పుణ్యభూమీ కళ్ళు తెరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుణ్యభూమీ కళ్ళు తెరు లేదా హేంగ్ మీ క్విక్ అన్నది బీనాదేవి రాసిన తెలుగు నవల. భాగవతుల నర్సింగరావు, బి.టి.సుందరమ్మ దంపతులు కలసి రచనలు ప్రారంభించి తమ పేర్లను కలిపి బీనాదేవి అని కలంపేరు పెట్టుకున్నారు. వారు రాసిన నవలల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నవల తెలుగు సాహిత్యంలో కూడా ముఖ్యమైన నవలల్లో ఒకటిగా నిలిచింది.

రచనా నేపథ్యం[మార్చు]

ఈ నవలను బీనాదేవి రచించగా 1969-70 మధ్యకాలంలో ఆంధ్రజ్యోతిలో హేంగ్ మీ క్విక్ అన్న పేరుతో నవల సీరియల్ గా ప్రచురితమైంది. సీరియల్ గా ప్రచురితమౌతున్నప్పుడు నవల సంచలనం కలిగించింది. సీరియల్ పూర్తయ్యాకా దీన్ని పుస్తకరూపంలోకి తీసుకువచ్చినపుడు పుణ్యభూమీ కళ్ళు తెరు అన్న పేరు పెట్టారు. నవల నేపథ్యం 1960 దశకం నాటి కళింగాంధ్ర ప్రాంతం, మొదట కళింగాంధ్ర ప్రాంతంలోని ఓ పల్లెటూరులో ప్రారంభమై, విశాఖపట్టణంలో ముగుస్తుంది.[1]

ఇతివృత్తం[మార్చు]

కళింగాంధ్రంలోని ఓ పల్లెటూళ్ళో మహాలక్ష్మమ్మకి రాజమ్మ పుడుతుంది. రెండో ఏటనే మేనత్త కొడుకు సింహాచలానికి రాజమ్మనిచ్చి పెళ్ళిచేయాలని అనుకుంటారు, చిన్నతనంలోనే చేస్తారు. సింహాచలం, రాజమ్మలు ఓ వయసుకు వచ్చాకా కాపురానికి పంపేస్తారు. రాజమ్మ పేదవేషం వేసుకున్న యువరాణిలా ఉంటుంది. ఆమె చాలా ఆరోగ్యకరంగా, అందంగా ఉంటుంది. ఐతే అందుకు భిన్నంగా సింహాచలం బక్కగా, డబుల్ టైఫాయిడ్ వచ్చి కోలుకుంటున్న నక్కలా ఉంటాడు. వాళ్ళకి ఓ అరెకరం పొలం ఉంటుంది. సింహాచలానికి ఆరుగాలం కష్టపడి, కాస్తో కూస్తో పండించినా చివరికి మనకేమీ మిగలదన్న చేదునిజం మొదటి నుంచీ తెలుసు.
సింహాచలం కుటుంబంలో భార్య, ముసలి తల్లి, కొడుకు ఉంటారు. హఠాత్తుగా సింహాచలం తల్లికి పక్షవాతం వస్తుంది, ఆమెకు వైద్యం చేయించేందుకు తగ్గ డబ్బు అతని వద్ద ఉండదు. చెరుకు తోట వెయ్యడానికైతే అప్పుపెట్టే షావుకారు, తల్లికి వైద్యం చేయించడానికంటే అప్పివ్వడు. ఇక వేరే దారి లేక గవర్రాజు మావ దగ్గరికి వెళ్తాడు. గవర్రాజు సాధారణ స్థాయి నుంచి మొదలై మున్సిపల్ కాంట్రాక్టరుగా పదెకరాల పొలం, అంటుమామిడితోట, డాబా ఇల్లు, పట్నంలో చదువుతున్న కొడుకు, జీవితంలో ఇంకా ఎదుగుతానన్న నమ్మకం సంపాదించుకునేందుకు చేయని పాపం, అన్యాయం లేదు.
గవర్రాజు షావుకారుతో మాట్లాడి సింహాచలానికి అయిదొందలు అప్పు ఇప్పిస్తూ ఓ ప్రోనోటు, బండి ప్రశస్తమైన బెల్లాన్ని షావుకారు కొట్టుకే తోలుతానన్న షరుతుతో అగ్రిమెంటూ రాయించాడు. సింహాచలం తల్లిని పట్నంలోని ఆసుపత్రికి తీసుకుపోవడానికి సాయం కూడా పడ్డాడు. అమాయకుడైన సింహాచలం నుంచి గవర్రాజు ఇప్పుడూ, అప్పుడు డబ్బు బాగానే లాగాడు. చివరకు డబ్బంతా ఖర్చైపోయి తల్లి మరణించింది. మరణించిన తల్లిని పట్నంలోనే దహనం చేసి, డబ్బు మొత్తం వదిలించుకుని ఊరు తిరిగొచ్చాడు సింహాచలం. ఇప్పుడతనికి తల్లి పోయి, షావుకారు అప్పు మాత్రం మిగిలింది.
తల్లి అనారోగ్యానికి, చెరుకుపంట పెట్టుబడికీ షావుకారు ఇచ్చిన బాకీ అసలు, వడ్డీతో కట్టాలి. ఈ పరిస్థితుల్లో తాను రాసిచ్చిన అగ్రిమెంట్ ప్రకారం షావుకారుకు అమ్మకుండా వేరే వాళ్ళకి బెల్లం అమ్ముకున్నాడు సింహాచలం. తన బాకీదారు తన ద్వారా బెల్లం అమ్మాలి. కొన్నవాడి దగ్గర కమిషన్, అమ్మిన రైతు దగ్గర కన్యకాపరమేశ్వరి ధర్మం, వర్తక సంఘానికి చందా, తన గుమాస్తాలకు, కళాసీలకు రుసుం వంటివన్నీ కట్టుకునేది ఉండగా, తాత అప్పు, తండ్రి అప్పు తీర్చకుండా తాను వేరేగా అప్పుచేసి మూడు అప్పులూ అలా ఉండనిచ్చి తన ముందే వేరొకడికి అమ్ముకోవడం చిరచిరలాడించింది షావుకారును.

మూలాలు[మార్చు]

  1. సహవాసి (2015). "పుణ్యభూమీ కళ్ళు తెరు/హేంగ్ మీ క్విక్". In డి., వెంకట్రామయ్య (ed.). నూరేళ్ళ తెలుగు నవల (1 ed.). హైదరాబాద్: పర్స్పెక్టివ్స్. pp. 169–174.