జాతీయ సాహస పురస్కారం

వికీపీడియా నుండి
(నేషనల్ బ్రేవరీ అవార్డ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జాతీయ సాహస పురస్కారం
National Bravery Award
राष्‍ट्रीय वीरता पुरस्‍कार
Typeపౌరసంబంధమైన
Category6 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలు
Instituted1957
Last awarded2014 (2013 సంవత్సరానికి)
Total awarded872 పిల్లలు (619 బాలురు, 253 బాలికలు)[1]
Awarded byభారత ప్రభుత్వం; ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ (ఐసిసిడబ్ల్యు)
2011 జాతీయ సాహస బాలుర పురస్కార విజేతలు

జాతీయ సాహస పురస్కారం లేదా జాతీయ సాహస బాలల పురస్కారాలు అనగా ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు తమ ప్రాణాలకు సైతం తెగించి అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే అవార్డుల సముదాయం. జాతీయ సాహస పురస్కారాలను ఆంగ్లంలో నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ అంటారు. ఈ అవార్డును భారత ప్రభుత్వం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ (ఐసిసిడబ్ల్యు) ప్రతి సంవత్సరం ఎంపిక చేయబడిన 6 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న 24 మంది అత్యుత్తమ ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలబాలికలకు ఈ అవార్డును ప్రదానం చేస్తాయి.

అవార్డు వివరాలు[మార్చు]

జాతీయ సాహస పురస్కారాల క్రింద మొత్తం ఐదు కేటగిరీలు ఉన్నాయి. అవి:

  1. భారత్‌ అవార్డ్‌, (1987 నుంచి)
  2. సంజయ్ చోప్రా అవార్డ్‌ (1978 నుంచి)
  3. గీతా చోప్రా అవార్డ్‌ (1978 నుంచి)
  4. బాపు గయధని అవార్డ్‌ (1988 నుంచి)
  5. జనరల్ నేషనల్‌ బ్రేవరీ అవార్డ్‌ (1957 నుంచి)

ఈ అవార్డులను ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆరు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయస్సు మధ్య నున్న పిల్లలకు ఇస్తారు. ఈ అవార్డుతో పాటు పతకం, సర్టిఫికెట్, నగదు బహుమతులను కూడా ఇస్తారు. అయితే భారత్ అవార్డు విజేతకు బంగారు పతకాన్ని, మిగతా వారికి వెండి పతకాలను ఇస్తారు. ఈ పురస్కారాన్ని పొందిన ప్రతి పిల్లవానికి ఇందిరాగాంధీ స్కాలర్షిప్ పథకం కింద, ఐసిసిడబ్ల్యు యొక్క ప్రోత్సాహాక కార్యక్రమ భాగంగా అతనికి లేదా ఆమెకి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది. 2009లో భారత ప్రభుత్వం వైద్య, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు ఈ పురస్కార విజేతల కోసం కొన్ని సీట్లను రిజర్వేషన్ల కింద కేటాయించాలని ప్రకటించింది.

చరిత్ర[మార్చు]

అక్టోబరు 2, 1957 న భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద రామ్‌లీలా మైదానంలో ఒక ప్రదర్శనను తిలకిస్తున్నారు. ప్రదర్శన జరుగుతున్న ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అలంకరణ కోసం వేసిన ఒక షామియానాకు అంటుకున్నాయి. అప్పుడు అక్కడే వున్న 14 ఏళ్ల వయస్సున్న హరీష్ చంద్ర అనే ఒక సాహసబాలుడు వెంటనే తన దగ్గరవున్న కత్తిని తీసుకొని తగలబడుతున్న టెంట్ ను చీల్చి మార్గాన్ని ఏర్పరచి, అక్కడ చిక్కుకున్న వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా రక్షించాడు. ఈ సంఘటన ద్వారా ప్రేరేపించబడిన నెహ్రూ దేశవ్యాప్తంగా ఉత్తమ ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను గౌరవించేందుకు ఒక అవార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 4, 1958న ప్రధానమంత్రి నెహ్రూ మొదటి అధికారిక జాతీయ సాహస పురస్కారాలను హరీష్ చంద్ర, ఇతర సాహసికులకు ప్రదానం చేశారు, ఇక అప్పటినుండి ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ (ఐసిసిడబ్ల్యు) ఈ సంప్రదాయాన్ని కొనసాగించింది. సంజయ్ చోప్రా అవార్డు, గీతా చోప్రా అవార్డు 1978 లో ఏర్పాటుచేయబడ్డాయి, సంజయ్ చోప్రా, గీతా చోప్రా అనే ఇద్దరు పిల్లలు తమను కిడ్నాప్ చేయబోయిన కిడ్నాపర్లను ఎదుర్కొనుటలో వారి ప్రాణాలు కోల్పోయారు, ఈ పిల్లల జ్ఞాపకార్థం ఈ అవార్డులు ఏర్పాటుచేయబడ్డాయి. సంజయ్, గీతా అవార్డులు ధైర్యసాహాసాలు ప్రదర్శించిన ఒక బాలుడికి, ఒక బాలికకు ఇస్తారు. భారత్ అవార్డు 1987 లో స్థాపించబడింది, బాపు గయాధని అవార్డు 1988 లో స్థాపించబడింది. 2001లో "స్కాలస్టిక్" 1999 నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ యొక్క విజేతల ప్రశంసాత్మక పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం బ్రేవ్ హార్ట్స్ పేరుతో ముద్రించబడింది.

వేడుక[మార్చు]

ఈ అవార్డులను సాధారణంగా నవంబరు 14, బాలల దినోత్సవం ప్రకటించి, గణతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి ద్వారా ప్రదానం చేస్తారు, ఈ పురస్కారం పొందిన బాలల గౌరవార్థం వీరికి భారత రాష్ట్రపతి ఆతిథ్యమిస్తారు.

మూలాలు[మార్చు]

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; dai13 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు