పి.జి.ఉడ్‌హౌస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
middle-aged man in overcoat and trilby hat smiling cheerfully towards the camera
48 ఏళ్ల వయసులో ఉడ్‌హౌస్ (1930లో తీసిన ఫోటో)

సర్ పెల్హమ్‌ గ్రెన్‌విల్ల్ ఉడ్‌హౌస్ KBE (1881 అక్టోబర్ 15 – 1975 ఫిబ్రవరి 14) ఒక ఆంగ్ల రచయిత. ముఖ్యంగా తన హాస్య రచనలకు ప్రసిద్ధి చెందాడు. ఇతడు సృష్టించిన బెర్టీ ఊస్టర్, జీవ్స్, స్మిత్, లార్డ్ ఎమ్‌స్వర్త్, ఫ్రెడ్డీ, మ్యూలినర్ వంటి పాత్రలు పాఠకలోకానికి చిరపరిచితాలు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు సర్రే (ఇంగ్లాండు) లోని "గిల్డ్‌ఫోర్డ్"లో 1881, అక్టోబర్ 15వ తేదీన జన్మించాడు[1]. ఇతని తండ్రి హెన్రీ ఎర్నెస్ట్ ఉడ్‌హౌస్ హాంగ్‌కాంగ్‌లో పనిచేసే బ్రిటీష్ మెజిస్ట్రేటు. ఇతని తల్లి పేరు ఎలనార్. ఉడ్‌హౌస్ విద్యాబ్యాసం డల్‌విచ్ కాలేజీలో సాగింది. చదువు తరువాత ఇతడు "హాంగ్‌కాంగ్ షాంగై బ్యాంకు"లో రెండు సంవత్సరాలు పనిచేశాడు. ఆ ఉద్యోగం నచ్చక మానివెసి[2] జర్నలిజం చేపట్టాడు. కథలు కూడా వ్రాయడం మొదలుపెట్టాడు. 1902లో "గ్లోబ్" పత్రికలో 'బైదవే' అనే కాలమ్‌ వ్రాసేవాడు[3]. "ది కెప్టెన్" అనే పిల్లల పత్రికకు పాఠశాల కథలు వ్రాసేవాడు. ఆ తర్వాత ఇతడు హాస్య రచనలు చేయడం మొదలుపెట్టాడు.

ఇతడు తన జీవితంలో ఎక్కువ కాలం అమెరికాలో గడిపినా ఇతని రచనలలో ఎక్కువ భాగం ఇంగ్లాండు నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. కొన్ని కథలు, నవలలలో మాత్రం న్యూయార్క్, హాలీవుడ్ వాతావరణాన్ని సృష్టించాడు. ఇతడు బ్రాడ్‌వే థియేటర్‌ కొరకు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, యుద్ధం తర్వాత కూడా గై బోల్టన్, జెరోమ్‌ కెర్న్‌లతో కలిసి అనేక మ్యూజికల్ కామెడీలను వ్రాశాడు[4]. ఇతడు 1930 నుండి ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఎం.జి.ఎం.కు రచనలు చేయడం ప్రారంభించాడు[5]. ఆ దశకంలో సాహిత్యపరంగా ఇతడు చాలా ఎత్తుకు ఎదిగాడు.

ఇతడు తన 33వ యేట ఈథెల్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు[1].

1940లో ఉడ్‌హౌస్‌ను బందీగా ఉంచిన జైలు

ఇతడు 1934లో ఫ్రాన్సు దేశానికి వెళ్ళాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫ్రాన్సును ముట్టడించినప్పుడు ఇతడిని అరెస్టు చేశారు[6]. దేశం వదిలి పోకూడదని ఆంక్షలు విధించారు. అలా నాలుగేళ్లు గడిచాక అతని అభిమానులైన జర్మనీ అధికారుల కోసం తన జైలు జీవితం గురించి హాస్య ప్రసంగాలు చేశాడు. కష్టకాలంలో కూడా హాస్యధోరణిని వదలి పెట్టని ఇతని తాత్వికత ఆ ప్రసంగాలలో కనబడుతుంది. ఆ ప్రసంగాలను బెర్లిన్ రేడియో ప్రసారం చేయడం[7]తో ఇతడు మరిన్ని కష్టాలను కొనితెచ్చుకున్నట్లయ్యింది. ఉడ్‌హౌస్ శత్రువులకు అమ్ముడు పోయాడని, జర్మన్ ముష్కరత్వాన్ని అసలు రంగుల్లో చూపకుండా ప్రపంచ ప్రజలకు జర్మన్ పట్ల సానుభూతి కలిగేలా సహాయ పడ్డాడని ఇతనిపై ఇంగ్లాండులో ప్రచారం జరిగింది"[8],[9],[10]. ఇంగ్లాండులోని అనేక గ్రంథాలయాలలో ఇతని పుస్తకాలను తొలగించారు. 1945లో యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత ఇతడు విడుదల చేయబడ్డాడు[11]. కానీ దేశద్రోహి అనే ముద్ర జీవితాంతం అతడిని వెంటాడింది. విడుదలైన 10 సంవత్సరాలకు కానీ అతనికి అమెరికా పౌరసత్వం లభించలేదు. ఇతని ప్రతిభకు ఎప్పుడో లభించవలసిన నైట్‌హుడ్ ('సర్ ' బిరుదు) చాలా కాలానికి అంటే మరణించే కొద్ది వారల ముందు వరకు లభించలేదు[1]. ఇతడు తనపై విచారణ జరుపుతారనే భయంతో ఇంగ్లాండుకు తిరిగి వెళ్లలేదు. 1947 నుండి 1975లో మరణించే వరకూ ఇతడు అమెరికాలోనే నివసించాడు.

రచనలు

[మార్చు]
ఎ ప్రిఫెక్ట్స్ అంకుల్ నవల ముఖచిత్రం

ఇతడు తన జీవితంలో విస్తృతంగా రచనలు చేశాడు. 1902 నుండి 1974 వరకు ఇతడు 293 కథలు, 71 నవలలు, 40 నాటకాలు, ఎన్నో మ్యూజికల్ కామెడీలు, రెండు ఆత్మకథలు వ్రాశాడు. ఇతని రచనలలో "ది పాట్ హంటర్స్", "మైక్", "లవ్ అమాంగ్ ద్ చికెన్స్", "స్మిత్ ఇన్‌ ద సిటీ", "స్మిత్ ద జర్నలిస్ట్", "లీవ్ ఇట్ టు స్మిత్", "ఎ జెంటిల్ మాన్ ఆఫ్ లీజర్", "స్ప్రింగ్ ఫీవర్", "మాంటీ పెర్ల్‌స్", "అంకుల్ ఫ్రెడ్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్", "రైట్ హో జీవ్స్", "ద ప్రిన్స్ అండ్ బెట్టీ", "జిల్ ద రెక్‌లెస్", "ది గర్ల్ ఆన్ ద బోట్", "బిగ్ మనీ", "లాఫింగ్ గ్యాస్", "జాయ్ ఇన్ ద మార్నింగ్", "అంకుల్ డైనమైట్","పిగ్స్ హావ్ వింగ్స్", "ఫెంచ్ లీవ్", "ఫ్రోజెన్ అసెట్స్", "ద లక్ స్టోన్", "ఎ ప్రిఫెక్ట్స్ అంకుల్" వంటి నవలలు, "టేల్స్ ఆఫ్ సెయింట్ ఆస్టిన్స్", "మై మాన్ జీవ్స్", "ద మాన్ విత్ టూ లెఫ్ ఫీట్","యూక్రిడ్జ్", "మిస్టర్ మ్యూలినర్ స్పీకింగ్", "ఎగ్స్, బీన్స్ అండ్ క్రంపెట్స్", "నథింగ్ సీరియస్" వంటి కథా సంపుటులూ, "ఆఫ్టర్ ద షో", "ఎ తీఫ్ ఫార్ ద నైట్", "నట్స్ అండ్ వైన్", "ఓ బాయ్", "ద గర్ల్ బిహైండ్ ద గన్", "ఓ లేడీ లేడీ", "మిస్ 1917" వంటి నాటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇతడు "పర్ఫార్మింగ్ ఫ్లీ", "ఓవర్ సెవెంటీ" వంటి ఆత్మకథలను వ్రాశాడు. ఇతని రచనలు వెలువడి చాలా కాలం అయినా వాటిని ప్రజలు ఇంకా విరివిగా చదువుతున్నారు. ఇతని పుస్తకాలు పదేపదే పునర్ముద్రింప బడుతున్నాయి. ఇతని రచనలు అనేక భాషలలోకి అనువదించబడ్డాయి.

తెలుగు రచనలపై ఉడ్‌హౌస్ ప్రభావం

[మార్చు]

ఇతర భాషా రచయితలపై ఉన్నట్లే తెలుగు రచయతలపై కూడా ఉడ్‌హౌస్ ప్రభావం చాలావుంది. తెలుగు రచయితలు ఎందరో ఇతని రచనలు చదివి ఇతనికి అభిమానులుగా మారారు. ఇతని రచనలను ప్రేరణగా తీసుకుని తెలుగులో హాస్య రచనలు చేశారు. డి.వి.నరసరాజు రచన "నాటకం", పాలగుమ్మి పద్మరాజు నవల "బతికిన కాలేజీ"లకు ఉడ్‌హౌస్ రచనలు ప్రేరణగా నిలిచాయి. పెళ్ళిసందడి వంటి సినిమాలలో, విజయా వారి అనేక సినిమాలలో పాత్రలకు ఉడ్‌హౌస్ సృష్టించిన పాత్రలకు చాలా పోలికలు కనిపిస్తాయి. ఇతడు సృష్టించిన పాత్రలు ఊస్టర్, జీవ్స్‌లను అనంతశయనం, అచలపతి అని తెలుగు పేర్లు పెట్టి, అచలపతి కథలు పేరుతో ఎమ్బీయస్ ప్రసాద్ అనే రచయిత కొన్ని కథలు వ్రాశాడు[1]. ఇతని కొన్ని కథలను "సరదాగా మరి కాసేపు" అనే పేరుతోను, ఫ్రోజెన్ అసెట్స్ నవలను "లంకె బిందెలు" అనే పేరుతోను గబ్బిట కృష్ణమోహన్ అనే రచయిత అనువదించాడు[12].

మరణం

[మార్చు]

ఇతడు 1975 ఫిబ్రవరి 14న, తన 93వ ఏట, న్యూయార్క్ లోని సౌతాంప్టన్‌లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 1.3 ఎం.బి.ఎస్.ప్రసాద్ (1 February 2002). "ఆంగ్ల హాస్య రచనలో అగ్రగణ్యుడు - పి.జి.ఉడ్‌హవుస్". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (9): 47–48. Retrieved 24 March 2018.
 2. McCrum, p. 47
 3. Jasen, p. 45
 4. Hischak, Thomas. "Princess Theatre Musicals", The Oxford Companion to the American Musical, Oxford University Press, 2008
 5. Taves, p. 127
 6. Jasen, p. 174
 7. Phelps, p. 211
 8. "The Price is ?", The Mirror, 28 June 1941, p. 1
 9. "Mr P.G. Wodehouse (Broadcasts, Germany)" Archived 2015-06-12 at the Wayback Machine, Hansard, 9 July 1941, Vol. 373, cols 145–146
 10. Connolly, p. 92
 11. Green (1981), p. 203
 12. ఉడ్‌హౌస్ పుస్తకాలు రెండు[permanent dead link]

గ్రంథసూచి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]