పోలవరం ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోలవరం ఆనకట్ట నిర్మాణ దృశ్యం
పోలవరం స్పిల్‌వే ఆనకట్ట - నిర్మాణ దశలో. బొమ్మలో పైభాగాన అనకట్టకు ఎగువన గోదావరి నది కనబడుతోంది.
Polavaram Dam
పోలవరం ప్రాజెక్టు is located in Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పథకము స్థానం
ప్రదేశంపోలవరం, పశ్చిమ గోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు17°15′40″N 81°39′23″E / 17.26111°N 81.65639°E / 17.26111; 81.65639Coordinates: 17°15′40″N 81°39′23″E / 17.26111°N 81.65639°E / 17.26111; 81.65639
నిర్మాణం ప్రారంభం2004
ప్రారంభ తేదీనిర్మాణంలో ఉన్నది
నిర్వాహకులుఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంConcrete spill way (754 m), Non over flow masonry dam (560 m) & Earth dam (1600 m)
నిర్మించిన జలవనరుగోదావరి నది
ఎత్తు39.28 m (129 ft)
పొడవు2,914 m (9,560 ft)
Spillway typeOgee section
Spillway capacity3,600,000 cusecs at 140 ft msl
జలాశయం
సృష్టించేదిపోలవరం జలాశయము
మొత్తం సామర్థ్యం194 tmcft at FRL 150 ft msl
పరీవాహక ప్రాంతం307,800 kమీ2 (118,800 sq mi)
ఉపరితల వైశాల్యం600 kమీ2 (230 sq mi)
గరిష్ఠ నీటి లోతు32.08 m at FRL 150 ft msl
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుఏపీజెన్‌కో
టర్బైన్లు12 × 80 మెగావాట్లు Francis-type (left bank side)
ప్రవేశ సామర్థ్యం960 మెగావాట్లు (నిర్మాణంలో కలదు)
Map

పోలవరం ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది[1]. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్ గఢ్, ఒరిస్సాలలోకి కూడా విస్తరించి ఉంటుంది.

ఈ పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం యొక్క తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తుందని అంచనా. అంతేగాకుండా, విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి, చేపల పెంపకానికి ఉపయోగపడుతుంది. ఈ పథకంలో భాగంగా 80 టి.ఎం.సీల గోదావరి నీళ్లని కృష్ణా నదిలోకి మళ్ళిస్తారు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్ళించే బృహత్ పథకం "గంగా - కావేరి నదుల అనుసంధానం"లో పోలవరం పథకం ఒక భాగం. ఇక్కడ గోదావరి మిగులు జలాలు ఉన్న నది. కృష్ణానది నీటి కొరత ఉన్న నది. పశ్చిమగోదావరి జిల్లాలోని రామాలపేట గ్రామం వద్ద, (రాజమండ్రి - కొవ్వూరు రోడ్డు నుండి 34 కి.మీ ల దూరం, ధవళేశ్వరం లోని కాటన్ ఆనకట్టకి 42 కి.మీ ఎగువన) నిర్మిస్తున్న ఈ పథకం యొక్క అంచనా విలువ రూ. 16716 కోట్లు.

నేపథ్యం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితమైనది.భారతదేశంలోని సగటు సాగుభూమి శాతం (22.2%), ఉత్తరప్రదేశ్ సాగుభూమి శాతం (22%), పంజాబ్ సాగుభూమి శాతం (35%) తో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ సాగుభూమి శాతం (14%) చాలా తక్కువ. కాలువలద్వారా నీటిలభ్యత ఉన్న కృష్ణా-గోదావరి డెల్టాలలో 22 లక్షల ఎకరాలలోనూ, నాగార్జునసాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని 20 లక్షలలో మాత్రమే సాగు జరుగుతున్నది. గోదావరికి ఎడమవైపునున్న తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని మెట్టప్రాంతాలు, కుడివైపునున్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు గోదావరి తప్ప మఱో నమ్మకమైన నీటివనరు లేదు. వర్షాలు సరిగా కురవని సమయాలలో కరువుకి గుఱవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ప్రవహించే ఏర్లు, నదులు పూర్తిగా వర్షాధారాలు మరియు ఆధారాపడదగినవి కావు. అందువలన ఈ ప్రాంతాలలో సాగుని ఆధారపడదగిన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరిరక్షించాల్సి ఉంది. పోలవరం పథకం వలన మాత్రమే ఈ అనిశ్చిత పరిస్థితులు, ఈ ప్రాంతాల వెనుకబాటుతనము పోగలవు.

పోలవరం అంధ్ర ప్రదేశ్ జీవనాధారంగా పిలువ బడ్తుంది. సర్ ఆర్థర్ కాటన్ భారతదేశపు నదుల అనుసంధానం గుఱించి ప్రాథమిక సూచనలు చేసినప్పటికీ, 1930-40 ల వఱకూ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941 లో, మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు, దివాన్ బహుద్దూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, గోదావరి నది పైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించాడు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీరు కె.ఎల్ .రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున “రామపాద సాగరం”గా పిలిచిన ప్రాజెక్టు యొక్క వివరాలు ఇవి,

  • 130.0 మీ ల గరిష్ఠ ఎత్తు ఉన్న ఆనకట్ట
  • ఎడమ వైపు, విశాఖపట్నం ఓడరేవు వఱకూ, 209 కి.మీల పొడవైన కాలువ.
  • కుడి వైపు, కృష్ణా నది వఱకూ 200 కి.మీ ల పొడవైన కాలువ. అటుపైన, గుండ్లకమ్మ నది వఱకూ మరో 143 కి.మీ పొడవైన కాలువ, మరియు
  • 150 మెగా వాట్ల సామర్థ్యం గల విద్యుతుత్పత్తి కేంద్రం

వెనకడుగు[మార్చు]

రామపాదసాగర్ ప్రాజెక్ట్ డిజైన్ పూర్తి అయినప్పటికీ నిర్మాణపరంగా అడుగు ముందుకు పడలేదు.

ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి.

ఒకటి వ్యయం.. రెండు నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత.

పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు.

డ్యాం కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళ్తే కానీ భూమిలో గట్టితనం ఉండటం లేదు. మరోవైపు కొండలు, గుట్టలు.

ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక ఆనాడు ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేదు.

ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం రూ. 129 కోట్లు. అయితే, ప్రాజెక్టు వ్యయం ఎక్కువగా ఉందని భావించడంతో పథకాన్ని చేపట్టడం జరగలేదు. 1953 సంవత్సరంలో వచ్చిన వరదలు, విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క పారిశ్రామిక అవసరాలు పథకం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పాయి. అందువలన 1976 సంవత్సరంలో పథకంలో కదలిక వచ్చింది. 1978 సంవత్సరంలో విస్తృత స్థాయి నివేదిక సమర్పించబడి 1980నాటికి శంకుస్థాపన జరగింది.

ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు[మార్చు]

బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి.

ఈ ఒప్పందం ప్రకారం..

పూర్తి నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం

స్పిల్‌వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు

పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలి.

1976లో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

1981లో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.

అనేక రకాల పరిశీలనల తర్వాత 1986లో తుది నివేదికను రూపొందించారు.

1985-86 ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,665 కోట్లుగా అంచనా వేశారు.

ఆ తరువాత మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి 2004లో కదలిక వచ్చింది.

రామపాదసాగర్ నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువున పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

2,454 మీటర్ల పొడవైన ఎర్త్-కమ్-రాక్ ఫిల్ డ్యాం, 1,128 మీటర్ల పొడవైన స్పిల్ వేను నిర్మించేందుకు నిర్ణయించారు.

ప్రయోజనాలు[మార్చు]

దీని వల్ల కృష్ణ, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో సుమారు 7.21 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చు. ప్రకాశం బ్యారేజి ఎగువన 12 లక్షల ఎకరాలకు 80 టీఎంసీల నీరు అందించవచ్చు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. విశాఖపట్టణానికి త్రాగునీరు, పారిశ్రామిక అవసరాల నిమిత్తం 80 టీఎంసీల నీరు ఇవ్వవచ్చు.

సాగునీటి అవసరాల దృష్ట్యా[మార్చు]

ఎడమ కాలువ: 181.50 కిలోమీటర్ల పొడవు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెబుతున్నారు. అలాగే విశాఖపట్నం నగరానికి తాగు నీరు ఇవ్వనున్నారు. ఈ కాలువను జలరవాణాకు కూడా ఉపయోగించనున్నారు.

కుడి కాలువ: 174 కిలోమీటర్ల పొడవు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు.

అలాగే 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించనున్నారు.

జలవిద్యుత్: 960 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

ప్రయోజనాలు

విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

విశాఖపట్నంలో కర్మాగారాల నీటి అవసరాలను తీర్చనున్నారు.

విశాఖపట్నం నగరానికి తాగు నీరు అందించనున్నారు.

కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పోలవరం ఉపయోగపడుతుంది.

నిధులు-వ్యయం

2017 ఆగస్టులో పోలవరానికి సంబంధించి కొత్త అంచనాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది.

2013-14 ధరల ప్రకారం ప్రాజెక్ట్ బడ్జెట్‌ రూ.58,319 కోట్లకు చేరినట్లు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ సమర్పించిన కొత్త అంచనా వ్యయానికి సీడబ్ల్యూసీ ఆమోదం లభించాల్సి ఉంది.

మొత్తం వ్యయంలో పునరావాసానికి రూ.32,000 కోట్లు అవుతాయని అంచనా.

పోలవరం మౌలిక స్వరూపం[మార్చు]

Papi Hills on both sides of Godavari

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి.

1. ప్రధాన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్)

2. స్పిల్‌వే (మత్తడి) ఆనకట్ట

3. స్పిల్ చానల్ (మత్తడి)

3. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం

గోదావరి ప్రధాన నదీ ప్రవాహానికి అడ్డంగా ప్రధాన ఆనకట్ట నిర్మించి, నీటి ప్రవాహాన్ని బంధిస్తారు. ఆ విధంగా ఆనకట్టకు ఎగువన 194 టిఎమ్‌సి సామర్థ్యం కల జలాశయం ఏర్పడుతుంది. ఈ నీటిని పక్కన స్పిల్‌వే గుండా మళ్ళించి, తిరిగి ప్రధాన ఆనకట్టకు దిగువన నదిలో కలుపుతారు. అంటే గోదావరి నదిని మళ్ళిస్తారన్నమాట. ఈ స్పిల్‌వేకు అడ్డంగా ఒక ఆనకట్ట నిర్మించి, దానికి 48 గేట్లు అమరుస్తారు. తద్వారా జలప్రవాహాన్ని నియంత్రిస్తారు.

కాలువలు: జలాశయంలో నిలువ చేసిన నీటిని రెండు కాలువల ద్వారా ప్రజోపయోగానికి విడుదల చేస్తారు. ఒకటి కుడి వైపు. రెండోది ఎడమ వైపు. వీటి ద్వారా నీటిని తరలిస్తారు.

ఆనకట్ట: ఇది రిజర్వాయర్ ఆనకట్ట. ఇందులో అనేక భాగాలున్నాయి.

డయాఫ్రం వాల్: ప్రధాన ఆనకట్టకు పునాది, ఈ డయాఫ్రం వాల్. పునాది కోసం భూమిని తవ్వకుండా, భూమిని తొలుచుకుంటూ రాయి తగిలేవరకూ వెళ్ళి, అక్కడి నుండి కాంక్రీటు వేసి గోడ కట్టుకుంటూ పైకి వస్తారు. నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతు వరకూ ఈ గోడ కట్టారు. ప్రధాన ఆనకట్టకు జలాశయపు నీటి వత్తిడిని తట్టుకునే దృఢత్వాన్ని ఈ పునాది ఇస్తుంది. నీరు లీకేజీ కాకుండా కూడా ఇది కాపాడుతుంది. దీని పొడవు 2.454 కిలోమీటర్లు.

కాఫర్ డ్యాం[మార్చు]

ప్రధాన డ్యాంను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కట్టడాన్ని కాఫర్ డ్యాం లేక రక్షణ ఆనకట్ట అంటారు. నీటి ప్రాజెక్టులు, బ్రిడ్జిలు, పిల్లర్లు లాంటివి కట్టేటప్పుడు నీటి ప్రవాహాన్ని పక్కకు మళ్ళించి లేదా తాత్కాలికంగా నిలిపి నది అడుగు భాగంలో నిర్మాణాలు చేపడతారు.కాఫర్ డ్యాం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో కట్టే తాత్కాలిక నిర్మాణం.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మొన్న కట్టిన పులిచింతల ప్రాజెక్టు వరకు ఇలాంటి కాఫర్ డ్యాములు కట్టారు.కాఫర్ డ్యాం ప్రధాన డ్యాం అంత బలీయంగా, పటిష్ఠంగా వుండవు.ప్రధాన ఆనకట్ట నిర్మాణంలోకి వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు తోడివెయ్యటానికి మోటర్లు కూడా ఏర్పాటు చేస్తారు.

కాఫర్ డ్యాం మరి దృఢమైనది కాదు కాబట్టి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఊహించనంత వరద వస్తే సులభంగా కొట్టుకోని పోతుంది, దీనివలన దిగువ ప్రాంతంలో ముంపు, ప్రాణ నష్టం తక్కువ.కాఫర్ డ్యామ్ను ఎంత ఎత్తులో కట్టాలి అన్నది ప్రధాన డ్యాం ఎత్తును పట్టి నిర్ణయిస్తారు.

పోలవరం విషయంలో రెండు కాఫర్ డ్యామ్‌లు ప్రతిపాదించారు.41 మీటర్ల ఎత్తులో,60 టి.ఎం.సిల నీటిని నిలువ చేసే కాపర్ డ్యాం పూర్తిచేసి కాలువలకు నీరుఇస్తారు.

నది ప్రవాహం అడ్డుతగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువున ఒక డ్యాం నిర్మించాలని నిర్ణయించారు.

జాతీయ ప్రాజెక్ట్[మార్చు]

Krishna River delta extending into the Bay of Bengal (bottom river in the image).

పోలవరాన్ని 2014లో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు.

2017 జనవరి నాటికి పోలవరంపై రూ.8,898 కోట్లు ఖర్చు పెట్టారు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత అంటే 2014 మార్చి నుంచి 2017 జనవరి వరకు ఖర్చు పెట్టిన నిధులు రూ.3,349.70 కోట్లు.

2014 మార్చి నుంచి 2017 జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు రూ.2,916.54 కోట్లు.

పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నాబార్డు కేంద్రానికి రుణంగా ఇస్తుంది. వీటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారు.

2014 జనవరి 1 నాటి అంచనాల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని కేంద్రం తెలిపింది.

అంటే ఈ అంచనాల కన్నా అదనంగా ఖర్చు అయితే దానిని రాష్ట్రమే భరించాలి.

అనుమతులు[మార్చు]

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం 2004లో ప్రారంభమైంది.

2005లో దీనికి పర్యావరణ అనుమతులు వచ్చాయి.

గిరిజన ప్రాంత ప్రజల తరలింపు, వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కేంద్ర గిరిజనశాఖ అనుమతులు 2007లో లభించాయి.

అటవీ ప్రాంత వినియోగానికి సంబంధించిన తుది అనుమతులు 2010లో వచ్చాయి.

ముంపు ప్రాంతం[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లో 276 గ్రామాలు, ఛత్తీస్‌గఢ్లో 4, ఒడిశాలో 8 గ్రామాలు ముంపుకు గురవుతాయి. 3427.52 ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ముంపుకు గురవుతున్న మండలాలను ఆంధ్రప్రదేశ్‌‌లో కలిపారు.

అవి భద్రాచలం రెవిన్యూ డివిజన్‌లోని కూనవరం, వర రామచంద్రాపురం, చింతూరు, భద్రాచలం మండలాలు.. పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లో వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మండలాలు.

విద్యుచ్చక్తి అవసరాల దృష్ట్యా[మార్చు]

ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాలలో అతి పెద్దది. దేశంలోని వివిధ పారిశ్రామిక మండలాలకి, ఓడరేవులకీ, నగరాలకీ దగ్గరగా ఉండడంతోబాటు విస్తారమైన ముడిఖనిజాలు, సుశిక్షితులైన మానవవనరులు అందుబాటులో ఉన్న కారణంగా పారిశ్రామికాభివృద్ధికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడలలో మంచి ఓడరేవులు ఉన్నాయి. జలరవాణాకి అనుకూలమైన వాతావరణం, రోడ్డు, రైలు సదుపాయాలు ఉన్నాయి. అయినా, పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉంది. దానికున్న కారణాలలో ఒక ముఖ్యకారణం, చాలినంత నాణ్యమైన, చవకైన విద్యుత్ అందుబాటులో లేకపోవడం. గ్రామీణ ప్రాంతాల విద్యుదీకరణ విషయంలో, పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనుకబడి ఉంది.అందుబాటులో ఉన్న వనరులని సక్రమంగా వాడుకోలేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. పోలవరం పథకం ద్వారా, వర్షాకలంలో 960 మెగావాట్ల విద్యుత్, అన్ని కాలాలోనూ 80 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు.

త్రాగునీరు, పారిశ్రామికజలాల అవసరాల దృష్ట్యా[మార్చు]

విశాఖపట్నం ఓడరేవు, పారిశ్రామిక మండలం, ఉక్కు కర్మాగారం, తత్సంబంధిత ఇతర కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారం, నౌకానిర్మాణ కేంద్రం, వాటి గృహసముదాయాలు, మొదలగువాటిన్నటికీ చాలినంత నీరు అందుబాటులో లేదు. అవేగాక విశాఖపట్నం, తూర్పు - పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో మెట్టప్రాంతాలు, వేసవికాలంలో తీవ్రమైన నీటి ఎద్దడికి గుఱవుతున్నాయి. ఈ అవసరాలు తీర్చడానికి పోలవరం పథకం అవసరం.

వరదల నియంత్రణ దృష్ట్యా[మార్చు]

గోదావరికి ప్రతీ సంవత్సరం వచ్చే వరదల వలన, మైదానప్రాంతంలో, చేతికి రావలసిన పంటలు నాశనం కావడమే, పశుసంపద, ఆస్తి నష్టం మొదలైనవి కలుపుకంటే నష్ట తీవ్రత రూ. కోట్లలో ఉంటున్నది. 1953, 1959 సంవత్సరాలలో వచ్చిన వరదలు, ఈ పథకంలో కదలిక వచ్చింది. 1985 సంవత్సరంలో వచ్చిన 36 లక్షల క్యూసెక్కులు భారీ వరద, 2005 సంవత్సరంలో వచ్చిన వరద, పథకం యొక్క అవసరాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తున్నప్పటికీ, శాశ్వత ఏర్పాట్లు చేయడం ఏమీ జరగలేదు.

పోలవరం పథకంలో భాగంగా 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని నియంత్రించేంతగా తూముల నిర్మించాలని రూపకల్పన చేయడం జరిగింది. ఈ నిర్మాణం అనంతరం నదిప్రవాహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రించే అవకాశం కలుగుతుంది. తద్వారా మైదానప్రాంతాలలో వరదముప్పు తొలగించేందుకు అవకాశం కలుగుతుంది.

జలరవాణా దృష్ట్యా[మార్చు]

గోదావరి ఒడ్డున ఉన్న అడవులలో ఉత్పత్తి అవుతున్న అటవీ ఉత్పత్తులు, ఎగువ ప్రాంతాలలో లభ్యమవుతున్న బొగ్గు, అలాగే వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు రోడ్డు, రైలు మార్గాలను ఆశ్రయించవలసి వస్తున్నది. ఈ మార్గం వలన దూరాభారమే కాకుండా, ఎంతో ఖర్చుతో కూడుకున్నది. సంవత్సరంలో కొన్ని నెలలు నదిలోని నీటిమట్టం తక్కువగా ఉండటం వలన జలరవాణా సాధ్యపడుటలేదు.

పోలవరం నిర్మాణానంతరం ఏర్పడే జలాశయం, జలరవాణాకై కూడా రూపకల్పన జరిగిన ఎడమ వాలు కాలువ వినియోగంలోకి వస్తే, జలరవాణా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. తద్వారా ఎగువన జరుగుతున్న ఉత్పత్తులు మార్కెట్ ఉండే ప్రాంతాలకి తరలించడం సులువవుతుంది.

పారిశ్రామిక అవసరాల దృష్ట్యా[మార్చు]

  • పోలవరం ఎడమ వాలు కాలువ (Left Bank Gravity Canal) ద్వారా, తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం నగరం, కాకినాడ – విశాఖపట్నం పారిశ్రామిక మండలానికీ, ఎడమ ఎత్తిపోతల కాలువ (Left Bank Lift Canal) ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నాలలోని మెట్ట ప్రాంతాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి; కుడి వాలు కాలువ (Right Bank Gravity Canal ) ద్వారా ప్రకాశంబ్యారేజిని అనుసంధానం చేస్తూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలకి, కుడి ఎత్తిపోతల కాలువ (Right Bank Lift Canal) ద్వారా పులిచింతల జలాశయం అనుసంధానం చేస్తూ గుంటూరు, ప్రకాశం జిల్లాలకి గోదావరి జలాలని కేటాయిస్తారు.
  • పోలవరం నిర్మాణం అనంతరం, గోదావరినుండి కృష్ణకి మళ్ళించే 80 టి.ఎం.సి ల నీటిలో ఎగువనున్న కర్నాటక, మహారాష్ట్రల వాటాగా 35 టి.ఎం.సీలు పోగా 45 టి.ఎం.సిలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు దక్కుతాయి.

ఎత్తిపోతల పథకాలు[మార్చు]

పోలవరం భారీ ప్రాజెక్టు. ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటిని తరలించేందుకు తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇందులో భాగంగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకాలు చేపట్టింది.

ఈ ఎత్తిపోతల పథకాలు పోలవరం మౌలిక డిజైన్‌లో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వీటిని రాష్ట్రమే తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.

పట్టిసీమ: పోలవరం మండలంలోని పట్టిసం వద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2015లో దీని నిర్మాణం పూర్తయింది. 2015 డిసెంబరు నాటికి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1299 కోట్లు ఖర్చు చేసింది[2].

పురుషోత్తమపట్నం: రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టారు. 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు.

మూలాలు[మార్చు]

  1. "Indirasagar (Polavaram) Project, Ministry of water resources, GoI". Retrieved 23 May 2014.
  2. https://m.dailyhunt.in/news/india/telugu/bbc+telugu-epaper-bbctel/polavaram+praajektu+eppudu+modalaindi+ippudu+ekkadundi-newsid-78758190