Jump to content

పులుగుర్త వేంకటరామారావు

వికీపీడియా నుండి

పులుగుర్త వేంకటరామారావు తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత, శతావధాని, ఆదర్శ ఉపాధ్యాయుడు.

జీవితం

[మార్చు]

బాల్యము, విద్యాభ్యాసము

[మార్చు]

పులుగుర్త వేంకటరామారావు 1902, అక్టోబర్ 10వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, కోలంక గ్రామంలో సూరమ్మ, సోమరాజు దంపతులకు జన్మించాడు.[1] ఇతడు ప్రాథమిక విద్య తుని, రామచంద్రాపురం, పెద్దాపురం పట్టణాలలో చదువుకొన్నాడు. తరువాత సోమావజ్ఝల సూర్యనారాయణశాస్త్రి, శృంగారం సింగరాచార్యులు, మహేంద్రవాడ సుబ్బరాయశాస్త్రుల వద్ద సంస్కృతాంధ్రాలలో కావ్య,నాటకాలు, అలంకార శాస్త్రము, శబ్దశాస్త్రము నేర్చుకున్నాడు. ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పొందాడు.

ఉద్యోగం

[మార్చు]

ఇతడు 1935లో కోటరామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉద్యోగంలోనికి చేరాడు. అక్కడ వేదుల సత్యనారాయణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి ఇతని సహోద్యోగులుగా ఉండేవారు. 1951లో ఇతడు తన స్వగ్రామమైన కోలంకలో అక్కడి పురప్రముఖుల సహకారంతో ఒక హైస్కూలును స్థాపించాడు. దాని పేరు మొదట పులుగుర్త రామారాయ ఉన్నతపాఠశాల అని వుండి తరువాత ఎస్.డి.వి.ఆర్.ఆర్ హైస్కూలుగా మార్చబడింది. ఈ హైస్కూలు ద్వారా అనేక మంది విద్యార్థులకు విద్యాదానం చేశాడు. తరువాత 1954లో ధవళేశ్వరం హైస్కూలులో తెలుగు పండితుడిగా చేరి మరణించేవరకు అక్కడే పనిచేశాడు.

మరణం

[మార్చు]

ఇతడు 1964లో మరణించాడు.

అవధానాలు

[మార్చు]

ఇతడు ప్రప్రథమంగా 1934లో కోలంకలో అష్టావధానం చేశాడు. తరువాత కాకినాడ, పల్లిపాలెం, తుని, రామచంద్రాపురం,వేములవాడ, యానాం మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలే కాక ద్విగుణిత అష్టావధానం, ద్వాదశావధానం, శతావధాన గర్భిత అష్టావధానం వంటివి చేశాడు. ఇతడు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, లాటిన్ భాషలలోని వాక్యాలను వ్యస్తాక్షరిలో అవలీలగా ప్రకటించేవాడు. ఒకేసారి ముగ్గురు పృచ్ఛకులకు త్రిధావ్యస్తాక్షరి అనే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాడు.

ఇతడి అవధానాలలో కొన్ని పూరణలు:

  • సమస్య: గణచతుర్థినాడు ఫణి చతుర్థి

పూరణ:

చిగురుబోడి వినుము చెల్మిదీపింపంగ
పాలు పోసినారమోలి మనము
పరమ భక్తితోడ పరగ కార్తికదిన
గణచతుర్థినాడు ఫణిచతుర్థి

  • సమస్య: భీష్మ ద్రోణుల కావహంబుఁ గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్

పూరణ:

గ్రీష్మాదిత్య ప్రతాప శోభిత నాభీలా జిరంగోన్నతా
ర్చిష్మ త్పుత్రుని మున్ను కౌరవులలో సేనాధిపత్యం బొగిన్
భీష్మ ప్రక్రియఁ గల్గె నేరి కవియే వేడ్కందగెన్ ధారుణిన్
భీష్మ ద్రోణుల కావహంబుఁ గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్

  • దత్తపది: జనానా - దేవిడీ - లుంగీ - పానీ అనే పదాలతో అంజనాదేవి, వాయుదేవుల వలపు

పూరణ:

ఎక్కడిది వెలుంగీ శరదిందు వదన
అంజనా! నా యెడకు నిట్టుల రుసమంద
మమ్మనగ గొప్ప దేవిడి రంజిలంగ
నరిగె పతికడ కేడవలపాని యాపె

రచనలు

[మార్చు]

ఇతనివి ఈ క్రింది రచనలు ప్రచురింపబడ్డాయి

  1. వేములవాడ శతావధానము
  2. అవధానములు
  3. పరీక్షిచ్చరిత్రము
  4. రామాయణము
  5. ఉత్తర రామాయణము
  6. సత్యనారాయణ
  7. పిచ్చిపుల్లయ్య
  8. శ్రీ కృష్ణశతకము
  9. శ్రీ నృసింహరాట్ స్మృతి
  10. శ్రీ రాజ్ఞీ సుభద్రయాంబికా స్మృతి
  11. శ్వశురస్మృతి
  12. హంస సందేశము
  13. అమరుకము
  14. భోజరామాయణము
  15. పంచతంత్రము
  16. భీష్మ యుద్ధము
  17. గదాయుద్ధము
  18. రామాభ్యుదయము
  19. హైమవతీపరిణయము
  20. కవుల కథలు
  21. నానార్థ నిఘంటువు
  22. సాధుప్రశంస
  23. రాజాభివందనము
  24. పల్లెటూరు
  25. చాటువులు
  26. గౌతమీ ప్రశస్తి (భార్య సుబ్బాయమ్మ పేరుతో)
  27. గోదావరిగాథ (భార్య సుబ్బాయమ్మ పేరుతో)

బిరుదులు

[మార్చు]
  • కవిభూషణ
  • మధురకవి

మూలాలు

[మార్చు]
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 236–241.