పల్లా దుర్గయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పల్లాదుర్గయ్య కవి. సాహిత్య పరిశోధకుడు. సాహితీ విమర్శకుడు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. పట్టా పుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి. ఇతడు 1914, మే 25వ తేదీన వరంగల్లు జిల్లా,హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో పాపయ్య శాస్త్రి, నర్సమ్మలకు నాలుగవ సంతానంగా జన్మించాడు.[1] గొట్టిముక్కల రాధాకిషన్ రావు ఇతనికి గురువు. ఇతడు 1942లో ఎం.ఎ., 1960లో పి.హెచ్.డి పట్టాపుచ్చుకున్నాడు. 1945 నుండి 1960 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు[2].

మొదటి తెలుగు ఎం.ఎ.[మార్చు]

ఉస్మానియా యూనివర్సిటిలో మొట్టమొదటి సారిగా 1940లో తెలుగు ఎం.ఎ.తరగతులు ప్రారంభించారు. ఆ ఏడాది ఆ క్లాసులో చేరిన ఏకైక విద్యార్థి పల్లా దుర్గయ్య. ఒక విద్యార్థి, ముగ్గురు అధ్యాపకులు. ఆ అధ్యాపకులు రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, గంటి సేవా రామయ్యలు. ఈ విధంగా పల్లా దుర్గయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగు శాఖకు తొలి విద్యార్థి గౌరవాన్ని పొందాడు[3].

రచనలు[మార్చు]

 1. ప్రబంధ వాజ్మయ వికాసము (సిద్ధాంత గ్రంథము)
 2. గంగిరెద్దు (కావ్యము)
 3. పాలవెల్లి (ఖండకావ్య సంపుటి)
 4. పారిజాతాపహరణము
 5. అల్లసాని పెద్దన (విమర్శ)
 6. చతుర వచోనిధి (విమర్శ)
 7. పెద్దన కవితావైభవం (యువభారతి ప్రచురణ)
 8. మాయరోగం (నాటకం)
 9. విక్రమార్క చరిత్ర (సంపాదకత్వం - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ)

రచనల నుండి ఉదాహరణ[మార్చు]

దాగుడుమూతలు[4]

మాగుడువడ్డ యీ భువన మంటప కేళి విహార లోలురై
ఆగక వచ్చి మూగెడి యనంత జగజ్జనముల్ క్రమంబునన్
దాగుడుమూతలాడ, కనుదమ్ములు మూసెడి తల్లి యెవ్వరో?
ఏగెడి వారిలోన దొర లెందరొ? చెల్లని దొంగ లెందరో?

ఏగెడివార లాడుకొని యేగ తదీయ పదాంక ముద్రితా
ధ్వాగమనేప్సులై యెదురుతాకుచు వచ్చు నవీనఖేలకుల్
మూగుదురప్పుడప్పుడె సముద్రతరంగములట్లు, క్రమ్మరన్
వేగమె విచ్చిపోవుదురు ఫేననముద్గత బుద్బుదక్రియన్

ప్రోగులు ప్రోగులై యిసుకపోసిన రాలని వాలకంబునన్
మూగిన మూకలో, నొకట ముందుకు వెన్కకు బారు వీరిలో
నాగతు లెందరో యిట ననాగతు లెందరొ, యిందులో నన
భ్యాగతు లెందరో యతిథులై చనుదెంచినవార లేందరో?

అక్కట నేలయీనినటు లంతట వింతగ నిండియుండి, యే
దిక్కున చూడ తామెయయి త్రిమ్మరునట్టి యుపిళ్లపుట్టలై
ఎక్కడనుండి యెక్కడకు నేగుచు యిక్కడి కేగుదెంచిరో
నిక్క మెఱింగి తెల్పు మహనీయులు యీ యిలలోన నెవ్వరో?

ఇక్కడ కూడినట్టి జను లెందరొ ముందర యిందు లేరు, ముం
దిక్కడ నున్నవార లిపు డెందరొ కానగరారు, చిన్నదై
చిక్కుల దుక్కియౌ కడు విచిత్రపు దాగుడుమూతలాటలో
నుక్కిరిబిక్కిరై నిలువనోడుచు నూడనిబాడియుండిరో?

ఆటకు రాకముందు దొర లందరు, మీదట దొంగలైనవా
రోటమి జెంది, కన్నుగవ లొక్కట మూయగబడ్డ పిమ్మటన్
నేటుగ బర్వుచుంద్రు, తమ నేరము లన్యుల నెత్తి రుద్దగా
చాటున నక్కియుండు దొరసంఘము భీతిని నిక్కిచూడగన్

అందరుగూడ తాము దొరలన్న యతార్థము విస్మరించి యీ
వందల వేలమంది, తమవారినె దొంగ లటంచు బల్కుచున్
నిందలు మోపుచున్ తమకు నేటుకువచ్చెడు దమ్ములేక, యి
బ్బందుల గొందిలో సణగి బాధలపాలగుచుందు రక్కటా!

రాత్రులయందు ప్రొద్దుల విరామములేక నిరంతరమ్ము నీ
సత్రములోపలన్ దిగి వెసన్ జనుటే పరిపాటి యయ్యు, నీ
ధాత్రియు దాగురింతలె, యథార్థమటంచు భ్రమించుటయే
చిత్రములోని చిత్రము విచిత్రపు దాగుడుమూతలాటలో!

క్రీడావేశము ముమ్మరమ్ముగొన స్వర్గీయస్థితిన్ వీడి, ని
ర్వ్రీడామానసులై పరస్పరజయశ్రీకాములై పోరు యీ
చూడాబద్ధ కిరీటఖేలకుల కిచ్చో వచ్చుచుం బోవుచో
జూడన్ గన్నులుమూయు 'తల్లి' యొకతే సూ! సాక్షియై నిల్చుబో!

(పాలవెల్లి ఖండకావ్య సంపుటి నుండి)

రిఫరెన్సులు[మార్చు]

"ఉత్తమ పరిశోధకులు పల్లా దుర్గయ్య". ABN. ABN ఆంధ్రజ్యోతి. Retrieved 25 September 2017.[permanent dead link]

మూలాలు[మార్చు]

 1. సంగిశెట్టి శ్రీనివాస్ (2011-05-23). "పల్లె మీది పాలవెల్లి". సాక్షి దినపత్రిక.
 2. https://openlibrary.org/authors/OL1598547A/Dr.Palla_Durgiah
 3. ఎడిటర్ (9 July 1979). "ఉస్మానియాలో తెలుగు భాష ప్రవేశపెట్టబడిన తొలి రోజులలో..." ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 98. Archived from the original on 15 జూన్ 2020. Retrieved 26 December 2017.
 4. పల్లా దుర్గయ్య (1955). పాలవెల్లి (1 ed.). హైదరాబాదు: తెలంగాణా రచయితల సంఘం. pp. 6–7. Retrieved 4 April 2015.