాలం కొనసాగించిన వారిలో ఒకరు. గ్యాలరీ పరిధిని విస్తరించడం, అనేక విద్యా కార్యక్రమాలను ప్రారంభించడం, ఢిల్లీలోని NGMA భవన ప్రధాన మౌలిక సదుపాయాల విస్తరణను పర్యవేక్షించడం వంటి ఘనతలు ఈయనకు దక్కుతాయి.
- అద్వైత గడనాయక్ (2016–2023): ప్రముఖ శిల్పి అయిన ఈయన డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు. ఈయన పదవీకాలంలో బహిరంగ ప్రదేశాలతో కళను అనుసంధానించడం, సేకరణలను డిజిటలైజ్ చేయడం, ఆధునిక భారతీయ కళాకారుల భారీ పునరావలోకన ప్రదర్శనలను నిర్వహించడం వంటివి జరిగాయి.
చిత్రసమాహారం
[మార్చు]ఈ గేలరీలో ఉన్న కొన్ని కళాఖండాలు:
-
రాజా రవివర్మ గీసినస్త్రీమూర్తి చిత్తరువు
-
రాజా రవివర్మ చిత్రించిన పండును చేతపట్టుకున్న స్త్రీ
-
విలియం హోడ్జెస్ చిత్రించినతాజ్ మహల్
-
థామస్ డేనియల్ గీసిన ఔరంగజేబు మసీదు
-
అవనీంద్రనాథ్ టాగూర్ మాతృదేవత
-
పెస్తోంజి బొమాంజీ గీసినవిరామం
