పండుగ సాయన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పండుగ సాయన్న పేదప్రజలకు దానధర్మాలు చేసిన వ్యక్తిగా, తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు. సంపన్నుల నుంచి విరాళాలు తీసుకొని పేదలకు పంచిన ఘనతను పొందాడు. ఆధిపత్య శక్తులు సాయన్నను హత్య చేసే పథకంతో ఆనాటి ప్రభుత్వం చేత చంపిస్తారు.

జీవిత విశేషాలు[మార్చు]

సాయన్న 1840 నుంచి 1885 మధ్య కాలానికి చెందినవాడు. అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. అతను తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌కు దగ్గర నవాబ్‌పేట మండలం, మెరుగోని గ్రామానికి చెందినవాడు. అతను గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్కచేత్తో లేపే వాడట. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు. అతను పేదవర్గాలను సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా అతనిని చిత్రించారు[1]. అతను ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు. ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదా ములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టాడు. సాయన్న సొంతంగా ఆయుధాలు తయారుచేసుకు న్నాడు. ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ఆనాడు గ్రామాల్లో పెత్తందార్లు స్వైరవిహారం చేసేవారు. దొరల ఆధిపత్యానికి అడ్డులేకుండా ఉండేది. అతని భూములను భూస్వాములు ఆక్రమించుకున్నారు. ఆ కుటుంబం చితికిపోయింది. సాయన్న చిన్నమ్మను భూస్వాములు చెరచటం జరిగింది. గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూస్వాముల దగ్గర వంగివంగి నడవాల్సి వచ్చేది. వూర్లో పెత్తందార్లకు ఎదురుతిరిగి మాట్లాడేవారు కాదు. ఈ పరిస్థితులను చూసిన పండుగ సాయన్న ప్రజర్విల్లాడు. ఆయనలో విప్లవాగ్నులు చెలరేగాయి. ఈ స్థితిని మార్చాలన్న తలంపు ఆయనలో పెరిగింది. ఎదిరించటానికి సాయుధుడయ్యాడు. సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు[2].

ధనవంతులను, భూస్వాములను కొట్టి పేదలకు పెట్టటమన్న ఒక్క సూత్రం ద్వారానే ఆధిపత్య శక్తులపై యుద్ధం చేయటం అతని అభిమతం కాదు. ఆధిపత్య శక్తులపై యుద్ధం చేసే క్రమంలో ప్రజలను చైతన్యపరచాడు. బహుజనులపై ఏ వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో గుర్తించి దాన్ని ఎదుర్కొనటానికి జ్ఞాన మనే చదువు కావాలని చదువుకున్నాడు. బహుజన వర్గాలు చదువుకోవాలన్న సందేశం ఇచ్చాడు.

ఆ రోజుల్లో పేదల పెళ్ళిళ్లు జరగాలంటే చాలా కష్టంగా ఉండేది. వారు భూమిలేక కరువుకాటకాలతో, పేదరికంతో బాధపడుతూ ఉండేవారు. వారి ఆకలి తీర్చటానికి పండుగసాయన్న అన్న దానాలు చేసేవాడు. భూస్వాముల గుమ్ములు పగులగొట్టి పేదల కడుపు నింపాడు. అన్నార్తులకు అన్నం పెట్టటమే ఆనాటి విప్లవం[3].

అరెస్టు, హత్య[మార్చు]

ప్రజల్లో సాయన్నకు పెరుగుతున్న ఆదరాభిమానాలను భూస్వాములు తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టించారు. వారు నిజాంపై ఒట్టిడి తెచ్చి అతనిని అరెస్టు చేయించారు. తరువాత సాయన్నను చంపడానికి పథకం వేసారు. జంగు జలాల్‌ఖాన్‌ మోహితి మిన్‌సాబ్‌ ఎస్పీ నాయకత్వంలో సాయన్నను అరెస్టు చేసి హతమార్చే కుట్రను ప్రజలు నిరసిస్తారు. కొందరు పెద్దమనుష్యులు సాయన్నను విడుదల చేయించాలని వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెస్తారు. ఆయన జైలునుంచి విడుదల కావాలని ప్రజల్నించి పెద్దఎత్తున ఒత్తిళ్లు పెరిగాయి. ఆగ్రహించిన జనం జిల్లా జైలుపై దాడికి దిగి జైలును బద్దలుకొడతారు. కానీ, సాయన్న అక్కడ ఉండడు. కనబడ్డ పోలీసులపై ప్రజలు తిరగబడతారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెగుతుంది.

వనపర్తి రాణి శంకరమ్మ రంగంలోకి దిగి ప్రజల పక్షాన నిలబడింది. నిజాం రాజు మీర్‌ మహుమూద్‌ అలీని కలిసింది. ‘‘పండుగ సాయన్నను ప్రజల కోరిక మేరకు విడుదల చేయాలని’’ విజ్ఞప్తి చేసింది. అతనిని వదిలివేయడానికి పదివేల రూపాయలు "జమానత్"గా కట్టింది. ప్రజల డిమాండ్ కు తలవంచి నిజాం సర్కార్ "మార్ మత్. చోడో" అని హుకుం జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో రాణి స్ంకరమ్మ నలుగురు పెద్దమనుషులతొ సహా పాలమూరుకు వచ్చింది. ఐతే సాయన్నను ఎలాగైనా హతమర్చాలని తలచిన భూస్వాములు మరల కుట్ర పన్నారు. "మార్ మత్. ఛోడో" అనే స్టే ఆర్డరును తమకు అనుకూలంగా ఉన్న ఎస్పీ మోహితి మిన్‌ సాబ్‌, జంగన్‌లాల్‌, పట్వారి వెంకట్రావుల సలహాతో ఆర్డరులోని "మార్" తరువాత విరామ బిందువునుంచి, "మార్. మత్ చోడో" అని మార్చి వేసారు. దీని అర్థం ప్రకారం "చంపండి. వదలకండి" అని. ఈ ఉత్తర్వు ప్రకారం సాయన్నకు మరణశిక్ష విధిస్తారు.

పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరేస్తారు. ప్రజలు ఆగ్రహంతో ఎస్పీ కార్యాలయం పైకి పోతారు. ఎస్పీ జనాగ్రహాన్ని చూసి గుండె పోటుతో చనిపోతాడు. నాగిరెడ్డి, వెంకట్రావు, పెద్దిరెడ్డి రాంరెడ్డి తదితర భూస్వాములు దావత్‌ చేసుకుంటున్న ప్రభుత్వ వసతి గృహాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టి తగులబెడతారు. అందులోనే వారు మసైపోతారు.

సంస్మరణ[మార్చు]

ఇప్పటికీ పండుగ సాయన్న మరణించిన రోజును మర్చిపోకుండా వేలాదిమంది ఆయన సమాధి దగ్గరకొచ్చి నివాళులర్పిస్తారు. జయంతి ఉత్సవాలు జరుపుతారు.[4] అతని చరిత్రను ఇప్పటికీ సజీవంగా ఉంచింది సంచార జాతుల, దళిత, బహుజన కళాకారుల కంఠాలే. వీళ్లు వూరూరా తిరుగుతూ సాయన్న చరిత్రను గానం చేశారు[5].

పుస్తకాలు[మార్చు]

మహబూబ్‌నగర్‌కు చెందిన న్యాయవాది బెక్కం జనార్ధన్‌ పండుగ సాయన్నపై ఒక నవల రాశారు. చారిత్రక ఆధారాలు తక్కువగా లభించే ఈ కథను దొరికిన ఆనవాళ్లతోనే ఉన్నతంగా రచించాడు[6].

సినిమా[మార్చు]

ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అతని పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పండుగ సాయన్న పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు[7].

మూలాలు[మార్చు]

  1. "JAMBAPURANA: GENEALOGY- POLITICS" (PDF).[permanent dead link]
  2. "గండర గండడు - పండుగ సాయన్న | సోపతి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-04-03.
  3. www.andhrajyothy.com https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-644813. Retrieved 2020-04-03. Missing or empty |title= (help)
  4. "Panduga Sayanna Jayanthi Vuthsvaalu at Mahabubnagar 17". funny-video-online.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-03.
  5. Sadanandam, P. (2008). Art and Culture of Marginalised Nomadic Tribes in Andhra Pradesh (in ఇంగ్లీష్). Gyan Publishing House. ISBN 978-81-212-0958-8.
  6. Janardhan, Bekkam; Publications, Nallamalla (2017-09-01). Autobiography of Pandaga Sayyanna (in Telugu) (1 edition ed.). Nallamalla Publications. |edition= has extra text (help)CS1 maint: unrecognized language (link)
  7. Krishna (2020-02-10). "పండుగ సాయన్నగా పవన్ .. ఏంటి ఈ కథ ?". www.hmtvlive.com. Retrieved 2020-04-03.

బాహ్య లంకెలు[మార్చు]